భర్తకు  భరణం: ఇండోర్ కోర్టు  సంచలన తీర్పు 

తన నుంచి విడిపోయిన నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ఇండోర్‌లోని కుటుంబ న్యాయస్థానం ఓ మహిళను ఆదేశించింది. కట్నం కోసం  భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రతిగా, ఆమె భర్త కోర్టుకు ఫిర్యాదు చేస్తూ.. పెళ్లి తర్వాత ఆమె తనను వేధించిందని, భరణం డిమాండ్ చేసిందని పేర్కొన్నాడు. భార్య కోసం చదువును మధ్యలోనే ఆపేయాల్సి రావడంతో నిరుద్యోగిగా మిగిలిపోయానని తెలిపాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5000 భరణం చెల్లించాలని ఆదేశించింది.  ఆమె వాంగ్మూలం పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తానో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు తొలుత పేర్కొంది. అయితే, ఆ తర్వాత కోర్టులో మాత్రం తానో నిరుద్యోగినని తెలిపింది. ఈ నేపథ్యంలో బలమైన సాక్ష్యం లేకపోవడంతో విడిపోయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. భర్తకు భరణం చెల్లించాలని భార్యను కోర్టు ఆదేశించడం మధ్యప్రదేశ్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో భర్తలే భరణం చెల్లించాల్సి వస్తుందని న్యాయవాది తెలిపారు.

నెల్లూరు సిటీ బరిలో నటుడు అలీ!

ఔను నిజమే.. నటుడు అలీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఐదేళ్లుగా ఊరించి ఊరించి ఊసూరు మనిపించిన జగన్ ఈ సారి మాత్రం ఆయనకు పార్టీ టికెట్ కేటాయించి అసెంబ్లీ బరిలో  నిలబెడుతున్నారు. ఔను నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అలీని వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపడానికి జగన్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   అయితే ఇప్పటికే ఆ స్థానాన్ని నగర డిప్యూటీ మేయర్ ఖలీల్‌కు కేటాయించడంతో తనకు చెప్పకుండా సీటు విషయంలో నిర్ణయం తీసుకున్నారంటూ.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీతోపాటు జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. దాంతో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీని బరిలో దింపాలని వైయస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.  మరోవైపు గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది స్థానాలకు పది స్థానాలు జగన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నెల్లూరు జిల్లా నుంచి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకుంటుందని నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... అంటే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై  తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయానికి  సహకరించారన్న ఆరోపణలపై వేటు వేశారు.  ఆ ఒక్క ఘటనచాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి అని అంటున్నారు. అలాంటి వేళ నెల్లూరు జిల్లాలో మళ్లీ మొత్తం ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొనేందుకు జగన్  శతధా ప్రయత్నిస్తున్నారనీ,  ఆ క్రమంలో నే జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ప్రకటించిన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని.. అందులోభాగంగానే నెల్లూరు సిటీ నుంచి ఇప్పటికే ప్రకటించిన ఖలీల్‌ను కాదని ఆలీని రంగంలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు.  మరోవైపు జగన్ పార్టీలో ఆలీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సైతం ఇదే ఆలీ.. తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ క్రమంలో త్వరలో మీకు గుడ్ న్యూస్ వస్తుందంటూ.. ప్యాలెస్‌లోని వర్గాలు స్పష్టం చేయడం.. దాంతో ఆలీకి రాజ్యసీటు ఒకే అయిదంటూ..  అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రచారం కావడం తెలిసిందే. అయితే  అదేమీ జరగలేదు కానీ కంటితుడుపు అన్నట్లుగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించి అప్పట్లో చేతులు దులిపేసుకున్న జగన్ ఇప్పుడు గుంటూరు సిటీ  నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని అంటున్నారు.  ఇంకోవైపు కర్నూలు ఎమ్మెల్యేగా ఆలీని బరిలో నిలిపే అవకాశాలు సైతం ఉన్నాయనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే హపీజ్ ఖాన్‌ను మార్చాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని.. దాంతో ఆ స్థానాన్ని ఆలీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ఊహగానాలు ఉపందుకొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఎంపీగా ఆలీని ఎంపిక చేసే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయని.. అది నంద్యాల లేదా గుంటూరు లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి ఆయన్ని బరిలో దింపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.   గతంలోనే ఆలీ ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ.. ఓ ప్రచారం అయితే గట్టిగానే జరిగిందని.. కానీ ఆ సమయంలో ఆయనకు ఎందుకో కానీ ఆ అవకాశం అయితే రాలేదని.. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం ఆయన పోటి చేయడం మాత్రం పక్కా అని.. ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే టాలీవుడ్ నటీనటులు దాదాపుగా ఎవరు లేరని.. అలాంటి వేళ.. ఆలీకి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకొనే అవకాశాలు మాత్రం చాలా అధికంగా ఉన్నాయనే ఓ చర్చ అయితే పార్టీలో హల్‌చల్ చేస్తోంది.

ఒకే ఎన్ క్లోజర్ లో ఈ సింహాలు  వద్దు: కలకత్తా హైకోర్టు 

మతపరమైన అంశాల్లో కోర్టులు కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే  స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి సఫారీ పార్క్ లో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం పట్ల విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ కలకత్తా హైకోర్టును విహెచ్ పి  ఆశ్రయించింది.  పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులే ఆ సింహాలకు పేర్లు పెట్టారని ఆరోపించింది. వీహెచ్ పీ పిటిషన్ పై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఆ రెండు సింహాలకు పేర్లు మార్చాలని ఆదేశించింది. తద్వారా ఈ వివాదానికి తెరదించాలని జస్టిస్ సౌగతా భట్టాచార్య స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ సింహాలను త్రిపుర నుంచి తీసుకువచ్చారని, వాటికి త్రిపురలోనే పేర్లు పెట్టారని వివరించారు. పేర్లను మార్చే అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోందని వెల్లడించారు.  కాగా, పశ్చిమ బెంగాల్ అధికారులు ఈ రెండు సింహాలను త్రిపురలోని సిపాహీజాలా జూలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. ఇందులో అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం. అధికారురులు పేర్లు పెట్టినప్పుడు మతం చూడలేదు. వీటిని ఒకే ఎన్ క్లోజర్ లో బంధించినప్పుడు మాత్రమే వివాదమయ్యింది.  రామాయణంలో సీత పాత్ర పరమ పవిత్రం. అక్బర్ మన దేశంపై దండయాత్ర జరిపిన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి.  త్రేతాయుగంలో జన్మించిన రాముడి భార్య సీత పేరు పెడితే  అధికారుల తప్పేం లేదు. కానీ  అక్బర్  అనే సింహం ఎన్ క్లోజర్ లో సీత అనే మరో సింహాన్ని బంధించడం హిందువుల మనో భావాలు దెబ్బతిన్నాయి. కాబట్టే కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

