జారుడు బండపై కాంగ్రెస్.. రేవంత్ గట్టెక్కించగలరా?
posted on Nov 21, 2022 @ 10:16PM
తెలంగాణలో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి దిగజారుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి కానీ.. అదే రాష్ట్ర ఆవిర్బావం నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారంది.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయని పైకి కనిపిస్తున్నా, ఇప్పటికిప్పుడు తెరాసకు వచ్చిన ఇబ్బందేమీ లేని పరిస్ధితే ఉంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయికి ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడమే గగనమన్న పరిస్థితే ఇప్పటికీ ఉంది. పట్టణ ప్రాంతాల్లో బాగానే పుంజుకున్నా.. అధి వచ్చే ఎన్నికలలో అధికారాంలోకి తీసుకువస్తుందా అన్న ప్రశ్నకు లేదనే జవాబే వస్తుందని కమలం వర్గాలే అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించినా, మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా పోటీ ఇచ్చినా అది బీజేపీ బలం అని ఆ పార్టీ నాయకత్వమే ధీమాగా చెప్పలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అనే పరిస్థితి అయతే వచ్చింది. అందుకు కాంగ్రెస్ బలహీనతలు, వైఫల్యాలే కారణం. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం, బలగం ఉండి కూడా ఎన్నికలలో చతికిల బడుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సమీప భవిష్యత్ లో పుంజుకుంటుందా అంటే కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తు్నారు. అన్నిటికీ మించి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కుదేలును చేసేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కార్యకర్తలలో జోష్ పెరిగిందనడంలో సందేహం లేదు.
అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని.. ప్రజలకు చేరవ కావడానికి మార్గదర్శనం చేయాల్సిన నాయకత్వం విఫలమౌతోంది. నిజానికి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో పుంజుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని బలోపేతం కావడంలో ఆ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే. కాంగ్రెస్ గురించి తరచూ పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంది. ఆ పార్టీని ఎవరూ ఓడించలేరు.. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని. రాష్ట్రంలో సరిగ్గా అదే జరుగుతోంది.
ఆ గొడవలే తెలంగాణలో ప్రజలకు పార్టీని దూరం చేస్తుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ కనిపించినా, సీనియర్ నేతలు తమ వైఖరితో ఆ జోష్ ను బలవంతంగా అణిచేస్తున్నారు. దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో ఘోర ఓటమి. ఇప్పటికే పలుమార్లు యాత్రలు, పోరులు తలపెట్టిన అధ్యక్షుడు రేవంత్ కొంతవరకు ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ నేతలు సహాయ నిరాకరణతో ఫలితం ఉండటం లేదు. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలలోకి వెళ్లాలని రేవంత్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ విఫలం చేయడానికే అన్నట్లుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. వీహెచ్, జగ్గారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాంగ్రెస్ లోని ప్రతి సీనియర్ పేరూ చెప్పాల్సి ఉంటుంది. సీనియర్లు సహకరించకున్నా రేవంత్ ఇప్పుడు మరో పోరుకు రెడీ అయ్యారు. ఈసారి రైతు సమస్యలపై ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేస్తూ పార్టీ నేతలను కలుపుకుపోవాలని సంకల్పించారు.
ముందుగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కార్యాచరణ ఓకే కానీ.. ఇది ఎంతవరకు సక్సస్ అవుతుంది? సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారు అన్న సందేహాలు పార్టీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పకోనవరం లేదు. రైతు సమస్యలపై కార్యాచరణపై చర్చించేందుకు గాంధీ భవన్ లో సమావేశం కోసం రేవంత్ పార్టీలో సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తేనే.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే హాజరయ్యారు. జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమన్వయ లోపమే కాంగ్రెస్ పార్టీకి పుంజుకోవడానికి అవరోధంగా మారింది. దీనిని అధిగమించి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి రేవంత్ తీసుకురాగలరా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి నడిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ జారుడు బండపై ఉంది. రేవంత్ గట్టెక్కించగలరా అన్నది చూడాలి.