టీఎస్-ఎప్సెట్ ఫలితాలు విడుదల ...బాలికలదే పై చేయి

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదయింది. ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అదే ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి మే 7, 8వ తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌రిగాయి. అలాగే  9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించ‌డం జ‌రిగింది.

కోనసీమలో బెట్టింగుల జోరు.. గెలుపు ఓటములపై కాదు.. మెజారిటీలపైనే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం. అయితే పోలింగ్ సరళి, పార్టీల మూడ్ ను బట్టి ఫలితం ఊహించేయవచ్చు. అన్నిటికీ మించి ఎన్నికల ఫలితంపై జరుగుతున్న బెట్టింగ్ లు కూడా ఫలితంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడతాయి.  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఇక కోనసీమలో అయితే ఈ బెట్టింగుల జోరు మరో లెవెల్ కు చేరింది. సాధారణంగా బెట్టింగులు అంటే ఫలానా పార్టీ విజయం సాధిస్తుంది. ఫలానా అభ్యర్థి గెలుపొందుతాడు అంటూ సాగుతాయి. కానీ కోనసీమలో మాత్రం బెట్టింగులు గెలపు ఓటములపై జరగడం లేదు. తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మెజారిటీలపై సాగుతున్నాయి. ఈ బెట్టింగులు లక్షల రూపాయలు దాటి కోట్లలోకి చేరుతున్నాయి. కోనసీమ మూడ్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేసేసినట్లు కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు సాధించబోయే మెజారిటీలపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారంటూ లక్షలలో బెట్టింగులు నడుస్తున్నాయి. అలాగే  ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో  తెలుగుదేశం కూటమి అభ్యర్థి పది వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారనీ పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. అదే విధంగా తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల మెజారిటీలపై ఐపీఎల్ బెట్టింగులను మించి బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుల తీరు చూస్తుంటే ఫలితానికి ముందే కూటమి అభ్యర్థుల విజయం ఖారరైపోయినట్లు కనిపిస్తోంది. బెట్టింగులన్నీ మెజారిటీలపైనే జరగడాన్ని చూస్తుంటే తూర్పుగోదావరిలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ప్రపంచ వింత: మల్లారెడ్డి భూమి కబ్జా!

మాజీ ఎంపీ, మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా..’ మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చని గిట్టనివారు అంటూ వుంటారు. మల్లారెడ్డికి వున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలాశాతం కబ్జాల పుణ్యమేనని కూడా అంటూ వుంటారు. అలా కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత.  కుత్బుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలోని మల్లారెడ్డికి, అతని అల్లుడు రాజశేఖరరెడ్డికి చెందిన స్థలంలో కొంతమంది బారికేడ్లు పెట్టి కబ్జా చేశారట. దాంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, వాళ్ళ అనుచరులు  సదరు స్థలం దగ్గరకి వచ్చి హడావిడి చేశారు. అక్కడకి పోలీసులు కూడా రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి స్థలాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారా.. వేరేవాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారా అనేది నిలకడ మీద తెలుస్తుంది. 

శకుని సజ్జల!?

మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులు అందరూ చూశారు. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిలుపైనే ఉన్నారు. సకుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవలసిన పరిస్థితి జగన్ ది. అది పక్కన పెడితే..   2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. , వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య కూడా సానుభూతిని ప్రోది చేసి జగన్ విజయానికి దోహదపడింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన విజయం కోసం ఇల్లూ వాకిలీ వదిలి మరీ తిరిగిన సొంత చెల్లి షర్మిలను,  దూరం పెట్టారు.  షర్మిల తెలంగాణలో  సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం,  తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్లిపోవడం ఇదంతా జనానికి తెలిసిందే.  అయితే జనానికి తెలియనిది  వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది.  వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ వైఎస్ కుటుంబానికి తెలుసు. ఈ హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేయించారో కూడా  తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కని పెంచిన తల్లి కూడా జగన్ కు ఎందుకు దూరంగా జరిగారో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.   ఆ ఇంటిగుట్లన్నీ, ప్రజలకు తెలియని ఆ కుటుంబ రహస్యాలన్నీ బయటకు వచ్చేలా చేసింది సజ్జలే. ఔను.. షర్మిల తెలంగాణలో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కూడా జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలకు దిగలేదు. అలాగే జగన్ కూడా చెల్లి షర్మిలపై నేరుగా విమర్శలు గుప్పించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై కొన్ని అనుచిత పోస్టులు కనిపించినా జనం కానీ షర్మిల కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీతోనే  విజయవాడలో పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలు పెట్టారా సీఎం జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల సున్నితంగా రిటార్డ్ ఇచ్చారు.   జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగిపోయి ఉండేది. కానీ సజ్జల ఎంటరై  చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారనీ నిందలేశారు. అక్కడితో ఆగకుండా అసలు జగన్ షర్మిలకు చేసిన అన్యాయమేంటో చెప్పాలని రెచ్చగొట్టారు. దాంతో షర్మిల ఓపెన్ అయిపోయారు.  జగన్ తనకు చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తండ్రి ఆస్తిలో వాటాను ఎలా ఎగ్గొట్టారో, ఏదో కొంత ఇచ్చి దానిని అప్పుకింద ఎలా రాయించుకున్నారో జనం కళ్లకు కట్టారు. సొంత బాబాయ్ వివేకా హత్య నిందితులను వెనకేసుకువస్తున్న సంగతీ చెప్పారు. జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ బహిరంగ వేదికలపైనే ఎండగట్టారు. కడపలో ఆమె జగన్ ప్రతిష్టను పాతాళానికి పాతేశారు. దీంతో మొత్తం వైసీపీయే డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ సజ్జలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ఇక పోలింగ్ పూర్తయిన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఏమూలో ఉన్న గెలుపు విశ్వాసాన్ని కూడా సజ్జల ఊదేశారు. మీడియా ముందకు వచ్చి గెలుస్తామంటూ ఓ పక్క చెబుతూనే ఎన్నికల సంఘం చంద్రబాబు ఆదేశాలను పాటించిందంటూ విమర్శలు చేయడం ద్వారా  ఎన్నిలక ఫలితం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే శకుని కౌరవులకు చేసిన మేలే సజ్జల వైసీపీకి చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. శకుని కౌరవ పతనానికి కారకుడైతే.. సజ్జల వైసీపీ ఓటమికి కారకుడౌతున్నారని అంటున్నారు. 

రాజకీయ ఆశ్రయం కోసం రేవంత్ పంచన ఆర్జీవీ

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత  తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలపై చిత్రం నిర్మించారు. పూర్తి అవాస్తవాలతో తెరకెక్కిన చిత్రం ఇది. .  జగన్ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. తాజాగా ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. త్రికూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న వార్తలు వస్తున్నాయి.  ఎలాంటి నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ  డైరక్టర్ల అసోసియేషన్ అంటూ  ఈ కొత్త డ్రామాకు తెరతీశాడు.  కొంత మందితో కల్సి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. పబ్లిసిటీ  పిచ్చిబాగా ఉన్న రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా  చూసుకున్నారు. గతంలో  డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించని వర్మ సడెన్ గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.  డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి వచ్చి  ఎవరైనా కలిస్తే కించ పరిచేవారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ?   ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది. 

పి(న్నె)ల్లి వారి పల్నాటి ‘పిరికితనం’!

