టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరం
posted on Feb 9, 2024 @ 1:40PM
టీం ఇండియాకు మరో స్టార్ బ్యాట్స్ మెన్ దూరమయ్యారు. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. మాజీ సారథి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ లో మరో రెండు టెస్టులకు దూరమయ్యారు. గాయాలతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ తొలి రెండు టెస్టులకు, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మరో స్టార్ బ్యాట్స్ మన్ జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
టాపార్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీపు నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లోనే కాదు, మిగతా రెండు టెస్టుల్లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగా మారింది.
రెండో టెస్టు ముగిశాక అందరి క్రికెట్ సామగ్రి విశాఖ నుంచి రాజ్ కోట్ కు తరలించగా, శ్రేయాస్ అయ్యర్ కిట్ ను మాత్రం అతడి స్వస్థలం ముంబయికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండబోవడంలేదని ఈ పరిణామం ద్వారా అర్థమవుతోంది.
ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును ఇంగ్లండ్ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. మిగతా మూడు టెస్టుల్లో ఆడే టీమిండియాను సెలెక్టర్లు నేడు ఎంపిక చేయనున్నారు.టీమిండియాకు బిగ్ షాక్. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని సమాచారం. వైజాగ్ టెస్టు అనంతరం టీమిండియా ఆటగాళ్ల లగేజ్‌ను మూడో టెస్టు జరిగే రాజ్‌కోట్‌కు తరలించారు. కానీ శ్రేయస్ అయ్యర్ లగేజ్‌ను మాత్రం తన ఇంటికి పంపించారని సమాచారం.
'30 బంతులు కంటే ఎక్కువగా ఆడిన సందర్భాల్లో వెన్నునొప్పి వస్తుందని, ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన గజ్జల్లో నొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా, మేనేజ్మెంట్, వైద్య సిబ్బందికి తెలిపారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అతడికి కొన్ని వారాలు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలో అతడు ఎన్సీఏకి వెళ్తాడు'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.