మూలిగే ఏపీ బీజేపీ నక్కపై…. జీవిఎల్ అనే తాటికాయ!

వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ చెరోవైపు నిలిస్తేనే రెండు ఎంపీ సీట్లోచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కమలాన్ని వదిలేశారు. పైగా అప్పుడు కాంగ్రెస్ విభజన చేసి ఆంధ్రుల్ని అడ్డంగా అన్యాయం చేసింది. ఆ బాధతో బీజేపీ లాంటి జాతీయ పార్టీ తమని ఆదుకుంటుందని ఏపీ ఓటర్లు భావించారు. మోదీని కూడా చాలా మందే నమ్మారు. కానీ, నాలుగేళ్లు గడిచే సరికి కాషాయ పార్టీ తలకిందులైపోయింది… ఏపీలో ఇచ్చిన రెండు సీట్లకు సరిపడా న్యాయం కూడా చేయలేదు మోదీ సర్కార్. ప్రత్యేక హోదా కాదంటే కాదని తెగేసే చెబుతోంది. పోలవరంకు ఇస్తున్న నిదులు అంతంతమాత్రమే. ఇక విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి డిమాండ్లపై ఎప్పుడు ఎవరు ఏ కామెంట్ చేస్తారో కేంద్రం పెద్దలకు, బీజేపీ నేతలకే తెలియాలి. మరి ఇటువంటి స్థితిలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లు ఎన్ని? ఇంతకు ముందటి రెండు సీట్ల సంఖ్యని నిలబెట్టుకుంటే … అదే పదివేలు!     ఇప్పటికే చాలా డ్యామేజైన ఏపీ బీజేపీ పరిస్థితిని ఓ జాతీయ స్థాయి తెలుగు కాషాయ నేత మరింత దిగజారుస్తున్నారు! అతనే… జీవిఎల్ నరసింహా రావు! ఈయన జాతీయ ఇంగ్లీషు న్యూస్ ఛానల్స్ లో బలంగానే వాదిస్తారు. బీజేపీపైన, ఆరెస్సెస్ పైన, మోదీ, షా వంటి నేతలపైనా ఈగ వాలనీయరు. ఆర్నాబ్ గోస్వామి లాంటి వారి చర్చల్లో కాంగ్రెస్ ను, కమ్యూనిస్టుల్ని ఉతికి ఆరేస్తుంటారు. తెలుగు వాడిగా జాతీయ స్థాయిలో జీవిఎల్ పర్ఫామెన్స్ మనకు గర్వకారణమే! కానీ, తీరా మన స్వంత రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం…. టీడీపీ వారి భాషలో చెప్పాలంటే… శనీశ్వరుడిలా తయారయ్యారు!     బీజేపీ అధికార ప్రతినిధిగా జీవిఎల్ ఇంగ్లీషు, హిందీ చర్చల్లో అదరగొడితే అదరగొట్టి వుండవచ్చు కానీ తెలుగు రాజకీయాలకు వచ్చేటప్పటికి తన పార్టీకి మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నారు. జీవిఎల్ ఏదో ఒక మాట అనటం… దానికి టీడీపీ మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించటం పరిపాటి అయిపోయింది. ఇక ఈ మధ్య ఏపీ ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు కుటుంబ రావు మరీ తీవ్రంగా దాడి చేసేశారు జీవిఎల్ పై! పీడీ అకౌంట్లలోని డబ్బు విషయంలో చంద్రబాబు సర్కార్ పై నరసింహా రావు లేనిపోని ఆరోపణలు చేశారు. అవి నిజమైనా కాకున్నా నిరూపించగలిగేవి అస్సలు కావు. అలాంటి ఆరోపణలు చేస్తే స్వయంగా ఆర్దిక మంత్రి యనమల తీవ్రంగా ఖండించారు. లెక్కలతో సహా పీడీ అకౌంట్ల సంగతంతా మీడియా ముందు పెట్టారు. అయితే, కుటుంబ రావు మాత్రం జీవిఎల్ ని ఏకంగా బుడబుక్కలోడు అనేశారు! ప్రతీ బుడబుక్కోలోడి ఆరోపణలకి విలువ ఇస్తూ పోతే పాలన ఎలా చేయాలి అన్నారు!     