ఇదేమిటబ్బా..!
posted on Nov 14, 2023 @ 1:14PM
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్టోబర్ 11న అంటే శనివారం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. గత వారం రోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడం.. అందులోభాగంగా.. మెరుగైన వైద్య చికిత్స కోసం.. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలించాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని భాగ్యనగరానికి తరలించారు. కానీ ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కంతా అనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
జగన్ గద్దెనెక్కిన తర్వాత.. మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో విశాఖపట్నం రేపోమాపో రాజధానిగా కొలువు తీరనుందని.. అలాంటి రాజధాని నగరంలో విద్య, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలని.. కానీ విశాఖపట్నంలో మెరుగైన వైద్యం లేదంటూ బొత్సకు వైద్య పరీక్షల నిర్వహించిన వైద్యుల ద్వారా అవగతమవుతోందని.. అందుకే ఆయనను పక్కా రాష్ట్రం హైదరాబాద్ తరలించారనే విషయం స్పష్టమవుతోందనే ఓ చర్చ జోరందుకుంది.
ఇక రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, జగనన్న ఆరోగ్య సురక్షా పథకం అమల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. జగన్ పాలనలో అన్ని రంగాంల్లో రాష్ట్రం దూసుకు పోతున్నదని వైసీపీ మాజీలు, తాజా మంత్రులే కాదు.. ఆ పార్టీలోని కీలక నాయకులు సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు మీడియా ముందుకు వచ్చి ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. మరి విశాఖపట్నంలో వైద్య సేవలు అంత బావుంటే.. మంత్రివర్యులు ప్లస్ ఉత్తరాంధ్ర కింగ్ బొత్స ఇలా హైదరాబాద్‌కు వెళ్లి ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందనే ప్రశ్న సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నెటిజనులు బోత్స సత్యనారాయణతో పాటు జగన్ సర్కార్ ను కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
గతంలో కరోనా సమయంలో సైతం జగన్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు వారి కుటుంబాలు హైదరాబాద్ తరలి వెళ్లి ఆక్కడ కరోనా చికిత్స తీసుకున్నాయి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును.. హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ వైద్యం అందించారని.. అంత దాకా ఎందుకు ఇటీవల మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారండతో.. ఆయన్ని బొంబాయి తరలించారని.. నెటిజనులు గుర్తు చేస్తున్నారు.
అయినా రేపోమాపో విశాఖ రాజధాని కానుందని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు విశాఖ కేంద్రంగా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే సందేహాలు పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమౌతున్నాయి.
మరోవైపు విశాఖపట్నానికి ప్రస్తుతం ఇన్‌చార్జి మంత్రిగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారని.. మరి బోత్స వ్యవహారంపై ఓ బాధ్యత కలిగిన ఆదే శాఖకు చెందిన మంత్రిగా.. ఆమె ఏం సమాధానం చెబుతారని నెటిజనులు నిలదీస్తున్నారు.
ఇంకో వైపు కరోనా సమయంలో.. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ గుర్తున్నాయనీ, ఇంకా వివరంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని కరోనా బాధితులు చికిత్స కోసం తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారని.. కానీ అక్కడి కేసీఆర్ ప్రభుత్వం వారిని తెలంగాణ భూభాగంలో అడుగు పెట్టనివ్వలేదని.. అలాంటి సంఘటనల జరిగిన దృష్ట్యా.. మనం, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కాకుంటే.. కనీసం వైద్య ఆరోగ్య రంగంలో అయినా గణనీయ ప్రగతి సాధించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అనారోగ్య జీవులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీసే పరిస్థితి ఉండేది కాదు కదా అంటున్నారు. ఈ కనీస అవగాహన వైసీపీ సర్కార్ కు, ఆ ప్రభుత్వంలోని మంత్రులకు లేక పోవడం నిజంగా సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏదీ ఏమైనా.. రాష్ట్రంలో అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం రకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయని.. వాటిని విస్మరించి.. ప్రజాప్రతినిధులు ఇలా పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవడంతో.. ఆ తర్వాత ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజేయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్ర అభివృద్ధిపై వివిధ సభల్లో వెటకారం, హేళనగా మాట్లాడడం.. వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో మళ్లీ జగన్ కేబినేట్‌లోని బొత్స లాంటి వారు.. ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం రివాజుగా మారిపోయిందని.. అయినా బొత్సలాంటి వారు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లడం వంటి సంఘటనలు చూస్తుంటే ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలలో తప్పేముందని అనిపించక మానదని పరిశీలకులు చెబుతున్నారు.