ఏపీలో జగన్ సీన్ సితారేనా?.. సీ వోటర్ సర్వే తేల్చేసిందా?
posted on Oct 25, 2022 @ 3:26PM
ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి ఓటర్లను కడుపూ, గడ్డం పట్టుకుని బతిమాలి ఏపీలో అధికార పీఠం ఎక్కిన జగన్ పట్ల ఓటర్లలో ఎక్కువ శాతం మందికి వెగటు పుట్టినట్లుంది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసిన జగన్ పాలన అంటే జనంలో తీవ్ర అసంతృప్తి రేగుతున్నట్లుంది. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిందంటున్నారు. ఆర్థికంగా ఏపీని బలోపేతం చేసే దిశగా ఏమాత్రం ఆలోచించకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటుపై దృష్టిపెట్టకుండా.. కేవలం కంటితుడుపు చర్యగా ఉచితాల పేరుతో జనాన్ని వెర్రోళ్లుగా, ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధి కోసం అర్రులు చాచేలా చేసిన జగన్ పట్ల, వైసీపీ పాలన పట్ల ఈ మూడున్నరేళ్లలో జనానికి మొహం మొత్తిందంటున్నారు. తద్వారా జగన్ సర్కార్ డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ సీ-ఓటర్ తాజాగా వెల్లడించిన సంచలన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది.
జగన్ ఏలుబడిలో ఏపీలో ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ధైర్యంగా ఏపీలో ముందుకు రాని పరిస్థితి ఉంది. కొత్త పెట్టుబడిదారుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతున్న వైనం బాధాకరంగా మారింది. రోడ్ల దుస్థితి చూస్తే దయనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇలా ఒక్కటేమిటి అన్ని వర్గాల వారూ వైసీపీ పాలన అంటేనే చీదరించుకునే స్థితి వచ్చింది. ఇలాంటి ఎన్నో కారణాలతో జగన్ సర్కార్ అంటే ఏపీ జనంలో 57 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీ ఓటర్ తాజా సర్వేలో వెల్లడించింది. సీ ఓటర్ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న టాప్ 5 ప్రభుత్వాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనంలో ప్రజాగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ అయితే మరీ దారుణంగా అగ్రస్థానంలో నిలిచింది. ‘యాంగర్ ఇండెక్స్’ పేరిట సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీ సర్కార్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తనుందని విషయం వెల్లడైంది.
ఈ క్రమంలో ఏపీలోని ప్రస్తుతం 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం గమనార్హం. ఈ విషయం సీ ఓటర్ సంస్థే కాకుండా జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ చేసిన సర్వేలో కూడా స్పష్టమైంది. 2019లో 151 స్థానాల్లో విజయం సాధించి, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గానూ 175 చోట్లా గెలవాలనే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తన పార్టీ నేతలు, బాధ్యులను పరుగులు పెట్టిస్తుండడం గమనార్మం. అయితే.. సీ ఓటర్ సర్వేలో అందుకు పూర్తి భిన్నంగా జగన్ సర్కార్ పట్ల జనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ సర్వేల కన్నా విభిన్నంగా సీ ఓటర్ సర్వే ఫలితాలు రావడం గమనించదగ్గ అంశం. ఎక్కువ శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారి తీరు మారకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, ఇతరులకు కేటాయిస్తానంటూ జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. విచిత్రంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల కన్నా వైసీపీ పాలనే ఘోరంగా ఉందని జనం ఆగ్రహంతో ఉన్నట్లు సీ ఓటర్ సర్వే తేటతెల్లం చేసింది.
అయితే.. అభివృద్ధిలో, సంక్షేమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని వైసీపీ నేతలు, ముఖ్యనేత చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98 శాతం అమలు చేశామని గొప్పగా వైసీపీ నేతలు చెబుతుంటే.. జనంలో తీవ్రాతి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం కనిపించడం లేదా అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లినప్పుడు కూడా ఇంతే స్థాయిలో వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సమర్థించగల దమ్ములేక అనేక మంది ఎమ్మెల్యేలు అసలు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముఖం చాటు వేసిన ఘటనలు ఉన్నాయి.
ఏపీలోని స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, సీఎంకు సంబంధించిన ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే అంశంపై సీ ఓటర్ సర్వే నిర్వహించడం గమనార్హం. ఈ సర్వే సందర్భంగా జగన్ రెడ్డి పాలన ఏమాత్రం బాగోలేదని ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారంటే.. వైసీపీ సర్కార్ ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిందనే భావించాలని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కో ఆర్డినేటర్ల సమీక్ష సందర్భంగా ఎంతసేపూ ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ చిర్రుబుర్రులాడుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే.. ఆశ్చర్యకరంగా అసలు వైసీపీ సర్కార్ పైనే ఎక్కువ వ్యతిరేకత రావడం గమనార్హం.మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు ఏపీ జనం నుంచి దబిడి దిబిడి తప్పేట్టు లేదని సర్వే నివేదికల ద్వారా అర్థం అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.