జీవిఎల్ పై వస్తోన్న వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే ఆయన వ్యవహారం వల్ల ఏపీ బీజేపీకి మాత్రం దారుణమైన పరిస్థితే ఎదురయ్యేలా వుంది! గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సున్నా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఈ సారి బీజేపీకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అసలే జనం హోదా విషయంలో బీజేపీ సర్కార్ తమని మోసం చేసిందని భావిస్తున్నారు. అటువంటి స్థితిలో మూలిగే నక్కపైన తాటికాయ లాగా… జీవిఎల్ రెచ్చగొట్టే ధోరణి మరింత నష్టం కలిగించకమానదు. మరి దీని గురించి అమిత్ షా ఏం చేస్తారో? ఎలాగూ దిల్లీ పెద్దలు ఆంధ్రా ఎంపీ సీట్లపై ఆశలు వదిలేశారు కాబట్టి చంద్రబాబుపై బురద జల్లే కార్యక్రమం కొనసాగించమని జీవిఎల్ కు చెబుతున్నది వారేనేమో! 

తమకి ‘న్యాయం’ జరగటం లేదంటోన్న న్యాయమూర్తులు ఎక్కువవుతున్నారా?

2014కు ముందు కూడా అనేక సార్లు ప్రభుత్వ మార్పు జరిగింది. కానీ, అప్పుడెప్పుడూ పెద్దగా సంచలనం కాలేదు. కానీ, గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ విజయం చరిత్ర తిరగ రాసింది. ఇది కేవలం మాట వరసకు చెప్పుకుంటోన్నది కాదు. నిజంగానే కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతిన్నది. మళ్లీ హస్తం పైకె లేవదు అని మనం చెప్పలేకున్నా దాదాపుగా తుడిచి పెట్టేశారు మోదీ! రెండు వందల సీట్ల నుంచీ నలభైకి పడిపోయింది కాంగ్రెస్ గ్రాఫ్! మళ్లీ ఆ రెండు వందల మార్కు ఎంపీ సీట్లు దాటటానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కి ఎంత టైం పడుతుంది? ఏమో చెప్పటం కష్టమే!     ఇప్పుడు మోదీ కాంగ్రెస్ పై చేసిన దండయత్ర గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… దిల్లీలో పీఠంపైకి కొత్త నేత రావటంతో దాని ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. రాహుల్, మమతా, మాయావతి, ములాయం, మన చంద్రబాబు… ఇలా చాలా మంది మోదీ వ్యతిరేక రాజకీయ పోరాటం చేస్తున్నారు. వీళ్లది కనిపించే యుద్ధం. కానీ మరో వర్గం వారు కనిపించని రణ రంగం చేస్తున్నారు మోదీ, ఆయన అనుకూల వర్గం శక్తులతో! అలాంటి వారే ఆర్బీఐ గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్, సుప్రీమ్ కోర్టు జస్టిస్ జోసెఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా…     మోదీ ప్రభుత్వానికి రఘురామ్ రాజన్ కి వున్న భేధాభిప్రాయాలు మనకి తెలియనివి కావు. అసలు ఆయన వున్నంత కాలం నోట్ల రద్దు జరగకపోవటం మోదీ సర్కార్ తో ఆయనకున్న గ్యాప్ వల్లే! అంతే కాదు, రఘురామ్ రాజన్ కాస్త కాంగ్రెస్ అనుకూల వైఖరి ప్రదర్శించటమూ మనం ఊహించలేని పరిణామం ఏం కాదు. ఎందుకంటే, ఆయనని విదేశాల నుంచీ తీసుకు వచ్చి ఆర్బీఐ గవర్నర్ ను చేసింది సోనియా ప్రభుత్వమే. ఇటువంటి దూరం అనేది ప్రభుత్వాలు మారినప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంటుంది. రాష్ట్రాల్లో అయితే పాత సీఎం పోయాక కొత్త సీఎంతో ఇమడలేని చాలా మంది ఉన్నతాధికారులు ప్రాముఖ్యత లేని పదవుల్లోకి ట్రాన్స్ ఫర్లు అయిపోతుంటారు….     