రేవంత్ వ్యూహం అదుర్స్‌.. బీజేపీ, బీఆర్ ఎస్ లో ఆందోళన

తెలంగాణ‌లో కాంగి‘రేసు’ వేరే  లెవెల్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చురుకైన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.  టీపీసీపీ ప్రెసిడెంట్‌గా, సీఎంగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న రేవంత్ రెడ్డి.. రెండు పాత్ర‌ల్లోనూ త‌న‌దైన మార్క్ ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే కొత్త‌కొత్త నిర్ణ‌యాలు, వ్యూహాలతో ప్ర‌త్య‌ర్థుల వ్యూహాల‌కు చెక్ పెడుతున్నారు.  మూడురోజుల క్రితం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో  సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే.  కొస్గీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ ప్ర‌సంగం కార్య‌క‌ర్త‌ల్లో కొత్త‌ జోష్ ను నింపింది. యుద్ధం ముగియ‌లేదు, అస‌లైన యుద్ధం ఇప్పుడే ప్రారంభ‌మైంది. విశ్రాంతి వ‌ద్దు.  క‌దన‌రంగంలోకి దూకండి అంటూ కార్య‌క‌ర్త‌ల‌కు రేవంత్ పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెప‌రెప‌లాడాల్సిందేన‌ని, ఆ మేర‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాలంటూ రేవంత్ సూచించారు. అంతేకాదు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం అభ్య‌ర్థుల‌ను సైతం రేవంత్ ప్ర‌క‌టించేస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా వంశీచంద‌ర్ పేరును రేవంత్ ప్ర‌క‌టించారు. మ‌రో వారం రోజుల్లో మిగిలిన అన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని  క్లారిటీ ఇచ్చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో రేవంత్ దూకుడు,   వ్యూహాల‌ను చూసి ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.  తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తొల‌గించే విధంగా రేవంత్ పాల‌న సాగుతుండ‌టంతో గ్రామ‌ స్థాయిలో పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ రోజు రోజుకు పెరుగుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌, బీజేపీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిలో అధిక‌శాతం మంది.. రేవంత్‌రెడ్డి  పాల‌న‌ను మెచ్చి కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కే ఓటు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపు దాదాపు ఖాయ‌మైన‌ట్లేన‌ని ప‌లు సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలు వెల్లడిస్తున్నాయి.  రెండు నెల‌ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో బీఆర్ ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు, ద్వితీయ శ్రేణి నేత‌లు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో బీఆర్ ఎస్ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ దూకుడు  పాల‌న‌ తీరు నచ్చి మెచ్చి పార్టీ నుంచి కీల‌క నేత‌లు చేజారుతుండ‌టంతో బీఆర్ ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది.  అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ వ్యూహాల‌కు తిరుగులేకుండా  ఉండేది. కానీ, అధికారం కోల్పోయాక‌.. కేసీఆర్ వ్యూహాల‌ను రేవంత్ చిత్తుచేస్తున్నార‌ని బీఆర్ ఎస్ నేత‌లుసైతం అంగీకరిస్తున్నారు. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. బీజేపీ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో, కాంగ్రెస్ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో , మ‌జ్లిస్ ఒక నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ‌లో ఉన్నాయి. దీనికి తోడు కొంద‌రు ముఖ్య‌నేతలు బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అంతే  ఇటీవ‌ల ప‌లు సంస్థ‌లు వెల్ల‌డించిన స‌ర్వేల్లో బీఆర్ ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు నుంచి మూడు పార్ల‌మెంట్ స్థానాలు మాత్ర‌మే గెలిచే అవకాశం ఉందని తేలింది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. దీంతో ఆ పార్టీకి 10 నుంచి 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని స‌ర్వే ఫ‌లితాలు తేట‌తెల్లం చేస్తున్నాయి. బీజేపీకి మూడు నుంచి నాలుగు, మ‌జ్లిస్ కు ఒక పార్ల‌మెంట్ స్థానం ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని   స‌ర్వేల ఫ‌లితాలు చెబుతున్నాయి.  అయితే, కొస్గీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 14 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించాల‌ని, ఆ మేర‌కు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.  రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి త‌న‌దైన రీతిలో పాల‌న సాగిస్తున్నారు. గ‌త బీఆర్ ఎస్ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూనే.. పదునైన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రేవంత్ దూకుడుతో వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 14 నుంచి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల విజ‌యం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక‌ విష‌యంలో హైక‌మాండ్  ఆచితూచి అడుగులు వేసేది. దీంతో ఆల‌స్యంగా అభ్య‌ర్థుల జాబితాలు విడుద‌ల‌య్యేవి. కానీ    రేవంత్ రెడ్డి ఆ విధానానికి స్వ‌స్తి ప‌లికిన‌ట్లు క‌నిపిస్తోంది. ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో క‌న్ఫ్యూజ్ లేకుండా చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన రేవంత్‌.. మ‌రో వారం రోజుల్లో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల జాబితాను వెల్ల‌డించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌టి రెండు చోట్ల మిన‌హా ఇప్ప‌టికే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌ను రేవంత్  పూర్తిచేశారని అంటున్నారు. ఆ మేర‌కు హైక‌మాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్న‌ల్  వచ్చేసిందన్న చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.  14 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా రేవంత్, కాంగ్రెస్ పార్టీ  వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దుకుడుతో బీఆర్ ఎస్, బీజేపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాలంటూ పార్టీ నేత‌లు ఆయా పార్టీల అధిష్టానాల‌పై ఒత్తిడి పెంచుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి  వ్యూహాలు బీఆర్ ఎస్‌, బీజేపీ అధిష్టానాల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయంటూ పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో చ‌ర్చ జ‌రుగుతుంది.

షర్మిల అరెస్టుపై అమ్మ స్పందనేదీ?

వైఎస్ విజయమ్మ.. ఒకప్పుడు వైసీపీ గౌరవాధ్యక్షురాలు. ఏపీ సీఎం జగన్ కన్నతల్లి. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సైతం కన్నతల్లి. సొంత అన్నతో విభేదాల కారణంగా తెలంగాణకు వలస వెళ్లి   వైఎస్సీర్టీపీ ఏర్పాటు చేసుకున్ షర్మిలకు మద్దతుగా అమ్మ విజయమ్మ కూడా కుమారుడు జగన్ ను వీడి కుమార్తె వద్దకు చేరారు. అంతే కాదు వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. ఇక కుమార్తె షర్మిలకు మద్దతుగా ఆమె తెలంగాణలో పోరాటం కూడా చేశారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం షర్మిలను అరెస్టు చేసిన సమయంలో రోడ్లపైకి  వచ్చి ఆందోళనకు కూడా దిగారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేశారు. ఓ సారి పోలీసులు షర్మిలను నివాసం నుంచి బయటకు రాకుండా ఆపిన సందర్భంగా విజయమ్మ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చేయి చేసుకున్నంత పని చేశారు. వైఎష్ బిడ్డ బిడ్డను ఆపుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వాస్తవంగా తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రిగా రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం షర్మిలపై ప్రయోగించిన నిర్బంధకాండ కంటే రెండింతలు ఎక్కువగా ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం షర్మిలపై ప్రయోగిస్తోంది.   తెలంగాణలో ఆమెను నిలువరించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా దూకుడును ప్రదర్శిం చలేదు. ఆమెతో గౌరవంగా వ్యవహరించారు. అయితే ఏపీలో మాత్రం షర్మిలకు అటువంటి గౌరవం ఇవ్వడం లేదు. ఏపీలో ఉన్నది సొంత అన్న నేతృత్వంలోని ప్రభుత్వమే అయినా, ఇక్కడ షర్మిల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బుధవారం షర్మిలను అరెస్టు చేస్తున్న సందర్భంగా  ఆమె స్వల్పంగా గాయపడ్డారు కూడా.  మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. ఇందు కోసం విజయవాడ చేరుకున్న షర్మిల  కేవీపీ ఇంట్లో బస చేశారు.   పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో ఆమె వెంటనే కాంగ్రెస్ కార్యాలయానికి తన బసను మార్చేశారు. బుధవారం ఉదయమే.. అక్కడ ఉన్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత షర్మిల ధర్నా చేసి.. సెక్రటేరియట్ కు బయలుదేరారు. దారిలో వందల మంది పోలీసులు మోహరించి ఆమెను అడ్డుకున్నారు.  అరెస్టు చేశారు.  దురుసుగా తీసుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడేశారు. తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి.. తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు.  పాలనే చేత కాని జగన్ తనపై పోలీసులతో దాడి చేయించారని విమర్శించారు. షర్మిల విమర్శలు, ఏపీ ప్రభుత్వం షర్మిల పట్ల వ్యవహరిస్తున్న తీరు పక్కన పెడితే.. తెలంగాణలో షర్మిలను నిలువరించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపునిస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించిన అమ్మ విజయమ్మ ఇప్పటి వరకూ స్పందించకపోవడంపై పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికైనా ఆమె జగన్ చర్యలను ఖండిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.  కొడుకు తీరు పట్ల వ్యతిరేకిస్తారా? లేక  కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తారా చూడాల్సి ఉంది. 

తిరుమ‌ల‌నూ వ‌ద‌ల‌ని జ‌గ‌న్.. రంగంలోకి అమిత్ షా?

