జగన్ ను సాగనంపేందుకు జనం సిద్ధం.. మూడ్ ఆఫ్ ఏపీ ఇదే!
posted on Feb 9, 2024 6:10AM
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏ ప్రాంతంలోనూ జరగలేదు. ఏపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన అమరావతి రాజధానిని సైతం వైసీపీ పాలనలో నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో ఏర్పాటైన పలు కంపెనీలు సైతం ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ఇసుక దగ్గర నుంచి మట్టి ఇలా అన్నింట్లోనూ ఏపీలో వైసీపీ నేతల దోపీడీ కొనసాగుతుందన్న వాదన ప్రజల నుంచి విస్తృతంగా వినిపిస్తోంది. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం అదంతా ప్రతిపక్షాల విమర్శలేనంటూ తమకు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. తాజాగా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెల్లుబికుతోందని తేటతెల్లమైపోయింది. ఇండియా టుడే తాజా సర్వేలో ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తేలింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. అన్నిప్రధాన పార్టీలు సమర శంఖం పూరించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు, సమావేశాలతో ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. మరోవైపు మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కానీ, ఈసారి జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర పరాభవం తప్పదని సర్వే తేల్చేసింది. ఇప్పటికే పలు సర్వేలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో సీఎం జగన్ నియోజకవర్గాల ఇంచార్జులను మార్పులు చేర్పులు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కొత్తవారిని అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నారు. అయినా జగన్ కు ప్రజలు గట్టిషాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రధాన సర్వేల్లో ఒకటైన ఇండియా టుడే సర్వే సైతం జగన్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని తేల్చేసింది. ఈ సర్వే ఏపీలో వైసీపీకి కేవలం ఎనిమిది ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. తెలుగుదేశం - జనసేన కూటమి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది.
ఏపీలో టీడీపీ - జనసేన కూటమికి 45శాతం ఓటు బ్యాంకు నమోదవుతుందని, అధికార వైసీపీకి 41శాతం ఓటు బ్యాంకు సమకూరుతుందని ఇండియా టుడే సర్వే ఫలితాల్లో వెల్లడైంది. ఏపీ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పూర్తిగా వైసీపీకి వెళ్లిపోయింది. ప్రస్తుతం, షర్మిల ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నట్లు ఇండియా టూడే సర్వేలో తేలింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి 2.7శాతం ఓట్ షేర్ వస్తుందని, బీజేపీ 2.1 శాతం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల సమయంలో 2019లో ఇండియా టూడే జరిపిన సర్వే ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. అప్పట్లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో వైసీపీకి 18 నుంచి 20 ఎంపీ సీట్లు, టీడీపీ కి 4-6 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే వెల్లడించగా.. వైసీపీకి 22, టీడీపీ మూడు ఎంపీ స్థానాలు వచ్చాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ - జనసేన కూటమికి 17 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. దీంతో ఈ దఫా పార్లమెంట్ ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుందని సర్వే స్పష్టం చేసింది. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కానున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టీడీపీ - జనసేన పొత్తుపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరోవైపు వీరికి త్వరలో బీజేపీకూడా తోడు కాబోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమిలో కలిసేందుకు బీజేపీ సిద్ధమైంది. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో ఏపీలో బీజేపీ 2.1శాతం ఓటు షేర్ వస్తుందని తేలింది. అయితే, టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ కలవడం ఖాయం కావడంతో ఆ ఓటింగ్ శాతంసైతం టీడీపీ, జనసేన కూటమికి యాడ్ కానుంది. దీనికితోడు తటస్థ ఓట్లలో మరికొన్ని ఓట్లు ఈ కూటమివైపు వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 22 నుంచి 23 ఎంపీ స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఐదేళ్ల పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వేలో తేలిపోయింది.