2014లో వచ్చిన కొత్త ప్రధానికి , అంతకు ముందు కాంగ్రెస్ ప్రోత్సహించిన ఉన్నతాధికారులకి నడుమ మనస్పర్థలు పెద్ద పట్టించుకోవాల్సినవి కావు. కానీ, అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థలో కూడా అనేక మంది జడ్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వుండాల్సిన న్యాయవ్యవస్థ, మరీ ముఖ్యంగా సుప్రీమ్ కోర్టులోని అంతర్గత ప్రపంచం ఇప్పుడు పదే పదే రోడ్డున పడుతోంది. ఆ మధ్య చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విషయంలో నానా హంగామా జరిగింది. ఆయన మీద ఆరోపణలు చేసిన ప్రతిపక్షలు ఏకంగా అభిశంసనకు ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మోదీ ప్రభుత్వ సలహా మేరకు దాన్ని తోసి పుచ్చారు. ఇలా ప్రతిపక్షం ఒక ప్రధాన న్యాయమూర్తిపై కత్తిగట్టడం నిజంగా ఆందోళనకరమే!     న్యాయవ్యవస్థలోని జడ్జీలతో ప్రతిపక్షాలకే కాదు అధికార పక్షానికి కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ సీనియారిటీ వివాదం మన దేశంలోని వ్యవస్థల నడుమ ఒత్తిడి పట్టి చూపుతోంది. ఎప్పట్నుంచో కేరళకు చెందిన కేఎం జోసెఫ్ పదోన్నతిని కేంద్రం తొక్కి పెడుతోంది. సుప్రీమ్ కోర్టుకు జడ్జీలను నియమించే కొలీజియమ్ ఆయనని అత్యున్నత న్యాయస్థానంలో జడ్జ్ గా చాలా నెలల క్రితమే ఎంపిక చేసింది. అయినా ఆయనకున్న అనుభవం తక్కువంటూ, ఇతర కారణాలు చెబుతూ మోదీ సర్కార్ బ్రేకులు వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు తప్పని పరిస్థితుల్లో జోసెఫ్ ను సుప్రీమ్ న్యాయమూర్తిగా గవర్నమెంట్ నియమించింది. కానీ, అంతలోనే తన స్టైల్లో తాను వ్యూహం అమలు చేసింది. మరో ఇద్దరు న్యాయమూర్తుల్ని కూడా నియమించిన కేంద్ర ప్రభుత్వం జోసెఫ్ ను మూడో స్థానంలో ప్రకటించింది. అంటే మిగతా ఇద్దరు జడ్జీల కంటే జోసెఫ్ జూనియర్ అవుతారు. జడ్జీగా ప్రమాణ స్వీకారం కూడా ఆయన మూడో వాడిగానే చేయాలి. దీని ఎఫెక్ట్ ఆయన ముందు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అవ్వటంపై కూడా వుంటుందట! అసలు ఇంతగా కేంద్రం జోసెఫ్ పై ఆగ్రహంగా వుండటానికి కారణం ఏంటి?     2016లో ఉత్తరాఖండ్ లోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది మోదీ గవర్నమెంట్. కానీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించటానికి వీలు లేదని తీర్పు ఇచ్చారు జోసెఫ్. ఇది ఒక్కటే కారణమా? లేక ప్రభుత్వానికి , జస్టిస్ కి ఇంకా ఏమైనా విభేదాలున్నాయా? పబ్లిగ్గా తెలిసే అవకాశాలు తక్కువ. కానీ, ఇటువంటి పరిస్థితి కేవలం జోసెఫ్ కే కాదు చాలా మంది న్యాయమూర్తులకి ఉన్నట్టు కనిపిస్తోంది. మన తెలుగువాడైన జస్టిస్ చలమేశ్వర్ కూడా మోదీ ప్రభుత్వ వ్యతిరేకి అన్నట్టుగా ఒక వర్గం జాతీయ మీడియా కథనాలు రాసింది. ప్రభుత్వానికి , అత్యంత శక్తివంతమైన న్యాయవ్యవస్థకి మధ్య దూరం పెరగటం వాంఛనీయం కాదు. కానీ, ఇప్పుడున్న రాజకీయ స్థితిగతుల్లో అది ఆపటం కూడా వీలు కాదు. కాకపోతే, ఇటు ప్రభుత్వం, అటు జడ్జీలు రెండు వైపుల నుంచీ ప్రజలు, దేశం శ్రేయస్సు ఆలోచిస్తే అన్నీ సాధ్యమే! ఆ పని జరగాలని ఆశిద్దాం… 

(టి కప్పులో) తుఫాను… ఆధార్ వివాదం!

