మంగ్లికీ ఓ సలహాదారు పదవి
posted on Nov 22, 2022 @ 10:17AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల పదవుల నియామక మేళా జరుగుతోంది. వారానికి ఇద్దరు చొప్పున సలహాదారు పదవులలో నియమితులౌతున్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. అంతా నా యిష్టం అన్న రీతిలో విమర్శలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల జోరు పెంచేస్తున్నారు.
తాజాగా ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదలో నియమించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. అలీ, పోసాని మురళిలక సలహాదారు పదవులు ఇచ్చిన జగన్ తాజాగా మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీని నియమించారు.
వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే మంగ్లిని సలహాదారుగా నియమిస్తూ ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీ అనగానే ధర్టీ ఇండస్ట్రీస్ పృధ్వికి జరిగిన మర్యాద గుర్తొచ్చిందో ఏమో ఉత్తర్వులు వెలువడినా మంగ్లీ మాత్రం ఇంత వరకూ బాధ్యతలు చేపట్ట లేదు. చివరకు సమాధానపడి, నాలుగు రోజుల క్రితమే ఆమె ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మంగ్లీకి లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్.
ఇవి కాకుండా ఇతర ఫెసిలిటీస్ అదనం. ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్లపాటు కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించిన సంగతి విదితమే.
కాగా ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా మంగ్లి నియామకం పట్ల మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తనదైన ప్రత్యేకత చాటుకుంటూ గాయనిగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న గాయని మంగ్లిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ )కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా(ఎస్వీబీసీ) ఏపీ ప్రభుత్వం నియమించడం చాలా ఆనందంగా ఉంది. మంగ్లి తన సాంగ్స్ తో స్వామిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ మంగ్లీ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.