చేతులు కాల్చుకున్న హస్తం... ఆకులు పట్టుకుంటోంది!

ఇప్పుడు ఏపీలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఎవరు అంటే… కాంగ్రెస్ అనే సమాధానమే వస్తుంది! 2014కు ముందు తెలుగు నేలపైన హస్తం అతి కీలకమైన పార్టీ! ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితం. అదీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తిని తట్టుకుని కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ పీఠం ఎక్కటం అంత తేలిక కాదు. ఇక ఆంద్రా కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలా వుంది పరస్థితి.     గత ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సమానంగా నిలవలేకపోయింది. అందుకు ఇష్టానుసారం చేసిన రాష్ట్ర విభజన ప్రధాన కారణంగా కాగా జగన్ పెట్టిన వేరు కుంపటి చేతి పార్టీ చేయికాలేలా చేసింది! ఇప్పుడు ఎన్ని ఆకులు పట్టుకున్నా పరిస్థితిలో మార్పు కనిపించేలా లేదు. గత నాలుగేళ్ల కాలంలో కూడా ఆంద్రా కాంగ్రెస్ రోడ్డెక్కి నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేకపోయింది. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో పార్లమెంట్ నడుస్తోంటే రెడీ మేడ్ రాజకీయం మాత్రం చేస్తోంది!     కేంద్రంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో వున్న టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ టీమ్ భావించింది. ఇంత వరకూ బాగానే వున్నా… ప్రస్తుతం ఆంధ్రా జనం ప్రధానమైన కోరిక ప్రత్యేక హోదా! దానిపై తగినంతగా స్పందించలేదు రాహుల్ గాంధీ. తన సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు చివర్లో వెళ్లి మోదీని వాటేసుకుని కలకలం రేపాడు. ఆ గిమ్మక్కు తప్ప రాహుల్ ఏపీ హోదా గురించి మాట్లాడిన ఏ ఒక్క మాటా హైలైట్ కాలేదు. ఇదే కాంగ్రెస్ పట్ల ఆంధ్రా ఓటర్లకు ఏ మాత్రం నమ్మకం కలగకపోవటానికి కారణం! ఇప్పుడు ఏపి వున్న పరిస్థితికి అసలు కారణం హస్తం పార్టీనే! 2009లో రాజేసిన రాష్ట్ర విభజన వివాదం సాగదీసీ సాగదీసీ 2014లో పార్లెమంట్ తలుపులు మూసి ముగించారు! ఆ దురుసు ప్రవర్తనే ఏపీ ఓటర్లలో కసి పెంచింది. సున్నా సీట్లు వచ్చేలా చేసింది. విభజన అనివార్యమైనప్పుడు యూపీఏ పాలనలోనే ఏపీకి తగిన వరాలు ఇచ్చి , కేటాయింపులు చేయాల్సింది. అవేమీ చేయకుండా కాంగ్రెస్ అడ్డంగా నరికి అవతల పారేసింది. ఆ ఫలితం కారణంగా తెలంగాణలోనూ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. రెంటికీ చెడ్డ రేవడైంది.     2014 ఎన్నికల ఫలితాలతో కూడా ఏమీ నేర్చుకోని కాంగ్రెస్ నాలుగేళ్లు నిద్రపోయింది. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఉధృత పోరు చేస్తోంటే కాస్త క్రెడిట్ కొట్టేసే పనిలో పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ ప్రైవేట్ బిల్లు అంటూ ప్రకటన చేశారు. అలా ప్రవైట్ బిల్ పెట్టటం ద్వారా లాభం ఏంటి? అవిశ్వాస తీర్మానంలో టైంలో రాహుల్ చేత గట్టిగా ఆంధ్రాకు మద్దతు పలికించకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా లాభం ఏంటి? చివరగా, కేవీపీ లాంటి అందరూ కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటి? 2019లో యూపీఏ వస్తే ప్రత్యేక హోదాకు కృషి చేస్తాం! దీన్ని నమ్మాల్సిన అగత్యం ఆంధ్రులకు ఏముంది? 2014కు ముందు సోనియా చేతిలో న్యాయం చేసే అవకాశం వుంటేనే చేయని వారు ముందు ముందు ఎలా చేస్తారు? అసలు యూపీఏ వచ్చే అవకాశాలు ఎంత మాత్రం వున్నాయని?     మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి చేర్చుకుని , ప్రత్యేక హోదా కోసం మేమూ కృషి చేస్తున్నామని సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ కు ఈసారి కూడా ఏపీ ఓటర్ల దయా, దాక్షిణ్యాలు కష్టమే! సున్నా రాకుండా కాస్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే అద్భుతం! ఎందుకంటే, పోయిన సారి టీడీపీ, వైసీపీ, బీజేపీ మాత్రమే వుంటే… ఈసారి జనసేన కూడా వచ్చి చేరింది. ఇన్ని పార్టీల్ని కాదని జనం హస్తాన్ని తెచ్చి తమ తల మీద ఎందుకు పెట్టుకుంటారు?

ఇక బ్యాటింగ్ ఇమ్రాన్ ఖాన్‌ది! భారత్ బౌలింగ్ ఎలా చేయాలి?

ఇవాళ్ల అంతర్జాతీయ మీడియా దృష్టంతా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపైనే వుంది. అనుకున్న విధంగానే ఇమ్రాన్ ఖాన్ గెలుపు దిశగా సాగిపోయాడు. ఒకప్పుడు పాకిస్తాన్ కు క్రికెట్ వాల్డ్ కప్ సాధించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికే కెప్టెన్ అవ్వనున్నాడు. ఇంత వరకూ ఓకే. కానీ, ఇవాళ్లే మరో ముఖ్యమైన విశేషం కూడా వుంది. అదే భారత్ లో జరిగే కార్గిల్ విజయ్ దివస్! ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ లో చాలా మంది రగిలిపోతుంటారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరు! ఆర్మీకి అత్యంత ప్రియుడైన ఈ టెర్రరిస్ట్ సపోర్టర్ కాశ్మీర్ తమదేనని అడ్డంగా వాదించే టైపే! నిజానికి అందుకే ఆయనంటే పాక్ మిలటరీకి బోలెడు ఇష్టం. నవాజ్ షరీఫ్ లా కాస్తో కూస్తో కూడా రాజకీయ చాతుర్యం వున్నా వాడు కాదు ఇమ్రాన్. పూర్తిగా మిలటరీ బాస్ లు చెప్పే మాటలకు జీ హుజూర్ అనే రకం! మరిక ముందు ముందు మన దేశం ఎలా వుండాలో ప్రత్యేకించి చెప్పాలా? అలెర్ట్ గానే వుండాలి!     భారత్, పాక్ వేరు వేరు దేశాలైనా గవర్నమెంట్ మార్పు జరిగితే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరి ప్రభావం వుంటుంది. అందుకే, పాకిస్తాన్ పాలకులు ఏదో మూలన కాంగ్రెస్ పాలన దిల్లీలో వుండాలని కోరుకుంటారు. అలాగే, ఇండియాలో నేరుగా ఆర్మీ పాలన కంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం పాలన వుండాలని మనం కోరుకుంటాం. మరీ ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నవాజ్ షరీఫ్ లాంటి నేతే పాకిస్తాన్ పీఎంగా వుండాలని ఆశించింది. కానీ, అలా జరిగే సూచనలు ఎంత మాత్రం లేవు. సరిగ్గా జరిగినా, జరగకపోయినా ఎన్నికల్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని అతనే అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇమ్రాన్ ప్రధాని అంటే పాలన నేరుగా ఆర్మీనే చేస్తోందని భావించాలంటూ విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.     పాక్ లో ప్రభుత్వ మార్పు సరే… ఇండియాలో 2014లో మోదీ వచ్చినప్పటి నుంచీ పక్క దేశానికి అసహనంగానే వుంది. ఎందుకంటే, యూపీఏ సర్కార్ హయాంలో కాశ్మీర్ లోనే కాదు భారతదేశం లోపల కూడా పాక్ అరాచకాలు హాయిగా సాగాయి. మోదీ ఇతర పథకాలు, నిర్ణయాలు ఎలా వున్నా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త అద్భుతమే! ఏకంగా ముంబై మహానగరంలో ఊచకోత కోసిన పాక్ ఇప్పుడు ఒక్క బాంబు పేల్చలేకపోతోంది ఇండియాలో. కేవలం కాశ్మీర్ లో రాళ్ల దాడి వ్యూహంతో కాలం గడుపుతోంది. దానికి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మన భద్రతదళాలు ఎన్ కౌంటర్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని హతం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కాలుపెట్టి ప్రతీకారం కూడా తీర్చుకున్నారు మన జవాన్లు. ఇలాంటి పరిస్థితి వల్లే పాక్ కు భారత్ లో ధృఢమైన ప్రభుత్వం వుండటం నచ్చదు. అదీ హిందూత్వ ఎజెండాతో సాగే బీజేపీ సర్కార్ అంటే పాక్ కు మరింత కలవరం.     2014 నుంచీ పాకిస్తాన్ కు మోదీ సర్కార్ మీద మంటగా వున్నా నవాజ్ షరీఫ్ లాంటి రాజకీయ నేత దేశాన్ని నడపటం వల్ల యుద్ద వాతావరణం తప్పుతూ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి పొలిటీషన్ అనుకోటానికి లేదు. తన మాజీ రెండో భార్య నుంచి అనేక ప్లేబాయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ అవసరాల కోసం పూర్తిగా పాక్ ఆర్మీకి అమ్ముడుపోయాడు. నవాజ్ షరీఫ్ ఆర్మీతో కాస్త దూరం పాటించటమే అతడి అరెస్ట్, ప్రస్తుత జైలు జీవితానికి కారణమన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి ఇమ్రాన్ ఆ తప్పు చేయకుండా మిలటరీ అధినేతల చెప్పుచేతల్లో తోకాడిస్తాడు.అంటే, భారత్ ఇమ్రాన్ రూపంలో పాక్ మిలటరీ కుట్రల్ని ఎదుర్కోటానికి సిద్ధంగా వుండాలన్నమాట. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన అంతిమ యుద్ధానికి కూడా ఇండియా తెగించే వుండాలి. తప్పదనుకుంటే పాక్ ను మోదీ మూడు ముక్కలు చేసైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇమ్రాన్ ఖానే సంయుక్త పాకిస్తాన్ కు చివరి ప్రధాని అయ్యేలా చూడాలి. అదే భారత్ మనః శాంతికి శాశ్వత పరిష్కారం!

జగన్ చంద్రబాబుని తట్టుకోలేడా? ఉండవల్లి లాజిక్ ఏంటి?

