మంత్రి తలసాని సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు
posted on Nov 22, 2022 @ 1:22PM
చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు దర్యాప్తు మొత్తం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేస్తున్న వారు, విచారణకు పిలుస్తున్న వారిలో అత్యధికులు తలసాని సంబంధీకులే కావడంతో ఈ అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇప్పటి వరకూ చీకోటి ప్రవీణ్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఈడీ నోటీసులు అందుకున్న వారు కానీ, విచారణకు హాజరైన వారు కానీ చాలా వరకూ తలసాని సంబధీకులు, ఆయన ఆర్థిక వ్యవహారాలుచూసే వారే కావడం గమనార్హం. ఈడీ ఇప్పటి వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నమాటే కానీ ఆయన ఇద్దరు సోదరులు, వ్యక్తిగత కార్యదర్శిలను ఈడీ నోటీసులు జారీ చేసి పిలిపించుకుని మరీ ప్రశ్నించింది.
ఒక దశలో తలసాని కుమారుడికీ ఈడీ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది. అయితే.. అది వాస్తవం కాదనీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదనీ తలసాని కుమారుడు స్పష్ట చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తనను బదనాం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు నోటీసులు వచ్చాయా? లేదా అన్నసంగతి పక్కన పెడితే.. చీకోటి ప్రవీణ్ తో తలసానికి సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ గట్టిగా నమ్ముతోంది. అంతెందుకు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెరాస వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే తలసానికి నేరుగా ఈ కేసులో సంబధాలు ఉన్నట్లు రుజువు అయ్యే అవకాశాలు లేవన్న చర్చా సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలసాని ఆర్థిక వ్యవహారాలన్నీ తన సన్నిహితుల పేరు మీదే ఉంటాయనీ అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పటి వరకూ తలసానికి ఈడీ నోటీసులు జారీ చేయలేదని చెబుతున్నారు. కానీ క్యాసినో కేసులో తలసాని సన్నిహితులకు ఉచ్చు బిగిసిందనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ సాగిస్తున్న వారంద గురించీ చీకోటి ప్రవీణ్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగానే ఈడీ ప్రశ్నిస్తోందని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ కస్టమర్ల ఖాతాలను బయటకు తీసి.. వారి ఆర్థిక లావాదేవీలపైనే విచారణ కేంద్రీకృతమై ఉండటంతో ఈడీ నోటీసులు అందుకున్న వారంతా ఆందోళనలో ఉన్నారంటున్నారు.