ఆంధ్రా కాంగ్రెస్‌కు ఓ ఆశాకిరణం!

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి! చరిత్రలో ఇలా శాశ్వతంగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు మాజీ సీఎం! విభజన సమయంలో ఆయన ఒక విధంగా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. కాకపోతే, ఒకవైపు తెలంగాణ జనం ఆయనని సమైక్యవాదిగా చూశారు. ఆంద్రా జనం విభజన అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీఎంగా చూశారు. ఇలా రెండు వైపులా డ్యామేజ్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్! అందుకే, గత నాలుగేళ్లుగా నిశ్శబ్ధంగా వుండిపోయారు. అయితే, తరుముకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన మరోమారు యాక్టివ్ అయ్యారు. దిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లి మరోమారు తన ఓల్డ్ బాస్… రాహుల్ ని కలవనున్నారు!     కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చేరతారా? ఇప్పుడు ఇది పెద్దగా సందేహించాల్సిన పరిణామం కాదు. దాదాపు ఖరారు అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ తో భేటీ తరువాత స్వయంగా ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, కిరణ్ చేరిక కాంగ్రెస్ కు లాభమా? కాంగ్రెస్ లో చేరిక కిరణ్ కు లాభమా? ఇవే అసలు ప్రశ్నలు!     విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఆఖరుకు స్వంత పార్టీ పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు కిరణ్. ఇప్పుడు ఆ పార్టీని, సమైక్యాంధ్ర నినాదాన్ని పక్కనపెట్టి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు! కానీ, విభజన చేసిన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? ఇది సమాధానం లేని ప్రశ్నే! తెలుగుదేశం, వైసీపీల్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీ అని కూడా అన్నారు. ఇవేవీ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి దయనీయ స్థితిలో వున్న ఏపీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇందులో ఆయన గుర్తించిన లాభం ఏంటో దేవుడికే తెలియాలి!     కాంగ్రెస్‌లో చేరిక వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కనుచూపు మేరలో పెద్ద లాభాలేం లేవు. కాకపోతే, ఆయన వల్ల పార్టీకి కొంత మేర లాభమే! మాజీ సీఎంగా ఆయనకు జనంలో కొంత గుర్తింపు వుంది. అది హస్తానికి కలిసి రావచ్చు. అయితే, చిత్తూరు జిల్లా నాయకుడైన నల్లారి ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రభావం చూపే నాయకుడేం కాదు. కాబట్టి కాంగ్రెస్ కు ఆయన వల్ల కలిగే లాభం కూడా చాలా పరిమితమే! ఇలా కిరణ్, కాంగ్రెస్ ల పునః కలయిక రాజకీయంగా ఏమంత విశేషం కాదనే చెప్పాలి!     వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాహుల్ గాంధీ దళం అద్భుతాలు సృష్టించే అవకాశాలు అస్సలు కనిపించటం లేదు! బీజేపీకి ఎంత గడ్డు కాలం వుందో… అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ కు కూడా ఆంద్రాలో వుంది. కాబట్టి తెలుగుదేశం, వైసీపీల జోరులో రెండు జాతీయ పార్టీలు అల్లాడిపోవటం గ్యారెంటీగానే కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన జనసేన ఎలాగూ వుండనే వుంది! మొత్తంగా ఇంకా ఓటర్ల దృష్టిలో విభజన చేసిన పార్టీగా మచ్చ పడ్డ కాంగ్రెస్ ఇప్పుడప్పుడే తేరుకునే స్థితిలో లేదు! మరి అటువంటి పార్టీలో కిరణ్ ముందు ముందు ఏం చేయనున్నారో! 

లోకేష్ బాబు శకం మొదలైనట్టేనా?

రాజకీయాలు నది లాంటివి! ఇలా ఎందుకు అనాలి అంటే… అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలతో పాటూ పాలిటిక్స్ లోకి కొత్త నీరు వస్తూనే వుంటుంది. అచ్చం నదీ ప్రవాహంలో లాగే నిరంతరం కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ వచ్చినట్లు కనిపిస్తోంది! ప్రస్తుతం నడుస్తోన్న చంద్రబాబు శకం… 2019తో ముగిసి… లోకేష్ శకం అరంభం అవ్వనుందా? తాజా పరిణామాలు ఆ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.     లోకేష్ ఓ మీటింగ్ లో సంచలన ప్రకటన చేశారు! కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బహిరంగ సభలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది నిజానికి టీడీపీ సంప్రదాయాలకి, చంద్రబాబు స్టైల్ కి భిన్నం! బాబు తన అపార అనుభవం, ఆచితూచి వ్యవహరించే నైజం వల్ల ఎప్పుడూ ఇలాంటివి చేయరు. కానీ, యువ నేత లోకేష్ దూకుడుగా ఇటు మోహన్ రెడ్డిని, అటు బుట్టూ రేణుకని టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు.దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. తండ్రితో మాట్లాడకుండా లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేంత నిర్ణయం చేయరనే అనుకోవాలి. అయితే, ఇందులో అసలు గుర్తించాల్సిన విషయం… రానున్న కాలంలో చినబాబు పోషించబోయే పాత్ర! ఒక బహిరంగ సభలో ఇద్దరు నేతల పేర్లు లోకేష్ పేర్కొనటం పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే, టీడీపీలో చంద్రబాబు కాకుండా ఇలా అభ్యర్థుల్ని మరొకరు ప్రకటించటం అస్సలు ఊహించలేం. కానీ, లోకేష్ బాబు ఇలా ఎందుకు చేసుంటారు? ప్లాన్డ్ గానే ఇదంతా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ చినబాబుదేనని వారంటున్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా వుంటారా ? లేదా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … పార్టీ పరంగా మాత్రం రానున్న రోజుల్లో లోకేష్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టవచ్చు. ములాయం అఖిలేష్ ని, సోనియా రాహుల్ ని రంగంలోకి దించేసినట్టే చంద్రబాబు కూడా ఫుల్ టైం రెస్పాన్సిబిలిటి లోకేష్ భుజాలపైన పెట్టవచ్చు! ఇక మరికొందరు రాజకీయ పండితులైతే మరో అడుగు ముందుకేసి… దిల్లీ రాజకీయాలు మోదీకి వ్యతిరేకంగా మారితే… ఖచ్చితంగా చంద్రబాబు అక్కడ వుండాల్సి వస్తుంది. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా బాబు పాత్ర ముఖ్యంగానే వుండబోతోంది. ఆయనే ప్రధాని అవ్వటం మొదలు కూటమిని ఒక్క తాటిపై నడిపే వరకూ ఆయన ఏ బాద్యతలైనా చేపట్టాల్సి రావచ్చు. అందుకే, దేశ రాజధానిలో తన మున్ముందు ఎజెండాను దృష్టిలో పెట్టుకనే బాబు లోకేష్ ను యాక్టివేట్ చేశారంటున్నారు. వారి ఉద్దేశ్యమైతే… దేశరాజధానికి బాబు, అమరావతిలో చినబాబు అని! చూడాలి మరి… లోకేష్ దూకుడు ముందు ముందు ఎలా వుండబోతోందో!