ఉండవల్లి అరూణ్ కుమార్… తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు! అయితే, మాస్ పొలిటీషన్ గా కన్నా మేధావిగానే అరూణ్ కుమార్ ఫేమస్! ఆయన మాట్లాడితే అందరు రాజకీయ నేతల్లాగా తలా తోక లేని ఆరోపణలు చేయరు. తలకి, తోకకి ముడిపెట్టే లాజిక్ తో కొడుతుంటారు! అదే ఆయన మాటలకి వాల్యూ తీసుకొస్తుంటుంది. మీడియా చెవులు పెద్దవి చేసుకుని వినేలా చేస్తుంటుంది.     వైఎస్ హయాంలొ ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి తరువాత క్రమంగా ప్రభ తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరన్నట్టుగా వుంది పరిస్థితి. ఓ సారి పవన్ పక్కన కనిపిస్తారు. ఓ సారి చంద్రబాబును కలుసుకుంటారు. స్వయంగా కూడా నేను ఏ పార్టీకి మద్దతుగా లేనని చెబుతూనే అప్పుడప్పుడూ ఆసక్తికర కామెంట్లు చేస్తుంటారు. ఉండవల్లి తాజా మాటలు రాజకీయ వర్గాల్లో అలాగే ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. వైఎస్ కు ఎంతో ఆత్మీయుడైనప్పటికి ఉండవల్లి ఏనాడూ జగన్ కు దగ్గర కాలేదు.  ఎప్పుడూ వీరాభిమానం చాటలేదు. ఇక ఇప్పుడైతే పూర్తిగా జగన్ కు వ్యతిరేకంగా విశ్లేషణ చేస్తున్నారు. జగన్ కోసం జనం విపరీతంగా రోడ్ల మీదకు వస్తుండటం నిజమే అయినా అదంతా ఓ సినిమా హీరో కోసం రావటం లాంటిదేనని అన్నారు. ఎన్నికల సమయంలో వారంతా జగన్ కే ఓటు వేస్తారని గ్యారెంటీ లేదన్నారు. గత ఎన్నికల్లోనూ జగనే గెలుస్తాడని చాలా మంది భావించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ముందు ఆయన చేయగలిగే పోల్ మ్యానేజ్మెంట్ జగన్ తట్టుకోలేడని అన్నారు!     ఉండవల్లి వ్యాఖ్యలు చంద్రబాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వున్నాయి కాబట్టి ఆయన టీడీపీలో చేరతారని మనం ఇప్పుడే భావించలేం. ఎందుకంటే, ఉండవల్లి రాజకీయ ఉద్దేశ్యాలు ఏవీ లేకుండా కూడా విశ్లేషణలు చేస్తుంటారు. ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా మిగతా ఆంధ్రా నాయకులందరి కంటే భిన్నంగా స్పందిస్తూ వచ్చారు. అలాగే, ఇప్పుడు చంద్రబాబు, జగన్ ల సత్తాని ఆయన నిష్పక్షపాతంగానే అంచనా వేశారని మనం భావించవచ్చు. చంద్రబాబు అనుభవం, జనం నాడిని పట్టగలిగే చాకచక్యం ఎన్నికల చాణక్యం … ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరో వైపు జగన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో తన ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని ఉపసంహరించుకుని చేస్తున్న రాజకీయం, సుదీర్ఘ పాదయాత్ర, పవన్ పై వ్యక్తిగత విమర్శలు… ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే వున్నాం. కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా చంద్రబాబు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఛేదించుకుని మళ్లీ అధికారంలోకి రావటం ఆశ్చర్యకరమేం కాదు. కానీ, జగన్ తనకున్న అనుభవ లేమీ, దూకుడు స్వభావంతో ఏపీ నెక్ట్స్ సీఎం అవుతారా? డౌటేనంటున్నారు ఉండవల్లి! ఉండవల్లి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా? జగన్ నవ్యాంధ్రా రెండో సీఎం అవుతారా? లేక చంద్రబాబే నవ్యాంధ్రకి రెండోసారి సీఎం అవుతారా? వేచి చూడాలి! ప్రస్తుతానికైతే సస్పెన్సే!

మోదీకి సాయం! ఏపీకి నష్టం! టీఆర్ఎస్ వ్యూహం!

ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా టాపిక్ గా నడుస్తోంది. అందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే, ఏపీకి సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హోదా విషయం పెద్దగా చర్చలో లేదు. జనం దాన్నసలు ఆలోచించటం లేదు. ఎందుకంటే, విభజన సమయంలో హైద్రాబాద్ తెలంగాణకు దక్కింది. అందుకే, స్పెషల్ స్టేటస్ లాంటివేవీ హామీ ఇవ్వలేదు. ఇక ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన ఏపీకైనా వచ్చిందా అంటే అదీ లేదు. అది రాకపోవటం వల్లే ఇంత గొడవ జరుగుతోంది. అయితే, ఈ మొత్తం కోలాహలంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఆందోళనకరంగా, అనుమానాస్పదంగా వుంటోంది…     నిన్న మొన్నటి వరకూ ఎక్కడ అడిగినా టీఆర్ఎస్ వారు ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పేవారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని అనేవారు. కానీ, అవిశ్వాస తీర్మానం వచ్చాక గులాబీ నేతల స్వరాల్లో మార్పు వచ్చేసింది. ఓటింగ్ సమయంలో గైర్హాజర్ అవ్వటం ద్వారా మోదీకి సాయం చేసిన కేసీఆర్ శిబిరం అక్కడితో ఆగకుండా పదే పదే ఏపీకి హోదా రాకుండా వుండేలా కామెంట్లు చేస్తోంది. ఆంద్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే హైద్రాబాద్ కు వాణిజ్య, వ్యాపార పరంగా నష్టం అంటూ మోకాలు అడ్డుతోంది టీఆర్ఎస్. హోదా ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇవ్వాలని మెలిక పెడుతోంది. ఈ వాదన ద్వారా పరోక్షంగా మోదీకి అత్యంత అవసరమైన సహకారం అందిస్తోంది గులాబీ పార్టీ!       అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కూడా నిరసనలు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. అంతే కాక పోలవరానికి కీలకమైన ముంపు మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదని తెలిసినా కేంద్ర ప్రభుత్వానికి సాయపడేలా ఆ మాట మాట్లాడారు. ఒకవైపు ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం రెండిటికీ కారు పార్టీ అడ్డుగా నిలుస్తోంది. దీని వల్ల టీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏం లేకున్నా కేంద్రంలోని దిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవచ్చు. అదే ఎజెండాగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే కేసీఆర్ చంద్రబాబు కంటే బాగా పని చేసుకుపోతున్నారని మోదీ అనటం … కమలం, గులాబీల మధ్య ఒప్పందాన్ని బహిరంగంగానే స్పష్ఠపరుస్తోంది.       ఈ మద్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయనకు ఆంద్రా మీదే ప్రేమ తప్ప తెలంగాణ మీద లేదని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వమని ఆజాద్ డిమాండ్ చేశారు. పార్లెమంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన డిమాండ్ ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. ఆయన తెలంగాణ గురించి పట్టించుకోకుండా ఏపీ మీద ప్రేమ ఒలకబోస్తున్నారని గులాబీ నేత కర్నె ప్రభావకర్ అన్నారు. దీని ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్నర్ చేయాలని ఆయన ప్రయత్నం. ఏపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని చెప్పటం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ను విలన్ గా నిలపాలని టీఆర్ఎస్ వ్యూహం!     తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రతిపక్షం కాబట్టి టీఆర్ఎస్ దాడి చేయటం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏపీకి ఎలాంటి జాలీ లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వనంటోన్న బీజేపికి లోపాయకారిగా సాయపడటం… కుట్రే అవుతుంది. లేదా వచ్చే ఎన్నికల తరువాత మోదీ సర్కార్ ఏర్పడితే టీఆర్ఎస్ అందులో మంత్రి పదవులు ఆశిస్తూ వుండాలి. ఏది ఏమైనా , ఎలాంటి రాజకీయ లబ్ధి వున్నా సాటి తెలుగు రాష్ట్రం నష్టపోయేలా వ్యూహాలు పన్నటం, కేంద్రానికి సాయం చేస్తూ ఏపీని ఎదగకుండా అడ్డుకోవటం… అస్సలు సమర్థనీయం కాదు. కేసీఆర్ దీనిపై పునరాలోచించుకోవాలి. లేదంటే తెలంగాణలోని, ముఖ్యంగా, హైద్రాబాద్ లోని ఆంధ్రుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు… 

ఇక మీదైనా నోటిపై అదుపు పాటిస్తారో లేదో… విజయ‘సారీ’రెడ్డి!

రాజకీయం వేరు, రచ్చ వేరు. అలాగే, వ్యాపారం , లెక్కలూ వేరు. పార్లమెంట్, చట్ట సభల్లో చర్చలు కూడా వేరు! ఈ సత్యం వృత్తి రిత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డికి ఇవాళ్లే బోధపడి వుంటుంది! ఆయన రాజ్యసభలో అందరి ముందూ బేషరతుగా చైర్మన్ వెంకయ్య నాయుడికి సారీ చెప్పారు. అలా చెప్పే పరిస్థితి నిన్న ఆయన తన స్వంత మాటలు, చేష్టలు కారణంగానే తెచ్చుకున్నారు. బహుశా ఇప్పటికైనా విజయసాయికి పెద్దల సభ అంటే తమ పార్టీ కార్యాలయం కాదని అవగాహనకు వచ్చి వుంటుంది!     విజయసాయి రెడ్డి కొన్నాళ్ల కిందటి దాకా జగన్ వ్యాపారపు లెక్కలు చూసుకునే సీఏ మాత్రమే. అయితే కామర్స్ తెలిసిన ఈయన అంతకంటే ఎక్కువ ప్రతిభ ప్రదర్శించారు. అందుకే, అనేక కేసుల్లో జగన్ ఏ వన్ అయితే ఈయన ఏ టూ అయ్యారు! అలా వైసీపీ అధినేతకి ఇతోధికంగా సహకరించిన విజయసాయి రాను రాను పార్టీలో కీలకమైపోయారు. మరీ ముఖ్యంగా, రాజ్యసభలో వైసీపీ ఎంపీగా కాలుపెట్టాక రెడ్డిగారి దూకుడు మరింత పెరిగింది. దిల్లీలో జగన్ కంటే ఎక్కువ ఈయనే పాప్యులర్ అయిపోయారు. ప్రధాని మోదీని ఓ సీఎం అయిన చంద్రబాబు కలవటం కష్టమైనా విజయసాయి మాత్రం అమాంతం కలిసేస్తుంటారు. అంతలా చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కమలదళానికి కావాల్సినంత సేవలందించారు. ఇదంతా రహస్యం కూడా కాదు. బహిరంగమే!     పార్టీలో జగన్ తరువాత అత్యంత కీలకమైన స్థానంలోకి వచ్చిన విజయసాయి రాజ్యసభ అంటే అదేదో ప్రెస్ మీట్ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా చైర్మన్నే టార్గెట్ చేసుకున్నారు! మన తెలుగు వారే అయిన మోస్ట్ సీనియర్ పొలిటీషన్ వెంకయ్య నాయుడు చైర్ లో వుండగా నిన్న విజయసాయి రెడ్డి అలిగారు. వాకౌట్ చేశారు. తనకు సరిగ్గా మాట్లాడే టైం ఇవ్వలేదని నిరసన తెలిపారు. ఇంత వరకూ ఓకే! కానీ, ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య తన పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తుననారని ఆనేశారు! దీని ఎఫెక్ట్ ఎలా వుంటుందో బహుశా నిన్న ఆయనకు అంచనా లేకపోవచ్చు!     విజయసాయి నోటి దురుసు తెలుగు వారికి కొత్తేం కాదు. ఆయన ప్రతీ రెండు రోజులకి ఒకసారి చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిడుతుంటారు. అయితే, అదంతా ప్రెస్ వారి మైకుల ముందు. కానీ, అలాంటి ప్రవర్తనే సభలో ప్రదర్శిస్తే ఎలా? అదీ జాతీయ స్థాయి పెద్దల సభ అయిన రాజ్యసభలో … నేరుగా చైర్మన్ ను ఉద్దేశించి అనాలోచితంగా మాట్లాడటం ఏంటి? తాను చేసిన తప్పు అర్థమైన వెంటనే విజయసాయి నిన్ననే వెంకయ్య వద్దకి వ్యక్తిగతంగా వెళ్లి సారీ చెప్పారట. అయితే, ఇవాళ్ల ఉదయం రాజ్యసభలో మళ్లీ ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. చైర్మన్ పై విమర్శల గురించి వివరణ ఇచ్చుకునే అవకాశం వచ్చింది. కానీ, మరోమారు తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ … రాగం తీసే సరికి వెంకయ్య నాయుడు విజయసాయి మాటల్ని మధ్యలోనే కట్ చేసి ఇతరులకి మాట్లాడే అవకాశం ఇచ్చేశారు. దీంతో వ్యవహారంలోని సీరియస్ నెస్ అర్థం చేసుకున్న మన సీఏగారు వివరణలు ఇవ్వటం మానేసి… బేషరతుగా సభకు సారీ చెప్పారు! విజయసాయి రెడ్డి రాజ్యసభలో సారీ చెప్పటం పెద్ద అవమానమో, నష్టమో కాదు. కానీ, ఆయన ఇప్పటి నుంచైనా నోటి మీద అదుపు ప్రదర్శిస్తే ఎంతో మంచిది. తెలుగు జాతి గర్వించేలా ఎదిగిన వెంకయ్యనే దేశం మొత్తం ముందు పక్షపాతి అనటం … ఏ విధంగానూ వివేకం కలిగిన పని కాదు. ఇలాంటివి జనంలో విజయసాయిని, ఆయన పార్టీని చులకన చేస్తాయి తప్ప మరే లాభమూ వుండదు! 

