అవినీతి అహంకారంతోనే కారు గ్యారేజీకి!
posted on Dec 3, 2023 @ 12:58PM
తెలంగాణలో కాంగిరేసు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి మరీ విజయపథంలో దూసుకుపోతోంది. దాదాపు 70 స్థానాలలో కాంగ్రెస్ అధీక్యంలో కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయమైంది. టిఆర్ఎస్ 29 స్థానాల్లో, బీజేపీ ఆరు స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తుండగా.. మరికొన్ని స్థానాలలో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఐదారు స్థానాలలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరాహరీ పోరు సాగుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో తొలి ఫలితంలోనే మొదట కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు మొదలవగా.. స్థానాలు పెరిగే కొద్దీ సంబరాల జోరు కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటికి డీపీజీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మొత్తంగా చూస్తే తెలంగాణ హస్తగతం కావడం, బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడానికి కారణాలేంటన్నది పరిశీలిస్తే.. తెలంగాణ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్ ను తమ వైపునకు తిప్పుకోవడంతో కాంగ్రెస్ సఫలీకృతమైంది. అలాగే కేంద్ర నాయకత్వాన్ని పిలిపించి ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీ బాగా పని చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ను ఢీకొట్టే దిశగా బలంగా అడుగులు వేయగలిగింది. అలాగే తెలంగాణలో కీలకమైన మైనార్టీల ఓట్లు మైనార్టీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకోగలిగింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే చర్చ బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడంతో.. మైనార్టీలు బీఆర్ఎస్ వైపు వెళ్లలేదన్నది స్పష్టమైపోయింది.
బీఆర్ఎస్ ఓటమిలో అతిముఖ్యమైనదిగా వినిపిస్తుంది తొమ్మిదిన్నరేళ్ళలో ప్రభుత్వ అవినీతి.. బీఆర్ఎస్ నేతల అహంకారపూరిత వైఖరి. ఔను.. ఏ ఛానెల్ డిబేట్లలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా.. ఏ నేతను కదిలించినా ఇదే మాట ముందుగా వినిపిస్తున్నది. స్థానికంగా గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. తమ చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజలపై పెత్తనం చేయడానికి ఉపయోగించడంతో ప్రజలలో ఈ స్థాయి వ్యతిరేకత వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు కేసీఆర్ నుండి ఆ కుటుంబానికి చెందిన కేటీఆర్, కవిత.. మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అందరినోటా అహంకార పూరిత వ్యాఖ్యలే వినిపించేవని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. అవే అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రజలు క్లియర్ కట్ గా గులాబీ పార్టీని దూరం పెట్టినట్లు పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ ఓటమిలో మరో కారణం అవినీతి. పార్టీ పెద్దల నుండి గ్రామ స్థాయి నేత వరకూ అందరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా కేసీఆర్ పలువురు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని తొలి నుండి ఆరోపణలుండగా.. బీసీ బంధు, దళిత బంధులో కూడా ఎక్కడిక్కడ స్థానిక నేతలు చేతి వాటం ప్రదర్శించారనే ప్రచారం జరిగింది. సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటాలు ఇవ్వాల్సిందే అనేలా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు పలు ఆక్రమణలు, కోట్లకు పడగలెత్తిన కేసీఆర్ కుటుంబ సన్నిహితులు, కేసీఆర్ కుటుంబం అంతా రాజకీయాలలో పదవులు దక్కించుకోవడం, బంధువులకు దోచిపెట్టినట్లు ఆరోపణలుండడం కూడా బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.