మోదీ, చంద్రబాబుల కంటే ముందే కేసీఆర్ రెడీ అయిపోతున్నారా?

గత ఎన్నికలు 2014లో జరిగాయి. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు? 2019లో! పార్లమెంట్, తెలంగాణ, ఏపీ అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు రావటం గత కొన్ని దఫాలుగా జరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి మాత్రం పరిస్థితి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది. ఎలక్షన్స్ రేపో, మాపో అన్నట్టు వుంటోంది కేసీఆర్, మోదీల వ్యవహార శైలి! చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎండా కాలంలోనే ఎన్నికలు అంటుంటే… ప్రధాని, తెలంగాణ సీఎంలు మాత్రం ముందస్తుకు సంకేతాలు ఇస్తూ మీడియాలో కలకలం రేపుతున్నారు. కాకపోతే, ఇంత వరకూ అదికారిక స్టేట్మెంట్లు మాత్రం రాలేదు!     దేశం మొత్తం మోదీ జరపాలని భావిస్తోన్న జమిలి ఎన్నికలు, పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ముందస్తు కంటే ముందస్తు ఎన్నికలు తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నారు గులాబీ నేతలు! తాజాగా ప్రగతి భవన్ నుంచి వెళ్లిన ఫోన్ల సంగతి పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కి దాదాపు తొంభై మంది ఎమ్మెల్యేలు వున్నారు. కొందరు కార్ గుర్తుపై గెలిచిన వారు, మరి కొందరు జంప్ జిలానీలు. వీరంతా వచ్చే ఎన్నికల్లో సహజంగానే టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అందులో కొంత మందికి మొండి చేయి తప్పదని వార్త వస్తోంది. అదే కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వెన్నులో వణకు పుట్టిస్తోంది.   టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంలో వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ తాజాగా ఫోన్లు చేయటం మరింత టెన్షన్ పుట్టిస్తోందట. కొందరికి స్వయంగా గులాబీ బాస్ ఫోన్ చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వండని చెప్పారట. ముందుగా వచ్చినా, టైముకే వచ్చినా, జమిలి ఎన్నికలైనా… అన్నిటికీ రెడీగా వుండాలని సీఎం చెప్పారట. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి, ఎన్నికలకి నిధులు సమకూర్చుకుని పోరు సన్నద్ధం కావాలిన ఫోన్ కాల్స్ సారాంశమట!     కేసీఆర్ ఫోన్ చేసి మళ్లీ ఎన్నికలకి సిద్ధం అవ్వమన్న వారు హ్యాపీనే! ఫోన్లు రాని వారి పరిస్థితే అయోమయంగా మారింది. తమకు బాస్ ఫోన్ చేయలేదంటే మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచన లేదేమోనని వారు భయపడుతున్నారట. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్నది ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మనోవేదన! సహజంగానే వారు రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశాలుంటాయి. ఒకరిద్దరూ కేసీఆర్ నచ్చజెబితే ఊరుకుంటారుగానీ… సాధారణంగా ఇతర పార్టీల్లోకి జంపు చేసి అయినా పోటీలో వుంటారు. ఎందుకంటే, సాధారణ ఎన్నికలు అయిదేళ్ల దాకా మళ్లీ రావు. అందుకే, పార్టీలు, కండువాలు మార్చేసైనా సమరానికి సై అంటారు! మొత్తం మీద కేసీఆర్ పార్లమెంట్ కంటే కూడా ముందుగానే ఎన్నికలకు తెర తీస్తే పార్టీ ఫిరాయింపుల పర్వం కూడా మొదలవ్వచ్చు! అసతంతృప్తులు, రెబెల్స్ ని ఎంత మందిని తెలంగాణ ప్రతిపక్షం … కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోందో చూడాలి. అలాగే, తెలంగాణలో పర్యటనకు సిద్ధమైన అమిత్ షా కూడా ఎంత మందికి కాషాయ కండువాలు కప్పుతారో? ఏది ఏమైనా… తెలంగాణలో ఆషాధ మహంకాళీ జాతర పూర్తవ్వగానే ఎన్నికల జాతర మొదలయ్యేలా కనిపిస్తోంది!

కత్తి Vs స్వామీ… తప్పెవరిది?

ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో బాబూ గోగినేని అనే ఒక నాస్తికుడు రాముడ్ని దుర్భాషలాడాడు. నిజానికి దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తరువాత అదే విషయమై ఓ ఛానల్ చర్చ పెట్టడంతో కత్తి మహేష్ పోన్ ఇన్ లోకి వచ్చాడు. అప్పుడు ఆయన బాబూ గోగినేని రాముడ్ని అన్న మాటల్నే రిపీట్ చేశాడు. ఇది పెద్ద దుమారానికి కారణమైంది. ఇక చివరకు, ఇప్పుడది నగర బహిష్కరణల దాకా వెళ్లింది. కత్తి మహేష్, స్వామీ పరిపూర్ణానంద ఇద్దరూ భాగ్యనగరానికి దూరంగా వుండాల్సిన స్థితి ఏర్పడింది! ఈ కేసు మొత్తాన్నీ కాస్త ఓపిగ్గా విశ్లేషిస్తే బోలెడు విడ్డూరాలు కనిపిస్తాయి! అసలు సమస్య ఈ విపరీతాలే! రాముడ్ని దుర్భాషలాడటం కన్నా ఇవి ఆందోళనకరం…     బాబూ గోగినేని తన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకుని రాముడ్ని తిట్టిపోశాడు. అది కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మత పరమైన విశ్వాసాల్ని కించపర్చటం కాదు కదా! అయితే, ఆయనెక్కడో అన్న మాటలు అత్యధిక జనానికి తెల్సింది ఎలక్ట్రానిక్ మీడియా వల్ల. ఇలాంటి పెద్దగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం లేని అంశాల్ని లైవ్ లో చర్చకెందుకు పెట్టాలి? జనానికి ఏంటి లాభం? రెచ్చగొట్టడమే మీడియా ఉద్దేశమా అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. ఆ మధ్య శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా అనేక ఛానల్స్ వ్యవహరించిన తీరు ఆలోచించే వారికి ఎవరికైనా వెగటు పుట్టిస్తుంది. పెద్ద పెద్ద సామాజిక సమస్యలు వున్నప్పటికీ ఏమంత ప్రభావితం చేయని అంశాల్ని రచ్చకీడుస్తోంది మన మీడియా! దాని ఫలితమే ఈ తాజా దగుల్భాజీ వివాదం కూడా!     మీడియా ఉద్దేశ్యపూర్వకంగానో , ఉద్దేశ్యం లేకుండానో వివాదం రేపితే… ప్రభుత్వాలు కూడా అదే కోవలో స్పందిస్తున్నాయి. సమస్య జటిలం అవ్వటానికి ఇది మరో కారణం. కత్తి మహేష్ కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణం అయ్యి వుండవచ్చు. అతను అలా మాట్లాడవచ్చా లేదా అన్నది కోర్టులు నిర్ణయించాలి. కత్తి మహేష్ పై కేసులు నమోదైతే అరెస్ట్ చేయాలి. అవసరం లేదనుకుంటే అతడికి రక్షణ కల్పించి అరెస్ట్ చేయకుండా అయినా వుండాలి. ఇదేదీ చేయకుండా ప్రభుత్వం నగర బహిష్కరణ అనే కొత్త తంతు ముందుకు తీసుకు వచ్చేటప్పటికి వివాదం మరింత ముదిరింది. కత్తిని హైద్రాబాద్ నుంచి తరలించటంతో దళిత సంఘాలు, నేతలు, ఇతర అభ్యుదయవాదులు రోడ్డెక్కారు. వార్ని శాంత పరిచేందుకా అన్నట్టు ధర్మాగ్రహ దీక్ష అన్న పరిపూర్ణానందని నగరం బయటకి తరలించారు. ఇది ఇప్పుడు హిందూ సంస్థలకి కోపం తెప్పిస్తోంది. మొత్తంగా నగర బహిష్కరణల పర్యవసానం ఏంటి? వివాదంలోని ఇరు వర్గాలకి ప్రభుత్వంపై అసతంతృప్తి మిగిలింది!     కత్తి మహేష్, పరిపూర్ణానందల బహిష్కరణల వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు వున్నాయో మనకు తెలియదు కానీ… మీడియా, ప్రభుత్వం చేసిన వ్యవహారం వల్ల సమాజంలో కొన్ని వర్గాల నడుమ దూరం పెరిగిపోయింది. ఇలా కాకుండా వుంటేనే ముందు ముందు మంచిది. తెలుగు మీడియా జాతీయ, అంతర్జాతీయ మీడియాలను చూసి ఏ అంశాలు నిజంగా చర్చకు పెట్టాలో పునరాలోచించుకుంటే మంచిది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకునేటప్పుడు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తే బావుంటుంది. అంతే తప్ప జటిలం అయ్యేలా ప్రవర్తిస్తే సమాజానికి, దేశానికి మంచిది కాదు. నగర బహిష్కరణలే మార్గమైతే దేశాన్ని ఏలే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యాలు చేసే వారందర్నీ ఒక నగరం నుంచీ మరో రాష్ట్రానికి పంపించేస్తూ కాలం గడపాల్సి వుంటుంది. ప్రభుత్వాలు భావ ప్రకటనే ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించాలి. మనోభావాలు , మత విశ్వాసాలు ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వార్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు వుంచాలి. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సమాజ శ్రేయస్సుకి పని చేయటమే అంతిమంగా చెప్పదగింది… 

పవన్‌ను టార్గెట్ చేస్తోన్న టీడీపీ... జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ఇది ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ, రానున్న ఎన్నికల్లో యుద్ధం ఎవరెవరి మధ్యా అన్నది మాత్రం అంతకంతకూ స్పష్టమైపోతోంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నడుమ పోరాటం వుంటుందని అందరికీ తెలిసిందే! అయితే, పోయిన ఎన్నికల్లో సీన్ వేరుగా వుండింది. ఒకవైపు టీడీపీ, బీజేపీ, పవన్ మోహరించారు. మరోవైపు వైసీపీ, ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒంటరి పోరు చేసి బొక్క బోర్లపడ్డాయి. కానీ, అయిదేళ్లలో అంతా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి చూస్తుంటే ఏ ఒక్కరూ మరొకరితో కలిసే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అగ్ర నాయకత్వం పవన్ ను ఏమాత్రం ఊపేక్షించవద్దని తమ కింది స్థాయి నాయకులకి చెప్పటం … ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది!     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు సీఎంగా వున్న చంద్రబాబు తమకు చేతనైంది కొత్త రాష్ట్రానికి చేస్తూనే… మిగతాదంతా కేంద్రం వైఫల్యంగా జనానికి చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగారు. ఇది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగానే కలిసొచ్చే విషయం. ఆయన పై సానుభూతి , మోదీపై ఆగ్రహం జనాల్లో పెల్లుబుకవచ్చు. అయితే, వైసీపీని కాదని టీడీపీకి మళ్లీ జనం ఓటు వేస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! రోజు రోజుకు టీడీపీకి కలిసి వస్తోన్న అంశాల్లో ప్రధానమైంది… ప్రతిపక్షాల అనైక్యత! ఏ రాష్ట్రంలో అయినా, మొత్తం దేశంలో అయినా శత్రువులు విడివిడిగా పోరాడటం అధికార పక్షానికి మేలు చేస్తుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. 2014 ఎన్నికల్లో మోదీని గెలిచిపించింది, మొన్నటి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగిని గెలిపించింది అపోజిషన్ అనైక్యతే! ఇప్పుడు అదే చంద్రబాబుకు వరంగా మారేలా వుంది!     పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తన స్టాండ్ పూర్తిగా క్లియర్ చేసేశాడు. టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గతంలో కలిసి పని చేసిన బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీకి దూరంగానే వుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ యాత్రలో దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. ఇక మిగిలిన కమ్యూనిస్టుల్లో సీపీఐ పవన్ తో కలవవచ్చని ప్రచారం నడుస్తోంది. సీపీఎం సంగతి అస్సలు తెలియదు. కాంగ్రెస్ కూడా ఏపీలో ఎవరితోనూ కలిసే స్థితిలో, గతిలో లేదు! ఒంటరి పోరు చేసి ఈసారన్నా సున్నా సీట్లు తెచ్చుకోకుంటే ఆ పార్టీకి అదే పదివేలు! మరిక టీడీపీ, వైసీపీలతో కలిసేది ఎవరు? ఎవ్వరూ లేరనే చెప్పాలి!       టీడీపీ, వైసీపీ రెండు ఒంటరిగానే బరిలో దిగినప్పటికీ… జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వేటికవి సింగిల్ గా ఫైటింగ్ చేస్తే… డ్యామేజ్ జగన్ కే! ఎందుకంటే, అన్ని పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతే… ప్రధాన ప్రతిపక్షానికి లాభం అంతకంతకూ తగ్గిపోతుంది. అంటే, అంతిమంగా టీడీపీకి లాభమన్నమాటే!  బహుశా ఈ వ్యూహంతోనే పవన్ పై ఎదురు దాడికి సిద్ధం అవ్వమని టీడీపీ తన నాయకులకి, క్యాడర్ కి ఆదేశాలు ఇచ్చి వుంటుంది!

