తొలి జాబితాతో తెలుగుదేశంలో జోష్.. బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్!
posted on Feb 26, 2024 @ 10:10AM
తెలుగుదేశం, జనసేన కూటమి తొలి జాబితా విడుదలతో తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నెలకొంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశంలో చేరుతున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి మొదటి జాబితాను 118 మందితో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. వీరిలో తెలుగుదేశం అభ్యర్థులు 94 మంది, జనసేన అభ్యర్థులుగా 24 మంది ఉన్నారు.
చంద్రబాబు 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. జనసేనాని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి.. మిగిలిన 19 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. బీజేపీ సైతం కూటమిలో కలిసే అవకాశం ఉండటంతో ఆ పార్టీకి కేటాయించగా.. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను వచ్చేనెల మొదటి వారంలో చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి తెలుగుదేశం, జనసేన తొలి జాబితా ప్రకటన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. జనసేన, తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఏపీలో ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. దీనికితోడు కక్షపూరిత రాజకీయాలతో జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన సాగింది. జగన్ ప్రజావ్యతిరేక, కక్షపూరిత రాజకీయాలతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. కొందరు జనసేన గూటికి చేరారు. మరింత మంది వైసీపీని వీడే యోచనలో ఉన్నారని అంటున్నారు.
రాష్ట్రంలోని 150కిపైగా స్థానాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. తాజాగా తెలుగుదేశం, శినసేన కూటమి మొదటి జాబితా విడుదల కావడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది. పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి, నియోజకవర్గంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను బట్టి చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించారు. ఫలితంగా మొదటి జాబితా ప్రకటించిన తరువాత పలు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్న పరిస్థితి.
తెలుగుదేశం, జనసేన తొలి జాబితా విడుదల తో ఆ పార్టీ నేతల మధ్య విబేధాలు నెలకొంటాయని వైసీపీ అధిష్టానం అంచనా వేసింది. కానీ, ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన నేతలు కలిసి సంబరాలు చేసుకుంటుండటం వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. పై పెచ్చు విపక్ష పార్టీల జాబితా తరువాత వైసీపీ నుంచే శ్రేణుల వలస ప్రారంభం కావడం ఆ పార్టీ అధినేతకు మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయిన వెంటనే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి జనసేనకు అన్యాయం జరిగిందంటూ జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు విఫల ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బానిసగా మారిపోయాడంటూ విమర్శలు చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించకపోవటంతో వైసీపీ పెద్దలకు ఓటమి బెంగ పట్టుకుంది.
జనసేన అధినేత ఇప్పటికే పలు దఫాలుగా జనసేన పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో జనసేన అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేక పోయిందని, కనీసం పది నియోజకవర్గాల్లోనైనా జనసేన అభ్యర్థులు గెలిచి ఉంటే ప్రస్తుతం పొత్తులో కనీసం 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేసేవాళ్లమని, కానీ, ఆ పరిస్థితి లేకపోటంతో తక్కువ సీట్లే అయినా కచ్చితంగా గెలుస్తామనుకున్న నియోజకవర్గాల్లోనే జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారని పవన్ చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు సైతం పవన్ మాటల్లో వాస్తవాన్ని గమనించి తెలుగుదేశం, జనసేన కూటమిని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
తెలుగుదేశం, జనసేన తొలి జాబితా విడుదలైన నాటి నుంచి పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ సమక్షంలో భారీ సంఖ్యలో వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చౌడేపల్లి మండలంలోని ఐదు పంచాయితీల్లోని 150 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం గూటికి చేరారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం ఖాయమని, చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం, జనసేన కూటమి జాబితాను ఆధారం చేసుకుని ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేయగా.. అవి బెడిసికొట్టాయి. పైపెచ్చు బూమరాంగ్ అయ్యాయి. వైసీపీ నుంచే భారీ సంఖ్యలో కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు.