ఆంధ్రా నీరో జగన్!!

రోమ్ నగరం తగలబడి పోతుంటే అప్పటి రోమన్ కింగ్ నీరో (nero) ఏం చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రోమ్ తగలబడిపోతే తగలబడిపోనీ నాకేంటి అనుకుంటూ, చక్కగా తన రాజమందిరంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత చర్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నీరో రేంజ్‌లో మన సమాజానికి దక్కిన మరో పాలకుడు వై.ఎస్.జగన్! పోలింగ్‌ సందర్భంగా, పోలింగ్ తర్వాత వైసీపీ గూండా మూకలు భారీ స్థాయిలో దాడులు చేసి వందల మందిని గాయపరిచాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి ప్రయత్నించాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం సానుభూతిపరుల మీద, తెలుగుదేశానికి ఓటు వేశామని చెప్పినవాళ్ళ మీద దాడులు చేసి రక్తాన్ని పారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపు, ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో రక్తపాతం ఇంకా జరిగే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా జగన్ ఎంతమాత్రం స్పందించలేదు. దారుణాలు ఆపే ప్రయత్నాలు చేయలేదు. తీవ్రంగా గాయపడిన అనేకమందిని పరామర్శించే సంగతి అటుంచి, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఇలాంటి అల్లర్లను ఆపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేదు.. ఎంచక్కా తనంతట తాను విహారయాత్రలు చేయడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.

భారత ఆసియా దేశాల వారధిగా బౌద్ద పర్యాటకం

ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు  మల్లేపల్లి లక్ష్మయ్య పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు  ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని  మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.  తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు  బుద్ద వనాన్ని  ఆసియాదేశాలకు పరిచయం  చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు.  ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను  వివరిస్తూ  ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు.  స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి  భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ )  నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. 

హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ వర్షం

నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది.  హైదరాబాద్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు. . గత కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు గడిచిన గంట సేపట్లో 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు

వివేకా హత్యపై కడప కోర్టు ఆర్డర్ పై సుప్రీం స్టే

వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కడప కోర్టు ప్రస్తావించిన విపక్షాల నేతలలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి,  జనసేన అధినేత పవన్ కల్యాణ్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి తదితరులు ఉన్నారు. వీరెవరూ కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వివేకా హత్య కేసు గురించి మాట్లాడకూడదంటూ కడప కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   సుప్రీం కోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ షర్మిల పిటిషన్ ను విచారించి కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప కోర్టు న్యాయమూర్తి కనీసం డిఫెండెంట్ల వాదనను కూడా వినకుండా తీర్పు వెలువరించిందని పేర్కొంది. కడప కోర్టు మేజిస్ట్రేట్ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేదిగా ఉందని వ్యాఖ్యానించింది. డిఫెండెంట్ల వాదన వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం,  కేసు విచారణను వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది.  

సీపీఆర్‌తో నడిరోడ్డుపై ప్రాణాలు కాపాడిన లేడీ డాక్టర్!

