శకుని సజ్జల!?

మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులు అందరూ చూశారు. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిలుపైనే ఉన్నారు. సకుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవలసిన పరిస్థితి జగన్ ది. అది పక్కన పెడితే..  

2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. , వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య కూడా సానుభూతిని ప్రోది చేసి జగన్ విజయానికి దోహదపడింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన విజయం కోసం ఇల్లూ వాకిలీ వదిలి మరీ తిరిగిన సొంత చెల్లి షర్మిలను,  దూరం పెట్టారు.  షర్మిల తెలంగాణలో  సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం,  తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్లిపోవడం ఇదంతా జనానికి తెలిసిందే.  అయితే జనానికి తెలియనిది  వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది.  వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ వైఎస్ కుటుంబానికి తెలుసు. ఈ హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేయించారో కూడా  తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కని పెంచిన తల్లి కూడా జగన్ కు ఎందుకు దూరంగా జరిగారో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.  

ఆ ఇంటిగుట్లన్నీ, ప్రజలకు తెలియని ఆ కుటుంబ రహస్యాలన్నీ బయటకు వచ్చేలా చేసింది సజ్జలే. ఔను.. షర్మిల తెలంగాణలో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కూడా జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలకు దిగలేదు. అలాగే జగన్ కూడా చెల్లి షర్మిలపై నేరుగా విమర్శలు గుప్పించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై కొన్ని అనుచిత పోస్టులు కనిపించినా జనం కానీ షర్మిల కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీతోనే  విజయవాడలో పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలు పెట్టారా సీఎం జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల సున్నితంగా రిటార్డ్ ఇచ్చారు.   జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగిపోయి ఉండేది. కానీ సజ్జల ఎంటరై  చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారనీ నిందలేశారు. అక్కడితో ఆగకుండా అసలు జగన్ షర్మిలకు చేసిన అన్యాయమేంటో చెప్పాలని రెచ్చగొట్టారు. దాంతో షర్మిల ఓపెన్ అయిపోయారు.  జగన్ తనకు చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తండ్రి ఆస్తిలో వాటాను ఎలా ఎగ్గొట్టారో, ఏదో కొంత ఇచ్చి దానిని అప్పుకింద ఎలా రాయించుకున్నారో జనం కళ్లకు కట్టారు. సొంత బాబాయ్ వివేకా హత్య నిందితులను వెనకేసుకువస్తున్న సంగతీ చెప్పారు. జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ బహిరంగ వేదికలపైనే ఎండగట్టారు. కడపలో ఆమె జగన్ ప్రతిష్టను పాతాళానికి పాతేశారు. దీంతో మొత్తం వైసీపీయే డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ సజ్జలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

ఇక పోలింగ్ పూర్తయిన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఏమూలో ఉన్న గెలుపు విశ్వాసాన్ని కూడా సజ్జల ఊదేశారు. మీడియా ముందకు వచ్చి గెలుస్తామంటూ ఓ పక్క చెబుతూనే ఎన్నికల సంఘం చంద్రబాబు ఆదేశాలను పాటించిందంటూ విమర్శలు చేయడం ద్వారా  ఎన్నిలక ఫలితం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే శకుని కౌరవులకు చేసిన మేలే సజ్జల వైసీపీకి చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. శకుని కౌరవ పతనానికి కారకుడైతే.. సజ్జల వైసీపీ ఓటమికి కారకుడౌతున్నారని అంటున్నారు.