ఏపీ  సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోగా.. అమ‌రావ‌తి రాజ‌ధానినీ నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇవి రెండూ చాలవన్నట్లు ప్రత్యర్థులపైనా, విపక్ష నేతలపైనా వేధింపులు, కేసులతో రెచ్చిపోయారు. అంతే కాకుండా దేవాలయాలను కూడా వదలలేదు. జగన్ హయాంలో   హిందూ దేవాల‌యాల‌పై దాడులు విపరీతంగా పెరిగాయి. ప‌లు దేవాల‌యాల్లో విగ్ర‌హాల ద్వంసం, రథాల దగ్ధం వంటి  ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా.. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో కొలిచే తిరుమ‌ల వేకంటేశ్వ‌ర స్వామివారిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ద‌ల్లేదు. పుణ్య‌క్షేత్రంలో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు, గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయంటూ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. రాజ‌కీయ పార్టీల నేత‌లు ఇలాంటి ప్ర‌చారాలు చేస్తే ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీపై బుర‌ద‌ జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నమ‌ని కొట్టిపారేయొచ్చు. కానీ, ప‌విత్ర‌మైన తిరుమ‌ల కొండ‌పై అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పినది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ స్వామివారి స‌న్నిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌ధాన అర్చ‌క‌త్వం చేసిన ర‌మ‌ణ దీక్షితులు. ఓ వీడియోలో  ర‌మ‌ణ దీక్షితులు స్వయంగా మాట్లాడుతూ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. దీంతో హిందువుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ‌ద్ద‌కు చేర‌డంతో.. నిగ్గుతేల్చేందుకు అమిత్ షా రంగంలోకి దిగ‌నున్నట్లు విశ్వసనీయ  స‌మాచారం.   సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్‌, ఈవో ధ‌ర్మారెడ్డి క్రిస్టియ‌న్‌.. దీంతో తిరుమ‌ల కొండ‌పై అన్య‌మ‌త ప్ర‌చారం పెరిగింద‌నీ, గుప్త నిధుల  కోసం వేట జ‌రుగుతోంద‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. అహోబిలంలో రెండు వంద‌ల సంవ‌త్స‌రాల కిందట  కొండ మీద ఒక గుహ‌లో ఓ జియర్  స‌మాధి అయ్యాడ‌ట‌.. ఆ గుహ‌లో అప్ప‌ట్లో విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు నిక్షిప్తం చేశారని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ఉన్న జీయర్ త‌రువాత వ‌చ్చే రెండో జీయర్ కు ఆ నిధులు అందాల‌ని సంక‌ల్పం చేశార‌ట‌. దాన్ని బ‌య‌ట‌కు తీయాల‌ని చాలా సార్లు అహోబిలం జీయర్ ద‌గ్గ‌రికి ధ‌ర్మారెడ్డి వెళ్లి వ‌స్తున్నార‌ని, అలాగే అవినాశ్ రెడ్డికోసం చాలాసార్లు హైద‌రాబాద్ కు తిరుగుతున్నారంటూ ర‌మ‌ణ‌ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ర‌మ‌ణ దీక్ష‌లు చెప్పిన సంచ‌ల‌న విష‌యాల‌తో హిందువుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది. నిత్యం గోవింద నామ‌ స్మ‌ర‌ణ‌తో భ‌క్తిభావం శోభిల్లే తిరుమ‌ల కొండ‌పై ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో, చైర్మ‌న్, డైరెక్ట‌ర్ లు అన్నీ నియామ‌కాలు ప్ర‌భుత్వ‌మే చేస్తుంది. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ప్ర‌భుత్వ సంస్థ‌లైన‌ ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా, సీఏజీ చెబితే మేము ఒప్పుకోమ‌ని, స‌మాచార శాఖ చ‌ట్టం మేము ఒప్పుకోమ‌ని చెబుతుంది. తిరుమ‌ల ఆల‌యంలో అంత‌కుముందు రాతి బండ‌లు ఉండేవి. అయితే, దానిమీద ప‌ర‌కామ‌ణి కోసం గ్రానైట్ వేశార‌ని, ఇప్పుడు నిధుల‌ కోసం త‌వ్వ‌కాలు జ‌రుగుతుండ‌వ‌చ్చ‌ని ర‌మ‌ణ దీక్షితులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు వెయ్యికాళ్ల మండ‌పం గానీ, దేవ మండ‌పం కానీ, అన్నీ నిధుల‌ కోస‌మే త‌వ్వార‌ని, తిరుమ‌ల ఆల‌యంలో లోప‌లికి క్రేన్ ను తీసుకువెళ్లి గోడ‌ల‌కు డ్రిల్లింగ్ వేసి నాశ‌నం చేస్తున్నార‌ని, ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని ర‌మ‌ణ దీక్షితులు ఆరోపించారు.  శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని, స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందని ర‌మ‌ణ దీక్షితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోజూ ఎంత మంది ఆల‌యానికి వచ్చారు.. ఎంత మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం ఎంత అన్న విష‌యాల‌ను తిరమల తిరుపతి దేవస్థానం ప్ర‌తీరోజూ ఉద‌యాన్నే వెల్ల‌డిస్తుంది. అయితే  హుండీలో ఎంత బంగారం, వెండి వ‌చ్చిందో  మాత్రం వెల్ల‌డించ‌డం లేదు. బంగారం, వెండి ఎంత వ‌చ్చింద‌నే విష‌యాన్ని ప్ర‌తీరోజూ వెల్ల‌డించాల‌ని స్వామివారి భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధ‌ర్మారెడ్డి క్రిస్టియ‌న్ అనీ.. తిరుమ‌ల‌ కొండ‌పై అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని, స్వామివారికి నైవేద్యం స‌రిగా పెట్ట‌డం లేదంటూ.. టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేయ‌డంతో బీసీవై పార్టీ అధినేత రామ‌చంద్ర యాద‌వ్ సీరియ‌స్ గా తీసుకున్నారు. ర‌మ‌ణ దీక్షితులు చెప్పిన విష‌యాల‌పై రామ‌చంద్ర యాద‌వ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.  టీటీడీలో జ‌రుగుతున్న అక్రమాలపై సీబీఐ విచార‌ణ జరిపించాలని డిమాండ్ చేశారు.  అమిత్ షాసైతం ర‌మ‌ణ దీక్షితులు వీడియో పై ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో విచార‌ణ‌కు ఆదేశాలిచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అదే జ‌రిగితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద చిక్కుల్లో చిక్కుకున్న‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే కన్ను మూశారు. కారులో ఉన్న ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్  తీవ్రంగా గాయపడ్డారు.  ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ పై అదుపుతప్పి రైలింగ్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  సాయినందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత ఏడాది ఫిబ్రవరిలో సాయన్న మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో లాస్య నందిత బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  

కడప ఎస్పితో సమావేశమైన వైఎస్ సునీత

ఎపి సీఎం జగన్ స్వంత బాబాయ్ హత్య కేసులో పురోగతి లేకపోవడంతో  వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె కడప ఎస్ పి కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నేడు కడప జిల్లా ఎస్పీతో సమావేశమయ్యారు.  ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్పీకి వివేకా హత్య కేసు వివరాలను తెలిపారు. తన భద్రతకు సంబంధించిన అంశాలపైనా సునీత ఎస్పీతో చర్చించారు. ఎస్పీతో సునీత దంపతుల సమావేశం గంటపాటు సాగింది. వివేకా హత్యకేసులో ఇబ్బందులను వివరించారు. వివేకా పీఏ తమపై అనవసరంగా కేసులు పెట్టారని ఎస్పీకి తెలిపారు. వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి తీరును కూడా డాక్టర్ సునీత ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన అసభ్య పోస్టుల గురించి వివరించారు. కడప ఎస్పీని సునీత దంపతులు కలవడం ఇది రెండోసారి. గతేడాది నవంబరులోనూ వారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి వివేకా హత్య కేసుపై చర్చించారు. అప్పట్లో సిద్ధార్థ్ కౌశల్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు.