మీ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ వుంటారు. ఇంతలో ఒక ఫ్యామిలీ మెంబర్ అచేతనంగా పడిపోతారు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు.. అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆఫీసులో వుంటారు.. మీ కొలీగ్ ఒకరు ఉన్నట్టుండి స్పృహ కోల్పోతారు అప్పుడు మీరేం చేస్తారు? వేరే ఎవరో కాదు.. మీరే అనుకోండి.. ఉన్నట్టుండి దబ్బుమని కింద పడిపోతారు.. అప్పుడు మీ ఇంట్లోవారు గానీ, ఆఫీసులో వాళ్ళు గానీ ఏం చేయాలి? మీ ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలి? ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోసే సంజీవని సీపీఆర్ (Cardio pulmonary resuscitation - CPR). కార్డియో పల్మోనరీ రీససిటేషన్‌ని షార్ట్ కట్‌లో సీపీఆర్ అని పిలుస్తారు. ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినా, కార్డియాక్ అరెస్టు అయినా, ఏదైనా గొంతుకు అడ్డం పడినా, కరెంట్ షాక్‌కి గురై అచేతనంగా పడిపోయినా, నీటిలో మునిగిపోయినా, ఊపిరి అందకపోయినా, డ్రగ్స్ ఓవర్ డోస్ అయినా... ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ చేయడం వల్ల అచేతనంగా పడిపోయిన వ్యక్తులు మళ్ళీ ప్రాణాలతో బతికి బయటపడతారు. శ్వాస ఆడేలా చేయడం, ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టుకునేలా చేయడం సీపీఆర్ ద్వారా జరిగి జీవితాలు నిలబడతాయి. సీపీఆర్ వల్ల ప్రాణాలు నిలబడతాయని తెలిసినా చాలామంది సీపీఆర్ చేయడం నేర్చుకోరు. జనానికి సీపీఆర్ మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. ఎవరైనా అచేతనంగా పడిపోతే చుట్టూ వున్నవారు హడావిడి పడిపోవడమో, అంబులెన్స్.ని పిలవటమో, ఆస్పత్రికి తరలించడమే చేస్తారు తప్ప సీపీఆర్ చేయాలన్న ఆలోచన చాలామందికి రావడం లేదు. దాని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి. విజయవాడలోని అయ్యప్ప నగర్ ప్రాంతంలో సాయి అనే ఆరేళ్ళ బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు సాయిని తీసుకుని డాక్టర్ దగ్గరకి వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్న వీళ్ళని డాక్టర్ రవళి చూశారు. వాళ్ళని ఆపారు. ఆ బాలుడికి అక్కడే సీపీఆర్ చేశారు. దాంతో సాయి ప్రాణాలు దక్కించుకున్నారు. సమయానికి అక్కడకి వచ్చి, సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ రవళికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. అందుకే అందరూ సీపీఆర్ నేర్చుకోవాలి. ఆపదలో వున్నవారినిని కాపాడాలి.