చంద్రబాబులోని ఆ లక్షణం… పవన్‌కు ఎంతో అవసరం! 

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో… ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు సీనియర్ మోస్ట్! ఆయనకంటే ఎక్కువ రాజకీయ జీవితం గడిపిన వారు చాలా తక్కువ. అయితే, ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో అందరూ బాగా గుర్తించేది చంద్రబాబులోని అభివృద్ధి చేయగల సత్తా, కష్టపడి పని చేసే తత్వం, దూరదృష్టి… ఇలాంటివన్నీ! కానీ, ఏపీ సీఎంలో మరో గొప్ప లక్షణం వుంది. అది చాలా వరకూ పెద్దగా చర్చకు రాదు. అదేంటంటే… చంద్రబాబు ఏనాడూ తన ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా దూషించరు! ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే చంద్రబాబు పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు! ఇది నిజంగా ఈనాటి రాజకీయ నాయకులు ఆయన నుంచీ తప్పక నేర్చుకోవాల్సింది. మరీ ముఖ్యంగా, చంద్రబాబును ఢీకొంటున్న ఆంధ్రా యువనేతలు జగన్, పవన్!     రాజకీయాల్లో విమర్శలు తప్పవు. అంత వరకూ ఓకే. కానీ, విమర్శలకు , వ్యక్తిగత దూషణలకు చాలా తేడా వుంటుంది. ఇక్కడే చంద్రబాబు లాంటి పరిణతి చెందిన నేతలు తమ విజ్ఞత చూపిస్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో మనకు తెలిసిందే. ఆయన పార్టీలోని రోజా లాంటి నేతల పదజాలం స్థాయి కూడా మనకు తెలిసిందే. అయితే, జగన్ తాజా టార్గెట్ పవన్ కళ్యాణ్ అయ్యారు! పవన్ ఈ మద్యే జగన్ను విమర్శించారు. ఏమని? ఆయనలాగా తనకూ కొందరు ఎమ్మెల్యేలు వుండి వుంటే తాను అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. జనం ఓట్లు వేసి పంపినందుకు సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసేవాడ్ననని పవన్ అన్నారు! దీనిపై జగన్ ఎలా స్పందించాలి? తాను ఎందుకు సభను వదిలి పాదయాత్ర చేస్తున్నాడో చెప్పుకోవాలి. అంతే తప్ప పవన్ పై వ్యక్తిగత దూషణలు అవసరమా? కానీ, మెచ్యూరిటీ లేని జగన్ అదే చేశారు!     పవన్ కళ్యాణ్ కార్లు మార్చినంత తేలిగ్గా పెళ్లాల్ని మారుస్తారనీ, ఆయనకు నలుగురు భార్యలని జగన్ దెప్పిపొడిచారు! ఇదెక్కడి సంస్కారం? పవన్ కళ్యాణ్ ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవటం, వారికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వటం అంతా, అందరికీ తెలిసిందే! ఎలాంటి రహస్యమూ లేని ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పైగా ఆయన భార్యల్ని కూడా రాజకీయ రచ్చలోకి లాగటం జగన్ కు సరైందేనా? అస్సలు కాదు!     ఇక… ఒకవైపు పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెలరేగిపోతుంటే… జనసేనాని కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి అంటూ పరోక్ష విమర్శలు చేశారు. ఇవి టీడీపీ నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణను ఉద్దేశించినవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ బాలకృష్ణ పేరైతే ఎత్తలేదుగాని ఆయన మొత్తం మీద ఎవర్నో వ్యక్తిగతంగా టార్గెటైతే చేశారు. ఆయన అలా చేయటానికి కారణం… జనసేన కార్యకర్తలు వాహనాలకు సైలెన్సర్లు లేకుండా ఓ ర్యాలీ తీశారట. దాంట్లో పవన్ కూడా పాల్గొన్నారు. విపరీతంగా శబ్దం చేస్తూ సైలెన్సర్లు లేని బండ్లు రోడ్డు మీద తిరిగాయి. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.     రూల్స్ కు విరుద్ధంగా రోడ్డు మీద వెహికల్స్ నడపవచ్చా? అభిమానులు అలా చేసినా పవన్ వారించకుండా వుండవచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి పవన్ ఎదురుదాడి చేస్తూ బాలకృష్ణపై పరోక్ష విమర్శలు సంధించారు. అసలు ఆయనకు , వివాదానికి ఏమైనా సంబంధం వుందా? ఇక్కడే పవన్ చంద్రబాబు లాంటి నేతల నుంచీ చాలా నేర్చుకోవాలి. ఒక పార్టీ అధినేతగా ఆయన స్థాయిని తగ్గించుకునే చౌకబారు వ్యక్తిగత విమర్శలు ఎప్పటికైనా చేటే చేస్తాయి. జనసేన అధినేతకే కాదు… ఇదే సూత్రం వైసీపీ నాయకుడికి కూడా వర్తిస్తుంది! తాత్కాలిక లాభం కోసం వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోవు! 

వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం 'కాసే' దమ్మున్నోడు!

కేటీఆర్… 2014కి ముందు కేసీఆర్ తనయుడు మాత్రమే! మరిప్పుడు? ఇప్పుడు కూడా ఆయన కేసీఆర్ వారసుడే … కానీ… జూలై 24 ఆయన 42వ పుట్టిన రోజు సందర్భంగా జరుగుతోన్న హంగామా చూస్తోంటే తాజా పరిస్థితి అర్థం అవుతుంది! ఆదివారం నుంచీ జ్వరం, బహుశా వయస్సు మీద పడుతున్నందుకేమో… అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో సరదాగా పోస్టు చేశారు! అనారోగ్యం వల్ల తెలంగాణ ఐటీ మంత్రి బయట ఎక్కడా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆయన బర్త్ డే హోరు జోరుగానే వుంది. పొలిటీషన్స్, సినిమా వారు, ఇతరులు అన్న తేడా లేకుండా వరస పెట్టి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అసలు ఎవరెవరు ఈ 42 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ కి హ్యాపీ బర్త్ డే చెప్పారో ఓ సారి చూస్తే క్రేజ్ ఏంటో అర్థమవుతుంది…     ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బావ హరీష్ రావు కూడా వున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, దర్శకుడు ఎన్. శంకర్, కేథరిన్ హడ్డా, ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌మాన్, నటుడు మహేశ్ బాబు, బ్రహ్మజీ, ప్రియదర్శితో పాటు ఇంకా చాలా మందే వున్నారు. ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ కూడా తన సహచర రాజకీయ వారసుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు!     ఒకవైపు తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరో వైపు కేటీఆర్ కేకులు కోసి, కటౌట్లు కట్టి డబ్బులు వృథా చేయకండి అంటూ పిలుపునిచ్చారు. మొక్కలు నాటమని చెప్పారు. ఆయన పిలుపునందుకుని టీఆర్ఎస్ శ్రేణులు భారీగానే మొక్కలు నాటుతూ, పళ్లు పంచిపెడుతూ సేవ కార్యక్రమాలు చేశాయి. ఓ కేటీఆర్ అభిమాని అయితే 42 ఏళ్ల తమ నేత మీద అభిమానంతో 42 మొక్కలు నాటారట! ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ బర్త్ డే అసలు హై లైట్ ‘వీడియో సాంగ్’! స్వయంగా హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వీడియో సాంగ్ ని ప్రజెంట్ చేయటం మరింత విశేషం! తెలంగాణ భవన్ లో కేటీఆర్ పై రూపొందించిన పాటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విడుదల చేశారు!     ఒక రాజకీయ నేత బర్త్ డే అన్నాక ఇలాంటి హంగామా సహజమే. కాకపోతే, ఎన్నికల ముందు సంవత్సరంలో కేసీఆర్ వారసుడు కేటీఆర్ పై ఈ శుభాకాంక్షల జల్లు కాస్త ప్రత్యేకమని కూడా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ తరువాత సీఎం పీఠంపై ఆయన కూర్చుంటారా? ఇప్పుడైతే ఆ చర్చ లేదు కానీ… రేపు ఎప్పుడైనా తెలంగాణ సీఎం అవ్వాలి అంటే ఆ అవకాశాలు టీఆర్ఎస్ లో కేటీఆర్ కే ఎక్కువగా వున్నాయి. హరీష్ వర్గం కూడా ఒకటి వుండవచ్చు. అయినా కేటీఆర్ పట్టు పార్టీపై రోజు రోజుకి పెరుగుతుండటం ఎవరూ కాదనలేని సత్యం! అందుకు ఆయన బర్త్ డే హంగామా మరో ఉదాహరణ! అంతే కాదు… ఆయన పై రూపొందించిన పాటలో కూడా తొలి లైనే… ‘’ వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు!’’ అంటూ సాగుతుంది! ఈ రాష్ట్రాన్ని కాయటం అంటే ఏంటి అంతరార్థం? ఇప్పుడే రకరకాల విశ్లేషణలు అవసరం లేనప్పటికీ… కేటీఆర్ … కేసీఆర్ తరువాత అంతటి వాడవుతున్నారు పార్టీలో అన్నది మాత్రం విస్పష్టం!

నెల్లూరులో జగన్ చెలగాటం! ‘వారి’ టికెట్ ఆశలకి ప్రాణ సంకటం!

