ప్రపంచ వింత: మల్లారెడ్డి భూమి కబ్జా!
posted on May 18, 2024 @ 1:10PM
మాజీ ఎంపీ, మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా..’ మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చని గిట్టనివారు అంటూ వుంటారు. మల్లారెడ్డికి వున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలాశాతం కబ్జాల పుణ్యమేనని కూడా అంటూ వుంటారు. అలా కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత.
కుత్బుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలోని మల్లారెడ్డికి, అతని అల్లుడు రాజశేఖరరెడ్డికి చెందిన స్థలంలో కొంతమంది బారికేడ్లు పెట్టి కబ్జా చేశారట. దాంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, వాళ్ళ అనుచరులు సదరు స్థలం దగ్గరకి వచ్చి హడావిడి చేశారు. అక్కడకి పోలీసులు కూడా రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి స్థలాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారా.. వేరేవాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారా అనేది నిలకడ మీద తెలుస్తుంది.