పల్నాటి పౌరుషం గురించి మనం కథలు కథలుగా విని వుంటాం. పలనాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుడి పౌరుషం గురించి తెలుసుకుని పులకరించిపోయి వుంటాం. ‘పల్నాటి యుద్ధం’, ‘పల్నాటి పౌరుషం’ సినిమాలు చూసి మన తెలుగువారికి ఇంత గొప్ప చరిత్ర వుందని హ్యాపీగా ఫీలై వుంటాం. తెలుగువారందరి మనసులలో ‘పల్నాడు’ అనే మాట వింటేనే పౌరుషంతో పిడికిళ్ళు బిగుసుకునే ఒక ఫీల్....! ఆ ఫీల్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది.. అంతటి పౌరుషం గడ్డ మీద పుట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టు అయిపోతామనే భయంతో పిల్లిలాగా గోడ దూకి హైదరాబాద్ పారిపోయారన్న విషయం తెలుసుకుని, వీళ్ళిద్దరి విషయంలో ‘పల్నాటి పౌరుషం’ అనే మాటని పక్కన పెట్టి... ‘పల్నాటి పిరికితనం’ అనే మాటని ఉపయోగించాలని అనిపించడం న్యాయమే. ఈ బ్రదర్స్ ఇద్దరూ పోలింగ్ సందర్భంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలూ చేశారు. రౌడీ మూకల సహకారంతో రక్తాన్ని పారించారు. ఎదుటి వారి మీద దాడి చేయడం పౌరుషం అవదు.. పిరికితనం అవుతుంది. పోలింగ్ సందర్భంగా వీరిద్దరూ భారీ స్థాయిలో పిరికితనం ప్రదర్శించారు. వీరి నేరాలు, ఘోరాలు బయటపడి హౌస్ అరెస్ట్ అయ్యారు. చివరికి అరెస్టు అయి జైల్లో పడే అవకాశం వుందని తెలుసుకుని, ఇంటి వెనుక గోడదూకి హైదరాబాద్‌కి పారిపోయారు. వీళ్ళిద్దరూ పిరికివాళ్ళని తెలుస్తుందిగానీ, మరీ ఇంత పిరికివాళ్ళని ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి ఇంటి పేరు ‘పిన్నెల్లి’ అని కాకుండా ‘పిల్లి’ అని మార్చుకోవడం మంచిది. ఇలాంటి పిరికి పిల్లులు పల్నాటి గడ్డ మీద భవిష్యత్తులో పుడతారని తెలిసుంటే బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు ఈ ప్రాంతం వదిలి పారిపోయి వుండేవారు.. వీళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతానని భయపడిపోయి లండన్ పారిపోయారు. వీళ్ళిద్దరూ అరెస్టు అవుతామని భయపడి హైదరాబాద్ పారిపోయారు. వీళ్ళిద్దరూ తిరిగి పల్నాడులో అడుగు పెట్టకుండా వుంటే ఆ ప్రాంతానికి గౌరవం. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.

తాడేపల్లి డైరెక్షన్ లోనే పల్నాడు హింసాకాండ?

ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో  ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కూడా బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా  ఏపీలో అల్లర్లపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం 13 మంది సభ్యులతో   స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్) ఏర్పాటు చేసింది.  నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పోలీసులు తమ పై అధికారుల సూచనలు, ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా అల్లర్లను ప్రేరేపించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిట్ నివేదిక పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులు వైసీపీ మూకలు చెలరేగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారన్న అనుమానాలూ ఉన్నాయి.  పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక  జగన్ అనుకూల పోలీసు అధికారుల పాత్ర ఉందన్న చర్చ పోలీసు అధికారుల్లోనే జోరుగా సాగుతోంది. ఆ అధికారులు ఎన్నికల విధుల్లో లేరనీ, కానీ తమ పలుకుబడిని ఉపయోగించి కింది స్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారని అంటున్నారు.     ఇక సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రాష్ట్రానికి కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా పూర్తి క్రియారహితంగా వ్యవహరించారనీ, ఆయన సీఎస్ ఆదేశాల మేరకే పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి తన వైసీపీ అనుకూల వైఖరితో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఇక తాజాగా ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. సిట్ పై తెలుగుదేశం కూటమి సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు. 13 మంది సిట్ బృందంలో అత్యధికులు ఏసీబీ నుంచే ఉన్నారనీ ఇటీవలే ఎన్నికల విధుల నుంచి ఉద్వాసనకు గురైన మాజీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఏసీబీ చీఫ్ గా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల విధుల్లో లేని నిజాయితీ పరులైన పలువురు   పోలీసు అధికారులు ఉండగా సిట్ లో ఏసీబీ అధికారులకే ప్రాథాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.  

యుకె పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజు 

యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు పోటీ చేయబోతున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ ఎంపీ అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది.  నాగరాజుది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగిన నాగరాజు ప్రఖ్యాత యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో పాలనాశాస్త్రంలో పీజీ చేశారు. భవిష్యత్ తరాలపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసికట్టిన నాగరాజు... ఏఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్ ట్యాంక్ ను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి వక్తగా, రచయితగా ఆయనకు మంచి పేరు ఉంది. దశాబ్దకాలంగా రాజకీయ ప్రచారకుడిగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. నాగరాజు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి జోరందుకుంది. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్ , అమెరికా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.   