పిల్లికి చెలగాటం… ఎలుకకి ప్రాణ సంకటం… ఈ సామెత పాతదే! కానీ, దాని ప్రభావం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఎలుకలుగా మారింది ఎవరు అటారా? అది తెలియాలంటే అసలు చెలగాటం ఆడుతున్న పిల్లెవరో తెలుసుకోవాలి కదా!     వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ నెల్లూరులో చెలగాటం మొదలు పెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వుండి తరువాత టీడీపీలోకి వచ్చి… తాజాగా జగన్ శిబిరం చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కలకలానికి కారణమయ్యారు. నెల్లూరులో ఆనం ఫ్యామిలి పట్టు అందరికీ తెలిసిందే. అదే జగన్ చేత మాజీ మంత్రి రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికించింది. కానీ, ఆనంకి అందిన ఆహ్వానం ఇప్పుడు నెల్లూరులొని అసలు వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతోన్న వేళ తమకు ఈ ఆనం గండమేంటని వారు వాపోతున్నారు!     ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెద్ద నేతలు పార్టీ మారితే దాని ఎఫెక్ట్ ఎక్కువగానే వుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఆర్దిక మంత్రిగా చేసిన ఆయన ఒక దేశలో సమైక్యాంధ్రకు సీఎం కూడా అవుతారని అన్నారు. అంత రేంజ్ కలిగిన ఆయన రాష్ట్ర విభజనతో హస్తం పార్టీలాగే కుదేలయ్యారు. నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనిపించుకుంటూ కొనసాగుతున్నారు. ఈ మధ్యే ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి మరణించటం కూడా వారి కుటుంబంలో విషాదం నింపింది. ఇటువంటి తరుణంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని ఆనం రామనారాయణ ప్రయత్నిస్తున్నారు. కారణాలు ఏవైనా టీడీపీని వదిలి వైసీపీకి చేరువైన ఆయన బలమున్న ఆత్మకూరు నియోజక వర్గం అడిగినప్పటికీ కుదరదని తేల్చేశారట జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఎంపీ వున్న స్థానాల్లో ఆనంకు అవకాశం లేదని తేలిపోయిందట. ఆత్మకూరు కాకుండా వెంకటగిరి తీసుకొమ్మని జగన్ అన్నట్టు పొలిటికల్ టాక్! ఆత్మకూరులో ఆనం అంటే మేకపాటి కుటుంబం తాము ఏకంగా వైసీపీ వదిలి పెడతామని హెచ్చరించిందని కూడా అంటున్నారు. మేకపాటి ఫ్యామిలిని వదులుకునే పిచ్చి ప్రయత్నాలేవీ జగన్ చేయరు కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి అంతగా పట్టులేని వెంకటగిరికే పరిమితం కావాలి.     జగన్ చెప్పినట్టు వెంకటగిరి నుంచి పోటీ చేసినా ఆనం ఎఫెక్ట్ మరో ఇద్దరు వైసీపీ నాయకుల మీద పడనుందట. నాలుగేళ్లుగా తమకు టికెట్ గ్యారెంటీ అంటూ వారిద్దరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాను రెక్కలు పట్టుకుని జోరుగా తింపుతూ వచ్చారు. వెంకటగిరి నియోజక వర్గంలో బొమ్మిరెడ్డి  రాఘవేంద్రా రెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అనేక ప్రజా కార్యక్రమాల్లో స్వంత డబ్బుతో పాలుపంచుకుంటూ వచ్చారు తీరా ఇప్పుడు ఆనం చేరిక ఆటంబాంబులా వారి ఆశల్ని ఛిన్నాభిన్నం చేసేస్తోందట! ఆనం వెంకటగిరి నుంచీ పోటీ చేస్తే బొమ్మిరెడ్డి, కలిమలి ఇద్దరూ పోటీకి దూరంగా వుండాల్సిన స్థితి వస్తుంది. నాలుగేళ్లుగా వారు చూసిన సహనానికి, పార్టీ విధేయతకి ఇలాంటి ఫలితం దక్కటం నిజంగా విషాదమే! ఇప్పటికైతే ఆనం ఏ స్థానం నుంచీ పోటీ చేస్తారని జగన్ చెప్పలేదు. ఆనం కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆనం నెల్లూరులో ఎక్కడ నుంచీ పోటీ చేసినా ఆయనకంటే ముందు నుంచీ వున్న వైసీపీ నేతలు ఎవరికో ఒకరి ప్రాణ సంకటమే! చూడాలి మరి జగన్ ఈ చెలగాటాన్ని ఎలా ఆడతారో! 

జగన్ బందులకి మోదీ ‘చింతకాయలు’రాల్చరు!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎందుకు రావటం లేదు? మోదీ ఇవ్వటం లేదు! ఇదే సమాధానం అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పుడు ఆలోచన వుండదు. అసలు ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఓ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోతే సవితి తల్లి ప్రేమే చూపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మేం రెడీ అంటూ కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ కూడా రేపు దిల్లీలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందా? బీజేపీలాగే కబుర్లు చెప్పే ఛాన్స్ లు ఎక్కువ! ఎందుకంటే, ఏపీలోనూ వారి ప్రభుత్వం వుండాలి. ఆ సూచనలు కనిపించటం లేదు. ఇక్కడ టీడీపీనో లేదో వైసీపీనో అధికారంలో వుంటాయి. ప్రాంతీయ పార్టీలు పీఠంపై వుండీ జాతీయ పార్టీలది కేంద్రంలో అధికారమైతే ఇక చెప్పేదేముంది? ఇదీ అసలు సమస్య. అయితే…     రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి జనం జైకొట్టినంత మాత్రాన దిల్లీలోని జాతీయ పార్టీలు ఇష్టానుసారం వివక్ష చూపించుకుంటూ పోతే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అక్కర్లేదు! 2009 – 2014 నడుమ తెలంగాణ కావాలని పది జిల్లాల ప్రజలు రోడ్డెక్కారు. పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. ఏ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఒక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒక్కటవ్వాలి. అదే విజయానికి మూలం. తమిళనాడులో జల్లికట్టు విషయంలోనూ అదే నిరూపితమైంది. జనం, పార్టీలు అంతా కలిస్తే దిల్లీ కూడా ఒప్పుకోక తప్పదు. సరిగ్గా అదే జరగటం లేదు ప్రత్యేక హోదా విషయంలో!     ప్రత్యేక హోదా వద్దనే పార్టీ ఏపీలో ఏదీ లేదు. అయినా, ఎవరి రాజకీయం వారిది. జగన్ పిలుపునిచ్చిన తాజా బందే ఇందుకు కారణం. ఆ మద్య తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా అనేక బందులు జరిగేవి. అయితే, చాలా వరకూ అవి సక్సెస్ కావటానికి కారణం జేఏపీ రూపంలో అన్ని పార్టీల్ని నిరసనాల్లో భాగమే చేసే వ్యవస్థ వుండేది. ఇవాళ్టి బంద్ లో అలాంటిదేం లేదు. జగన్ ఒంటెద్దుపోకడ తప్ప ప్రత్యేక హోదాపై నిజాయితీ ఎక్కడా కనిపించటం లేదు! తనకు తానే నిర్ణయం తీసుకుని మంగళవారం రాష్ట్రం బంద్ అనేశారు ప్రతిపక్ష నేత. దానికి ఎవరు మద్దతిస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఇవ్వటం లేదు. ప్రతిపక్ష నేత బందులకి అధికారపక్షం ఎలాగూ అండగా నిలువదు కదా! కనీసం ఇతర ప్రతిపక్షాలైనా వైసీపీ బంద్ కు మద్దతిస్తున్నాయా? ఎక్కడా లేదనే చెప్పాలి!     జగన్ పిలుపునిచ్చిన బంద్ కు టీడీపీ సహజంగానే సై అనలేదు. విచిత్రంగా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పట్నుంచో అంటోన్న జనసేనాని కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇవాళ్ల. బంద్ లో ఆయన వంతు పాత్ర ఏం లేదు. ఇది ఖచ్చితంగా జగన్ వైఫల్యమే. బంద్ విజయవంతంగా నిర్వహించాలనుకున్నప్పుడు కాస్త చొరవ చేసి పవన్ తో అయినా చర్చలు జరపాల్సింది. చంద్రబాబు దగ్గరికి వెళ్లి బంద్ కు సహకరించమని అడగలేరు కదా! వున్న మిగతా ప్రతిపక్షాల్నికూడా కలుపుకుపోకపోతే ఎలా? జనసేనతో సహా పోరాటాలకి , బందులకి నిత్యం సై అనే కమ్యూనిస్టు పార్టీల్ని కూడా జగన్ తన వెంట తెచ్చుకోలేకపోయారు. చివరకు, వైసీపీ బంద్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంగా కన్నా తమ పార్టీ బల ప్రదర్శనగా మారిపోయింది. వైసీపీ ఏపీ వీధుల్లో బంద్ నిర్వహిస్తుంటే టీడీపీ పార్లమెంట్లో హోదా కోసం చర్చకు పట్టుబడుతోంది. అక్కడ వైసీపీ టీడీపీకి సహకరించటం లేదు. ఇక్కడ టీడీపీ వైసీపీ వెంట వుండటం లేదు. మిగతా పార్టీల దారి దేనిది దానిదే! ఇలా అనైక్యంగా వుండటమే మోదీకి అత్యంత అనుకూలంగా మారుతోంది. హోదా కంటే ఏపీ రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ ఎజెండానే ఎక్కువగా కొనసాగిస్తున్నాయి. దిల్లీ పెద్దలకు కావాల్సింది కూడా అదే! 

ముగింపులు లేని బుజ్జగింపుల్లో చంద్రబాబు!

  నవ్యాంధ్ర సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదా అతి పెద్ద సమస్య. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకి సమస్యేంటి? బోలెడు! అలాగే వుంది పరిస్థితి. తాజాగా ఆయన పిలిచి మాట్లాడక అనంతపురం సీనియర్ నేత జేసీ చల్లబడ్డారు. ఆయనసలు అలకబూనటానికి కారణం ఏంటి? అదీ స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే రకరకాల ప్రచారాలే తప్ప దివాకర్ రెడ్డి నేరుగా తన డిమాండ్లు ఇవ్వంటూ ఎవరికీ చెప్పలేదు. అలాగే, చంద్రబాబు కూడా పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు. కానీ, జేసీ డిమాండ్స్ లో ఎన్ని న్యాయబద్ధమైవి, ఎన్ని కాకపోయినా… కీలక సమయంలో పార్టీకి, పార్టీ అధినేతకి ఇబ్బందికరంగా మాత్రం మారాయని చెప్పక తప్పదు. మోదీని ఢీకొంటూ చంద్రబాబు దిల్లీలో మంత్రాంగం నడుపుతుంటే… టీడీపీ ఎంపీ అయ్యి వుండి జేసీ అనంతపురంలో అలక పాన్పు ఎక్కారు. పార్లమెంట్ కు పోనని పేచీ పెట్టారు. ఎలాగో సర్ది చెప్పిన టీడీపీ అధినేత ఇతర పార్టీల ఎంపీల్ని మద్దతివ్వమన్నట్టు తన స్వంత పార్టీ ఎంపీనే బుజ్జగించాల్సి వచ్చింది. ఇది ఎంత మాత్రం హర్షనీయం కాదు!     అవిశ్వాస తీర్మానం అంకం ముగిశాక జేసీ ఇవాళ్ల చంద్రబాబుని కలిశారు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవటంలో అపార అనుభవం వున్న చంద్రబాబు లోపల ఏం మంత్రం వేశారోగానీ దివాకర్ రెడ్డి పూర్తిగా మెత్తబడ్డారు. లోపలేం జరిగిందో తాను చెప్పను అంటూనే లోక్ సభకు వెళతానని స్పష్టం చేశారు. మోదీ పీఎంగా వున్నంత కాలం విభజన హామీలు నెరవేరవని మరోమారు అన్న ఆయన పోరాటం మాత్రం సాగుతూనే వుండాలని చెప్పుకొచ్చారు. అసలింతకీ, దివాకర్ రెడ్డి ఏం అడిగారు? చంద్రబాబు ఎలా సముదాయించారు? ఇదంతా ఇప్పటికైతే సీక్రెట్టే! బహుశా వచ్చే ఎన్నికల్లో తనకు, తన వారసుడికి టికెట్ల గురించి దివాకర్ రెడ్డి పట్టుబట్టి వుంటారు.ఇది కూడా జరుగుతున్న ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడా ఎవరూ చెప్పటం లేదు.     దివాకర్ రెడ్డి లాగే గతంలో గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి, చంద్రబాబుకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం చేశారు. సీఎం స్వయంగా ఆయన్ని పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దఫదఫాలుగా కొనసాగిన నంద్యాల నియోజక వర్గ వర్గపోరు సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ఒకటికి రెండు సార్లు వాళ్లని పిలిచి కూర్చోబెట్టి సముదాయించాల్సి వచ్చింది. ఇలా పదే పదే పుట్టుకొస్తున్న పార్టీ అంతర్గత కలహాలు లేదా కుమ్ములాటలు, అసంతృప్తులు అధినేత సమయాన్ని వృథా చేస్తున్నాయి. రాష్ట్ర రథసారథిగా ఆయన సమయం అమూల్యమైంది. దాన్ని స్వంత పార్టీ నేతలే వృథా చేయిస్తుండటం ప్రభుత్వానికి, ప్రజలకి కూడా నష్టమే. ముందు ముందు ఎన్నికలు సమీపిస్తే ఈ అలకలు, బుజ్జగింపులు మరింత పెరుగుతాయేమోనని కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు! దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి మరి…

పీఎం కుర్చీపై రాహుల్ కర్చీఫ్! మోదీ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్ పార్టీ! 

2014లో జరిగినట్టే మళ్లీ జరుగుతోందా? ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో చిక్కుతోందా? పరిణామాలు చూస్తోంటే అలాగే అనిపిస్తోంది! రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తొలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ నాయకత్వంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం సమాలోచనలు జరిపింది. చివర్న రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ హస్తం పార్టీ సంకేతాలిచ్చింది. నిజానికి, ఇదే కమలానికి కావాల్సింది! కాషాయ నేతల ఆశలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ పోరు జరగాలనే! ఆ ట్రాప్ లో చిక్కినట్టే కనిపించింది కాంగ్రెస్ పార్టీ!     2014లో బీజేపీకి స్పష్టంగా మోదీ అనే నేత నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కి సోనియా వున్నా ఆమె ప్రధాని అభ్యర్థి కాదు. మన్మోహన్ మళ్లీ పీఎం అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదు. పోనీ రాహుల్ పీఎం అవుతారని కూడా అనలేదు. అయినా కూడా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా మోదీ చుట్టూ తిరిగింది. మోదీ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టు కొనసాగి చివరకు ఓటర్లు నమో మీదే నమ్మకం చూపేలా చేసింది. అయితే, కాంగ్రెస్ ఈసారి తొందరపడి రాహుల్ ని పీఎం క్యాండిడేట్ గా ప్రకటించి మళ్లీ మోదీకి మేలు చేసినట్టు కనిపిస్తోంది!     2014లో కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పకున్నా జనం దృష్టి మోదీ అనే వ్యక్తి మీద నిలిచింది. పార్టీలు, పార్టీల గుర్తులు ప్రాముఖ్యత కోల్పోయాయి. ఇప్పుడు రాహుల్ మా ప్రధాని అంటూ కాంగ్రెస్ ప్రకటించే సరికి మరో మారు అమెరికన్ స్టైల్లో వ్యక్తుల మధ్య పోరాటంగా పరిణమించబోతోంది. మోదీ వర్సెస్ రాహుల్ అయితే బీజేపీకి పండగే. ఎందుకంటే, గతంలో కంటే ఇప్పుడు రాహుల్ ఇమేజ్ కాస్త బెటరైనా మోదీని ఢీకొట్టే స్థాయిలో క్రేజ్ రాలేదు. అదే విధంగా రాహుల్ నేతృత్వం దేశంలోని ఎన్ని పార్టీలకు, ఎంత మంది సీనియర్ నాయకులకు ఆమోదం? ఇదీ అనుమానమే! కాబట్టి ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఈ విషయంలో తొందరపడిందనే చెప్పుకోవాలి. రాహుల్ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పటం ద్వారా హస్తం పార్టీకి వచ్చే ప్రత్యేక లాభాలేం లేవు. కానీ, అదే సమయంలో బీజేపీకీ మాత్రం మోదీ ప్రత్యర్థిగా రాహుల్ వుండటం ఎంతో అవసరం. దేశమంతా పార్లమెంట్ ఎన్నికల్ని మోదీ వర్సెస్ రాహుల్ గా భావిస్తే ఓటర్లు నరేంద్రుడి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే సమయంలో మోదీ, రాహుల్ ప్రచార హోరులో మమత, మాయ, ములాయం, చంద్రబాబు, కేసీఆర్… ఇలా అందరు సీనియర్ నేతలు సైడ్ లైన్ అవుతారు. తమతమ రాష్ట్రాలకే పరిమితం అవుతారు. ఇది మోదీకి అతి పెద్ద లాభం. తెలిసో తెలియకో కాంగ్రెస్ ఈ లబ్ది చేకూర్చిపెడుతోంది మోదీకి!     తమకు రెండు వందల దాకా సీట్లు వస్తే రాహులే ప్రధాని అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం నలభై సీట్లు మాత్రం వున్న పార్టీ అమాంతం రెండు వందలకు చేరుకోవటం కష్టం. అదీ చాలా చోట్ల రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు లేవు. మరప్పుడు ఎంపీల్ని గెలిపించుకోవటం రాహుల్ కు తలకు మించిన భారమే. అటువంటప్పుడు మోదీని అడ్డుకోవాలని నిజంగా వుంటే… ప్రాంతీయ పార్టీలు, నాయకుల్ని కలుపుకుపోవాలి.ఎన్నికల పలితాలు పూర్తిగా వచ్చేదాకా ప్రధాని అభ్యర్థిత్వంపై మాట్లాడకుండా వుండాలి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత, మోదీపై అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ కు రెండు వందల దాకా సీట్లొస్తే మిగతా పార్టీలన్నీ రాహుల్ నే పీఎంని చేస్తాయి. దానికి ఇప్పట్నుంచే కుర్చీపై కర్చీఫ్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనవసరంగా మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల్లో కూడా భయాలు, అనుమానాలు రేకెత్తించటం తప్ప! కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది! 

పవన్ కళ్యాణ్ … టీడీపీ, వైసీపీల ముంగిట తీరం దాటని తుఫాన్!

పవన్ కళ్యాణ్ … నిన్న మొన్నటి దాకా పార్ట్ టైం పొలిటీషన్. ఫుల్ టైం హీరో. కానీ, ఇప్పుడు ఫుల్ టైం జనం మధ్యనే గడుపుతోన్న జనసేనాని! అయితే, ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే…. పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆయన నేరుగా ఎన్నికల్లో పాల్గొనకున్నా 2014లో తీవ్రంగా ప్రచారం చేశారు. చంద్రబాబును, మోదీని సమర్థించారు. మరిప్పుడు? ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తున్నారు! కొంత కాలం కాకినాడ, అనంతపురాల్లో సభలు నిర్వహించినప్పుడు మోదీని తెగ తిట్టి, బాబును సున్నితంగా విమర్శించారు. ఇప్పుడు సీన్ రివర్స్ చేసేశారు. చంద్రబాబును, లోకేష్ ను, టీడీపీని అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. అలా అని పవన్ బీజేపీ వైపున కూడా వుండటం లేదు. జగన్ను కూడా ఉపేక్షించటం లేదు. అందర్నీ విమర్శిస్తూ ఒంటరిగానే బరిలో తొడగొడుతున్నారు. దీని వల్ల ఆయనకెంత లాభం? ఇతర పార్టీలకు ఎంత నష్టం? ఎన్నికల ఫలితాలొచ్చే దాకా సస్పెన్సే!     పవన్ పోరుయాత్ర చేస్తూ ఉత్తరాంధ్ర దాటి కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. అయితే, రోజురోజుకి ఆయన ఆరోపణలు, మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాస్త సన్నిహితంగా వున్నా దాదాపుగా జనసేనాని యుద్ధం ఒంటరిగానే అని తేలిపోతోంది. పవన్ తాజాగా జగన్ని టార్గెట్ చేశారు. తనకు పది మంది ఎమ్మెల్యేలు వున్నా అసెంబ్లీ వదిలి పారిపోయేవాడ్ని కానని చెప్పారు. జగన్ మంచి అవకాశాన్ని అసెంబ్లీ సాక్షిగా పాడు చేసుకున్నారని అన్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీని, నేరుగా చంద్రబాబునే ఇరుకునే పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు జనసేన అధినేత!     చంద్రబాబు తనను గతంలో ప్రత్యక్ష పోరుకు దిగవద్దని అన్నారని చెప్పిన పవన్ అందుకు ప్రతిగా రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారంటూ పేర్కొన్నారు. కానీ, తనకు రాజ్యసభ సీటు ఇస్తానన్న సంగతి మరుసటి రోజుకే పత్రికలకు లీకు చేయించారని పవన్ ఆరోపించారు. ఇది ఎప్పుడో 2014కి ముందు జరిగింది. దీన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టటం ఏంటి? కేవలం చంద్రబాబు ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయటమే దీని ఉద్దేశం అయి వుండాలి. ఇక ఇలాంటి ఆరోపణలు ఎంత వరకూ ఓట్లు రాలుస్తాయో కూడా చూడాలి!     ఒకవైపు చంద్రబాబును, మరోవైపు జగన్ను వ్యతిరేకిస్తోన్న పవన్ గత కొంత కాలంగా మోదీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఘాటు విమర్శలు కాదు కదా… కనీస ఎత్తిపొడుపులు కూడా వుండటం. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెలరేగిన పవన్ సడన్ గా ఇలా ఎందుకు మెత్తబడ్డారో ఆయనకి, మోదీకే తెలియాలి. కానీ, రానున్న ఎన్నికల్లో పవన్ కీలక శక్తి మాత్రం కానున్నారని ఆయన తాజా విమర్శల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే, పవన్ బోలెడు మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంటారని అర్థం కాదు! ఆయన పార్టీ నిలబెట్టే అభ్యర్థుల వల్ల చంద్రబాబుకో, జగన్ కో డ్యామేజ్ పక్కా. అది ఎవరవుతారో వాళ్లు అధికారానికి దూరమవ్వమూ ఖాయం. మొత్తానికి పవన్ తాను తినకుండా ఎవరు తినకూడదో డిసైడ్ చేయబోయే ప్రమాదకర శక్తిగా మారనున్నరన్నది గ్యారెంటీ!

పాక్ ప్రధాని కాబోతున్నాడు! మాజీ భార్య మాత్రం ముప్పతిప్పలు పెడుతోంది! 