ప్రధాని రేసులో ప్రియాంక వాద్రా ?.. అలా అయితేనే ఐక్యంగా ఇండియా కూటమి?

పీఎం ప్రియాంక..  ఇండియా కూటమి చీలికలు పేలికలు కాకుండా నివారించడానికి కాంగ్రెస్ తురఫు ముక్కలాంటి వ్యూహానికి తెరలేపిందా? రాహుల్ నేతృత్వంపై కొద్ది పాటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాలను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే ప్రధాని పదవికి ప్రియాంక పేరును ప్రతిపాదించడమే మార్గమన్న భావనకు వచ్చిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అంటే 2019 ఎన్నికల కంటే ముందు నుంచీ కూడా కాంగ్రెస్ లోని ఒక బలమైన వర్గం ఈ డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే హైకమాండ్ ఈ డిమాండ్ ను పెద్దగా ఖాతరు చేయలేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్న విధానానికే కట్టుబడి ఉంది. పైగా రాహుల్ ను ప్రధానిగా చేసి పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కలను సాకారం చేస్తామంటూ చెబుతూ వచ్చింది. అయితే రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా బయటకు వెడుతూ వచ్చాయి. పైగా   2019 ఎన్నికలలోనూ కాంగ్రెస్ గ్రాఫ్ ఏమంత పెరగలేదు సరికదా మరింత దిగజారడంతో కాంగ్రెస్ పార్టీలో నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి.  రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై పార్టీలోనే అనుమానాలు పొడసూపాయి. దీంతో 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే రెండు వరుస ఓటముల తరువాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన లభించింది. దీంతో 2024 ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది. అయితే మోడీని, బీజేపీనీ ఢీ కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ సమష్టిగా కదలాలనీ, లేకుంటే పార్టీ పుంజుకున్నా.. అధికారం చేజిక్కించుకునే అవకాశాలు అంతంత మాత్రమేననీ కాంగ్రెస్ గ్రహించింది. అదే సమయంలో బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేసి ఏకపార్టీ స్వామ్యం దిశగా భారత్ ను నడిపించాలన్న బీజేపీ ఉద్దేశాన్ని పసిగట్టిన బీజేపీ యేతర పార్టీలు మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ.. పలు ప్రాంతీయ పార్టీలూ కాంగ్రెస్ నేతృత్వంలో సమష్టిగా పని చేయడానికి స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. కూటమికి కాంగ్రెస్ నేతృత్వంపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రాహుల్ నేతృత్వంలో పని చేయడం విషయంలోనే భాగస్వామ్య పక్షాలలో వేరు అభిప్రాయం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట తొలుత జేడీయూ ఇండియా కూటమి నుంచి వైదొలగి ఎన్డీయే గూటికి చేరడం, తృణమూల్ వచ్చేసార్వత్రిక ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో విపక్షాల ఐక్యత ఎండమావి చందంగా మారిపోయింది.  ఎస్పీ కూడా కూటమిలో కొనసాగుందుకు ఆమోదయోగ్యం కానీ షరతులు విధించడంతో  వచ్చే ఎన్నికల ముంగిట విపక్షాల ఐక్యత దేవతా వస్త్రంగా మారిపోయింది. సరిగ్గా ఈ తరుణంలోనే కాంగ్రెస్ లోని ఒక బలమైన వర్గం నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక అన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలలో  ప్రియాంకా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.  2019 ఎన్నికల్లో వారణాసి నియోజక  వర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేసేందుకు కూడా ప్రియాంక రెడీ అయ్యారు. అయితే  అందుకు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందుకు అంగీకరించ లేదు. అలాగే, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కాడి వదిలేసిన సందర్భంలోనూ, పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ, ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే షరతు విధించడంతో రెండవ సారీ ఆమె వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. మరో సారి ప్రియాంక ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన గట్టిగా ముందుకు వచ్చింది.  దీనికి ప్రియాంక స్పందన కంటే ర ాహుల్, సోనియాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న అనుమానాలే పార్టీ వర్గాలలోనూ పరిశీలకులలోనూ బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? లేక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎమర్జెన్సీ ఏమైనా అమలులో ఉందా? ఇక్కడ దేశంలో చట్టాలేవీ వర్తించవా? ఏపీని ఒక నియంత పాలిస్తున్నారా? అంటే పరిస్థితులను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలకు నిండా రెండు నెలలు కూడా సమయం లేదు. ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ విధమైన భయానక పరిస్థితులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం సృష్టించింది. తన విధానాలకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. పత్రికలు వార్తలు ప్రచురించడానికి వీల్లేదు. అసలు ప్రతిపక్షాలు రోడ్ల మీదకు రావడానికే వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకు అప్రకటిత ఆంక్షలు అమలులో ఉన్నాయా అన్నట్లుగా రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టించింది. మీడియా ప్రతినిథులపై దాడులు, పత్రికా కార్యాలయాలపై దాడులు, ఆందోళనకు దిగితే ప్రతిపక్షాల నేతల అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితి. జగన్ అధకారంలోకి వచ్చినప్పటి నుంచీ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల ముంగిట ప్రభుత్వ దమనకాండ తీవ్రత పెరిగింది. తలెత్తితే సహించం అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో పరిస్థితులు అత్యయిక పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి.   1975 జూన్ 25 అర్థరాత్రి  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది జరిగి 49 ఏళ్లయ్యింది.  తన ఎన్నిక  చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, 1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి, ఇందిరమ్మ పోలీసులు, అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు.   ఇప్పడు వైసీపీలో జగన్  అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన, ఎత్తుతున్న వారిపై జగన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నిర్బంధ కాండ సాగించారు. కానీ జగన్ అటువంటి ప్రకటన ఏదీ లేకుండానే అదే తరహా పాలన సాగిస్తున్నారు. నిర్బంధ కాండ సాగిస్తున్నారు.   మీడియా ప్రతినిథిపై దాడి, ఆ వెంటనే మరో మీడియా కార్యాలయంపై దాడి, ఇక ఆ మరుసటి రోజే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో సెక్రటేరియెట్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం చూస్తుంటే నాటి ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. పైన చెప్పిన వన్నీ నిన్నమొన్న నేడు జరిగిన సంఘటనలు. కానీ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజా భవన్ కూల్చివేతతో మొదలైన విధ్వంసం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముంగిట  జగన్ రెడ్డి  ఓటమి భయంతో రాష్ట్రంలో అప్రకటిత  ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  నాడు ఇందిరాగాంధీకి ఎదురైన అనుభవమే వచ్చే ఎన్నికలలో జగన్ కూ ఎదురు కాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వారం రోజుల్లో మరో  రెండు గ్యారెంటీలు అమలు 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీల పథకాల్లో  ఒక్కోటి అమలవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి గ్యారెంటీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దీన్ని అమలు చేస్తున్నారు. రెండో గ్యారంటీ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించి డేట్ కూడా ఫిక్స్ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్టు తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గీలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఆరు ఎన్నికల హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి ఆలోచన, విజన్‌తో అడుగులు వేస్తోంది.