షిండే వర్గంలో లుకలుకలు.. మరో మహా సీఎంకు రంగం రెడీ అవుతోందా?
posted on Oct 25, 2022 @ 12:05PM
మహారాష్ట్రలో రాజకీయ అస్థిరతకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. శివసేనను నిట్ట నిలువునా చీల్చి, ఉద్ధవ్ ధాక్రేను గద్దె దించి కమలం మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏక్ నాథ్ షిండే పదవీ వైభోగం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా?
ఆయనకు పదవీ గండం పొంచి ఉందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. శివసేన షిండే వర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గు ముంటున్నాయని, ఆయనపై తిరుగుబాటుకు తెరవెనుక రంగం సిద్ధమౌతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంటోందని చెబుతున్నారు. షిండే వర్గంలో ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగ నివురు తొలగించుకుని జ్వాలలై ఎగసే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు.
శివసేన నుంచి తిరుగుబాటు చేసిన వచ్చిన షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ప్రస్తతం షిండేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ముఖ్యమంత్రి వర్గీయులే చెబుతున్నారు. ఉద్దవ్ పై తిరుగుబావుటా ఎగుర వేసిన 40 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని శివసేన ఉద్ధవ్ వర్గం అధికార పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. బీజేపీయే స్వయంగా షిండే వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నదనీ, బీజేపీ షిండేను సీఎం పీఠంపై తాత్కాలికంగానే కూర్చో బెట్టిందనీ సామ్నా పేర్కొంది.
అసమ్మతి నేతల తిరుగుబావుటా కారణంగా షించే ఏ క్షణంలోనైనా తన పదవి కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. అంధేనీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివసేన షిండే వర్గం పోటీ చేయాలని భావించినప్పటికీ బీజేపీ అంగీకరించలేదనీ, దీనిని బట్టే ప్రభుత్వం నడపడంలో సీఎం పాత్ర ఎంత అన్నది సులువుగానే అర్ధం చేసుకోవచ్చని ధాకరే వర్గీయులు అంటున్నారు.
షిండే తిరుగుబాటు చేసి గద్దెనెక్కడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేశారనీ, మహా జనం ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరనీ సమ్నా సంపాదకీయం పేర్కొంది. కేవలం 40 మంది తరుగుబాటు ఎమ్మెల్యేలతో నడుస్తున్న షిండే సర్కార్ ఎక్కువ కాలం అధికారంలో ఉండే అవకాశం లేదని పేర్కొంది. షిండేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల రిమోట్ కంట్రోల్ పీఎంవో చేతుల్లో ఉందని, ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర తీసుకుంటున్నారని సామ్నా పేర్కొంది.