రేవంత్ కేబినెట్ విస్తరణకు వేళాయె.. చాన్స్ దక్కేదెవరికి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా  రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తొలి నుంచీ కూడా లోక్ సభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ చేపడతానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే.  రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లలకు ప్రాతినిథ్యం లేదు.  ఈ నేపథ్యంలోనే  కేబినెట్ విస్తరణలో రేవంత్ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   కేబినెట్ విస్తరణపై కూడా  మంత్రవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.    బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలకు  ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో  నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు  మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు  ఉన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి అయితే  సీఎంతో పాటు మరొక మంత్రి ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు.  ఒక సామాజికవర్గాల వారీగా చూస్తే రేవంత్ కేబినెట్ లో   ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉన్నారు.   మొత్తంగా కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా  ఇరు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న  అంశాలపైనా,   ఆగస్టు 15 లోగా చేయాల్సిన రుణమాఫీకి నిధుల సమీకరణపైనా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  అలాగే అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంపైనా,   ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపైనా కూడా కేబినెట్ చర్చిస్తుందని అంటున్నారు.   

ఓటుకు 5 వందలు పంచారు.. డిస్‌క్వాలిఫై చేయాలి!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఆంధ్రాలో హడావిడి అదిరిపోయే లెవల్లో జరిగింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా గొడవలు లేవు. రిగ్గింగులు లేవు. ఆంధ్రావాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఆంధ్రాలో అయితే పోలింగ్‌ జరిగేటప్పుడు గొడవలు.. పోలింగ్ ముగిశాక గొడవలు.. చివరికి ఫలితాలు వచ్చాక కూడా గొడవలు జరిగే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. ఆంధ్రా పరిస్థితి అలా వుంటే, అదేంటో తెలంగాణలో ఎప్పుడూ తిట్టుకునే కేసీఆర్, రేవంత్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా చప్పుడు లేకుండా వున్నారు. ఇదిలా వుంటే, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు రఘునందనరావు పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఓటుకు 5 వందల రూపాయలు పంచారని, అయిదేసి వందల చొప్పున ఎన్వలప్ కవర్లలో పెట్టి గ్రామాలకు పంపిణీ చేశారని రఘునందనరావు ఆరోపించారు. ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.  అవును, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓటుకు 5 వందలు పంచిన నేరం మీద వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలి. అరెస్టు కూడా చేయాలి. వీలైతే, ఎన్ని సెక్షన్లు కుదిరితే అన్ని సెక్షన్లతో కేసులు పెట్టి, జీవితాంతం జైల్లో వుండేలా చేయాలి. లేకపోతే ఏమిటండీ? ఓటుకు ముష్టి ఐదు వందలు ఇస్తారా? ఎంత దారుణం? ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు ఒక్కో ఓటుకు మూడు వేల దగ్గర మొదలుపెట్టి ఐదు వేల వరకు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే, తమకు రావు అనుకున్న ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి ఓటుకు పదివేలు కూడా ఇచ్చారని సమాచారం. వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చారు. ఇంత పవిత్రమైన, ఘనమైన, విలువైన ఓటుకు ముష్టి 5 వందలు ఇచ్చారంటే, ఇంతకంటే పెద్ద నేరం వుంటుందా? అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన పవిత్రమైన భారతదేశంలో ఓటును ఇంత అవమానిస్తారా? ఇంత తక్కువ చేస్తారా? రఘునందనరావు గారు ఎలాగూ లాయర్ కాబట్టి, ఈ నేరానికి బహిరంగ ఉరి వేసే అవకాశం ఏమైనా వుందా అనే విషయాన్ని పరిశీలించాలి.

