చివరాఖరికి శ్రీరెడ్డికీ వైసీపీ సొమ్ములెగ్గొట్టింది!
posted on Nov 14, 2023 9:09AM
ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేసే సోషల్‌మీడియాకు.. ఆ పార్టీ నిర్వహకులు డబ్బులు ఎగ్గొడుతున్నారంటూ అలా ప్రమోట్ చేసిన వారు మీడియాకు, వీడియోకు ఎక్కడం మొదటి సారిగా జరిగింది. ఇంతకూ ఒక రాజకీయ పార్టీ కోసం సామాజిక మాధ్యమంలో విపరీతంగా ప్రమోట్ చేసి ఆ సోషల్‌మీడియా ఉద్యమకారిణి ఎవరంటే ఆమె శ్రీరెడ్డి. శ్రీరెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసి బాగా పాపులర్ అయిన శ్రీరెడ్డి.. ఆ తరువాత కూడా వంటల వీడియోలతో, రాజకీయ పార్టీలూ, నేతలపై సంచలన వ్యాఖ్యలతో అన్ని వర్గాల వారికీ బాగా సుపరితమైన పేరే. ఆ శ్రీరెడ్డి జగన్ పార్టీ వైసీపీకి అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పలు పోస్టులు పెట్టారు. పనిలో పనిగా తనదైన ప్రత్యేక శైలిలో విపక్షాలపైనా, విపక్షాల నాయకులపైనా సంచలన ఆరోపణలు, విమర్శలూ చేశారు. అయితే శ్రీరెడ్డి ఆ పనులన్నీ వైసీపీ పట్ల తనకు ఉన్న అభిమానంతో చేశారని ఇంత వరకూ అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన చేత పార్టీని ప్రమోట్ చేయించుకుని ఇప్పుడు వైసీపీ డబ్బులు ఎగ్గొట్టిందంటూ ఓ పోస్టు పెట్టారు. ఆమె సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
సినీ రంగంలో మహిళలపై వేధింపులపై మీడియాకు ఎక్కడం, తనకు సభ్యత్వం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ, హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఆఫీసు వద్ద అర్ధనగ్న ప్రదర్శనలతో బాగా గుర్తింపు పొందిన శ్రీరెడ్డి తన చర్యల వల్ల సినీమాలలో అవకాశాలు దొరకలేదు. దాంతో సోషల్‌మీడియాలో బూతు పురాణం, సంచలన వ్యాఖ్యలతో పొట్టపోసుకుంటున్న శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ తనకు డబ్బులు ఎగ్గొట్టిందంటూ వీడియోకి ఎక్కడం సంచలనం సృష్టిస్తున్నది.
తెలుగుదేశం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఇష్టారీతిన విమర్శలతో చెలరేగిపోతూ, అదే సమయంలో వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన శ్రీరెడ్డి అధికార పార్టీ సోషల్ మీడియాకు ముందుండి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అదే శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీపై నోరు పారేసుకుంది. తన చేత వైసీపీ సోషల్ మీడియాలో పార్టీని ప్రమోట్ చేయడానికి పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేసిందని అదే సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జగనన్న కోసం మంచీ చెడూ మరచి విపక్షాలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన విమర్శలు చేయించుకున్న అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ అలా చేసినందుకు ఇస్తానన్న సొమ్ములు ఎగ్గొట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
అయినా జగనన్న హయాంలో పని చేసిన ఎవరికి సక్రమంగా వేతనాలు అందుతున్నాయనీ, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు సొమ్ములు ఇవ్వలేదంటూ శ్రీరెడ్డి మీడియాకు ఎక్కడమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
జగనన్న ఇమేజ్ ను పెంచడానికీ, విపక్షాలను అడ్డగోలు విమర్శలతో తూర్పారపట్టడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ అహోరాత్రుళ్లూ పని చేస్తున్నదన్నది కాదనలేని వాస్తవం. మరి అంతగా వెట్టి చాకిరీ చేయించుకున్న వైసీపీ సామాజిక మాధ్యమ సైన్యానికి ఇవ్వాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే ఎలా? శ్రీరెడ్డిలా ఆ వింగ్ లో ఉన్న మిగిలిన సామాజిక మాధ్యమ సైన్యం కూడా వీడియోలకు, మీడియాకు ఎక్కితే.. అదే జగన్ ఇమేజ్ అధ:పాతాళానికి పడిపోవడం ఖాయం కాదా? పెంచిన వాళ్లకు తగ్గించడం తెలియకుండా ఉంటుందా? ఆ దిశగా బోల్డ్ లేడీ శ్రీరెడ్డి తొలి అడుగువేసిందంటున్నారు.
వైసీపీ సోషల్‌మీడియా సైనికులకు జీతాలు అందడం లేదనీ, పని చేయించుకోవడం తప్ప వేతనం గురించి అధికార పార్టీ అస్సలు ఆలోచించడం లేదంటూ శ్రీరెడ్డి అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు. వైసీపీ సోషల్‌మీడియాను సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ పక్షాన సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తీరు అందరికీ తెలిసిందే. ఆమెకు ఆగ్రహం వస్తే ముందు వెనుకలు ఆలోచించకుండా దూకుడుగా విమర్శలు చేసేస్తారు. గతంలో ఒక సారి వైసీపీ పాలన కంటే, చంద్రబాబు పాలన బాగుందంటూ తన గ్రామంలోని ఓ దేవాలయ దుస్థితిని ఉన్నదున్నట్లు చెప్పేశారు. అంతే కాదు ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా వైసీపీలో తనకు ఎలాంటి గుర్తింపూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ సోషల్ మీడియాలో పని చేసే వారికి జీతాలివ్వడం లేదంటూ రోడ్డెక్కారు. దీంతో వైసీపీ పరువు గంగలో కలిసిపోయినట్లైంది. శ్రీరెడ్డి ఆరోపణలపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందో, ఉండబోతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనూహ్యంగా శ్రీరెడ్డికి మాత్రం జగన్ వ్యతిరేకుల నుంచి సానుభూతి, సంఘీభావం వ్యక్తం అవుతోంది.