కేటీఆర్ ట్వీట్... లోకేష్ రీట్వీట్… మారుతోన్న రాజకీయం!

రాజకీయాలు మారిపోతున్నాయి. మన పాలిటిక్స్ లో పాత తరం నేతలు తమ వారసుల్ని వేగంగా దించేస్తున్నారు. కొత్త నేతల రాకతో పాలిటిక్స్ నడిచే తీరు కూడా మారుతోంది. తాజాగా ట్విట్టర్ లో తెలంగాణ సీఎం వారసుడు కేటీఆర్, ఆంధ్రా సీఎం వారసుడు లోకేష్ మధ్య జరిగిన సంభాషణ దానికే అద్దం పడుతుంది! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాలు గెలుచుకుని దేశం దృష్టిని ఆకర్షించాయి. దానిపైనే యువ నేతలిద్దరూ ట్వీట్లు పోస్టు చేశారు.   నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెబుతూనే కేటీఆర్ జస్ట్ మిస్ అన్నారు. కేవలం 0.09 శాతం తేడాతో ఫస్ట్ ర్యాంక్ మిస్సయ్యాం అన్నారు. దానికి స్పందించిన లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయన్నారు! ఇది తెలుగు ప్రజల మంచికే తప్ప ర్యాంకుల రేస్ మన మధ్య ఏం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది నిజంగా పరిణతి చెందిన సమాధానం అనే చెప్పాలి. నిజానికి కేటీఆర్ ఆంద్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెప్పటం హర్షనీయం. అంతకంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావం ధ్వనించేలా లోకేష్ స్పందించటం మరింత ఆనందదాయకం. ఈ సందర్భంగా మనం ఒక్కసారి విభజనకు ముందు పరిస్థితి గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా కూడా కేసీఆర్ పదే పదే టీడీపీని టార్గెట్ చేసేవారు. అప్పుడు తెలుగు దేశం నేతలు ఘాటుగానే ప్రతి దాడి చేసేవారు. అటువంటి స్థితి నుంచీ ఇప్పుడు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుని వెన్నుతట్టి ప్రొత్సహించుకునే స్థితికి రావటం ఖచ్చితంగా గుణాత్మక మార్పే!   ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రకటన మరో విషయం కూడా తేటతెల్లం చేసింది. విభజన ఎంత మాత్రం మంచిది కాదన్న వాదన తప్పని నిరూపించింది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు వుండగా కొత్తగా ఏర్పడ్డ మన రెండు రాష్ట్రాలే టాప్ లో వుండటం విభజన కారణంగానే! విడిపోవటం వల్ల ఏపీ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ నెంబర్ వన్ గా నిలవటం నిస్సందేహంగా గొప్ప విషయం. ఇక్కడ వాణిజ్యానికి వున్న పుష్కలమైన అవకాశాలకి ఇది సంకేతం. అలాగే, హైద్రాబాద్ లాంటి బిజినెస్ హబ్ తో సహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ సహజంగానే టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఇదంతా విభజన వల్ల సాధ్యమైందనే చెప్పాలి!   మొత్తానికి… అనేక సంక్షోభాలు, గందరగోళాల నడుమ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల ఇప్పుడు యావత్ దేశం చూపుని కట్టిపడేస్తోంది. కేసీఆర్, చంద్రబాబు శకంలో ఉప్పు, నిప్పుగా వున్న టీఆర్ఎస్, టీడీపీ ఇప్పుడు సుహృద్బావంతో మెలుగుతున్నాయి. కేటీఆర్, లోకేష్ లు మంత్రులుగా, కాబోయే ముఖ్యమంత్రులుగా కొత్త రాజకీయంతో నవశకంలోకి తీసుకెళుతున్నారు. ఇదంతా తెలుగు వారికి ఒక విధంగా సంతోషదాయకమైన పరిణామమే! 

కత్తి రాజకీయ కలలకు గండి..!!

ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవాళ్ళు.. ఇప్పుడు కొత్తగా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నగర బహిష్కరణ అవుతారు అంటున్నారు.. ఇది కత్తి మహేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కత్తి మహేష్.. ఫిలిం క్రిటిక్ గా కొందరికి పరిచయమైన మహేష్, బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యారు.. ఆ ఫేమ్ ని అలా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది.. కాని అలా ఉంటే కత్తి ఎందుకు అవుతాడు.. వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. పవన్ మీద వ్యాఖ్యలు, పవన్ ఫ్యాన్స్ తో వివాదం.. దీంతో కొన్ని రోజులు మీడియాలో నానాడు.. తరువాత మూడు వ్యాఖ్యలు ఆరు విమర్శలతో గాలి వానలో పడవ ప్రయాణంలా సాగిపోయింది మహేష్ జీవితం.. ఇదే ఉత్సహంతో ఆయన రాజకీయ రంగప్రవేశం కూడా చేయాలనుకున్నారు.. వైసీపీ తరుపున చిత్తూర్ ఎంపీగా కత్తి పోటీ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.. ఇక కత్తి రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ అనుకుంటుండగా ఆయన నోటి దూలతో సిటీ నుండి ఎగ్జిట్ అయ్యాడు. ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి, శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసాడు.. ఈ వ్యాఖ్యలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కత్తి వ్యాఖ్యలను వ్యతిరేకించాయి.. ఇప్పుడు కత్తి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు టికెట్ ఇచ్చే సాహసం ఏ పార్టీ చేయదు.. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టుగా, కత్తి మహేష్ తన రాజకీయ కలలకు తన వ్యాఖ్యలతో గండి కొట్టుకున్నాడు.

