విజయవాడ, హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
posted on Nov 30, 2023 @ 9:51AM
విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే, వచ్చే ప్రయాణీకులతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
అదలా ఉంటే నాగర్ కర్నూల్ మన్ననూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీయడంతో పోలీసులు ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. గద్వాల జిల్లా ఐజ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
అదే విధంగా జనగామలో కూడా ఓ పోలీసు స్టేషన్ వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు.
భద్రాద్రి జిల్లా నల్లబండపోడులో గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి తారు రోడ్డు లేదని వారు ఓటు వేయడానికి నిరాకరించారు.