బీఆర్‌ఎస్‌ను ముంచేసిన బీజేపీ
posted on Dec 3, 2023 @ 12:37PM
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. అభ్యర్థుల భవితవ్యం కూడా తేలిపోయింది. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ, పోస్టల్ బ్యాటెట్ సహా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. గురువారం (నవంబర్ 30)న పోలింగ్ ముగిసిన క్షణం నుంచీ ఎక్కడ చూసినా తెలంగాణలో విజయం సాధించే పార్టీ ఏది? కాబోయే సీఎం ఎవరు? అన్న చర్చే జరుగుతోంది. ఆ చర్చకు ఈ రోజు ముగింపు దొరికింది. తెలంగాణలో రాబోయే సర్కార్ కాంగ్రెస్ దేనని తేలిపోయింది. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. పాతిక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించగా, వాటిలో రెండు మూడు మాత్రమే బీఆర్ఎస్ గులుస్తుందని అంచనా వేశాయి. మిగిలిన అన్నిటి ప్రిడిక్షన్ కాంగ్రెస్ విజయం ఖాయమనే. అది కూడా స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేపడుతుందనే చెప్పాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే వాస్తవంగా వచ్చాయి. సరే విశ్లేషకులు కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషిస్తూ ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనే చెప్పారు. ఇప్పుడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని దేశానికే మోడల్ గా మార్చేశాం, తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మార్చేశాం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోకతప్పని పరిస్థితి. అసలా పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అన్న రీతిలో దూసుకొచ్చిన బీజేపీ ఒక్కసారిగా ఎందుకు చతికిల పడింది? సరిగ్గా ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎలా పుంజుకోగలిగింది? అన్న విషయాలపై రాజకీయవర్గాలలోనే కాదు, జనబాహుల్యంలో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే బీఆర్ఎస్ ఓటమిని ఖరారు చేసి పోస్టు మార్టం కూడా చేసేశారు.
తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలలో అసంతృప్తి రావడం సహజం. కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అలాగే వ్యతిరేకత కనిపించింది. యువత నుండి సంక్షేమ పథకాల లబ్ధిదారుల వరకూ అన్ని విషయాలలో, అందరిలో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయితే ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎలా ఓటుగా మలచుకోగలిగిందన్న దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ విజయాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంగా విశ్లేషకులు కాంగ్రెస్ గెలుపును అభివర్ణిస్తున్నారు. కురుక్షేత్ర యుద్దానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష, అహంకారం, ఎలాగైనా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్న దురాశ కారణం. అలాగే 2014 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ లో ఈ లక్షణాలన్నీ కనిపించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ విజయానికి అర్జునుడి రథసారథిగా కృష్ణుడు సహాయ పడ్డాడు. తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా శ్రీకృష్ణుడిలా కీలక పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కేసీఆర్ మాస్టర్ మైండ్ పాలిటిక్స్ అవలంబించారు. 2018లో రెండవసారి అధికారం దక్కిచుకున్న అనంతరం భవిష్యత్ లో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) కు భవిష్యత్ లో ప్రత్యర్థి పార్టీగా బలపడే అవకాశం కాంగ్రెస్ కే ఉందని ఊహించి, ఆ పార్టీని దెబ్బతీయడానికే సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు సంస్థాగతంగా కూడా ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రణాళికలు అమలు చేశారు. ఇదే సమయంలో మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పుంజుకునేందుకు తెరవెనుక సాయం చేశారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసమే బీజేపీ దూకుడు పెంచేందుకు సహకారం అందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రమేననీ, బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేననే స్థాయిలో ఆ పార్టీకి బిల్డప్ ఇచ్చారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కేసీఆర్ వేసిన ప్రణాళికను బాగానే అమలు చేశారు. ఫలితం ఎలా ఉన్నా కాంగ్రెస్ ను దెబ్బతీయడంలో కేసీఆర్ సఫలీకృతం అయ్యారు. అక్కడితో ఆగకుండా తెరాసను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ను, కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అక్కడ కేసీఆర్ వ్యూహాలను, ఎత్తుగడలను అర్ధం చేసుకున్న రాజకీయ పార్టీలు ఆయనకు దూరం జరిగాయి. తెలంగాణ వరకూ అయితే కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి. కానీ బీజేపీ వ్యూహాలు వికటించాయి. ఆ పార్టీ ఎన్నికల ముందు చేసిన సంస్థాగత మార్పులన్నీ కేసీఆర్ సూచనల మేరకే చేసిందన్న అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్లిపోయింది. దీంతో కేసీఆర్ దెబ్బతిన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో బీజీపీ ఆ స్థానాన్ని భారీ చేసేందుకు తెగ ప్రయత్నం చేసింది. అసలు ఉనికే లేని బీజీపీకి కేసీఆర్ బంగారం లాంటి అవకాశాలు కల్పించారు. దాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ పెద్దలు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసి పార్టీ నిర్మాణానికి వ్యూహాలు రచించారు. వారికి బండి సంజయ్ లాంటి సారథులు కూడా తోడవడంతో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించింది. ప్రజలు కూడా బీజేపీ వైపు మళ్లనున్నారని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ఏడాదిలో బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు మొత్తం తారుమారు చేసేశాయి.
ఎన్నికలకు కొన్ని నెలల ముందే తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు ఆ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చింది. ఈ మార్పుతో పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో బండి తన ప్రజాసంగ్రామ యాత్రను మధ్యలోనే ఆపేశారు. ఇది ఎందుకు ఆపారో కూడా ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణులకు అర్ధం కాని ప్రశ్నే. ఇక సీఎం కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఆరోపణలు గుప్పించిన బీజేపీ.. ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. చివరికి ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వెనక కేంద్రం ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వినిపించాయి. వీటన్నిటిని నేపథ్యంలో ప్రభుత్వ అసంతృప్తులు బీజేపీని నమ్మ లేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ.. ఈ రెండు పార్టీల వ్యాహాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలలో అవగాహనా పెరిగేలా చేయగలిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలకుండా నివారించగలిగింది. తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లింది. అదే బీఆర్ఎస్ కొంప ముంచింది.