పొట్టి ఫార్మట్ లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్.. రవిశాస్త్రి
posted on Nov 18, 2022 @ 2:17PM
పొట్టి ఫార్మట్ లో టీమ్ ఇండియా ఆట తీరు మెరుగు పడాలంటే కొత్త కెప్టెన్ అవసరమని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. టి20లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ ను నియమిస్తే ఆటతీరు గణనీయంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇందుకు ఇంగ్లాండ్ జట్టు మెరుగుపడిన తీరే ఉదాహరణ అని రవిశాస్త్రి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా టెస్ట్, వన్డే, టి20లకు సారథ్యం వహించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే రోహిత్ మూడు ఫార్మట్లకూ కెప్టెన్ గా ఉన్నాడనీ, ఇక టి20 ఫార్మట్ కెప్టెన్ గా అతడికి ఉద్వాసన చెప్పడమే మేలనీ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ కు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ తో టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఐపీఎల్ లో సారథిగా తనను తాను నిరూపించుకున్న హార్థిక్ పాండ్యాకే టి20 సారథ్య బాధ్యతలు అప్పగిస్తే టీమ్ ఇండియాకు మేలు జరుగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.