ఎన్నికలవ్వగానే వీసారెడ్డి మాయం.. విషయమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు  జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది. అయితే  అధికార వైసీపీకి చెందిన కీలక నేతలు పోలింగ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, రోజా వంటి వారైతే ఒక వైపు పోలింగ్ జరుగుతుండగానే.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ మీడియా ముందుకు రావడం వంటివి చూస్తుంటే ఆ పార్టీ ఫలితాలకు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్, ఆళ్లనాని వంటి కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్యాడర్ కు చేసిన సూచనలను బట్టి వైసీపీ సీన్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ కు వీడ్కోలు పలుకుతూ చేసిన ప్రసంగంలో విజయంపై వ్యక్తం చేసిన ధీమా అతి విశ్వాసాన్ని మించి ఉండి ఓటమినే ధ్వనించింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నేత ఇలా పోలింగ్ అయ్యిందో లేదో అలా అజ్ణానంలోకి వెళ్లిపోయిన విషయంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయిన దానికీ కాని దానికీ మీడియాముందుకు వచ్చో, లేదా సామాజిక మాధ్యమ వేదికల ద్వారానో ఆత్మస్థుతి, పరనిందలలో చెలరేగిపోయే ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి మే 13 తరువాత నుంచీ బయట ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ నాలుగు రోజులలో ఆయన సోషల్ మీడియాలో నెల్లూరులో తనకు ప్రచారంలో సహకరించిన  క్యాడర్ కు నేతలకు కృతజ్ణతలు తెలపడం మినహా.. పోలింగ్ సరళి గురించి కానీ, రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై కానీ స్పందించిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి ఈ సారి తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడ్డారు. ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ అధినేత మాత్రం ఆయనను విశాఖ నుంచి కాకుండా నెల్లూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. మూడేళ్ల పాటు విశాఖలో అన్నీ తానై వ్యవహరించిన విజయసాయిని అత్యంత అవమానకరంగా విశాఖ నుంచి పక్కకు తప్పించి అక్కడి బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించిన సంగతి తెలసిందే. నెల్లూరు ఎంపీ టికెట్ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే విజయసాయికి ఇచ్చారు జగన్ నెల్లూరులో వైసీపీ కీలక నేత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరి, ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో జగన్ కు వేరే దారి లేక విజయసాయిని నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. వాస్తవానికి విజయసాయిరెడ్డికి నెల్లూరు నుంచి పోటీ చేయడం సుతరామూ ఇష్టం లేదు. నెల్లూరు ఆయన స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలు, నియోజకవర్గం కోసం ఆయన చేసిన పనీ రెండూ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఎదురీదిన విజయసాయికి ప్రచారం సమయంలోనే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తన ప్రచారం కోసం సమీకరించిన జనాలు వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కు పోతుండటంతో మైకుల్లోనే వారిని వెళ్లిపోవద్దంటూ బతిమలాడుకుంటున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అది పక్కన పెడితే పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా విజయసాయిరెడ్డి మౌనముద్ర దాల్చడమే కాదు, ఎవరికీ అందుబాటులోకి కూడా రాలేదు. ఓ వైపు వైసీపీ కీలక నేతలు విజయంపై  ధీమా వ్యక్తం చేస్తూనో, పోలింగ్ తీరు పట్ల అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూనో మీడియా ముందుకు వస్తుంటే.. పార్టీకి మౌత్ పీస్ అన్నట్లుగా ఇంత కాలం వెలిగిపోయిన విజయసాయి రెడ్డి మౌనం, బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక నెల్లూరులో ఆయన ప్రచారం అంతా దాదాపు చేతులెత్తేసినట్లుగానే సాగింది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరిన తరువాత నియోజకవర్గంలో పోరు ఏకపక్షమైపోయింది. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో వైసీపీ బాగా బలహీనపడింది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని విజయసాయి రెడ్డి అజ్ణాతవాసానికి ఫలితం వెలువడడానికి ముందే ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తీహార్ జైల్లో కవితను పరామర్శించిన ఆర్ఎస్ , బాల్క

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు. కవిత అన్న కెటీఆర్, బావ హరీష్ రావు తప్పితే బిఆర్ఎస్ అగ్రనేతలు కూడా కలవడం లేదు. కన్న కూతురు జైల్లో ఉన్నప్పటికీ తండ్రి కెసీఆర్ ఇంత వరకు పరామర్శించకపోవడం గమనార్హం. అయితే ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నాగర్‌ కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్‌ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ తయారీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ లోనే ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ సైతం ఆమెను సాంకేతికంగా అరెస్టు చేసినట్లు చూపింది. మరోవైపు బెయిల్‌ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ ట్రయల్ కోర్టు కొట్టేసింది. బెయిల్ పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ, సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది.

వైసీపీ అభ్యర్థి మహా మంచి పొరపాటు!

ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి. లేటెస్టుగా అలాంటి మంచి పొరపాటు చేసే అవకాశం కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డికి వచ్చింది. ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారం చేసిన ఆయన, పోలింగ్ రోజున తన ఓటు వేయడానికి వెళ్ళారు. ఓటు వేయడానికి వెళ్ళిన ఆయన చక్కగా ఓటేసి రావచ్చు కదా.. ఈయన అలా చేయకుండా పోలింగ్ బూత్‌ దగ్గర వున్న పోలింగ్ సిబ్బందికి బిల్డప్‌గా అభివాదం చేశారు. ఆ అభివాదాల గోలలో పడి,  ఈవీఎం మీద వున్న ఫ్యాన్ గుర్తు ముందువున్న బటన్ నొక్కకుండా, సైకిల్ గుర్తు ముందు వున్న బటన్ నొక్కేశారు. దాంతో ఈయన గారి ఓటు వైసీపీ ఎంపీ అభ్యర్థికి పడకుండా నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పడింది. బటన్ నొక్కిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన వెంటనే పోలింగ్ సిబ్బందికి ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు పోలింగ్ సిబ్బంది ఇక చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టి, ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని బబ్బోమని చెప్పారు. ఇలాంటి పొరపాటు చేశానేంట్రా దేవుడా అనుకుంటూ ప్రతాప్ రెడ్డి పోలింగ్ స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ప్రతాప్ రెడ్డి పొరపాటు చేసినప్పటికీ, టీడీపీకి ఓటు వేయడం మంచి పనేగా?