బాబు లేఖతో ఆగిన ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు.  వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు. కానీ ఇంత కాలం ఆయన మాటలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. అధికారంలో ఉన్న జగన్ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ప్రజా తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. అయితే అంత వరకూ ఆగక్కర్లేకుండానే ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసిపోవడానికి రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పోలీసులు, ఎన్నికల సంఘం  పై చేస్తున్న ఆరోపణలే కారణం. అది కాకుండా.. ఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న తీరుపై చంద్రబాబు రాసిన ఒక్క లేఖ ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కు బ్రేక్ వేయడం కూడా జగన్ అధికారానికి చెల్లుచీటీ పడిపోయిందనీ, ఎన్నికల ఫలితం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఖాయమని తేలిపోయిందనీ జనం అంటున్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పేరుతో తన అక్రమ జీవోలు, విధానాలకు సంబంధించి సాక్ష్యాలను చెరిపివేయడానికి సమాయత్తమైంది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ ఆఫీస్ ను మూసివేయాలని కూడా నిర్ణయించింది. అయితే చంద్రబాబు ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను నిలిపివేయాలని, కొద్ది వారాలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పడు అంత అర్జంట్ గా అప్ గ్రడేష్ అవసరం ఏముందంటూ గవర్నర్ కు లేఖ రాశారు. ఈసీ జోక్యం చేసుకుని ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను తక్షణం నిలిపివేయాలని కోరారు. కీలక ఉత్తర్వులను మాయం చేయడం కోసమే ఈ అప్ గ్రడేష్ తంతు అని ఆరోపించారు. చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ అప్ గ్రడేష్ పేర ఈ ఆఫీస్ ను క్లోజ్ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పద్ధతిలోనే ఈ ఆఫీస్ నడవాలని ఆదేశించింది..  ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఎవరూ ఈ అప్ గ్రడేష్ వంటి  నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీలో  గత ఐదేళ్లుగా రహస్య పాలన జరిగింది. ఏ జీవోల్లో ఏముందో ఎవరికీ తెలియదు. జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా పట్టించుకోలేదు.  జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి  ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీస్‌లో ఉంటాయి. ఇప్పుడు జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతో  ఈ ఆఫీస్ ను సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మూసేసి తమ తప్పులు, అక్రమాలను చెరిపేద్దామన్న ప్రయత్నానికి చంద్రబాబు ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. 

వైసీపీ నేతలు సైలెంట్ గా సర్దేసుకుంటున్నారా?

విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఇదే జరిగింది. ఆ ట్రాప్ లో విపక్షం కూడా పడిపోయింది.  ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా వైసీపీ అలాగే చేస్తోంది. అధికారం కోల్పోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు నెమ్మదిగా రాష్ట్రం వదిలి వెళ్లిపోవడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే ఆ విషయం ఎవరూ గమనించకుండా ఉండేందుకు విజయంపై ధీమా ఒలకబోస్తూ, రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తూ విపక్ష కూటమి నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే  సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నేతలు మీడియా ముందుకు వచ్చి ముఖంలో ఇసుమంతైనా ధీమా లేకపోయినా గెలుపు తధ్యమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వారిలా మీడియా ముందుకు వచ్చి విజయంపై ప్రకటనలు గుప్పించడం వెనుక అసలు కారణం మరోటి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జూన్ 4న కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడేనాటికి పార్టీలోని కీలక నేతలంతా మూటాముల్లె సర్దుకుని రాష్ట్రం దాటేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అది జనం దృష్టికి, ముఖ్యంగా విపక్ష కూటమి నేతల దృష్టికీ వెళ్లకుండా రాష్ట్రంలో హింసాకాండను ప్రేరేపించడం, తెలుగుదేశం కూటమిపై విమర్శలు, అల్లర్లకు వారే కారణమంటూ నిందలు, చివరాఖరుగా ఎన్నికల సంఘంపై ఆరోపణలు. దీంతో విపక్ష నేతలంతా వైసీపీ ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇవ్వడంపై పెడుతున్న శ్రద్ధ తెరవేనుక వైసీపీ నేతలు ఏం చేస్తున్నారన్నది గమనించడంపై పెట్టడం లేదు. దీంతో సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ కీలక నేతలంతా మూటాముల్లె సర్దేసుకుంటున్నారు.  అలా సర్దేసుకుంటున్నవారిలో ప్రథముడు సజ్జల అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సజ్జల కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఎవరికీ కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఎవరూ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పేశారు. నెల రోజుల పాటు సెలవులు ఇచ్చామని, పూర్తిగా తీసేశామని చెబుతూ వైసీపీ సోషల్ మీడాయా వర్కర్లలో కన్ష్యూజన్ క్రికేట్ చేశారు.  నిజంగా సజ్జల మీడియా ముందుకు వచ్చి చెబుతున్నట్లుగా విజయంపై అంత నమ్మకం ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం పడదు.  ఆ సోషల్ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లరు.  ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, సజ్జల భార్గవ్‌పై ఈసీ ఆదేశాల మేరకు కేసు కూడా బుక్కౌంది.   ఒక్క సజ్జల అనే కాదు.. ఆ పార్టీ కీలక నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పిన్నెల్లి సోదరులైతే.. హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని, గన్ మెన్ లను సైతం వదిలేసి పరారైపోయారు.  ఇప్పుడు వైసీపీ కీలక నేతల దృష్టంతా తమ ఆస్తులు, వ్యాపారాలు సేఫ్ జోన్‌కు ఎలా పంపించుకోవాలన్నదానిపైనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూడబెట్టిన అక్రమాస్తుల రక్షణపైనే వైసీపీ నేతల దృష్టి ఉందని అంటున్నారు.  పెద్దిరెడ్డి వైసీపీలో క్యాష్ కింగ్‌గా పేరున్న పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అందుకు ఉదాహరణగా పెద్ది రెడ్డి అనుచరులు, అనుయాయులు అయిన పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను రాబట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఉదాహరణగా చూపుతున్నారు.   మొత్తంగా ఓట్ల లెక్కింపు వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారకుండా ఉండేలా కార్యకర్తలను, క్యాడర్ ను రెచ్చగొడుతున్నారనీ, తద్వారా  విపక్ష కూటమి నేతల దృష్టిని డైవర్ట్ చేసి, పోలీసుల దృష్టి మొత్తం హింసను అరికట్టడంపై కేంద్రీకృతమయ్యేలా చేసి.. తాము రాష్ట్రం దాటేసే యత్నాలలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆంధ్రాలో అల్లర్లపై ‘సిట్’ - వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం!!

ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి.భూషణం (గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్), రామకృష్ణ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), మోయిన్ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్ (అనంతపురం ఏసీబీ), శివప్రసాద్(ఏసీబీ ఇన్‌స్పెక్టర్) వున్నారు. ఈ ‘సిట్’ రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనుంది. 

అట్లుంటది రేవంత్‌రెడ్డితోని!!

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్లేదుగానీ, ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో, ఈ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో  చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడని అరచి గోలచేసి, తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.  ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడంటే తనకు ఎంతో గౌరవం వుందే తప్ప, రాజకీయంగా ఆయనకీ తనకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలసినప్పుడు ఓ నోటి తుత్తరగాడు ఇలా అడిగాడు.. తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు.. ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు. శిష్యుడు సహకరిస్తారా? అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం లాగా సీరియస్సయిపోయి వార్నింగ్ ఇస్తూ, ‘‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేవాడు.. శిష్యుడెవరు, గురువెవరు? నేను సహచరుడిని అని చెప్తున్నాను. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు శిష్యుడు, గురువు అని మాట్లాడితే బుడ్డిమీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన సహచరుడిని నేను. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను. నేను ఆయనకు సహచరుణ్ణి.  వారంటే అపారమైన గౌరవం వుంది ఇప్పటికి కూడా చెప్తున్నా.. అంతే తప్ప గురువు, శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాణ్ణి, కాంగ్రెస్ పార్టీ వాడిని. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను’’ అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో వున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవం గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలు ప్రయోజనాలే అన్నట్టుగా వ్యవహరించి, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ వున్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంలో ఊరట 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.  తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్‌కు ఊరట లభించింది.  

వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి... శ్రీకాకుళం ఎంపీగా కింజారపు విజయం నల్లేరు మీద బండి నడకే!

శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  

పిన్నెల్లి బ్రదర్స్ అదృశ్యం 

మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.  ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.