తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్
posted on Feb 24, 2024 @ 4:59PM
తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్ జరిగింది. ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కాంలో పెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి సిబ్బందితో పటు, ప్రజాప్రతినిధుల పీఏల పాత్ర ఉందని తెలుస్తోంది. కేవలం పీఏలే ఉన్నారా లేక ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. 200 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్టు అంచనా.
తెలంగాణలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా విచారణంలో తేలింది. మిర్యాలగూడలో బయడపడ్డ కేసులో తీగ లాగిన అధికారులకు, నమ్మలేని నిజాలు తెలిశాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ పేషెంట్‌లను రూపొందించడమే కాకుండా తప్పుడు బిల్లులు పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేసినట్లుగా తేలింది. నకిలీ బిల్లు సృష్టించి లక్షలు కొద్దీ డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని రెండు ఆస్పత్రుల్లో బాధితులకు వైద్య చికిత్స అందించకుండానే.. చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వైద్యం చేయకపోయినా.. చేయించినట్టు నకిలీ బిల్లులు సృష్టించిన ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు.. మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, దిరావత్, శివపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం కోసం ఆరోగ్య పథకాలతో పాటు.. ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. వాటిల్లో ఒక సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్సను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవి ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావు.. అప్పుడు అటువంటి వారికీ ఉపయోగపడే మరొక పథకం.. సీఎం రిలీఫ్ ఫండ్..
2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేస్తున్నారు.
అసలు దీని వెనక ఎవరు ఉన్నారు?
ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధిని దుర్విని యోగం చేశారు?
ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారనే దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారిస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉన్నది.
అయితే అర్హులైన పేదలు రూ.లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు రూ.50 వేల లోపే చెక్కుల రూపంలో అందగా.. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందజేశారు.
సాధారణంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలు స్తోమతకు మించి ప్రయివేటు హాస్పిటళ్లలో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటే.. అందుకు సంబంధించిన పూర్తి బిల్లులను ప్రభుత్వా నికి సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ సీఎంఆర్‌ఎఫ్ సెక్షన్‌లో కమిటీ పరిశీలించి ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది. ఆ తరువాత మూడు లేదా నాలుగు నెలలకు చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు. అయితే 2018లో మూడు వేలకు పైగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి.
వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందినట్టు తెలిసింది.
వడ్డించే వాడు మనవాడైతే.... అవినీతికి పాల్పడాలనుకునే వాళ్లకు అడ్డదార్లు ఎన్నో వుంటాయి. సి.ఎం. రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నొక్క వచ్చని అప్పట్టి పాలకులు నిరూపించారు. అలా అప్పనంగా డబ్బులు నొక్కేసేందుకు నకిలీ రోగులను సృష్టించడమే కాకుండా..తప్పుడు బిల్లులు పెట్టి కుంభకోణానికి తెరతీశారు.