ఎన్నికలైపోయాయి.. సొమ్ములు కరిగిపోయాయి.. బటన్ నొక్కిన డబ్బుల జాడేదీ?!

ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు. రాష్ట్రంలోని బ్యాంకులను గత శనివారం (మే 11) రెండో శనివారమైనా సరే తెరిచి ఉంచాలని హుకుం జారీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సొమ్ము పంపిణీకి ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల సంఘం కొర్రీ వేయడంతో సొమ్ముల పంపిణీ ఆగింది.   దీంతో లబ్ధిదారులమంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. బటన్ నొక్కి నెలలైనా సొమ్ములు పడకపోయినా ప్రశ్నించని ఈ లబ్ధిదారలు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్నదెవరో ఊహకి అందని విషయం కాదు. నాటకీయ పరిణామాల మధ్య గతంలో నొక్కిన బటన్లకు సంబంధించిన సొమ్మును పోలింగ్ పూర్తి అయిన మరునాడు మే 14న లబ్ధాదారుల ఖాతాలలో జమచేయాలని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు జమచేయడానికి ఎక్కడ లేని తొందరా ప్రదర్శించిన సర్కార్, మరీ ముఖ్యంగా సీఎస్.. పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఆ ఊసే మరచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు.  అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరగడంతో  ఫీజు రీఎంబర్స్ మెంట్…  ఆసరా పథకం డబ్బులు  కొంత మేరకు మాత్రమే జమ చేశారు. కొంత మేర అంటే మొత్తం జమ చేయాల్సిన సొమ్ములలో ఓ పది శాతం విదిల్చినట్లుగా లబ్థిదారుల ఖాతాలలో జమ చేశారు. లబ్ధిదారులకు పంచాల్సిన సొమ్ములు అడ్డదారుల్లో అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లింపులుగా మరళిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసి లబ్ధిపొందుదామని తహతహలాడిన జగన్ అది కుదరకపోయేసరికి లబ్ధిదారుల పట్ల ఆయన ‘నిజమైన ప్రేమ’ ప్రదర్శించారు. వారికి ఇవ్వాల్సిన సొమ్ములకు ఎగనామం పెట్టేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు పందేరం చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 

మోడీకి ‘ఆశ కురుపులు’ వస్తాయేమో!