ఏ దేశంలో అయినా ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలు, నేతలు గుర్తుకు వస్తారు. అయితే, నిజంగా రాజకీయాన్ని ప్రభావితం చేసేది పొలిటీషన్స్ అయినా ఎక్కువ చర్చ, రచ్చ జరిగేది మాత్రం సినిమా, క్రికెట్, టీవీ సెలబ్రిటీల గురించే! మన దేశంలో కూడా ఎన్నికలొప్పుడొచ్చినా చూస్తూనే వుంటాం కదా! నలభై ఏళ్ల అనుభవం వున్న రాజకీయ నేతకి దక్కని కవరేజ్ నాలుగు సినిమాలు చేసిన సెలబ్రిటీలకు దక్కేస్తుంది! అంతా గ్లామర్ మహిమ!     పాకిస్తాన్ లో మరో రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలున్నాయి. పాక్ నెక్స్ట్ పీఎం ఎవరో డిసైడ్ అవ్వనుంది. అయితే, ఈసారి పాకిస్తాన్ లో కూడా క్రికెట్ సెలబ్రిటీ హంగామానే నడుస్తోంది. ఒకవైపు మిలటరీ, మరోవైపు ఉగ్రవాదుల అరాచకం మధ్య పాకిస్తాన్ ప్రధాని అంటేనే డమ్మీ అనుకుంటారు ప్రపంచ జనం. అటువంటిది ఈసారి మాజీ క్రికెటర్, వరుస పెళ్లిళ్ల రొమాంటిక్ స్టార్ … ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్సెస్ వున్నాయట! చాలా సర్వేలు అదే చెబుతన్నాయి. పాక్ ఆర్మీకి కూడా మనోడే మక్కువగా వున్నాడు. అందుకే, కాస్తో కూస్తో రాజకీయ అనుభవం వున్న నవాజ్ షరీఫ్ ను , అతడి కూతుర్ని లోపలేసి మరీ ఇమ్రాన్ ఖాన్ ను అధికారపు పిచ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది!     జనంలో క్రేజ్, ఆర్మీతో మంచి సంబంధాలు, అన్నీ బాగానే వున్నా… ప్లేబాయ్ గా పేరుబడ్డ ఇమ్రాన్ ఖాన్ కి అసలు సమస్య మాజీ భార్య రేహమ్ నుంచి వస్తోంది. ఆమెని రెండో భార్యగా నిఖా చేసుకున్న ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ అలవాటు ప్రకారం వదిలేసి మొన్న ఫిబ్రవరీలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రెండో భార్య రేహమ్ ఆత్మకథ రాస్తున్నా అంటూ … పీఎం పదవిపై పరుగు తీస్తున్న ఇమ్రాన్ ని రన్నవుట్ చేసే పనిలో వుంది! తన పుస్తకంలో రచ్చ రచ్చైపోయే వివరాలు పేర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ గే అని రేహమ్ చెప్పిందట బుక్కులో. అతడికి ఓ బాలీవుడ్ హీరో సంబంధం వుందని రాసింది ఆత్మకథలో. అంతే కాదు, ఇమ్రాన్ ఖాన్ కు అయిదుగురు అక్రమ సంతానం వున్నారనీ, వాళ్లు రహస్యంగా పెరుగుతున్నారని చెప్పింది. వాళ్లలో కొందరు భారతదేశంలో పెరుగుతున్నారని అనటం కలకలం రేపింది!     ఎన్నికల ముందు రోజుకో విధంగా ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య డ్యామేజింగ్ చేస్తోంటే కాబోయే పీఎం మాత్రం ఏమీ అనటం లేదు. ఎలక్షన్స్ టైంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని లోలోన మథనపడుతున్నాడు. అయితే, చిట్ట చివరకు నోరు తెరిచిన ఇమ్రాన్ తన జీవితంలో చేసిన తప్పులన్నిట్లో అతి పెద్ద తప్పు రేహమ్ ఖాన్ ని పెళ్లాడటమేనని అన్నాడు! ఇంతకీ, రేహమ్ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా? ఇమ్రాన్ అయితే వాట్ని ఖండించటం లేదు! అంటే… నిజమనే కదా!     ఇమ్రాన్ ఖాన్ లాంటి క్యారెక్టర్ పాక్ పీఎం అయితే ఏమవుతుంది? కొత్తగా ఆ దేశానికి జరగాల్సిన నష్టమంటూ ఏం మిగలలేదని కూడా కొందరంటున్నారు. అది పక్కన పెడితే ఇమ్రాన్ పిల్లలు రహస్యంగా మన దేశంలో పెరుగుతున్నారా? వారెవరు? ఇవీ… ఇంట్రస్టింగ్ కొశన్స్. రేపు ఆయన ప్రధాని అయితే… ఏదో ఒక క్షణంలో వారెవరో కూడా బయటకు పొక్కవచ్చు! చూద్దాం! అంతవరకూ మాత్రం పాక్ ఎన్నికల హడావిడిని గమనించటం మంచి ఎంర్టైన్మెంటే! ఎందుకంటే, అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు… తమ ప్రచార పోస్టర్లపై అమితాబ్, మాధురీ దీక్షిత్ ఫోటోలు ముద్రించి క్యాంపైన్ కొనసాగిస్తున్నారట! పాక్ పై ఇండియా, బాలీవుడ్ల ప్రభావం చాలానే వుందని ఒప్పుకోక తప్పదు!

అవిశ్వాసం వీగిపోయినా చంద్రబాబు దిల్లీకి ఎందుకు వెళ్లారు?

చంద్రబాబు దిల్లీ వెళ్లారు. దీన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కొందరైతే వెటకారాలు కూడా చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవటంతో ఏపీ సీఎం మరో విధంగా హడావిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కానీ, నిన్నే పార్లమెంట్లో చర్చతో వేడెక్కిన దిల్లీకి ఇవాళ్ల చంద్రబాబు ఎందుకు వెళ్లారు? జగన్ చెప్పినట్టు అమరావతిలో కూర్చునే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు కదా? టీడీపీ ఎమ్మెల్యేలతో చేత కూడా పార్లమెంట్ సమావేశాలు సాగుతుండగానే రాజీనామాలు చేయించి నిరాహార దీక్షలు చేయవచ్చు కదా?     చంద్రబాబు దిల్లీ టూర్ ఊరికే చేస్తున్నదేం కాదు. ప్రత్యేక హోదా విషయంలో సభలో చేయాల్సింది అంతా చేసేశాం. ఇప్పుడిక పార్లమెంట్ వెలుపల జరగాల్సిందే మిగిలి వుంది. ప్రత్యేక హోదా రాలేదు. మోదీ ఇవ్వనని తేల్చేశారు. మరి ఎలా? చంద్రబాబు ఒకటి కావాలని నిర్ణయించుకున్నాకా వెనక్కి తగ్గరు కదా! అదీ ఆంధ్ర ప్రజలకు మంచి చేసేది అయితే ఆయన ఏనాడూ మడమ తిప్పరు. అందుకే, ఇప్పుడు మరో పంథాలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు జరుగుతోన్న కీలక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బాబు చక్రం తిప్పుతున్నారు.     మోదీ ఒకవేళ ముందస్తుకు సై అంటే ఇప్పుడు జరుగుతోన్న లోక్ సభ సమావేశాలే చివరివి కూడా కావచ్చు. అందుకే, హుటాహుటిన దిల్లీ చేరుకున్న చంద్రబాబు జాతీయ మీడియా ముందు ఏపీ బాధని వెల్లడించారు. ఇప్పుడైతేనే నేషనల్ మీడియా పూర్తి స్థాయి దృష్టి పెడుతుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతే ఏపీ ప్రత్యేక హోదా అంశం స్థానిక సమస్యగా భావిస్తాయి ఇంగ్లీషు, హిందీ మీడియా సంస్థులు. అందుకే, చంద్రబాబు ఇదే సమయాన్ని తెలివిగా వాడుకుంటున్నారు. సమస్యని ఏక కాలంలో మీడియా, ఉత్తరాది పార్టీలు అన్నిటి దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఎంతగా ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ లో మార్మోగితే అంత ఇబ్బంది మోదీకి. అలాగే, ఈ సమస్యపై టీడీపీ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఇతర పార్టీలు ఎంతగా గుర్తిస్తే అంత మంచిది భవిష్యత్ లో. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా వుండవచ్చు. అవిశ్వాస తీర్మానంలో గెలిచినప్పటికీ మోదీ 2019 ఓటర్ల తీర్పులో గెలిచేస్తారని చెప్పలేం. అప్పుడు మోదీ వ్యతిరేక పార్టీలదే కీలక పాత్ర అవుతుంది. ఆప్ , టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ… ఇలా అనేక పార్టీలు మోదీపై గుస్సాగా వున్నాయి. ఆయా పార్టీలతో వ్యూహ రచన చేయాలంటే బాబు దిల్లీలో వుండటం ఇప్పడు తప్సనిసరి. అందుకే, చంద్రబాబు నేరుగా రాజధాని చేరి రాజకీయం చేస్తున్నారు.     ఇప్పటికిప్పుడు హోదా ఇవ్వకపోవటాన్ని ఎత్తి చూపటం, మెజార్టీ వర్సెస్ మోరాలిటి అంటూ నినదించటం ఒక కోణం. రానున్న కాలంలో మోదీ వ్యతిరేక శిబిరంలో కీలకంగా మారి అలాగైనా ఏపీకి లాభం రాబట్టుకోవటం మరో కోణం! ఇదీ సింపుల్ గా చెప్పుకుంటే చంద్రబాబు దిల్లీ టూర్ సారాంశం…

గాడి తప్పిన పాక్ లో… ఓ గాడిద బతుకు!