మనకు రోజూ కనిపించేవి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం గొడవలే! లేదంటే… సినిమా వాళ్ల కాంట్రవర్సీలు, క్రికెటర్ల ఎఫైర్లు వగైరా వగైరా! కానీ, ఈ మధ్య కాలంలో అలాంటి రెగ్యులర్ గోలతో కాకుండా వెరైటీగా ఆకట్టుకున్న వివాదం… ఆధార్ భద్రత! ఇందులో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అనటానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే, ఆధార్ మొదలు పెట్టింది ఈనాటి ప్రతిపక్షం కాంగ్రెస్! యూపీఏ హయాంలో హస్తం పార్టీనే ఆధార్ కు తెరతీసింది. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కొనసాగిస్తోంది. అయితే, ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం ఆధార్ పై వెనక్కి తగ్గటం లేదు. అది సాధ్యం కాదు కూడా! ఇప్పటికే కోట్లాది మంది ఆధార్ తీసేసుకున్నారు. ఎన్నో పథకాలు ఆధార్ తో అనుసందానం అయిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధార్ ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకి నడుమ ప్రధాన ఆధారం అయిపోయింది. కానీ, ఇదే సమయంలో వరుసగా రోజుకోసారి సోషల్ మీడియాలో ఆధార్ దుమారం రేగుతోంది! అదే ఆందోళనకరం.     ఆధార్ జారీలో, నిర్వహణలో లోపాలున్నాయని చాలా మంది ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే, చాలా వరకూ దాన్నెవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. ఇండియాలో డబ్బులు పెడితే ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా దొరికిపోతుందని మనకు ముందే తెలుసు! కాబట్టి ఎవ్వరూ పెద్దగా షాకవ్వలేదు. మన దగ్గర శ్రద్ధగా కష్టపడితే పాస్ పోర్ట్ లు కూడా ఎన్నంటే అన్నీ జారీ అయిపోతుంటాయి. ఆధార్ సంఖ్య లీకైతే మాత్రం ఏంటిలే అనుకున్నారు సామాన్యులు! బయట పెద్దగా పట్టించుకోకున్నా సోషల్ మీడియాలో గొడవ మాత్రం బాగానే జరిగింది ఆధార్ పైన. ఒకవైపు ఆధార్ పకడ్బందీగా వుందని ఆధార్ జారీ చేసే సంస్థ చెబుతోంటే మరో వైపు అంతా డొల్లేనని నెటిజన్లు, హ్యాకర్లు వాదిస్తూ వచ్చారు. వీరందరికీ మాంచి ఛాలెంజ్ విసిరి ఒక్కసారి కాక పుట్టించారు రామ్ సేవక్ శర్మ. ఆయనెవరో మామూలు వాడైతే పెద్ద గోల జరిగేది కాదు. ఆయన ప్రస్తుత ట్రాయ్ ప్రధానాధికారి! గతంలో ఆధార్ జారీ యూఐడీఏఐకి కూడా బాస్ గా పని చేశాడు! ఆయన ఆధార్ వ్యవస్థపై వున్న నమ్మకంతో తన నెంబర్ ట్విట్టర్ లో పెట్టాడు. అంతే కాదు, ఆ ఆధార్ తో తనకు ఎలాంటి హాని చేయగలరో చేయండని సవాల్ విసిరాడు!     ఆర్ఎస్ శర్మ ఛాలెంజ్ తో రెచ్చిపోయిన నెటిజన్లు ఆయన ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ లాంటి చాలా వివరాలు బహిర్గతం చేశారు. చివరకు, ఒకరు శర్మగారి అకౌంట్లో ఒక రూపాయి డిపాజిట్ చేశారు! ఇంత రచ్చ జరిగినా ఆర్ఎస్ శర్మ తనకు హాని ఏం చేయలేకపోయారని తొడ గొట్టాడు! తన అకౌంట్లో రూపాయి పడితే అది లాభమేనని సమర్థించుకున్నాడు! శర్మ చెప్పినట్టు ఆధార్ నెంబర్ లభించినా ఎవ్వరూ ఆయనకు హాని చేయలేకపోయారు. అది నిజమే. కానీ, అసలు ఇంత రచ్చెందుకు ? ఆయన ఆవేశంగా తన నెంబర్ పబ్లిక్ లో పెట్టడం ఎందుకు? చివరకు, ఆధార్ కార్డులు ఇచ్చే యూఐడీఏఐ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో జనాన్ని హెచ్చరించింది. ఎవ్వరూ ఆధార్ నెంబర్ పబ్లిక్ లో పెట్టకూడదని చెప్పింది. సవాళ్లు విసరొద్దని అంటూ శర్మకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది!     మొత్తం మీద మాజీ ఆధార్ ప్రాదికార సంస్థ బాస్ సృష్టించిన తుఫాన్ టీకప్పులో ముగిసిపోగా… మళ్లీ కొన్ని గంటల్లోనే తాజా ఆధార్ వివాదం మొదలైంది. చాలా మంది మొబైల్ ఫోన్లలో ఆటోమేటిక్ గా ఆధార్ కాల్ సెంటర్ నెంబర్ అప్ డేట్ అయిపోయిందట! అంటే, మీ ఫోన్లో మీరు ఫీడ్ చేయకుండా ఆధార్ అనే పేరుతో కాంటాక్ట్ సేవ్ అయిపోతుంది! ఇదెలా? ప్రస్తుతానికైతే యూఐడీఏఐ దీనిపై స్పందించలేదు. ఆధార్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎలా జనాల ఫోన్లలోకి వచ్చిందో చెప్పలేకపోతోంది. మరో వైపు హ్యాకర్లు మాత్రం గట్టి ప్రశ్నిస్తున్నారు. ఆధార్ లో వున్న ప్రైవెసీ ఇంతేనా అంటున్నారు!   ఏదైనా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నప్పుడు అనేక లోటుపాట్లు సహజమే. ఆధార్ కూడా అలా కొన్ని లోపాలతో వుండవచ్చు. అలాగని ఆధార్ నే కాదని వద్దనలేం. అదీ ఇంత మంది ఆధార్ తో అనుసంధానం అయ్యాక. కాబట్టి ప్రభుత్వం ఆధార్ ను మరింత పటిష్ఠ పరిచే చర్యలు తీసుకోవటం ఉత్తమం. ఇలాంటి సమస్యలే ఓటర్ ఐడీ కార్డుల జారీలో కూడా మొదట్లో వచ్చాయి. ఇలాంటి టెక్నికల్ ఆరోపణలే ఈవీఎంలపై మన అపోజీషన్ లో వుండే పార్టీలు చేస్తుంటాయి. కాబట్టి ఆరోపణలన్నీ సీరియస్ గా తీసుకోకున్నా జాతియ, వ్యక్తిగత భద్రతలకు భంగం కలగకుండా మాత్రం ప్రభుత్వం చూడాలి. అందుకు , ఏం చేస్తే ఆధార్ మరింత సేఫ్ గా మారుతుందో ఆలోచించాలి. మనసుంటే మార్గం వుంటుంది.

నిరుద్యోగభృతి… ఎన్నికల ముందు లోకేష్ మోహరించిన మిసైల్!