మనం చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ‘ఆశ కురుపులు’ వస్తాయని అనుకునేవాళ్ళం. అంటే, ఎవరికైనా ఏదైనా ఇస్తామని చెబితే కచ్చితంగా ఇచ్చేయాలి. లేకపోతే కంటి మీద  ఒక స్పెషల్ కురుపులు వస్తాయి. వాటిని ‘ఆశ కురుపులు’ అంటారు.  ఇప్పుడు ఇలాంటి ‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల బ్లాక్ మనీ బోలెడంత వుందని, దాన్ని ఇండియాకి పట్టుకొస్తానని, అలా తెచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని చెప్పారు. ఆ తర్వాత వెంటనే పేదలందరి పేరు మీద ‘జనధన్’ పేరుతో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు. దాంతో పేదలందరూ మోడీకి ఓటేశారు. మోడీ తమ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారని ఆశగా ఎదురుచూశారు. పాపం మన దేశంలో జనం అంతేకదా.. ఎవరు ఏది ఇస్తామన్నా వద్దనరు.. ఆశలు పెంచుకుంటారు. ఎవరు ఏమిస్తారా.. తీసుకుందామా అని వెయ్యి కళ్ళతో, చాచిన చేతులతో ఎదురు చూస్తారు. అలా పదిహేను లక్షల కోసం ఆశలు పెట్టుకున్న జనం నిరాశకు గురయ్యారు. మోడీ స్విట్జర్లాండ్ నుంచి డబ్బు తెచ్చిందీ లేదు.. పేదల బ్యాంక్ అకౌంట్లలో వేసిందీ లేదు. అలాగే 2019 ఎన్నికలప్పుడు రైతు ఆదాయం రెట్టింపు చేస్తాననే హామీ ద్వారా రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి, ఆ తర్వాత రైతులను భూమ్మీదే వుంచారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వచ్చాయి. మోడీ గారు మరోసారి పేద జనాలకు సరికొత్త ఆశ పెడుతున్నారు. అవినీతి కేసుల విచారణ సందర్భంగా ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తాన్నీ పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు మోడీ చెబుతున్నారు. ‘‘కొందరు వ్యక్తులు అధికార బలంతో, తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా పేదలకు చెందాలని కోరుకుంటున్నాను. ఈ డబ్బంతా పేదలకు పంచడం కోసం ఏంచేయాలనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయబృందాన్ని ఇప్పటికే కోరాను. దీనికోసం చట్టాలను  మార్చడానికి కూడా వెనుకాడను’’ అని మోడీ అంటున్నారు. ఇలా పేదలకు ఆశల మీద ఆశలు పెడుతున్న మోడీ వాటిని ఈసారైనా నెరవేరుస్తారా? లేకపోతే ఆయనకు ‘ఆశ కురుపులు’ రావడం ఖాయం!

భూ వివాదంలో హైకోర్టు నాశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ 

 ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా  గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆ కిలాడి గీత లక్ష్మీ. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే  డిఆర్టి  లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది.

 ఫ్రస్టేషన్ లో వైసీపీ...  ప్రకాశంలో ఓటరు  చెవి కోసేసిన వైనం 

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది.   ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. బాధితులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు... పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలే వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను వివరించాడు. ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారింది. మూడు నెలల క్రితం గసగసాల గడ్డితో తయా చేసిన గడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గడ్డి సేవిస్తే మంచి కిక్ వస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చర్చనీయాంశమైంది.  

జగన్.. గాయమంటే ఇదీ.. గులకరాయి దెబ్బ కాదు!

ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి  ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే  మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో. ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ  జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా  ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై   అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా  ఆసుపత్రికి పరుగులు తీయకుండా  పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 

అమెరికాలో ‘వన్ చిప్ ఛాలెంజ్’ మెంటల్!

మామూలుగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వుంటాయి. కానీ, కొంతమంది అనంతకోటి దరిద్రాల కోసం శతకోటి ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ జనరేషన్ యూత్ ఇలా ఆలోచించే వాళ్ళలో ముందుంటారు. ముఖ్యంగా అమెరికన్ యూత్ అయితే ఏ మెంటల్ పని చేయడానికైనా రెడీగా వుంటారు. అలా ఇప్పుడు అమెరికన్ కుర్రోళ్ళు చేస్తున్న ఒక మెంటల్ పని ‘వన్ చిప్ ఛాలెంజ్’. అసలేంటీ ‘వన్ చిప్ ఛాలెంజ్’. మన టీవీ షోలలో అప్పుడప్పుడు మిరపకాయలను తినే పోటీలు వుంటాయి చూశారా అలాంటి పోటీనే. కాకపోతే మిరపకాయల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఘాటు వున్న చిప్ తినే పోటీ. పాఖీ అనే చిప్స్ తయారు చేసే సంస్థ అత్యంత ఘాటుగా వుండే పదార్థాలతో ఒక చిప్ తయారు చేస్తూ వుంటుంది. దాన్ని శవపేటిక ఆకారంలో వుంటే ఒక ప్యాక్‌లో వుంచుతుంది. ఈ సంస్థ అమెరికన్ యూత్‌కి ఒక ఛాలెంజ్ చేసింది. తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవాళ్ళని నోరు మండిపోవడం తప్ప వచ్చేదీ చచ్చేదీ ఏమీ వుండదు. అయినప్పటికీ అమెరికన్ వెర్రి యూత్ ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. తమ ఫోన్లలో వీడియో కెమెరా ఆన్ చేసుకుని, బ్యాక్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని చిప్ తింటూ వుంటారు. ఐదు క్షణాలు కౌంట్ డౌన్ అయ్యే వరకూ ఆ చిప్ ధాటికి కుయ్యో మొర్రో అంటారు. ఐదు క్షణాలు దాటిన తర్వాత ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఎక్స్.ప్రెషన్ ఇస్తారు. ఇదీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ వ్యవహారం.  ఈ దిక్కుమాలిన ఛాలెంజ్‌లో కుర్ర సన్నాసులతోపాటు అమెరికాలో వున్న సెలబ్రిటీస్ కూడా పాల్గొనడంలో ఇది బాగా పాపులర్ అయిపో్యింది. వన్ చిప్ ఛాలెంజ్ చేయనివాడు యూత్ కాదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ఛాలెంజ్ అంత ఈజీగా వుండదు. ఆ దిక్కుమాలిన చిప్ తినగానే నోరు మండిపోతుంది. ఐదు క్షణాలపాటు కూడా భరించలేనంత మండిపోతుంది. ఐదు క్షణాలపాటు అలాగే వున్నవారి సంగతి అలా వుంచితే, చిప్ తినగానే భళ్ళున వాంతులు చేసుకున్నవాళ్ళు, కళ్ళుతిరిగి పడిపోయినవాళ్ళు, నోరు మండిపోయి చాలారోజులు ఏమీ తినలేక తంటాలుపడిన వాళ్ళు కోకొల్లలు.  సరే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని ఊరుకోవచ్చు. కానీ, 2023 సెప్టెంబర్లో ఒక ఘోరం జరిగింది. ఈ వన్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వొలోబా అనే కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రమైన ఘాటు వల్ల అతని గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో పాఖీ కంపెనీని అందరూ తిట్టిపోయడంతో ఈ కంపెనీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్‌’ని ఉపసంహరించుకుంది. మార్కెట్లో వున్న తమ కంపెనీ చిప్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించింది. అయితే, ఈ చిప్స్ స్టాక్‌ని చాలామంది వెనక్కి ఇవ్వలేదు. సీక్రెట్‌గా అమ్మకాలు జరుగుతూనే వున్నాయి. ‘వన్ చిప్ ఛాలెంజ్’ వీడియోలు వస్తూనే వున్నాయి. ఈ దారుణమైన ఛాలెంజ్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారో అని అమెరికా పేరెంట్స్ భయపడుతున్నారు. యూత్‌కి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.

బొత్సకి కూడా నమ్మకం లేదు!