  మన దేశంలో జరిగే బోలెడు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటాయి. మధ్యలో అవిశ్వాస తీర్మానం పేరున లోక్ సభలోనూ ఓటింగ్ హడావిడి నడిచింది. వీటన్నటి మధ్యా అంతర్జాతీయ వ్యవహారాలు పెద్దగా ఆసక్తి లేని వారు పట్టించుకోకుండా వదిలేస్తోన్న ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. అవే పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు! ఈ మాట వినగానే భారతీయులు ఎవరైనా నవ్వేసి ఊరుకునే ప్రమాదమే వుంది. అలాంటి స్థితి మన పక్క దేశంలో నెలకొని వుంటుంది. 1947లొనే స్వతంత్రం పొంది ఇండియాతో పాటూ ఏర్పడ్డప్పటికీ పాకిస్తాన్ దారుణమైన స్థితిలో వుంది. ఇండియా చంద్రుడ్ని, అంగారకుడ్ని చేరుకుంటూ వుంటే పాకిస్తాన్ కాశ్మీర్ లో కాలుపెట్టడానికి ఉగ్రవాదుల్ని తయారు చేయటంలోనే మునిగిపోయింది. దీనికి కారణం పాక్ లోని మతోన్మాదం, ఆ మతోన్మాదాన్ని వాడుకునే అక్కడి మిలటరీ. పాక్ సైన్యం చేతిలోనే ఆ దేశం అధికారం మగ్గిపోతూ వుంటుంది. ప్రధాని వున్నా, నియంతలు పాలించినా! అందుకే, పాక్ ఎన్నికలు అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపరు…   పాకిస్తాన్ ఎన్నికల్ని మనం పెద్దగా పట్టించుకోకున్నా ఈ మద్య జరిగిన ఒక నికృష్టమైన దాడిని మాత్రం తప్పక మాట్లాడుకోవాలి. ఎన్నికల సందర్భంగా దాడి అంటే అదేదో మానవ బాంబు దాడి అనుకోకండి. అవి కూడా పాకిస్తాన్ లో సర్వ సాధారణం అయిపోయాయి. ఈ ఎన్నికల సందర్భంగానే బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోయారు. అది పక్కన పెడితే కొందరు ఆగంతకులు కరాచీ నగరంలో ఓ రాత్రి పూట ఒక గాడిదని చిత్రవధ చేశారు. ఎంత దారుణంగా అంటే… గాడిద ముక్కుపుటాలు విరిచేశారు. ఎముకలు విరిగేలా చావబాదారు. కార్ తో గాడిదని ఢీకొట్టి నుజ్జునుజ్జు చేశారు! ఎందుకు? సమాధానం వింటే పాకిస్తాన్ లో రాజ్యమేలుతోన్న ఉన్మాదం ఎంతో అవగాహనకు వస్తుంది!     పాకిస్తాన్ ఎన్నికల్లో తరువాతి ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫుల్ గా ప్రచారం అవుతున్నాడు. అతడికే మిలటరీ సపోర్ట్ కూడా వుండటంతో గెలవటం దాదాపు ఖాయం అయిపోయినట్టే. అతను ప్రధాని అవుతాడో కాడోగానీ… ఇమ్రాన్ ఖాన్ ఓ మాటన్నాడు. ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ మద్దతుదారులు గాడిదలు అన్నాడు! అదే గుర్తుతెలియని ఉన్మాదుల నికృష్ట ప్రవర్తనకి కారణం! రాత్రి వేళ ఘారాతి ఘోరంగా గాడిదని హింసించి దాని ఒంటిపై నవాజ్ అని కత్తితో చెక్కి… రోడ్డు పక్కన చావటానికి వదిలేసి వెళ్లిపోయారు.   బహుశా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులని అనుమానిస్తున్న సాడిస్టులు ఇంత వరకూ దొరకలేదు. మనుషుల్నే కుక్కల్లా కాల్చి చంపే పాకిస్తాన్ లో గాడిదని ఎవరు పట్టించుకుంటారు? అలా దారిన పోతున్న ఒకాయన రక్తం కక్కుతూ చచ్చిపోతున్న గాడిదని చూసి ఫేస్బుక్ లో పోస్టు పెట్టి ఎవరైనా సాయం చేయండని అభ్యర్థించాడు. ఒక స్వచ్ఛంద సంస్థ వారొచ్చి గాడిదకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రస్తుతం వైద్యం చేయిస్తున్నారు. సగటు పాకిస్తానీల ఉన్మాదానికి బలైన ఆ గాడిద ఇంకా లేచి నిలబడి తిరగలేకపోతోంది. బతికే చాన్స్ వుందని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు!   మనుషుల్నే మతోన్మాదంతో , డబ్బుల కోసం, అధికారం కోసం, అర్థంపర్థం లేని పగతో చంపేసే పాకిస్తాన్ లో గాడిద బతికినా చచ్చినా పెద్దగా తేడా ఏం వుండబోదు. కానీ, అసలు విషాదం ఏంటంటే… పాక్ లోని ఆర్మీ, పాలకులు, తాజాగా అధికారులు, న్యాయ వ్యవస్థలోని వారు అందరూ … మొత్తం వ్యవస్థనే గాడిదని చేశారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దిశ నుంచీ హింసిస్తున్నారు. అటువంటి పాక్ లో సామాన్య జనం బతుకులు మాత్రం… ఎన్ని ఎన్నికలు వచ్చినా …. చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ గాడిదలానే వుండబోతున్నాయి. నవాజ్ షరీఫ్ జైలుకి వెళ్లినా, ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయినా పాక్ ఎప్పుడు మారుతుందో వాళ్ల దేవుడికే తెలియాలి!  

శివసేన పులి స్వారీ చేస్తోన్న బీజేపీకి ‘గండం’ తప్పకపోవచ్చు!

శత్రువుగా కనిపించే శత్రువు కంటే… మిత్రుడుగా నటించే శత్రువు చాలా ప్రమాదకరం! ఈ విషయం మోదీ లాంటి రాజకీయ నాయకుడికి , అమిత్ షా లాంటి వ్యూహకర్తకి తెలియదని మనం భావించలేం. కానీ, వారు కూడా ఏమీ చేయలేక కళ్లప్పగించి చూస్తున్నారు శివసేనని! అసలింతకీ మరాఠా పార్టీకి, కాషాయ పార్టీకి మధ్య సమస్య ఏంటి? అదే ఇంత వరకూ అర్థం కానిది! శివసేన ప్రతీ రోజూ , ప్రతీ కారణంపై ఏదో ఒక విధంగా బీజేపీని తిట్టిపోస్తూనే వుంది. అయినా కూడా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుంచీ మాత్రం తప్పుకోదు. మిత్ర పక్షంగా వుంటేనే ప్రతిపక్షాల కంటే దారుణంగా దాడి చేస్తుంటుంది!     శివసేన, బీజేపీలది ప్రతీ రోజు సాయంత్రం విపరీతంగా గొడవపడే భార్యా, భర్తల సంబంధం లాంటిది. తెల్లవారితే అంతా మామూలైపోతుంది. రెండు పార్టీలు అసలేం కాలేదన్నట్టు నటిస్తాయి. తాజా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా అంతా శివసేన బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటుందని అంచనా వేశారు. ఉద్ధవ్ గత కొన్ని నెలలుగా తన పత్రిక సామ్నాలో దుమ్మెత్తి పోస్తూనే వున్నాడు. తమ సీఎం ఫడ్నవీస్ ను, దేశ ప్రధాని మోదీని ఆయన తిట్టని తిట్టు లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక కూడా శివసేన మరో మారు బీజేపీపై మాటల బాంబులు వేసింది. తమ పత్రికలో మోదీని కసాయి అనేసింది. జంతువుల్ని కాపాడుతాడుగానీ మనుషుల్ని పట్టించుకోడనీ, దయ, జాలీ లేవని నోటికి వచ్చినట్టు రాసేశారు. మరింత కోపమే వుంటే మోదీకి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయవచ్చు కదా? అలా చేయలేదు! సైలెంట్ గా శివసేన ఎంపీలు జారుకున్నారు. సభలో లేకపోవటం ద్వారా బీజేపీకి, మోదీకి కావాల్సినంత మేలు చేశారు!     ఒకవైపు శివసేన అయోమయంగా ప్రవర్తిస్తున్నా బీజేపీ ఏమీ అనకుండా మౌనంగా భరిస్తోంది! అంతకు మించి కాషాయ అగ్రనేతలు చేయగలిగింది కూడా ఏం లేదు. మహారాష్ట్రలో కమలానికి స్వంత మెజార్టీ లేదు. కేంద్రంలో కూడా వాజ్ పేయ్, అడ్వాణీ హయాం నుంచీ శివసేన తోడుగా వుంటోంది. అక్కడా సాటి హిందూత్వ పార్టీ అయిన శివసేనని కమలదళం వదలలేదు. ఇలా దిల్లీలో, ముంబైలో రెండు చోట్లా శివసేన అవసరం ఎంతో కొంత బీజేపీకి కూడా వుంది. ఇదే మోదీ, అమిత్ షాల సహనానికి,మౌనానికి కారణం!     ఇష్టం లేని కాపురం శివసేన, బీజేపీలు ఇంకా ఎంత కాలం చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఇదే తంతు కొనసాగితే మాత్రం ఇద్దరికీ కష్టమే. ప్రాంతీయ పార్టీ అయిన శివసేనని పక్కన పెడితే మళ్లీ ప్రధాని కావాలని పట్టుదలతో వున్న మోదీకి మాత్రం … మిత్ర పక్షంలా పక్కనే వుంటూ బల్లెంలా తయరైన మరాఠా పార్టీ ఏనాటికైనా ప్రమాదమే! శివసేన పులి స్వారీ చేయటం… దుస్సాహసమే!

వాట్సప్ మెసేజ్ లకి, వాస్తవాలకి తేడా తెలుసుకోలేకపోతున్న జనం!

సైన్స్ , టెక్నాలజీ ఎప్పుడూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటాయి. అయితే, కొన్ని సార్లు వాటి ప్రభావం మంచికి దారి తీస్తే కొన్ని సార్లు చెడు ఎదురవుతూ వుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఆవిష్కరణలు, సాంకేతిక అద్భుతాలు ఒక ఉద్దేశంతో మొదలై ఎక్కడో ముగుస్తున్నాయి. చివరకు, విషాదాలకి దారి తీస్తున్నాయి! సోషల్ మీడియా కూడా ఆ లిస్టులో చేరింది!     కంప్యూటర్ కనుగొన్న సైంటిస్టుకి ఇంటర్నెట్ అంటూ ఒకటి వస్తుందని తెలియకపోవచ్చు. అలాగే, ఇంటర్నెట్ రూపొందించిన శాస్త్రవేత్తలకు ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఊహల్లో కూడా వుండకపోవచ్చు! కానీ, ఇవాళ్ల అవ్వి అంగీకరించి తీరాల్సిన నిజాలు! ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయన్నది కూడా నిజమే. అదీ ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, ఇండియా లాంటి దేశాల్లో మేలు చేసే సోషల్ మీడియా తలనొప్పులు కూడా తెచ్చి పెడుతోంది. అదే ప్రభుత్వానికి కూడా సమస్యగా మారింది! సోషల్ మీడియాలో ఇతర సైట్లు కూడా వున్నా… స్మార్ట్ ఫోన్లనే నమ్ముకున్న వాట్సప్ యాప్ దుమారం రేపుతోంది. ట్విట్టర్ కంటే, ఫేస్బుక్ కంటే వాట్సప్ సామాన్యులకి అత్యంత అందుబాటులో వుంటూ అవసరాలు తీరుస్తోంది. మాటలు, పాటలు, కథలు, కవితలు, వీడియోలు, ఆడియోలు… ఇలా ఒక్కటని కాకుండా అన్నీ షేర్ చేసుకుంటున్నారు కామన్ ఇండియన్స్. వాట్సప్పే అందరికీ దిక్కైపోయింది. కానీ, వాట్సప్ వాడే క్రమంలో తెలిసీ , తెలియక గందరగోళానికి, విషాదాలకి కూడా భారతీయులే కారణం అవుతున్నారు!     వాట్సప్ కంపెనీ వారు అధికారికంగా చెబుతోన్న సమాచారం ప్రకారం కూడా ఇండియన్స్ మెసేజ్ లు ఫార్వార్డ్ చేయటంలో అందరి కంటే ముందున్నారట. ప్రపంచంలో వాట్సప్ వాడే వారందరిలో మన భారీయులే మెసేజ్ ఫార్వార్డ్ ఆప్షన్ విపరీతంగా వాడుతున్నారట. ఇదే ఇప్పుడు సమస్యలకి కారణం అవుతోంది. ప్రాణాలు కూడా తీస్తోంది. తమకు వచ్చిన మెసేజ్ వెనకా ముందు ఆలోచించకుండా తమ కాంటక్ట్స్ లో వున్న అందరికీ పంపేస్తున్నారు. అలా వెళ్లిన మెసేజ్ ప్రభావం చాలా తీవ్రంగా వుంటోంది. ఈ మద్యే బళ్లారి ప్రాంతంలో హైద్రాబాద్ నుంచి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానంతో కొట్టి చంపారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్లు రెడ్ కార్లో వస్తున్నారన్న వాట్సప్ మెసేజే ఆ విషాదానికి కారణం! ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.     కాశ్మీర్ లాంటి కల్లోల ప్రాంతాల్లో కూడా వాట్సప్ మెసేజ్ లు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. రెచ్చగొట్టే తప్పుడు సందేశాలు వైరల్ గా మారిపోయి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. అందుకే, ఏ చిన్న అల్లరి మొదలైనా ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అర్థం కాని అజ్ఞానం, అత్యుత్సాహం! వాట్సప్ ఆమెరికాలోనూ, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కూడా వుంది. కానీ, అక్కడ ఇలా ఫార్వర్డ్ మెసేజీల సమస్య లేదు. వాట్సప్ మెసేజ్ లు చూసి జనం రెచ్చిపోరు. ఎందుకంటే, టెక్నాలజీని వాడుకోవటంలో వారు విచక్షణ చూపుతున్నారు. మన దగ్గర అది కొరవడుతోంది.     వాట్సప్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తప్పుడు వార్తల విషయమై నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో రెండు సార్లు తీవ్రంగా హెచ్చరించింది. వాట్సప్ వారు కూడా ఎలా ఫేక్ మెసేజ్ లు ఫిల్టర్ చేయాలా అని ఆలోచిస్తున్నారట. నియమాలు, నియంత్రణలు ఎలా వున్నా… జనం వాట్సప్ లాంటి ఆధునిక సౌకర్యాల్ని తెలివిగా, వివేకంతో వాడుకోవాలి. అంతే తప్ప తమకు ఏది వచ్చినా దాన్ని అందరికి చేరవేసి అనవసర సంకోభాలకి తెర తీయవద్దు. అలాగే, సున్నితమైన విషయాలపై వాట్సప్ లాంటి ఓపెన్ ఫోరమ్ లలో వచ్చే ప్రతీ మాటని నమ్మవద్దు. అన్నిటికి రెచ్చిపోతూ రోడ్ల మీదకొచ్చే ఉన్మాదాన్ని జనం మానుకోనంత వరకూ ఎంత మంచి ఆవిష్కరణ అయినా చెడుకే దారి తీస్తుంది. ప్రభుత్వం దీనిపై జనాన్ని చైతన్య పరచాలి!