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని   కేసీఆర్‌ కుటుంబం వ్యక్తిగతంగా నిందలు వేసి, ప్రజల్లో లేని ఒక వ్యతిరేకతను సృష్టించాలని చూస్తుందని వక్రమార్గంలో  అధికారంలోకి రావాలని చూస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరిస్తామని తెలుపుతూనే, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. అసలు ఈ ఆరు గ్యారెంటీలు అమలుచేయడానికి పూర్తిగా దృష్టి పెట్టింది.   సిలిండర్‌ రూ.500కు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా సిలిండర్లను మార్కెట్‌ రేటుకు అనువుగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు అని చెప్పాలి. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న ఎల్‌పీజీ సౌభాగ్య పథకం కింద ఉన్నవారిని ఇందులో అర్హులుగా చేర్చుతారా అనేది తేలాల్సి ఉంది. అంటే రేషన్‌ కార్డున్న వారికి గ్యాస్‌ సిలిండర్‌పై కొన్ని ఆంక్షలుంటాయని తెలుస్తోంది. వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని వెల్లడించారు.మార్చి 15లోగా అందరికీ రైతుబంధు అందజేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ బాధ్యత తనదేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఆర్ధిక ఇబ్బందుల నుంచి కాపాడటానికి, ప్రజల సుఖ, సంతోషాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన, ప్రజలు మెచ్చుకొన్న 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని పలువురు సీనియర్ ఆర్ధికవేత్తలు వివరించారు. ఈ ఆరు గ్యారెంటీలు గొంతెమ్మ కోర్కెలేమీ కాదని, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఒక సంక్షేమ ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులేనని, అయితే ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ, ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే, రుణ పరిమితిని పెంచుకోవాల్సి ఉంటుందని ఆ ఆర్ధికవేత్తలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించి, ప్రజల మన్ననలను పొందటమే కాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం చేసి సంచలనం సృష్టించడంతో ఈ ఆరు గ్యారెంటీలు ఏమిటి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానాపై అదనంగా ఎంత భారం పడుతుంది… ఆరు గ్యారెంటీల అమలుకు ఎంతమేరకు నిధులు అవసరవుతాయి… అనే అంశాలపై ఆర్ధిక నిపుణులు, ఆర్ధికశాఖలోని పలువురు సీనియర్ అధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలుకు మొత్తం సుమారు 94,156 కోట్ల రూపాయల (రూ.95 వేల కోట్లు) నిధులు అవసరమవుతాయని ప్రాధమిక అంచనా.  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే తాము ఆరు గ్యారెంటీలకు అదనపు నిధులు ఎంత మేరకు అవసరమవుతాయనే అంశాలపై అధికారులు  లెక్కలు  వేశారు. ఆ మేరకు ప్రాథమికంగా అంచనాలు రూపొందించగా 94,156 కోట్ల రూపాయలుగా తేలిందని, రానున్న రోజుల్లో లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ ఆరు గ్యారెంటీలకు 95 వేల నుంచి ఒక లక్ష కోట్ల రూపాయల వరకూ ఖర్చులు పెరుగుతాయని వివరించారు. అయితే ఈ ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులన్నింటినీ ప్రణాళికా వ్యయంలోనే చూపించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, రెవెన్యూ వ్యయం కింద కూడా నిధులను కేటాయించుకోవచ్చునని, ఈ ఆరు గ్యారెంటీల్లో సర్వీస్ సెక్టార్, సంక్షేమ రంగాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని, అందుచేతనే ప్లాన్ బడ్జెట్ (ప్రణాళిక వ్యయం) భారీగా పెరుగుతుందేమో, అందుకు నిధులను ఎక్కడి నుంచి తెస్తామనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. నాన్-ప్లాన్ బడ్జెట్ లో కూడా ఈ ఆరు గ్యారెంటీలకు నిధులను కేటాయించుకొని ఖర్చులు చేసుకోవచ్చునని వివరించారు. అప్పులు ఎలా ఉన్నా… ప్రతి ఏటా చెల్లింపులు, వడ్డీల రూపంలో చెల్లింపులు చేసే ఖర్చులు ఏడాదికి సుమారు 13 వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని, అయినప్పటికీ నిధులను ఆరు గ్యారెంటీలకు విజయవంతంగా ఖర్చు చేయవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో చివరి వరసలో ఉందని, రాష్ట్ర జిడిపిలో కేవలం 28 శాతం మాత్రమే అప్పులున్నాయని, దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పులు చేసిన రాష్టాల  జాబితాలోని వరుస క్రమంలో తెలంగాణ 23వ స్థానంలో ఉందని, మిగతా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలన్నీ 30 శాతం నుంచి 46 శాతం వరకూ అప్పులు చేశాయని వివరించారు. న్యాయంగా, చట్టబద్ధంగా రుణాలను సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇంకనూ ఎన్నో అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకొని కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ఈ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని ఆ అధికారులు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలోని మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకొన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి ఎనిమిది సిలిండర్ల లెక్కన గ్యాస్‌బండ సబ్సిడీ భారం 3,276 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అని అంచనా. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో మహిళలకు నెలకు 2500 రూపాయల లెక్కన ఒక్కో మహిళకు ఏడాదికి 30 వేల రూపాయల లెక్కన 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి 27వేల కోట్లు రూపాయల నిధులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలోని 45 లక్షల మంది పెన్షనర్లకు నెలకు 4 వేల రూపాయల లెక్కన ఏడాదికి 21,600 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అని అంచనా.  ఇక నిరుద్యోగ యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం రేయింబవళ్ళూ కష్టపడి చేసిన యువతను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన “యువ వికాసం” పథకంలో 50 లక్షల మంది విద్యార్ధులకు ఏడాదికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను చెల్లిస్తే 25 వేల కోట్లు రూపాయల నిధులు అవసరమవుతాయని వివరించారు. ఇక కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు గంపెడాశలు పెట్టుకొన్న 12 వేల రూపాయలను చెల్లిస్తే రాష్ట్రంలోని 54 లక్షల మంది కూలీలు, కౌలు రైతుల కోసం ఏడాదికి 6,480 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.  గృహ విద్యుత్తులో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటును సరఫరా చేస్తే రాష్ట్రంలోని 90 లక్షల ఇళ్ళకు ఏడాదికి 10,800 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుంది. 