ఎన్నికల ముందు సంవత్సరం ఏ ప్రభుత్వమైనా ప్రజల్ని మెప్పించే పథకాలు విరివిగా అమలు చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అయితే, వాటి లక్ష్యం ఓట్లు మాత్రమే అయి వుంటాయి. చాలా వరకూ పాలకుల వరస ఇలాగే వుంటుంది. కానీ, ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిరుద్యోగభృతిని అలా చూడలేం. వైసీపీ దీన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేయవచ్చుగాని… నిరుద్యోగభృతి నిస్సందేహంగా గొప్ప పథకమే. ఎందుకంటే, నెలకు వెయ్యి రూపాయలు అందుకునే 22 నుంచీ 35 ఏళ్ల మధ్య వయస్సులోని నిరుద్యోగ యువత దాన్ని ఎంతో సమర్థంగా వాడుకోగలుగుతారు. వారి అవసరాలన్నీ ఆ డబ్బుతో తీరిపోతాయని ప్రభుత్వం కూడా ఎక్కడా చెప్పటం లేదు. కానీ, నిరుద్యోగ యువత చేసే ఉద్యోగాన్వేషణలో అవి చక్కగా ఉపయోగపడతాయి.     నిరుద్యోగ భృతి ఐడియా గత ఎన్నికల కాలం నాటిదే. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే, ఇంత కాలం దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు హడావిడిగా తీసుకొస్తున్నారా అంటే… సూటి సమాధానం అంటూ వుండదు. ఎందుకంటే, నవ్యాంధ్ర రాష్ట్రానికి తొలి సీఎంగా చంద్రబాబు గత నాలుగేళ్లలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటన్నటి మధ్యా నిరుద్యోగభృతి ఆలస్యమైతే అయి వుండవచ్చు. కానీ, నిరుద్యోగభృతి అందించాలన్న ఆయన చిత్తశుద్ధిని మనం శంకించలేం. అలాగే, యువ నేత లోకేష్ దీనిపై చూపిన పట్టుదల కూడా మెచ్చుకుని తీరాల్సిందే!     నిరుద్యోగభృతి పథకానికి యువనేస్తం అన్న పేరు సూచించారట లోకేష్. ఈ పథకంపై పూర్తి స్థాయిలో కూలంకషంగా అధ్యయనం చేసింది ఆయనే. మొదటి నుంచీ దీని సాధ్యాసాద్యాలు ఆలోచించి పకడ్బందీగా ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ పథకం వల్ల మొత్తం 12 లక్షల మంది యువత లాభపడనున్నారు. ఇంతటి భారీ పథకానికి యువ నేస్తం అన్న పేరు సరిగ్గా సరిపోతుంది. అయితే, చంద్రబాబు యువనేస్తం అంటూ నామకరణం చేద్దామని మంత్రులు అభ్యర్థించినా సీఎం వద్దన్నారట. ఈ పథకం క్రెడిట్ అంతా లోకేష్ దేనని బాబు చెప్పారట కూడా!   చంద్రబాబు, లోకేష్ లలో ఎవరికి నిరుద్యోగభృతి క్రెడిట్ దక్కినా అదేం పెద్ద ముఖ్యం కాదు. అంతిమంగా టీడీపీకి లాభం చేకూరితే కార్యకర్తలకి అదే సంతోషం! కానీ, ఇంతకీ ఈ నిరుద్యోగభృతి వల్ల లోకేష్ ఆశిస్తున్న రాజకీయ లబ్ది ఏంటి? యువతలో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవటమే! ఒకవైపు రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రం, మరో వైపు కేంద్రం సృష్టిస్తోన్న అడ్డంకులు, ఇంకో వైపు బాద్యత లేని ప్రతిపక్షాల కుట్ర రాజకీయం… ఇన్నిటి మధ్యా అనుకున్నని ఉద్యోగాలు కల్పించలేకపోవటం సహజమే! అయినా కూడా ఓటు వేసి అధికారం అందించిన జనం పట్ల తమ బాద్యతని నిరూపించుకోవటమే నిరద్యోగభృతి లక్ష్యం. అయితే, నిరుద్యోగభృతికి ఓకే చెప్పిన సమావేశంలోనే ఏపీ కేబినేట్ 20 వేల ఉద్యోగాల భర్తీకి కూడా పచ్చజెండా ఊపటం మనం జాగ్రత్తగా గుర్తించాలి! ఉద్యోగాల కల్పన సాగుతూనే వుంటుంది. అంతవరకూ నిరుద్యోగులకి ఉపశమనం కోసమే … ఈ నిరుద్యోగభృతి!