దిల్లీలో అవిశ్వాసం… ట్విట్టర్‌లో జనసేనాని అయోమయం!

ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబువి తెలివైన రాజకీయాలు. జగన్ వి ఆవేశపూరిత రాజకీయాలు. ఇక పవన్‌వి ఆశ్చర్యకర రాజకీయాలు! ఆయన ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తారో, ఎవరికి గౌరవం ఇస్తారో, ఎవర్ని బతిమాలతారో, ఎవర్ని తిట్టిపోస్తారో ఆయనకే తెలియదు! అవిశ్వాస తీర్మానం నేపథ్యంలోనూ పవర్ స్టార్ ట్వీట్ల రాజకీయం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలింతకీ కళ్యాణ్ బాబు కథ ఏంటి, కథనం ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి అనేలా వ్యవహారం నడిచింది!     గత వారం రోజులుగా ఏదైనా అంశం తీవ్ర దుమారం రేపుతోంది అంటే… అది అవిశ్వాసమే! కేంద్రంపై టీడీపీ సంధించిన బలపరీక్ష అస్త్రం కలకలమే రేపుతోంది. లాభ, నష్టల మాట ఎలా వున్నా ఏపీకి జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. ఒక విధంగా మోదీ బోనులో నిలబడాల్సిన స్థితి వచ్చింది. టీడీపీ ఇంత వరకైనా సక్సెస్ అవుతుంటే జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి అస్త్ర సన్యాసానికి పాల్పడ్డారు. ఆయనకంటే తెలివైన వారు పవన్ కళ్యాణ్! అసలు ఈయన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న శుక్రవారం ఉదయం వరకూ నిద్రలేవలేదు! అవిశ్వాసం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు! జనసేన అనే ఒక పార్టీనే ఏర్పాటు చేసుకుని జనంలో తిరుగుతోన్న నాయకుడు ఇంత బాధ్యత రాహిత్యంతో వుండవచ్చా? హోదా గురించి ప్రజలు ఎంతో సీరియస్ గా వుంటే అది సమస్యే కాదన్నట్టు తన యాత్రలు, పర్యటనలు, కవాతులు తాను చేసుకుంటున్నారు పవన్. ఇక తప్పదన్నట్టు అవిశ్వాసం సభలో జరగనున్న నాటి ఉదయం రెండు మొక్కుబడి ట్వీట్లు చేసి ఊరుకున్నారు! అందులోనూ తనదైన శైలిలో గందరగోళ వ్యాఖ్యానం చేశారు జనసేనాని!     గుర్తుందిగా… ఇదే గబ్బర్ సింగ్ గతంలో అనంతపురం, కాకినాడ సభల్లో కాషాయ పార్టీని కడిగిపారేశారు. కానీ, ఇప్పుడు తాను కావాలన్న హోదా విషయంలోనే టీడీపీ పూర్తి స్థాయి యుద్ధం చేస్తుంటే … సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు! పవన్ తన ట్వీట్స్ లో స్వీట్ గా ఇలా చెప్పారు. బీజేపీ పెద్దలకు టీడీపీ పెద్దలతో ఏవైనా గొడవలుంటే ప్రత్యేక హోదాని పణంగా పెట్టవద్దట! ఇదేం చోద్యం? టీడీపీ నాయకత్వానికి బీజేపీ నేతలతో వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏముంటాయి? పవన్ కే తెలియాలి.     ఇక ఇంకో ట్వీట్ లో పవన్ టీడీపీ, బీజేపీలు రెండూ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ హోదా ఇవ్వమని పట్టుబట్టి అవిశ్వాస తీర్మానం దాకా వ్యవహారాన్ని లాక్కొస్తే నాటకాలు ఏమున్నాయి? మోదీని నేరుగా విమర్శిస్తోంటే ఇంకేం కావాలి? జగన్ తో బాటూ పవన్ ఈ మధ్య కాలంలో మోదీని పల్లెత్తు మాట అనటం మీరెప్పుడైనా చూశారా? కానీ, మన అజ్ఞాత వాసికి అన్ని రిస్క్ లు తీసుకుంటోన్న టీడీపీ కూడా బీజేపీకి తోడు దొంగలా కనిపిస్తోందట!     ఆ మధ్య ఏవో పెన్ డ్రైవ్ లు దొరికాయని వార్తలు రావటమే తప్ప వాటి గురించి, అవ్వి పవన్ పంథాపై చూపుతోన్న ప్రభావం గురించి అధికారికంగా ఏం తెలియటం లేదు. కానీ, పవన్ బీజేపీని సాద్యమైనంత తక్కువ టార్గెట్ చేసీ… మోదీని ఒక్క మాటైనా అనకుండా వుంటూ… టీడీపీని బోనులో నిలబెడుతుండటం చూస్తే… పెన్ డ్రైవ్ గాసిప్స్ నిజమేనేమో అనిపిస్తోంది! దిల్లీ పెద్దలు జగన్ని సీబీఐ ద్వారా, పవన్ని పెన్ డ్రైవ్ ద్వారా రిమోట్ కంట్రోలింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది! 

ఆటలో అరటి పండు అయిపోయిన వైసీపీ! 

ఇప్పుడు దేశమంతా పార్లమెంట్ వైపు చూస్తోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలు అవిశ్వాస తీర్మానం చర్చను శ్రద్ధగా వింటున్నారు. ఏపీ ప్రజలకు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఏం చెబుతోంది, బీజేపీ ఏం చెప్పబోతోంది ఈ రోజు తేలిపోతుంది. అలాగే, ప్రత్యేక హోదా గురించి ఇంత వరకూ ఒక్కసారి కూడా అధికారికంగా నోరు మెదపని మోదీ ఏమంటారు? అది కూడా తీర్మానంపై చర్చ చివరకొచ్చే సరికి స్పష్టం కానుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్న మరో వ్యక్తి జగన్! ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఆయన జనంలో పాదయాత్ర చేస్తున్నారు. సంతోషమే. కానీ, ఆయన ఎంపీలు ఎక్కడున్నారు? కీలకమైన ప్రత్యేక హోదా గురించి అవిశ్వాసం ముందుకొస్తే వారెక్కడా? ఇదీ సామాన్య ఆంద్రా జనం ఆలోచన!     జగన్ యువ నేత. ఒక విధంగా చెప్పాలంటే… ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పుట్టేటప్పటికే పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఆ అపార అనుభవం ఇప్పుడు కళ్లారా కనిపిస్తోంది! జగన్ వయస్సంత అనుభవం వున్న రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు అటు మోదీని , ఇటు జగన్ ని ఏక కాలంలో కార్నర్ చేశారనే చెప్పాలి. హోదా ఇవ్వని పీఎంని అవిశ్వాసానికి గురి చేయటమే గొప్ప విజయం! స్వంతంగా ఇరవై మంది ఎంపీలు కూడా లేని టీడీపీ ఆ పని చేయగలిగింది. ఇది గొప్ప నైతిక విజయమే. మోదీ ఓట్ల సంఖ్యతో బలపరీక్ష నెగ్గవచ్చు. కానీ, జనం ముందు బాబు తన పోరాట పటిమ నిరూపించుకున్నారు. మరి జగన్ సంగతేంటి?     జగన్ అనుభవ రాహిత్యం గత నాలుగేళ్లలో ఇది రెండోసారి సుస్పష్టంగా కనిపించటం. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్న ఆయన ఇప్పటికీ డెమొక్రటిక్ పాలిటిక్స్ ఒంట బట్టించుకోవటం లేదు. ఆ మధ్య అసెంబ్లీలోకి కోట్లాది ఓటర్లు తమని నమ్మి అందించిన ఎంట్రీని తనకు తానే దూరం చేసుకున్నారు. పాదయాత్ర అంటూ బయలుదేరి అసెంబ్లీని బహిష్కరించారు. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో కాదు. రోడ్లపై ఉద్యమాలు చేయటానికి ఎన్నికల్లో గెలవటం ఎందుకు? ఎన్జీవోలు స్థాపించుకుని కూడా జనం కోసం పోరాడవచ్చు కదా? ఏపీ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే దాన్ని అవతలకి విసిరేసి రోడ్డు మీదకొచ్చి మళ్లీ ఓటేయండి అంటూ పాదయాత్ర చేయటం జగన్ కే చెల్లింది!     అసెంబ్లీ వేదికగా తన అనుభవ రాహిత్యం నిరూపించుకున్న జగన్ తానే కాక తన ఎమ్మెల్యేలు కూడా జనం కష్టాలు ప్రస్తావించకుండా చేసేశారు. ఇప్పుడు అదే తప్పిదం పార్లమెంట్ వేదికగా ఎంపీల చేత చేయించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు వైసీపీ ఎంపీల్ని ఎందుకు గెలిపించారు? తమ గొంతు దిల్లీలో వినిపిస్తారని! కానీ, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా సమస్యపై జనం తరుఫున మాట్లాడాల్సిన సమయంలో జగన్ ఎంపీలు ఏ ఒక్కరూ లేరు! ఇది ఖచ్చితంగా జగన్ దుందుడుకు నిర్ణయం వల్లే! పార్లమెంట్లో టీడీపీ వాదన, బీజేపీ ప్రతి వాదన జరుగుతుంటే వైసీపీ స్వరమే లేకుండాపోయింది. ఇది చేజేతులారా జగన్ చేసుకున్న నిర్వాకం అనక తప్పదు!     చంద్రబాబువి సహనంతో కూడుకున్న రాజకీయాలు. జగన్ వి అసహనపు ఎదురు దాడులు. సీఎం అవ్వలేకపోయానన్న అసహనం, త్వరగా ఎన్నికలొచ్చి అధికార పీఠంపై కూర్చోవాలన్న అసహనం అతడ్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాతికేళ్లు ఎదురు చూసి సీఎం అయిన తన తండ్రి వైఎస్ చరిత్ర అయినా జగన్ ఒకసారి మననం చేసుకోవాలి. లేదంటే, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలుగా జగన్ ప్రజాస్వామ్యాన్ని , ఓటర్లు వేసిన ఓట్లని అపహాస్యం చేయటం… జనం సీరియస్ గా తీసుకుంటారు!