అర్ధరాత్రి సాగర్ వద్ద హైడ్రామా.. ఎన్నికల వేళ ఎందుకిలా?
posted on Nov 30, 2023 @ 11:02AM
రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, వందల మంది పోలీసులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక రాష్ట్రం పోలీసులు గేటు వేసి అడ్డుకుంటే.. మరో రాష్ట్రం పోలీసులు ఫెన్సింగ్ వేసి అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తతతలు ఘర్షణకు దారి తీయడంతో డ్యామ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒకవైపు తెల్లవారితే తెలంగాణలో ఎన్నికలు, అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా నెలకొనడంతో అసలేం జరుగుతోందన్న అయోమయం ఏర్పడింది. ఇరు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడంతో వందల మంది పోలీసులు మోహరించడంతో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ అర్ధరాత్రి సమయంలో హైడ్రామాకి తెర తీసారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. ఆ ఆరోపణలు అలా ఉంచితే ఇంతకూ అసలేం జరిగిందంటే.
తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు ఏపీ పరిధిలో ఉండగా మిగతా సగభాగం తెలంగాణలో ఉంది. కాగా ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఇదే సమయంలో డ్యామ్ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోంది. అసలు రెండు రాష్ట్రాలకు వాటాలు ఉన్న ప్రాజెక్టును ఒకే రాష్ట్రానికి యాజమాన్య బాధ్యతలను అప్పగించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ అధికారులు భారీ ఎత్తున పోలీసులను వెంటపెట్టుకొని నాగార్జునసాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని, అక్కడ వరకు కంచె వేశారు. ఏపీ అధికారులు పోలీసులను డ్యామ్ సిబ్బంది గేట్ వేసి అడ్డుకోగా.. డ్యామ్ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా డ్యామ్ సిబ్బంది మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని కోరారు. ఏపీ పోలీసుల నుండి స్పందన లేకపోవడంతో తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటనా స్థలంలో మీడియా కవరేజీకి ప్రయత్నించగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా లాక్కున్నారు.
అయితే, అర్ధరాత్రి వేళ ఏపీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముందే ప్రక్కా ప్రణాళికతో 600 నుండి 700 మంది పోలీసులు ప్రాజెక్టుపైకి వెళ్లారు. నిజానికి ఈ ప్రాజెక్టు, అందులో నీటి వాటాలు, ప్రాజెక్టు నిర్వహణ ఇవన్నీ కేంద్ర పరిధిలోని అంశాలు. మహా అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అంశాలు. కానీ, వందల మంది పోలీసులతో వెళ్లి ప్రాజెక్టు వద్ద బీభత్సం సృష్టించడం వలన ఒరిగేది ఏమీ లేదు. పైగా సిబ్బందిపై దాడి, సీసీ కెమెరాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజల సొమ్మే నష్టపోయింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తే.. ఇది కావాలని పక్కా ప్రణాళికతో చేసిన చర్యగానే కనిపిస్తుంది. దౌర్జన్యకాండతో ఫలితం లేదని తెలిసినా.. పోలీసులే పనిగట్టుకొని వెళ్లి అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం వెనక పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రభావం చేయాలన్న దురుద్దేశమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఊరుకుని సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ రకమైన దూకుడు ప్రదర్శించడం పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికేనని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్ చేసిన ఈ చర్య వల్ల ఇటు ఏపీలో జగన్ సర్కార్ రైతాంగం సమస్యల పట్ల పొరుగు రాష్ట్రంతో గొడవకు సైతం వెనుకాడటం లేదన్న భావన ప్రజలలో కలిగేలా చేయడంతో పాటు.. పొరుగు రాష్ట్రంలో సెంటిమెంట్ ను రగిల్చి అక్కడి తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలన్న కుట్ర కూడా దాగి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ సాగర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడేలా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు రాజకీయ కుట్రేనని అంటున్నారు.