బంగారు తెలంగాణ కోసం ఓటేయండి.. రాహుల్
posted on Nov 30, 2023 9:03AM
సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేసించి x వేదిక ద్వారా ఓ సందేశం ఇచ్చారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 7.78 శాతం పోలింగ్ జరిగింది. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పోలింగ్ మందకొడిగా సాగుతోందని, క్రమంగా పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వెలవెలబోతున్నది. ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకూ కేవలం 12 మంది మాత్రమే ఈ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇలా ఉండగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఖానాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్యా మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు.