అక్షర క్రమంలోనే కాదు.. అప్పుల్లోనూ నంబర్ వన్ ఏపీ.. ఇది జగన్ ఘనతేగా మరి!
posted on Nov 18, 2022 9:19AM
అక్షరక్రమంలో నే కాదు... అభివృద్ధిలోనూ అగ్రగామే. విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి గతంలో దేశం యావత్తూ అన్న మాట. ఇప్పుడు కూడా అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలోనే నిలిచింది. అయితే అభివృద్ధిలో మాత్రం కింది నుంచి మొదటి స్థానానికి పోటీ పడుతోంది. జగన్ పాలనలో ఈ మూడేళ్లలోనూ ఏపీ సాధించిన ఘనత ఇది. అదొక్కటే కాదు.. మరో విషయంలో కూడా ఏపీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కనీసం పోటీలో కూడా ఉండలేని విధంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
అభివృద్ధిలో అధమ స్థానానికి పడిపోయిన ఏపీ.. ఈ మూడేళ్లలో ఏ విషయంలో నంబర్ వన్ గా నిలిచిందో తెలుసా.. అప్పుల్లో. అవును దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి అప్పుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోన్ని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద 48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది.
సెప్టెంబరు నెలాఖరు నాటికే ఏకంగా 49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. అంటే అంచనాలను మించి వంద శాతం కంటే ఎక్కువ రుణాలను ఇప్పటికే ఏపీ తీసేసుకుంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంలో చెప్పుకునే బీహార్ కంటే ఏపీ పరిస్థితి అధ్వానమని కాగ్ నివేదికే వెల్లడించింది. బీహార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి, తొలి 6 నెలల్లో తీసుకున్న రుణం 30,407.14 కోట్లు మాత్రమే. ఈ గణాంకాలను పరిగణనలోనికి తీసుకుని చూస్తే ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఏడాది మొత్తం అంచనాలను దాటేసి రుణాలు చేసేసింది.
అదే తమిళనాడు అయితే 96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించి ఇప్పటి వరకూ 18,726.34 మాత్రమే అప్పు చేసింది. కర్ణాటక, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాలు కూడా అంచనాల రుణపరిమితిని దాటలేదు. అయితే ఏపీ మాత్రం అంచనా రుణన్ని దాటేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలలోనే పరిమితికి మించి వంద శాతం అధికంగా అప్పులు చేసింది. ఈ అప్పులు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు అదనం. వీటికి అదనంగా ఏపీఎస్‌డీసీ, బేవరేజస్ కార్పొరేషన్ ల ద్వారా తీసుకున్న రుణాలు ఉన్నాయి. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న 8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణించాల్సి ఉంటుంది.
రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన 49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అందిన కాడికల్లా అప్పులు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేక.. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక సతమతమవుతోంది. మరి ఈ రుణాలన్నిటీనీ దేనికి ఖర్చు పెడుతున్నట్లు.. ఉచితాలకే వ్యయం చేస్తున్నదా అంటే ఈ మొత్తంలో నాలుగో వంతు మాత్రమే ఉచితాలకు ఏపీ సర్కార్ వ్యయం చేస్తున్నది. అప్పుల్లో అగ్రస్థానానికి ఏపీని చేర్చిన జగన్ సర్కార్ తీసుకున్న రుణాలను ఎందుకోసం వ్యయం చేస్తున్నదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నది.
తెలుగుదేశం, ఇతర విపక్షాలూ సొమ్ము దొంగ ఖాతాల ద్వారా తరలిపోతున్నదని ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. ఒక్క బేగం పేట విమానాశ్రయం నుంచే కాకుండా గన్నవరం విమానాశ్రయం, విశాఖ పాత విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలపై కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయని తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి అంటున్నారు. మరి ఆ దిశగా ఈడీ దృష్టి సారిస్తుందా లేదా చూడాల్సి ఉంది.