టీజీ టీడీపీని వీడుతారా..?

  తాజాగా కర్నూలు ఉస్మానియా కళాశాలలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మంత్రి లోకేష్‌ అనూహ్యంగా.. కర్నూలు పార్లమెంట్ మరియు కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు.. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి.. ఒక ఓటు మోహన్‌రెడ్డికి.. మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.. మోహన్‌రెడ్డిని శాసనభకు, బుట్టా రేణుకను లోక్‌సభకు పంపే బాధ్యత మీదే అని లోకేష్ అన్నారు.. ఇప్పుడిదే కర్నూల్ రాజకీయాల్లో చర్చకు తెరదీసింది.. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీలో చాలా గందరగోళం ఉంది.. 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు.. తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.. ఇప్పుడా అసెంబ్లీ సీటు నుంచి తన కుమారుడు టీజీ భరత్‌ను నిలబెట్టాలనుకుంటున్నారు.. కానీ వైసీపీ తరపున గెలిచిన.. ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.. అప్పటి నుంచి కర్నూలు టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది.. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి.. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి.. బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.. అయితే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది.. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.. ఎస్వీ మోహన్ రెడ్డికి రూట్ క్లియర్ చేయాడానికేనన్న ప్రచారం మొదట్లో సాగింది. అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్‌ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు.. మరి లోకేష్ తాజా ప్రకటనతో టీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.. తనయుడి భవిష్యత్తు కోసం టీడీపీని వీడతారు అనే భావన కూడా వ్యక్తమవుతోంది.. చూద్దాం ఏం జగురుతుందో.

మోడీజీ.. జమిలి ఎన్నికలు ఉన్నాయా? లేవా?

  ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.. దానిలో భాగంగానే వచ్చే లోక్‌సభతో పాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయపడుతోంది.. అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎప్పుడో ప్రకటించింది.. కానీ బీజేపీ మాత్రం జమిలి దిశగా అడుగులు వేస్తుంది.. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది.. వాటిని కాదని బీజేపీ ఏకపక్షంగా జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేయదు.. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. లా కమిషన్ కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా.. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ, సిఫార్సులు చేస్తూ వస్తోంది.. ఇప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో కొన్ని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి.. మెజారిటీ పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జమిలి ముసుగులో ముందస్తు ఎన్నికలకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు తాము అనుకూలమని స్పష్టం చేసింది.. మరోవైపు తమిళనాడు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని, ఇలాంటి ఒక ఆలోచన లా కమిషన్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఇది సమాఖ్య విధానానికి విఘాతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.. ఇక యూపీలోని సమాజ్‌వాది పార్టీ, బీహార్ లోని జేడీయూ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి.. మరో ప్రధాన పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం చాలా బలంగా తాము జమిలి విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.. వామపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.. అసలు జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ పరిధిలోనే ఉండదని, పూర్తిగా పార్లమెంట్‌కే ఆ అధికారం ఉంటుందని తెలిపాయి. 2019 ప్రారంభంలో లో పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని మోడీ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. 2024కు దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలి నిర్వహించాలనేది ఆయన ఆలోచన.. దాని ప్రకారమే ప్రస్తుతం, కసరత్తు నడుస్తోంది.. చివరిగా లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది.. మరి, కొన్ని పార్టీలకు ఇష్టంగా, కొన్ని పార్టీలకు కష్టంగా ఉన్న ఈ జమిలి ఎన్నికలను మోడీ ప్రభుత్వం కొన్ని పార్టీలను కష్టపెట్టి నిర్వహిస్తుందో లేక ఎప్పటిలానే ఎన్నికలకు వెళ్ళడానికి అంగీకరిస్తుందో చూడాలి.

పవన్ తో విడాకులు.. రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు.!!

  ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు రేణూదేశాయ్.. హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మనకి సుపరిచితురాలు.. పవన్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత.. పవన్ మరో పెళ్లి చేసుకొని ఆయన జీవితం ఆయన బ్రతుకున్నారు.. రేణూదేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఇన్నాళ్లు ఒంటరిగా బ్రతికారు.. కానీ ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు.. ఇది జీర్ణించుకోలేని కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెని సోషల్ మీడియాలో బెదిరించడం మొదలుపెట్టారు.. దాంతో భయపడిన రేణూదేశాయ్ ఆమెకి కాబోయే భర్త వివరాలు వెల్లడించలేదు.. నిశ్చితార్థం అయిన విషయం మాత్రం వెల్లడించారు.. దీంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు.. ఆమె విడాకుల తరువాత ఎవరి లైఫ్ వారికి ఉంటుంది అని ఫ్యాన్స్ కి అర్ధమయేలా చెప్పే ప్రయత్నం చేసారు..  అయినా ఫ్యాన్స్ వినలేదు.. పవన్ కూడా రేణూదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్తూ పాజిటివ్ గా పోస్ట్ చేసారు.. వారు అభిమానించే పవన్ పోస్ట్ కూడా కొందరికి పట్టలేదు.. ఆమెని అలానే బెదిరిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.. ఆమె చాలావరకు సహనంగా ఉంటూ వచ్చారు.. ఇక లాభం లేదని ఒక ఇంటర్వ్యూ ద్వారా తన మనసులో ఉన్న బాధని, కోపాన్ని బయటపెడుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్నాను.. కానీ ఇక భరించలేను అని చెప్పిన రేణూదేశాయ్.. అసలు విడాకులు కావాలన్న కోరిక ముందుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే వచ్చింది, నేనెప్పుడూ డివోర్స్ అడగలేదు అని స్పష్టం చేసారు.. పవన్ కళ్యాణ్ గారి ఫిమేల్ ఫ్యాన్స్‌ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా..  మీరే ఆయన భార్యగా వుండి.. 11 సంవత్సరాలు కాపురం చేసి.. మీకు తెలీకుండా అతడు మరొకావిడతో బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు.. పిల్లల కోసం పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. అకీరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలవడం.. అకీరాతో పాటు పవన్ కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదు.. అందుకే వద్దన్నా అని తెలిపారు.. పవన్ ఫ్యాన్స్ విమర్శలు ఆపకపోవడం వల్లే ఇలా ఇంటర్వ్యూ ద్వారా నా గురించి చెప్పుకోవాలనిపించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే 'అమ్మాయిలూ గట్టిగా వుండండి.. ప్రేమ ముఖ్యమే..  కానీ ప్రేమే జీవితం కాదు.. ఎవ్వరూ ఆ మాయలో పడొద్దు' అని అన్నారు.. ఇన్ని రోజులు సహనంగా ఉన్న రేణూదేశాయ్ ఇలా మాట్లాడటానికి ఖచ్చితంగా పవన్ ఫ్యాన్సే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.. విడాకుల తరువాత పవన్ కి ఒక జీవితం ఉన్నట్టే, రేణూదేశాయ్ కి కూడా ఒక జీవితం ఉంటుందని అర్ధం చేసుకోకుండా ఆమె మీద విమర్శలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.. అలానే పవన్ కూడా రేణుదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, రేణుదేశాయ్ ని ఇబ్బంది పెట్టొద్దని ఒక్కమాట చెప్తే ఫ్యాన్స్ ఆగేవారు కాదా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పవన్ జగన్ కలిస్తే.. బాబు గెలుపే.!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి తన అభిప్రాయాలు వ్యక్తం చేసారు.. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని పవన్ మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు.. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు.. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? అని సబ్బం ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు.. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని విమర్శించారు.. 'వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ మాకు మద్దతిస్తానని చెప్పాడని ప్రకటన చేసారు కదా' అని సబ్బం గుర్తు చేసారు.. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత.. ఏపీ ప్రజల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. అదే సమయంలో వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీని వ్యతిరేకించకపోవడాన్ని ఏపీ ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. జగన్, పవన్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబుని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని అన్నారు.. అయితే జగన్, పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే, ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది.. కానీ వైసీపీ,జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది.. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది అని సబ్బం హరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.  