ఏపీలో టీడీపీ విజయం ఫిక్సయిపోయింది. ఏపీలో దారిన పోయే దానయ్యని ఆపి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటావ్ అని అడిగితే, ఆ దానయ్య ఎగాదిగా చూసి ‘టీడీపీ రాబోతోందని ఇంకా అర్థం కాలేదా’ అని అంటాడు. మరి పామరులకే అసలు విషయం అర్థమైపోయినప్పుడు వైసీపీ నాయకులకు అర్థం కాకుండా వుంటుందా? అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు, బిల్డప్పులు ఫలితాలు వచ్చే వరకూ ప్రదర్శించాలి కదా. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆ పనిలోనే బిజీగా వున్నారు. మేమే గెలుస్తున్నాం అని వాళ్ళు చెబుతున్నారు. అయితే, ఆ గొంతుల్లో నమ్మకం ధ్వనించడం లేదు. సోషల్ మీడియాలో ఈమధ్య ఒక పాయింట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని.. ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని ఆపద్ధర్మ మంత్రి బొత్స సత్యనారాయణ  నేను కూడా వున్నా అంటూ రంగంలోకి దిగారు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని ఆశిస్తున్నానని, ఈనె 9న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు. మొన్నామధ్య జగన్ పబ్లిక్ మీటింగ్‌లో బొత్స తన తండ్రి లాంటి వాడు అని అన్నప్పటి నుంచి బొత్స ఎమోషనల్‌గా ఫీలైపోతున్నట్టున్నారు. అందుకే, మిగతా మంత్రులందరూ విజయం మీద మాట్లాడే శక్తి లేక నవ డాష్‌లూ మూసుకుని కూర్చుంటే, బొత్స మాత్రం బయటకి వచ్చి ‘గెలుస్తామని ఆశిస్తున్నాను’ లాంటి బలహీన స్టేట్‌‌మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్‌మెంట్ వల్ల వైసీపీకి లాభం జరగకపోగా, మరింత నష్టం జరిగింది. పోలింగ్‌కి ముందు రోజు మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మన బొత్స గారిని మామూలుగా తిట్టలేదు. బొత్సలాంటి వాళ్ళ వల్లే జగన్ పూర్తిగా నాశనమయ్యాడని చెప్పారు. కరెక్టే... ‘గెలుస్తామని ఆశిస్తున్నాను.. ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను’ అని స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి? వైసీపీని మరింత నాశనం చేయడానికి కాకపోతే!?

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలే వర్షాలు 

నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.   దీంతో తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణశాఖ. రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో ఐదు రోజులపాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

సీఎస్ ను మారిస్తేనే సజావుగా కౌంటింగ్.. ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో  ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై  సీఈసీ  సీరియస్ అయింది.  సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు. అయితే వారి వివరణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఒకింత సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.  అనంతపురం,తిరుపతి,పల్నాడు మూడు జిల్లాల్లో 12మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  తిరుపతి ఎస్పీని బదిలీ  చేసింది.పల్నాడు కలెక్టర్ నూ బదిలీ చేసింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ, సిట్ ఏర్పాటు చేసి అల్లర్లకు కారణమైన వారిపై విచారణకు ఆదేశించి  48 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు రాష్ట్రంలో కౌంటింగ్ పూర్తి అయిన తరువాత 15రోజుల వరకూ ఉండేలా పారామిలిటరీ దళాలను ఏపీకి తరలించాలని సీఈసీ ఆదేశించింది. అయతే సీఎస్, డీజీపీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి కింది అధికారులపై వేటు వేసి ఊరుకుందా? అనే చర్చ రాష్ట్రంలో  మొదలైంది.  ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండకు ఎన్నికల్లో ఓడిపోతారనే దుగ్ధతో ప్రత్యర్ధులపై   వైసీపీ నాయకులు, మూకలు కారణమనీ, పోలీసులు, అధికారులు ఈ హింసాకాండను, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు టార్గెట్ గా జరిగిన దాడులను చోద్యం చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే అని కాదు, తమకు ఓటు వేయలేదని భావించిన  ఓటర్లపై కూడా దాడులు జరిగాయి. ‘పైవారి’ ఆదేశాల మేరకే చేష్టలుడిగి ఉండిపోయామని స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో కొందరు పోలీసులే చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారు చెప్పే ‘పైవారు’ ఎవరన్నది ఊహించడం పెద్ద  కష్టం కూడా కాదు.   పోలింగ్ సరళితో.. స్వయంగా వైసీపీ అంతర్గతంగా నిర్వహించుకున్న సమీక్షలో, అలాగే ఐప్యాక్ నివేదికలో పార్టీ ఓటమి ఖాయమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు  వైసీపీ అధినాయకత్వం మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటంటే  ఓట్ల లెక్కింపు జరిగే వరకైనా పార్టీ నేతలు, క్యాడర్ ను కాపాడుకోవడం, ఇప్పుడే చేతులెత్తేస్తే కౌంటింగ్ కేంద్రాలలో కూర్చోవడానికి కూడా ఏజెంట్లు దొరకరన్న భయం. అందుకే కౌంటింగ్ జరిగే వరకూ వైసీపీ నాయకులను, శ్రేణులలో విజయం సాధిస్తున్నామన్న విశ్వాసాన్ని నిలిపి ఉంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఏకంగా గత ఎన్నికలలో కంటే అధిక స్థానాలు సాధిస్తున్నామంటూ ప్రకటించారు. సొంత పార్టీ నేతలే ఆ మాటలు నమ్మడం లేదు. బొత్స వంటి సీనియర్ నాయకులు కూడా విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. అయితే వారి ప్రకటనలు పార్టీలో పెద్దగా జోష్ నింపలేదు. ఎందుకంటే అంతకంటే ముందే సజ్జల, అనీల్ కమార్ యాదవ్, రోజా,  అంబటి రాంబాబు,  కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు పార్టీ ఓటమి తథ్యమని పరోక్షంగా సంకేతాలిచ్చేశారు. అనవసరంగా బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు చెప్పారు. ఈ పరిస్థితుల్లో క్యాడర్ ను ఎంగేజ్ చేయాలంటూ కౌంటింగ్ వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగేలా చేయడం వినా మరో మార్గం లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వైసీపీ మూకలను రెచ్చగొడుతున్నారు. ఉద్రిక్తతలు చల్లారకుండా దాడులను ప్రేరేపిస్తున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈసీ పర్యవేక్షణలో అధికారులు తమ బాధ్యతను గుర్తెరిగి ఎలాంటి అభిమానం దురభిమానాలకు దూరంగా శాంతిభద్రతలు కాపాడాలి. అయితే రాష్ట్రంలో కొందరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లనే పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తరువాత కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఏపీ విషయంలో సీరియస్ యాక్షన్ కు దిగింది.  కౌంటింగ్ సందర్భంగా అధికార యంత్రాంగం  నిష్పాక్షికంగా వ్యవహరించాలంటే సీఎస్ ను మార్చాల్సిన అవసరం ఉందని విపక్ష తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తున్నది. మరి రానున్న ఒకటి రెండు రోజులలో ఈసీ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాల్సి ఉంది. 

