తెలంగాణ హస్తగతం.. సీఎం రేవంతా? భట్టినా?
posted on Dec 3, 2023 @ 11:36AM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. 119 స్థానాలకు గాను 65కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న హస్తం పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. దీంతో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో పలువురు ఉంటారనేది ముందు నుంచి ఉన్న చర్చే. అయితే రేసులో ఎంతమంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం రేవంత్, భట్టి మధ్యనే అనేది విశ్లేషకుల అభిప్రాయం. రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా, భట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
రేవంత్ మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చి పార్టీని విజయం దిశగా పరుగులు పెట్టించారు. అందుకే రేవంతే సీఎం అనేది మెజారిటీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయం. తమ పార్టీకి మళ్ళీ ఊపిరి పోసి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ కి పట్టంకట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపవచ్చు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అనుమానాలున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భట్టి పేరుని కూడా ప్రధానంగా పరిశీలించే అవకాశముంది. భట్టి కాంగ్రెస్ కి విధేయుడు, సౌమ్యుడు, పైగా దళిత నాయకుడు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భట్టిని సీఎం చేస్తే కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకించే అవకాశం లేదు. అలాగే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారు కాబట్టి, కాంగ్రెస్ దళిత నేతని సీఎంని చేస్తే ప్రజల్లోకి మరింత పాజిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశముంది.
కర్ణాటకలో కూడా తన దూకుడు స్వభావంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డి.కె. శివకుమార్ ని కాదని సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పద్ధతిని అనుసరించి భట్టిని సీఎం చేస్తుందా? లేక రేవంత్ వైపు మొగ్గుచూపుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.