రాయచోటిలో తెలుగుదేశం పాగా వేసేనా?

 రాయ‌చోటి... ఆంధ్రప్రదేశ్ లో హాట్‌సీట్‌. ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది.   శ్రీకాంత్‌రెడ్డికి దీటైన ప్రత్యర్థిని వెతికే పనిలో నిమగ్నమైంది. ముస్లింలు, అలాగే బలిజ ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండే రాయచోటిలో ఎవరిని పోటీకి దింపాలన్న విషయంపై తెలుగుదేశం అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న  ఇన్‌చార్జితో పాటుగా మరి కొందరి పేర్లనూ పరిశీలిస్తోంది.   ఇన్నాళ్లు వార్ వన్‌సైడ్‌ అన్నట్లు రాజకీయం నడిచిన రాయచోటిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి? శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.  రాయచోటు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 275 పోలింగ్ బూతులు ఉన్నాయి. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 70.05శాతం ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో వైసీపీకి 56.95శాతం, తెలుగుదేశం పార్టీకి 38.04 శాతం ఓట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుసా గెలిచారు. ఇప్పుడైతే నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో 80 వేలకు పైగా ముస్లిం మైనారిటీల ఓట్లో ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. రాయచోటి లోని తూర్పు ప్రాంతంలోనే ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండటంతో ఈ ప్రాంత ఓట్లే నియోజకవర్గంలో గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం వారిలో ఎక్కువ మంది బీజేపీకే మద్దతుగా నిలుస్తారనీ, బీజేపీ అభ్యర్థి బలంగా లేకుంటే ఓటింగ్ కు గైర్హాజరయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.   ఈ సారి నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే ముస్లిం మైనారిటీ అభ్యర్థినే రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నప్పటికీ నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీకి దింపాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముస్లిం మైనారిటీ నుంచి పోటీకి దిగాలనుకుంటున్న వారు తెలుగుదేశం వైపు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ముస్లిం మైనారిటీలే అత్యధికంగా ఉన్నప్పటికీ రాయచోటిలో గడికోట్ల, రెడ్డప్ప కుటుంబాలే ఆధపత్యం వహిస్తూ వస్తున్నాయి.ఇలా ఉండగా రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎదిరించి విజయం సాధించడం అంత తేలికైన పని కాదని భావిస్తున్న తెలుగుదేశం ఇక్కడ పోటీకి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. ప్రస్తతానికైతే రాయచోటి నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రేసులో ఉన్నారు. వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తాఖ్ హుస్సేన్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి , గతంలో  వైసీపీలో కీలకంగా వ్యవహరించి ఏడాది కిందటే తెలుగుదేశం గూటికి చేరిన పీసీసీ మాజీ సభ్యుడు రాంప్రసాద్ రెడ్డి, అలాగే రెండు నెలల కిందటే   వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చిన ద్వార‌కానాథ్‌రెడ్డి ఉన్నారు.  దివంగత తారకరత్న భార్య ద్వారకానాథ్ రెడ్డికి మేనకోడలు. తెలుగుదేశం పార్టీలోకి అసెంబ్లీ టికెట్ ఆశించే వచ్చానని ద్వారకానాథ్ రెడ్డి దాపరికం లేకుండా చెబుతున్నారు. ఒక వేళ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి టికెట్ లభించకుంటే తన దారి తాను చూసుకుంటానని ద్వరకానాథ్ రెడ్డి తన అనుచరులతో ఓపెన్ గానే చెప్పేస్తున్నారని వినికిడి.   ఒకప్పుడు రాయచోటి ఉమ్మడి కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది.  ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే అని చెప్పుకోవ‌చ్చు.  2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా.. అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్‌రెడ్డి.. వైఎస్ మరణం తర్వాత జగన్‌తోనే నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్‌రెడ్డి. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 31 వేల 637 ఓట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ 95 వేల పైచిలుకు ఓట్లు సాధించింది వైసీపీ. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మళ్లీ గడికోట శ్రీకాంత్‌రెడ్డే పోటీ చేయనున్నారని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అధిష్టానంలో పట్టుతోపాటు.. జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల శ్రీకాంత్‌రెడ్డి స్థానం సుస్థిరమేనని అంటున్నారు.  ఇక తెలుగుదేశం విషయానికి వస్తే రాయచోటి టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఇక్కడ నుంచి ఓటమి చవి చూసిన   ఈ సీటుపై టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే రెండుసార్లు పోటీచేసి ఓటమి చవిచూసిన రమేశ్‌కుమార్‌రెడ్డి మళ్లీ మరోమారు పోటీకి రెడీ అవుతున్నారు. ఇక రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్ బాబుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అలాగే రామప్రసాద్ రెడ్డి కూడా పార్టీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రమేశ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌బాబుల మధ్య గ్రూప్‌వార్ నడుస్తోంది.   మొత్తంగా చూస్తే రాయ‌చోటిలో గెల‌వాలంటే మైనార్టీల స‌మద్దతే కీల‌కం. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం అధిష్టానం ఏం చేయ‌బోతోంద‌నేదే హాట్ టాపిక్‌గా మారింది. రాయచోటి అసెంబ్లీకి  పోటీ చేయాల పలువురు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు కోరుకుంటున్నారు.రు.  ఏదైనప్పటికి టిడిపి టికెట్‌ ముస్లిం మైనారిటీలకు ఇస్తారా లేక రాంప్రసాద్‌రెడ్డి కే ఫైన‌ల్ చేస్తారా అనేది ఉత్కంఠ‌గా మారింది.

బాబు గొప్ప విజనరీ.. తెలంగాణ సీఎం రేవంత్.. వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో?

చంద్రబాబు నాయుడు, కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో  అగ్రగాములుగా ఉన్నారు.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే అనడంలో సందేహం లేదు.  ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించే నిజం. అంగీకరించిన వాస్తవం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఐటీ రంగాన్ని తీసుకువచ్చి సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని నిర్మించి,  హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు ఘనతను రాజకీయ వైషమ్యాలు, రాజకీయ కక్షతో ఎవరో చెరిపేద్దామంటే చెరిగేది కాదు.  ఈ విషయాన్ని  తెలంగాణ ఐటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన పదవిలో ఉన్నప్పుడే అంగీకరించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసింది. ఐటీ రంగాన్ని అత్యున్నత స్థాయికి  చేర్చినది చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించి తీరుతారనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు ఇదే విషయాన్నీ  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు.   హైద్రాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకువచ్చినది  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన  నారా చంద్రబాబు నాయుడు అనడంలో సందేహాలకు తావు లేదని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  హైద్రాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పునాదుల నుంచి స్లాబుల వరకు ఉంది.  అయితే ఆ విషయాన్ని గుర్తించడానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం మనసు రావడం లేదు. అందుకే చంద్రబాబు విజన్ కారణంగా అంకురార్పణ చేసుకుని శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అమరావతిని నిర్వీర్యం చేశారు. బాబు విజన్ ను విజ్ణతను ప్రశంసించే వారిపై అనుచిత విమర్శలతో విరుచుకుపడ్డారు. అసలు చంద్రబాబు గొప్పతనం ఆయన అధికారంలో ఉన్నప్పటి కంటే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయనను జగన్ సర్కార్ రాజకీయ కక్షతో స్కిల్ స్కామ్ నెపంతో జైలులో పెట్టినప్పుడు.. మరింత ప్రకాశవంతంగా కనిపించింది. దేశ విదేశాలలో ఆయనకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి.    ఆయన జైలులో ఉన్న సమయంలోనే  జరిగిన సైబర్ టవర్స్ రజతోత్సవ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది.  పాతికేళ్ళకు ముందు నాడు,కొండలు గుట్టల నడుమముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది.తెలుగు యువత హైటెక్  భవితకు బంగరు బాటలు పరిచిన  విజనరీకి  వందనం చేయటమే కాకుండా గళం విప్పి గర్జించింది.  ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు 30 ఏళ్లలోపు వారే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం కొత్త చర్చకు తెర తీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు  ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నరనే విషయం సందేహాలకు అతీతంగా రుజువైంది.  అయినా జగన్ మూకకు అవేమీ కనిపించలేదు. వినిపించలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ చంద్రబాబు గొప్పతనాన్ని  మరోసారి చాటడం  వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు.  గతంలో చంద్రబాబును ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై విమర్శలతో విరుచుకుపడినట్లుగా ఇప్పుడు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిపై కూడా మాటల దాడికి తెగబడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

గుడివాడ అమర్నాథ్.. మంత్రే కానీ ప్రొటోకాల్ ఊస్ట్!

నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఇప్పుడు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సరిగ్గా అతికి నట్లు సరిపోతుంది. సాగినంత కాలం  పరిధులు లేకుండా ఎగిరెగిరి పడిన గుడివాడకు ఇప్పుడు ఏదీ సాగడం లేదు. జగన్ కేబినెట్ లో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ.. గుడ్డు కథ చెప్పి బాగా పాపులర్ అయ్యారు.  ఇక నిన్నమొన్నటి వరకూ ఆయన తీరు ఎలా ఉండేదంటే తనకు తానే వైసీసీలో జగనంతటివాడినని బిల్డప్ లు ఇచ్చేసుకునే వారు.  అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు కనీసం మంత్రిగా దక్కాల్సిన గౌరవం కూడా దక్కడం లేదు. వచ్చే ఎన్నికలలో పోటీకి గుడివాడ అమర్నాథ్ కు నో టికెట్ అని జగన్ ఇప్పటికే చెప్పకుండానే చెప్పేశారు. ఆయన సీటును మార్చేసిన జగన్.. మరో చోట పోటీకి కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తత్వం బోధపడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతా జగన్మాయ, జగన్ దయ అంటూ వేదాంతంలోకి దిగిపోయారు. ఇప్పుడు తాజాగా గుడివాడ అమర్నాథ్ కు మరో ఘోర పరాభవం జరిగింది. అలా పరాభవించింది కూడా పార్టీ అధినేత, సీఎం జగనే. మంత్రిగా అమర్నాథ్ కు ఉన్న ప్రొటో కాల్ ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో  జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏ మంత్రికీ ఇటువంటి పరాభవం ఎదురై ఉండదు. పాపం గుడివాడ అమర్నాథ్ అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇంతకీ జరిగిందేమిటంటే.. మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ విశాఖ జిల్లాలు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం పలికి రిసీవ్ చేసుకుంటారు. ఇది ప్రొటోకాల్. ఇప్పటి వరకూ అదే జరిగింది. ఎప్పుడైతే జగన్ ఆయనకు టికెట్ లేదని క్లారిటీ ఇచ్చారో అప్పుడే నీరసపడిపోయిన అమర్నాథ్ కుఇప్పడు ఆయనకు ఉన్న ప్రొటోకాల్ ను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులతో ఇక ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విశాఖకు ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్  రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు రెడీ అయిపోతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు దిమ్మతిరిగేలా ఆయనకున్న ప్రోటోకాల్ గౌరవాన్ని తొలగిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే బాధ్యతను బూడి అప్పలనాయుడికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుడివాడ అమర్నాథ్ కు చెప్పకుండానే  ఆయనకు స్వాగతం చెప్పే బాధ్యతను బూడి ముత్యాలనాయుడుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ స్వాగతం చెప్పే గుడివాడ అమర్నాథ్ కు ఇంతకు మించిన పరాభవం ఎముంటుందని పరిశీలకులు అంటున్నారు. గుడివాడకు చెప్పకుండానే ఆయన నియోజకవర్గం అనకాపల్లికి వేరే అభ్యర్థిని ప్రకటించిన జగన్ ఇప్పటికీ ఆయనకు మరో చోట నుంచి పోటీకి అవకాశం ఇస్తానన్న హామీ ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. దీంతో ఆయనకు పోటీ చేసే చాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం పార్టీలోనే జోరుగా సాగుతోంది.   జగన్ అండ చూసుకుని గుడివాడ అమర్నాథ్  ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పై ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు  వ్రతమూ చెడి ఫలమూ దక్కని చందంగా జగన్ నుంచి తిరస్కారం ఎదురుకావడంతో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. అనకాపల్లి సీటు లేదని జగన్ తేల్చేసిన నాడే బహిరంగంగా గుడివాడ కళ్ల నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తల రాత జగనే రాస్తారని ఆయన పాపం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు రాత రాయడం కాదు.. ఏకంగా పరువే తీసేపి పక్కన కూర్చో పెట్టారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. 