జగన్ కొంప ముంచబోతున్న కాంగ్రెస్..!

విభజన అనంతరం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఊసే లేదు.. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం వచ్చింది.. చాలావరకు నేతలంతా కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలలో చేరారు.. ఇక కొందరు నేతలైతే రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.. 'రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసింది' అని విమర్శిస్తూ అప్పుడప్పుడు ఇతర పార్టీ నేతలు గుర్తు చేసుకోవడమే తప్ప, ఇంచుమించు ఏపీలో అందరూ కాంగ్రెస్ ని మర్చిపోయారు.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేదు అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.. ఏపీ లో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీతో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తోంది..  ఇప్పటికే పార్టీని వీడిన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.. రేపో మాపో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. వీరి చేరిక వల్ల 'కార్యకర్తల్లో ఉత్సహం వస్తుంది.. అలానే పార్టీని వీడిన కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది' అని అధిష్టానం భావిస్తోంది. ఉమెన్ చాందీ ఏపీలో ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అనుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఓట్లు నుంచి 50 వేల ఓట్లు సాధించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఒక్కో నియోజక వర్గంలో పదివేల ఓట్లు అంటే కాంగ్రెస్ పుంజుకున్నట్టే.. ఇంకేంటి కాంగ్రెస్ హ్యాపీ..  ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీ కొంప మునిగినట్టే అంటున్నారు విశ్లేషకులు.. విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడిన మెజారిటీ కేడర్ అంతా వైసీపీలో చేరింది.. ఇప్పుడు వైసీపీ బీజేపీకి దగ్గరవుతోంది.. ఇది జీర్ణించుకోలేని కొందరు కార్యకర్తలు,ఎస్సీలు, మైనార్టీలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నారట.. ఆ కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ లో చేరితే.. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు పదివేలు తగ్గితే.. వైసీపీ పరిస్థితి ఏంటి?.. అసలే గత ఎన్నికల్లో 5 వేలు లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పదివేల ఓట్లు సాధిస్తే, సీఎం అవ్వాలన్న జగన్ ఆశలు మీద నీళ్లు జల్లినట్టేనా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటే జగన్ కొంప మునిగేలా ఉందిగా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మహాత్మాగాంధీ పోటీ చేసిన నోట్లు పంచాల్సిందే..!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. నాయకుడు అంటే నలుగురిని నడిపించేవాడు కాదు, నలుగురికి నోట్లు పంచేవాడు అనిపిస్తుంది.. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో నాయకులు, మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రచార పత్రాలు పంచేవారు.. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పినా చెప్పకపోయినా.. ఎంతిస్తే ఓటేస్తారని అడిగి మరీ నోట్లు పంచుతున్నారు.. ప్రజలు నోట్లు తీసుకొని ఓట్లేస్తున్నారు.. తరువాత నాయకులు పని చెయ్యట్లేదు, అవినీతి పెరిగిపోయింది అంటూ బాధపడుతున్నారు.. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా నోట్లిచ్చే నాయుడు కాదు మంచి చేసే నాయుడుకి ఓటేద్దాం అనుకుంటారా?.. అబ్బే లేదు.. అదే పాత పాట.. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది?.. నోట్లు పంచే నాయకుడుది కాదు, ఆ నోట్లు తీసుకుని ఓటేసే ప్రజలది.. ప్రజలు నోట్లకి అలవాటు పడిపోయారు కాబట్టే, కొందరు మంచి నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు పంచుతున్నారు, నోట్లు పంచలేని మంచి నాయకులు సాధారణ ఓటర్లులా మిగిలిపోతున్నారు.. ఈ నిజం నాయకులకి కూడా తెల్సు.. కానీ ప్రజలకి చెప్పలేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు..  ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయి.. స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని అన్నారు.. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు.. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని, పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు.. ఇది అందరికీ తెల్సిన నిజమే.. కొందరు ఆయనలా బయటపడతారు, మిగతావారు బయటపడరు అంతే తేడా.. దేశం మారాలంటే ముందు ప్రజలు మారాలి.. ప్రజలు మారితే మంచి నాయకులు వస్తారు.. ఆటోమేటిక్ గా దేశం మారుతుంది.

మోడీ దాచిన పెద్ద రహస్యం..!!

