విజయ సంకల్ప యాత్రలతో తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు ఇంకా ప్రచార పర్వం ప్రారంభించలేదు. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించేసింది. ఒక వైపు బీఆర్ఎస్ తో పొత్తు వార్తలు ప్రచారం అలా సాగుతుండగానే, ఆ ప్రచారంతో సంబంధం లేకుండా బీజేపీ ఎన్నికల సమరానికి తన వంతుగా సన్నాహాలు ప్రారంభించేసింది.
పార్టీలో విభేదాలు ఆ పార్టీ విజయావకాశాలను మసకబారుస్తున్నాయన్న ప్రచారం ఓ వైపు సాగుతూనే ఉంది. బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో బండి సంజయ్ తప్ప మరెవరూ స్పందించడంలేదు. రాజకీయవర్గాలలో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ తో కలిసేందుకే మొగ్గు చూపుతోందన్న చర్చ సాగుతుంటే.. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ప్రశక్తే లేదని సభలలో కుండబద్దలు కొట్టేస్తున్నారు. అయితే వాస్తవంగా పొత్తులపై మాట్లాడాల్సిన అధిష్ఠానం కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో మౌనం పాటిస్తున్నారు. బండి సంజయ్ అయితే మాత్రం రాష్ట్రంలోని 17లోక్ సభ స్థానాలలోనూ బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ మాత్రం కేంద్రంలో మోడీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాలలో విజయం సాధించాలన్న సంకల్పంతో తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది.
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ప్రారంభమైన యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇస్ బార్…చార్ సౌ పార్ అనే నినాదాలతో యాత్రలు సాగుతున్నాయి.
కొమురం భీం క్లస్టర్ లో యాత్రను భైంసాలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ , ఎంపీ సోయం బాపురావు , ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్ , పాయల్ శంకర్ , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను వికారాబాద్ జిల్లా చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ యాత్రలో శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
భాగ్యనగర్ క్లస్టర్ యాత్రను న భువనగిరిలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ మాజీ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ , ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.
కృష్ణమ్మ క్లస్టర్ లో విజయ సంకల్ప యాత్రను నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలొ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల తో కలిసి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ , జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి , రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మంగళవారం మొత్తం 4 క్లస్టర్లలో విజయసంకల్ప యాత్రలు జరిగాయి.