షర్మిలపైనా ఉక్కుపాదం!.. అంత భయమేంటి జగన్?!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నీడను చూసి తానే వణికి పోతున్నారు. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా తన కుర్చీ మడతపడిపోతోందని భయపడుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం నేతలూ, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడినా సహించలేకపోయారు. అయితే ఇప్పడు ఎన్నికల సమయం ముంచుకు వచ్చేసరికి ఆయనకు అందరూ శత్రువులుగానే కనిపిస్తున్నారు. తన అధికారాన్ని అంతం చేయడానికి బయలుదేరిన కుట్రదారులుగానే కనిపిస్తున్నారు. అందరినీ అణచివేయడానికి తనకున్న ఏకైక అండ పోలీసులేనన్న భావనలో పడిపోయారు. అందుకే చీమ చిటుక్కు మన్నా పోలీసులను రంగంలోకి దింపేస్తున్నారు.  తాజాగా గురువారం ఉదయం  కాంగ్రెస్ చలో సెక్రటేరియెట్  కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఒక యుద్ధ వాతావరణాన్నే సృష్ఠించారు.  వాస్తవానికి గత పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రం. ఇప్పుడు కూడా ఆ పార్టీ గొంతు ఏదో కొద్దిగా వినిపిస్తోంది. అది కూడా జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే ఏదో మేరకు కాంగ్రెస్ లో కొంత చలనం కనిపిస్తోంది. ఆ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశాలూ మెరుగయ్యాయి. అంతే కానీ.. షర్మిల పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో అనూహ్య విజయాలు సాధించేసి అధికారం చేపట్టేస్తుందన్న పరిస్థితి ఇసుమంతైనా లేదు. కానీ జగన్  మాత్రం కాంగ్రెస్ ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలనే భావిస్తున్నారు.  ఇందు కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడితో ఆగకుండా హౌస్ అరెస్టుల పర్వానికీ తెరతీశారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేనలను ఏ విధంగానైతే ప్రజలలోకి రాకుండా అడ్డుకునేందుకు అణచివేతనే మార్గంగా ఎన్నుకున్న జగన్ ఇప్పుడు అదే అణచివేతను కాంగ్రెస్ పైనా ప్రయోగిస్తున్నారు. గత ప దేళ్లలో కాంగ్రెస్ పార్టీ జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు, ఏదో ఒక సమస్య తీసుకుని ఆందోళనకు పిలుపునిచ్చినా ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేని పరిస్థితిలో అవేమీ కనీస మాత్రం ప్రభావాన్ని చూపలేదు. ఇది వాస్తవం. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత కొద్దికొద్దిగా పార్టీ క్యాడర్ బయటకు వస్తున్నారు అంతే.  అయితే కాంగ్రెస్ ఆందోళనల స్థాయి ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేదన్నది కూడా వాస్తవమే. అయినా  పులి, సింహం అంటూ జగన్ పార్టీ కేడర్ గొప్పగా అభివర్ణించే జగన్ మాత్రం పిల్లిలా భయపడుతున్నారు.  కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తున్నారు. చివరాఖరికి కాంగ్రెస్ పార్టీ అంటే కూడా జగన్ గజగజలాడిపోతున్నారు.  సొంత చెల్లిని సైతం హౌస్ అరెస్టు చేయించడానికి వెనుకాడటం లేదు.  ఇంతకీ కాంగ్రెస్ చలో సెక్రటేరియెట్ పిలుపు ఎందుకు ఇచ్చిందంటే.. గత ఎన్నికల ముందు జగన్  తాను అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని ఇచ్చిన హామీని ఇంత కాలం పూర్తిగా విస్మరించి, సరిగ్గా ఎన్నికల వేళ అరకొర పోస్టులతో  నిబంధనలను పాటించకుండా డీఎస్సీ ప్రకటించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది.  ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిబంధనలతో డీఎస్సీ ప్రకటించి పనికిరాని నోటిఫికేషన్ విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దాని మీదే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది.  సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇటీవలే కుమారుడి వివాహం చేసిన షర్మిల ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ కార్యక్రమంలో ముందుండేందుకు రెడీ అయ్యారు.  షర్మిలను పార్టీ ఆఫీసు నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.  రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ పార్టీని నియంత్రించేందుకు కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికార వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అవగతమౌతుంది.  తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రిగా షర్మిల చేపట్టిన ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రయత్నించి గతంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎంతగా అప్రదిష్టపాలైందో తెలిసిందే. షర్మిలపై అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధ కాండ ఆమె పార్టీకి పెద్దగా మైలేజ్ తీసుకురాకపోయినప్పటికీ, అప్పటికి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలంగా పుంజుకోవడానికి కారణమైన సంగతి తెలసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పై, షర్మిలపై జగన్ సర్కార్ ప్రయోగిస్తున్న నిర్బంధం కూడా విపక్ష కూటమికి మేలు చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పుడేం ముఖం పెట్టుకొని వ‌స్తావ్‌ ఆళ్ళా!?