మోడీ ప్రధాని పదవి చేపట్టి నాలుగేళ్లు దాటింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, కాంగ్రెస్ మీద విమర్శలు చేసారు.. ఇప్పటి పరిస్థితులే కాదు, ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీను కూడా గుర్తుచేస్తూ విమర్శలు చేస్తారు.. అలాంటి మోడీ దేశానికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పుని నాలుగేళ్లుగా రహస్యంగా ఉంచారట.. కాంగ్రెస్ తప్పు చేస్తే మోడీ విమర్శించకుండా నాలుగేళ్లు ఉన్నారా? నో వే అంటారా.. నిజమండి బాబూ.. ఈ విషయాన్ని స్వయంగా మోడీనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆర్థిక నిపుణుడైన వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావిస్తాం..కానీ తాను ప్రధాని కుర్చీలో కూర్చునే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని' మోడీ, అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు.. ఆర్థిక వేత్త అయిన ప్రధాని, ఆర్థిక నైపుణ్యం ఉన్న ఆర్థిక మంత్రి హయాంలో దేశం సంక్షోభంలో పడింది.. ఆ గణాంకాల్ని చూసి తాము నిర్ఘాంతపోయామని మోడీ అన్నారు.. ఎవరూ ఊహించని రీతిలో ఉన్న అంకెల్ని చూసి, వాటిని సరి చేసేందుకు ప్రయత్నించామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..ఆ  సమయంలో తమ ముందు రెండు మార్గాలున్నాయి.. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పటం.. రెండోది దెబ్బ తిన్న భారత ఆర్థిక పరిస్థితిని గుట్టుగా బాగుచేయటం.. మొదటి విధానంలో రాజకీయ లబ్థికి అవకాశం ఉంది.. రెండో విధానంలో మాత్రం అలాంటిది లేదు.. అయినప్పటికీ తాము రెండో విధానాన్నే ఎంచుకున్నామని మోడీ అన్నారు.. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం.. దేశానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మోడీ తెలిపారు. ఓ వైపు ప్రజల్లో మోడీ మీద వ్యతిరేకత మొదలవ్వడం, మరో వైపు కాంగ్రెస్ విపక్షాలన్నింటినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని చూస్తున్న తరుణంలో.. మోడీ నాలుగేళ్ళ రహస్యం ఇప్పుడు బయటపెట్టడంతో అందరు షాక్ అవుతున్నారు.. మరి మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.. అయితే మోడీ వ్యాఖ్యల పట్ల కొందరి స్పందన వేరేలా ఉంది.. కాంగ్రెస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నాలుగేళ్లకు చెప్పారు.. మరి మీరు అధికారంలోకి వచ్చాక నోట్లరద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శలు వస్తున్నాయి.. ఇక దీనికి సమాధానం ఇంకెన్నాళ్ళకి చెప్తారు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

పవన్‌పై పోటీకి నిమ్మగడ్డ సై..?

  రాజకీయ నాయకుడు ఎన్నికలు ఉన్నప్పుడే ప్రచారం చేస్తే సరిపోదు.. ఎన్నికలు లేకపోయినా ఆరోజు ఈరోజని తేడాలేకుండా ప్రతిరోజూ ప్రచారం చేసుకోవాలి.. అప్పుడే నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటాడు.. ఈ ఫార్ములాని ఇంచుమించు అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి.. అందుకే ప్రతి పార్టీ సొంతంగానో లేక అనుకూలమైన వ్యక్తులతోనో.. న్యూస్ పేపర్, ఛానల్ నడిపిస్తున్నాయి.. ఎప్పటినుండో ఉన్న పార్టీల దగ్గరనుండి ఈ మధ్య వచ్చిన పార్టీల వరకు అన్నింటికీ మీడియా విలువ బాగా తెలుసు.. జనసేనకి కూడా మీడియా విలువ తెలిసినట్టుంది.. ఆ మధ్య కొన్ని ఛానెల్స్ మీద విమర్శలు చేసిన పవన్, పార్టీ తరుపున తనకంటూ ఓ ఛానల్ ఉండాలని అనుకుంటున్నారట.. దానిలో భాగంగానే కొత్త ఛానల్ తీసుకోవాలి అనుకున్నారట..  తరువాత కొత్త ఛానల్ కంటే ఆల్రెడీ కొంత పేరున్న పాత ఛానల్ కొనడం బెటర్ అని డిసైడ్ అయ్యారట.. ఓ ఎన్నారై ఆర్థిక సాయంతో 10 టీవీ ఛానల్ కొనాలని సంప్రదింపులు కూడా జరిపారట.. ఇక 10 టీవీ జనసేన టీవీ అని ఆనందపడే లోపు, అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ తెరమీదకు వచ్చారట.. భారీమొత్తానికి ఛానల్ కొంటా అనడంతో ఛానల్ యాజమాన్యం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే, ఒక ఛానల్ కోసం 'పవన్ పై పోటీకి నిమ్మగడ్డ ప్రసాద్ సై' అన్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై కొందరి వాదన వేరేలా ఉంది.. వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయి.. అందుకే వైసీపీ సానుభాతిపరుడు నిమ్మగడ్డ, పవన్ కోసం ఛానెల్ కొంటున్నాడు అంటున్నారు.. వీటిల్లో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి.  

అరెస్ట్.. విడుదల.. మళ్ళీ రాముడి గురించి వ్యాఖ్యలు!! 

  ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్.. శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు మహేష్ ని అరెస్ట్ చేసి ఆ వ్యాఖ్యల గురించి వివరణ కోరినట్టు తెలుస్తుంది.. అదేవిధంగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి వుంటుందని చెబుతూ నోటీసులు ఇచ్చి మహేష్ ని పంపించారు. ఈ అరెస్ట్, విడుదల గురించి కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు.. 'కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి' అని పోస్ట్ చేసారు.. అంతటితో ఆగితే కత్తి మహేష్ ఎలా అవుతా? అనుకున్నారేమో.. ఇంకో పోస్ట్ పెట్టి మరోసారి విమర్శలకు, చర్చలకు తెర లేపారు.  'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువదించిన రామాయణం లో యుద్ధకాండలో రాముడు సీతనుద్దేశించి " సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు. కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవునిదగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణునిదగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది. ఆధారం: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటం. మనసు ఫౌండేషన్ ప్రచురణ. కాబట్టి, సీతను రావణునిదగ్గర కే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది'. అంటూ పోస్ట్ చేసారు.. దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. ఈ చర్చలు ఎప్పుడు ముగుస్తాయో ఏంటో.

ప్రేమిస్తే చంపేస్తారా నాన్న?

తండ్రికి కూతురంటే ఇష్టం.. కాదు కాదు ప్రాణం.. అందుకేనేమో కొందరు క్షణికావేశంలో సొంత కూతురు ప్రాణాలే తీస్తున్నారు.. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి, తన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు.. కూతురు మీద తనకున్న ప్రేమని మర్చిపోయి, తన కూతురి ప్రాణాలే తీసేస్తున్నాడు.. కూతురు మీదున్న ప్రేమని మర్చిపోయి తండ్రి యముడిలా మారడానికి కారణం.. కూతురి ప్రేమ.. అవును ప్రేమే.. ప్రేమ పలకడానికి రెండు అక్షరాలే.. కానీ అదే ప్రేమ రెండు అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తుంది. చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించిన నాన్న, ప్రేమిస్తే చంపేస్తాడని.. గుండెల మీద ఎత్తుకొని ఆడించిన నాన్న ప్రాణం తీస్తాడని..  ఏ కూతురు ఊహించదు.. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు.. కానీ తీస్తున్నాడు.. దానికి కారణం క్షణికావేశం.. అవును ఈ క్షణికావేశమే ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీసేలా చేస్తుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె చంద్రిక బీ.ఫార్మసీ చదువుతోంది.. పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామం వచ్చిన చంద్రిక, తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్తే.. ఆమె తన భర్త కోటేశ్వరరావుకి చెప్పింది.. కూతురు ప్రేమలో పడటం, ఎక్కువగా ప్రేమికుడితో ఫోన్ మాట్లాడుతుండటంతో.. కూతురు ప్రేమలో పడి తన పరువు తీస్తుంది అంటూ క్షణికావేశంలో కర్రతో బలంగా కొట్టడంతో చంద్రిక చనిపోయింది.. ఇప్పుడు కూతురు దూరమైందని బాధపడుతున్నాడు.. ఆవేశంలో కూతుర్ని దూరం చేసుకొని ఇప్పుడు కన్నీరు పెట్టుకొని ఏం లాభం.. కూతురు ప్రేమ గురించి తెలిసి ఆవేశం తెచ్చుకునే ముందు, ఒక్కసారి కూతురి మీద తనకున్న ప్రేమని గుర్తుతెచ్చుకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా, కూతురికి నాన్నంటే ప్రాణం.. దానికి ఉదాహరణే చంద్రిక సోదరి శిరీష మాటలు.. 'మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క అంటేనే ఎక్కువ ప్రేమ.. క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది.. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ శిరీష కన్నీరు పెట్టుకుంది.. చంద్రిక, శిరీష లాంటి ప్రతి ఆడపిల్ల కోరిక ఒక్కటే.. 'కూతురు ప్రేమని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు.. కానీ కూతురి మీద ప్రేమని చంపుకొని, కూతురిని చంపి సమాజం దృష్టిలో చెడ్డవాడివి కాకు నాన్న'.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం..!

  తెలంగాణ సీఎం కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసరడం తెలిసిందే.. అయితే ముందస్తు ఎన్నికల గురించి కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి కాస్త భిన్నంగా స్పందించారు.. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ సవాల్‌ హాస్యాస్పదమన్నారు.. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు ఓట్లేస్తే.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు..  కేంద్ర ప్రభుత్వం కూడా ముందుస్తు ఎన్నికలకు పోవాలని చూస్తుందని, దాని ట్రాప్ లో టీఆర్ ఎస్ పడినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.. ఒకవేళ టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే...ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందన్నారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేను కానీ అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో మాత్రం గెలుస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు..  అదే విధంగా, డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలపై స్పందించిన జానారెడ్డి.. డి శ్రీనివాస్ తనతో మాట్లాడలేదని, ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం తనకి అందలేదని అన్నారు.. అలానే, పీసీసీలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న సమాచారం లేదని.. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం నాయకులు, కార్యకర్తలు పని చేయాల్సి ఉంటుందన్నారు.. పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని స్పష్టం చేసారు.. చూద్దాం మరి జానారెడ్డి అనుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో.  

టీడీపీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  కడప ఉక్కు పరిశ్రమ కోసం ఓ వైపు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు, లేఖలు ఇలా అన్ని విధాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందించి, ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటానికి వెళ్లిన టీడీపీ ఎంపీల తీరే చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.. టీడీపీ ఎంపీలు సరదాగా దీక్ష గురించి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి లీక్ అయింది.. ఆ వీడియోలో టీడీపీ ఎంపీలు దీక్ష గురించి వెటకారం చేసారు.. జోను లేదు గీను లేదని అవంతి శ్రీనివాస్ అంటే.. నేను ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్న వారం రోజులు దీక్ష చేస్తానని మురళి మోహన్ అన్నారు.. ఈ వీడియోని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకొని దీక్షల మీద టీడీపీ చిత్తశుద్ధి ఇది అంటూ విమర్శలు చేస్తూ వీడియో షేర్ చేస్తున్నాయి.. ఈ విషయం చంద్రబాబుకి తెలిసి వెంటనే ఎంపీలతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది..  సీఎం రమేష్ ఓవైపు దీక్ష చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దని, ఛలోక్తులకు ఇది సమయం కాదని, మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించారట.. చంద్రబాబు సీరియస్‌ కావడంతో ఎంపీలు కూడా వివరణ ఇచ్చారు.. తమ మాటలను కొంతమంది వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు అన్నారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేశారని 75ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలమా అన్న మాటల్ని మాత్రం కట్ చేశారని చెప్పారట.. దీనిపై స్పందించిన బాబు, టీడీపీ చేసే పోరాటంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తుంది..  అదే విదంగా, రాష్ట్రం మొత్తం ధర్మపోరాటం వైపు చూస్తోందని.. టీడీపీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. ఒకప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారని.. ఇప్పుడు మురళీ మోహన్ మాట్నలి కట్ అండ్ పేస్ట్ చేశారని.. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారొద్దని బాబు సూచించారు.. ప్రతి క్షణం అప్రమత్తంగా, సీరియస్‌నెస్‌తో ఉండాలన్నారు బాబు.. అలానే అసలు ఆ వీడియో ఎవరు తీశారు? బయటికెలా వచ్చింది? ఎవరు ఎడిట్ చేసారో? విచారించాలని.. ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దీని వెనక ఎవరైనా ఇంటి దొంగ ఉన్నారేమో అన్న విషయం కూడా తెలిసిపోతుందని చెప్పినట్టు తెలుస్తుంది.