జగన్ దారెటు.. ముందస్తే దిక్కు!
posted on Nov 18, 2022 6:05AM
ఏపీలో జగన్ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచీ చిక్కులే ఎదురౌతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. ఏ పని చేసినా చేదు అనుభవంగానే మిగులుతోంది. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని సార్లు కోర్టుల చేత అక్షింతలు వేయించుకుని ఉండదు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయ్యింది. ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది మరో సారి ప్రజా తీర్పు కోరడానికి. ప్రజలు మనవైపే ఉన్నారు.. ఈ సారి 151 కాదు.. 175కు 175 స్థానాలలోనే మనదే గెలుపు అంటూ జగన్ గంభీరంగా ప్రకనటలు గుప్పిస్తున్నా.. అదే మాట చెప్పి క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాలని ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది కేవలం మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న ప్రకటనలేనని పార్టీ వర్గాలకే అర్ధమై పోతున్నది.
మరో ఏడాదిన్న పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం అంటే మరింత ప్రజా వ్యతిరేకతను ప్రోది చేసుకోవడమేనన్న నిర్ణయానికి సీఎం జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ముందస్తు ప్రణాళికలు రచించడమే కాకుండా అమలులో పెట్టేస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలంటూ హడావుడి చేస్తున్నారు. వర్క్ షాపులంటూ ఎమ్మెల్యేలలో ఈ సారి పార్టీ టికెట్ అనుమానమేనని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.
అన్నిటికీ మించి ఎన్నికల బదలీలకు శ్రీకారం చుట్టేసింది. ముఖ్యంగా పోలీసు శాఖలో బదలీల స్పీడ్ చూస్తుంటే ఈ విషయం క్లయర్ గా అర్ధమౌతుంది. కీలక స్థానాలలో అనుకూలమైన పోలీసు అధికారాల నియామకం దాదాపు పూర్తి చేసేసిందనే చెప్పాలి.సాధారణంగా ఇలాంటి బదలీలన్నీ ఎన్నికలకు ముందు జరుగుతాయి. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం ఉండగానే చేసేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వెళితే పరిస్థితి ఇప్పటి కంటే దారుణంగా ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నది.
అయితే ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే విషయంలో మాత్రం రెండు మూడు ఆప్షన్ ను పరిశీలిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా లేకున్నా మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. ఏపీ ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద వచ్చే ఆరు నెలలలో జగన్ సర్కార్ ఎప్పుడైనా ముందస్తు ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత మరంత పెరగడమే కాకుండా.. ఇప్పటికే బలంగా పుంజుకున్న తెలుగుదేశం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని కూడా జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం సభలకు వస్తున్న ప్రజాదరణ, అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజా నిరాసక్తత ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ మరింత పెరుగుతాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.