సినిమాల్లో స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లుగా క‌మ‌ల్ హాస‌న్ త‌ర‌హాలో న‌టించేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు, కానీ,  వైసీపీ నేత‌లు క‌మ‌ల్ హాస‌న్ ను మించి న‌టించేస్తున్నారు. అంటే సినిమాల్లో కాదు, నిజ జీవితంలో, రాజకీయాలలో.  అలాంటి వారిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. త‌న‌కు ఎప్పుడు ఎలా అవ‌స‌ర‌మో ఆ విధంగా ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి న‌టించేస్తుంటారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్ పై మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల వైసీపీని వీడి ఆళ్ల కాంగ్రెస్ లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే.. ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ష‌ర్మిల‌కు రాజ‌కీయంగా అంతా తానేనంటూ ఆళ్ల బిల్డ‌ప్ ఇచ్చారు. ఆళ్ల జ‌గ‌న్ కోవ‌ర్ట్ అనే విష‌యాన్ని గుర్తించిన ష‌ర్మిల ఆయనను దూరంపెట్టారు. ఇక కాంగ్రెస్ లో ఉన్నా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ కొన‌సాగించ‌లేమ‌ని భావించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ ను వీడి తిరిగి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు.  ఏపీలో  త్వరలో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్య‌లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొంద‌రు నేత‌లు ఏరోజు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి.  నెల రోజుల క్రితం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. వైసీపీని వీడే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రుల‌తో ఆళ్ల భేటీ అయ్యారు. వైసీపీని వీడ‌టానికి కార‌ణాల‌ను వివ‌రించారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములిచ్చిన‌ రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని, మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని చెప్పుకొచ్చాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మొహం పెట్టుకొని పోతామండీ అమ‌రావ‌తి ప‌రిధిలోని గ్రామాల‌కు అంటూ ఆళ్ల త‌న అనుచ‌రుల ముందు వాపోయారు. ఒక‌వైపు మూడు రాజ‌ధానులు అన‌గానే అమ‌రావ‌తి ప‌రిధిలోని భూముల ధ‌ర‌లు ప‌డిపోయాయి.. పిల్ల‌ల పెళ్లికో, చ‌దువుల‌కోస‌మో..  భూములు అమ్ముకుందామంటే రిజిస్ట్రేష‌న్‌లు కావ‌డం లేదంటూ క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్  ఓ ఉపన్యాసం దంచేసి, జగన్ తీరును ఎండగట్టారు. జ‌గ‌న్ అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల‌ను మోసం చేశారనీ, అందుకే వైసీపీ వీడుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. తాజాగా మ‌ళ్లీ అదే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేద్దాం అంటూ ఆళ్ల చెబుతుండ‌టంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్రాంతం ప్ర‌జ‌లు ఛీకొడుతున్నారు. అప్పుడు అలా అన్నావ్‌.. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వైసీపీకి ఓటు వేయ‌మ‌ని అడుగుతావ్ అంటూ ఆయ‌న అనుచ‌రులే ప్ర‌శ్నిస్తున్నారు.   ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యంచేసే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. మూడు రాజ‌ధానుల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ.. అమ‌రావ‌తి పేరు లేకుండా చేయాల‌ని జ‌గ‌న్‌ కంక‌ణం క‌ట్టుకున్నాడు. జ‌గ‌న్ తీరును నిర‌సిస్తూ అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములిచ్చిన‌ రైతులు నాలుగున్న‌రేళ్లుగా ఉద్య‌మం చేస్తున్నారు. కోర్టుల‌కువెళ్లి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలను అడ్డుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రైతుల‌పై పోలీసులతో దాడులు చేయించ‌డం, అక్ర‌మంగా కేసులు పెట్టించ‌డం, అరెస్టులు చేయించ‌డం సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశాడు. అయినా అమ‌రావ‌తి రైతులు ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌కుండా.. ఎండావాన అనే తేడాలేకుండా అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర‌వ్యాప్తంగా పాద‌యాత్ర‌ సైతం నిర్వ‌హించారు. జ‌గ‌న్ వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తి రైతుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. ఏపీ వ్యాప్తంగా అమ‌రావ‌తి రైతుల‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత ప్ర‌జ‌లు, ముఖ్యంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏనాడూ మ‌ద్ద‌తుగా నిలిచిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం, ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరుతూ ప్ర‌జ‌ల ముందుకొస్తున్నాడు. అమ‌రావ‌తి రాజ‌ధానిని జ‌గ‌న్ నిర్వీర్యం చేస్తున్నా రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌ని ఆళ్ల‌.. ఇప్పుడు ఏమొహం పెట్టుకొని ఓట్లు వేయ‌మ‌ని అడ‌గ‌టానికి వ‌స్తారంటూ మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ ఓట‌మిపాల‌య్యాడు. అయినా, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతూ వారి స‌మ‌స్య‌ల్లో చేదోడు వాదోడుగాఉంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లు లోకేశ్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కానీ,  గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి అభివృద్ధి చేయ‌క‌పోగా.. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల ప‌క్షాన ఎన్నడూ మాట్లాడిన దాఖలాలు లేవు.   తాజాగా ఎన్నిక‌ల స‌మ‌యం రావ‌డంతో మ‌ళ్లీ వైసీపీ అభ్య‌ర్థిని గెలిపించాలంటూ, జ‌గ‌న్ ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేద్దామంటూ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. దీంతో మంగళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆళ్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు వేయ‌మ‌ని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన్నావ్‌.. కొంచెమైనా నీకు సిగ్గూశ‌రం ఉందా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

బరిలో బ్రాహ్మణి?!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  సతీమణి నారా బ్రాహ్మణి  ఎన్నికల బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ప్రచారం జోరుగా నడుస్తోంది. గుంటూరు ఎంపీగా ఆమెను పోటికి దింపితే,  ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి మంగళగిరితోపాటు రాజధాని ప్రాంతం సైతం వస్తుందని.. ఈ నేపథ్యంలో ఆమెకు గుంటూరు లోక్‌సభ స్థానం ఫిక్స్ చేస్తున్నారనే ఓ ప్రచారం   హల్‌చల్ చేస్తోంది.  అదీకాక.. ఆమె గుంటూరు నుంచి బరిలో దిగి.. గెలిస్తే   లోక్‌సభలో రాజధాని సమస్యలపై ప్రస్తావించడమే కాకుండా.. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో వస్తే.. రాజధాని కోసం ఏ ఏ అంశాలు సభలో ప్రస్తావనకు తీసుకు రావాలి.. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఏ విధి విధానాలు చేపట్టాల్సి ఉంది.. వాటి అమలు కోసం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు .. మామగారు చంద్రబాబు మార్గదర్శకంలో.. పని చేసేందుకు ఆమెకు వీలు కలుగుతోందనే ఓ చర్చ   సాగుతోంది.  అలాగే గుంటూరు నుంచి నారా బ్రాహ్మణిని బరిలో దింపితే ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పడితే.. ఆ సమయంలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రహ్మణి ప్రజల్లోకి రావడమే కాదు.. బాబు అరెస్ట్ కావడంతో.. మీరు ఒంటరి అయిపోయారని భావిస్తున్నారా? అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు...  అదేమీ లేదు.. మాతో ప్రజలు ఉన్నారంటూ.. పక్కా క్లారిటీగా.. పూర్తి ఆత్మ విశ్వాసంతో ఆమె స్పందించిన తీరు కు తెలుగు ప్రజలు   ఫిదా అయిపోయారు,   అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పథంలో సాగిందో.. యువత భవిష్యత్ ఎలా కొత్త పుంతలు తొక్కిందో  అందరికీ తెలిసిందేనని... అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో యువత..  డ్రగ్స్, గంజాయి మత్తులో తమ భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నదని ఆమె సోదాహరణగా వివరించారని,  బాబు అరెస్టు అయినప్పుడు నారా బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటూ.. పార్టీ సీనియర్ నేతలతో సైతం భేటీ అయి.. పార్టీ భవిష్యత్  కార్యాచరణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని.. అలాంటి ఆమె రేపు ఎన్నికల్లో పోటికి దిగి.. గెలిస్తే మాత్రం... తనదైన శైలిలో రాజకీయ చతురతో వ్యవహరించ గల నేర్పు ఆమె సొంతమని రాజకీయవర్గాలు అంటున్నాయి.  నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో దిగితే  సైకిల్ పార్టీకి ప్లస్ పాయింట్ కావడం మాత్రం పక్కా అంటున్నారు. మరోవైపు నారా బ్రాహ్మణి.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారంటూ.. మరో ప్రచారం సైతం సాగుతోంది.. అదీకూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మించిన  జిల్లాలోని అత్యంత కీలక మైన అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు.. ఇప్పటికే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతోపాటు ఆయన చిన్నల్లుడు భరత్ సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని... అలాంటి వేళ.. నారా బ్రాహ్మణి సైతం పోటీకి దిగితే మాత్రం.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంత మంది బరిలో దిగుతున్నారంటూ.. ప్రత్యర్థి ఫ్యాన్ పార్టీ చేతికి విమర్శలు చేసే అవకాశం స్వయంగా కల్పించినట్లు అవుతుందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం.. ఆమె గెలుపను ఎవరు ఆపలేరని.. ఆమె సభలో అడుగు పెట్టడమే తరువాయి అనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.