బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలివే!
posted on Dec 3, 2023 @ 12:15PM
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని ఆశపడిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. హస్తం పార్టీ 65కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుండగా, కారు పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. గులాబీ పార్టీ ఘోర పరాజయానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.
- వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. బీఆర్ఎస్ విషయంలో కూడా అదే జరిగింది.
- టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి అనుకోవడం కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పుగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల ఈసారి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోలేకపోయారు. మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క అవకాశం అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
- లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలు బయట పడటం.
- పరీక్షా పత్రాల లీకులతో విద్యార్థులు, నిరోద్యుగులలో కేసీఆర్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత.
- రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. మరోవైపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని రైతులు బలంగా నమ్మడం.
- కౌలు రైతులను పట్టించుకోకపోవడం, రైతులకు లబ్ది చేకూర్చే పలు సబ్సిడీలు ఎత్తివేయడం.
- డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు, బీసీ బంధు వంటివి దాదాపు ప్రకటనలకే పరిమితమవ్వడం. వాటి ద్వారా అతికొద్ది మంది మాత్రమే లబ్ది పొందటంతో ఇతరుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం.
- తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం.
- అరాచకాలు, భూకబ్జాలు, అవినీతి వంటి ఆరోపణలతో ఎందరో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ మళ్ళీ వారికే టికెట్లు ఇవ్వడం.
- బీజేపీతో చీకటి ఒప్పందం అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళడం.
- చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు.