జగన్ ప్యాకప్ ఖాయం.. ఐ ప్యాకే చెప్పేసింది!
posted on Nov 14, 2023 @ 11:01AM
జగన్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని ఇప్పటి వరకూ విశ్లేషకులూ, పరిశీలకులూ, పలు సర్వేలూ చెప్పాయి. కానీ ఇక పడిపోవడానికి, దిగజారడానికి ఏమీ లేదని జగన్ నమ్ముకున్న ఐప్యాక్ తేల్చేసింది. వాళ్లూ, వీళ్లూ ఇంత కాలం జగన్ పని అయిపోయిందని చెబుతుంటో ఏమో వాళ్లూ, వీళ్లూ చెప్పినవి ఎందుకు నమ్మాలి అనుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్.. ఈయన ఎవరన్న డౌట్ వచ్చిందా? డౌట్ ఎందుకు ఆయనే అవును అక్షరాలా ఆయనే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకేనే... అవును పీకేయే వైసీపీ పని అయిపోయింది. ఇక తట్టాబుట్టా సర్దేసుకోవడమే తరువాయి అని కుండ బద్దలు కొట్టేశారు.
దీంతో వైసీపీకి తత్వమే కాదు సత్యమూ బోధపడింది. ఐప్యాక్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ఓటర్లు ఎటుమొగ్గు చూపుతున్నారన్నది తేటతెల్లమైపోయింది. ఇప్పటికిప్పుడు అని కాదు.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికార వైసీపీకి ఓటమి తథ్యమని ఐపాక్ సర్వే తేల్చేసిందని వాళ్లూ వీళ్లూ కాదు.. వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అదీ అలాంటి ఇలాంటి ఓటమి కాదు.. దిమ్మతిరిగి బొమ్మ కనిపించే లాంటి ఓటమి అని ఐప్యాక్ సర్వేయే చెప్పిందంటూ.. వాస్తవంగా రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉండి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
పరిశీలకులు విశ్లేషణలతో పని లేకుండానే క్షేత్ర స్థాయిలో అసలు పరిస్థితి ఏమిటి? జనం జగన్ పాలన గురించీ, వైసీపీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. వారి మూడ్ ఎలా ఉంది? వచ్చే ఎన్నికలలో వారు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయాలు అందరికంటే గడపగడపకూ, వైఎపీ నీడ్స్ జగన్, సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ జనంలోకి వెళ్లిన, వెళ్లడానికే జంకుతున్న వైసేపీ నాయకులకే బాగా తెలుసు. అయితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ‘నేను బటన్లు నొక్కుతూ పప్పుబెల్లాల్లా సొమ్ములు పందేరం చేస్తుంటే ఓట్లెందుకు పడవు.. మీరు జనంలోకి వెళ్లి మనం పందేరం చేసిన సొమ్ముల లెక్కలు చెప్పండి చాలు’ అంటూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఊదరగొడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, సర్వేల పేరిట, తనను తాను మోసం చేసుకుంటూ, పార్టీ నేతలనూ, ఎమ్మెల్యేలను ఇంత కాలం మోసం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు ఐప్యాక్’ తాజా సర్వేతో అంతా తేటతెల్లమైపోయింది. పార్టీ నేతలే కాదు, కార్యకర్తలు కూడా కాడె వదిలేసే పరిస్థితి వచ్చింది. సామాజిక సాధికార యాత్రకు కార్యకర్తలు కూడా మొహం చాటేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకీ ఐప్యాక్ సర్వే వైనాట్ 175 అంటున్న జగన్ గాలి తీసేసింది. ఎట్ లీస్ట్ 31 కూడా కష్టమేనని తేల్చేసింది. ఆ నివేదికను ఏకంగా జగన్ కే అందజేసింది. మీటల మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనని జగన్ కు తెలియజేసింది. ఈ సర్వే వెల్లడి కావడం కంటే కొంచం ముందే ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఉచితాలు పందేరం చేసి, అభివృద్ధిని అటకెక్కించేస్తే దేశంలో రాష్ట్రాలన్నీ ఏపీలా తయారౌతాయని తేల్చేశారు. ఏపీ పాలన, జగన్ తీరు తనకు చెడ్డపేరు తెచ్చిపెట్టాయన్న ఆవేదనా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత దేశ విదేశాల్లో ఆయనకు లభిస్తున్న మద్దతు. వ్యక్తమవుతున్న సానుభూతి, అన్నిటినీ మించి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మరో సారో మరింతగా వెలుగులోకి వచ్చింది. జగన్ రెడ్డి అరాచక పాలనలో గట్టు తప్పి, ఆగాధంలోకి కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రి అవసరమనే భావన ప్రజలలో ఏర్పడిందని సర్వేలో పేర్కొంది.