టీడీపీకే ఓటు వేస్తామంటే చావగొట్టారు

ఎన్నికల పోలింగ్‌కి ముందు, పోలింగ్ తర్వాత వైసీపీ గూండాలు చేస్తున్న దారుణాలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే వున్నామా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానాలు కూడా ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. జరక్కూడని దారుణాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా వైసీపీ అనుకూల పోలీస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. ఈ బదిలీలు జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలవా? తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్న కోపంతో వైసీపీ గూండాలు బుధవారం నాడు ఒక కుటుంబం మీద దాడి చేసి దారుణంగా గాయపరిచాయి. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ దారుణం జరిగింది. సుంకర ధనలక్ష్మి అనే మహిళ ఇంటికి పోలింగ్‌కి ముందు బొగ్గు శ్రీను నాయకత్వంలోని వైసీపీ గూండాలు వచ్చారు. వైసీపీకే ఓటు వేయాలని చెబుతూ డబ్బు ఇవ్వబోయారు. అయితే, ఆమె తమకు డబ్బు వద్దని, తాము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామని చెప్పారు. అయితే మీ సంగతి ఎన్నికల తర్వాత చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయిన లోకేష్, భాస్కర్, సాయి అనే వైసీపీ గూండాలు పోలింగ్ ముగిసిన తర్వాత ధనలక్ష్మి ఇంటి మీద దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో వున్న ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠలపై దాడి చేసి రాడ్లతో తలమీద, ఒళ్ళంతా కొట్టారు. దాంతో వాళ్ళు రక్తసిక్తం అయిపోయారు. ఇంట్లోనే వున్న రమ్య అనే గర్భిణిని తాను గర్భిణిని అని చెబుతున్నా వినకుండా కడుపు మీద కొట్టారు. తెలుగుదేశం నాయకులు ఆందోళన చేయడంతో వీరిలో ఒక నిందితుడు లోకేష్‌ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.