కేసీఆర్‌కు అపాయింట్మెంట్! బాబుకు డిస్సపాయింట్మెంట్! మోదీ రాజకీయం! 

కేసీఆర్ మరోసారి దిల్లీ ప్లైట్ ఎక్కారు. మోదీతో సహా మరికొందరు కేంద్రమంత్రుల్ని కలుస్తారట! తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానం కేంద్రం చేత అమోదింపజేయించుకోటానికి ఈ టూర్ అంటున్నారు! ఇదంతా అధికారికమే… అయితే, కేసీఆర్, మోదీల కొత్త స్నేహానికి కూడా ఇది ఒక విధమైన సంకేతమే!     కేసీఆర్ 2014లో మోదీకి చాలా దూరం. కానీ, ఇప్పుడు ఆయన నమ్మదగ్గ నాయకుల్లో ఒకరైపోయారు. ఒకవైపు చంద్రబాబును దూరం చేసుకున్న మోదీ పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతే కాదు, ఇప్పుడు కేసీఆర్ ఇంచుమించూ నెలకొకసారి దిల్లీకి వెళ్లివస్తున్నారు. పోయిన నెలలో కూడా ఆయన మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన జోనల్ విధానం మోదీ సర్కార్ కూడా ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. హైకోర్ట్ విభజన, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లాంటి మరి కొన్ని డిమాండ్లు కూడా వున్నాయి. అయితే, ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో జోనల్ విధానంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.దీనికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానికులకి 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయి. ఆ విధంగా రిజర్వేషన్ అమలవుతుంది. ఇది ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన అస్త్రంగా ఉపయోగపడుతుంది!     తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు, నిప్పే! గులాబీ పార్టీ ఎన్డీఏలో లేదు కాబట్టి రాష్ట్ర నేతలు అడపాదడపా ఆరోపణలు చేస్తూనే వుంటారు. కానీ, కేంద్రం పెద్దలు మాత్రం ఈ మధ్య కాలంలో సంపూర్ణమైన ప్రోత్సాహం ఇస్తున్నారు గులాబీ కారుకి! ఒకప్పుడు మోడీ లేడు గీడీ లేడు, మోడీగాడు… అన్న కేసీఆరే ఇప్పుడు ప్రధాని ఫేవరెట్ సీఎం అయ్యారు. మరీ ముఖ్యంగా, తెలంగాణలో బీజేపీకి నష్టం చేసే నిర్ణయాలు కూడా మోదీ ప్రభుత్వం కేసీఆర్ కోసం తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జోనల్ విధానం లాంటి విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది టీఆర్ఎస్ కు ఓట్లు సంపాదించి పెడుతంది. దీనికి మోదీ లాంటి రాజకీయ నాయకుడు అంగీకరిస్తే .. అది పెద్ద ఆశ్చర్యమే! ఎందుకంటే, కళ్ల ముందే మనకు ఏపీలో ఏం జరుగుతోందో తెలిసిందే కదా!   చంద్రబాబుతో 2014లో క్లోజ్ గా మూవ్ అయిన మోదీ ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. కేసీఆర్ కు, విజయసాయి రెడ్డికి ఇచ్చిన అపాయింట్ మెంట్లలో సగం సార్లు కూడా ఇవ్వటం లేదు. మరో వైపు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే, కడప ఉక్కు వంటి వాటి మీద మోదీ సర్కార్ కొర్రీలు మనకు తెలియనివి కావు! ఇలా ఒకవైపు ఆంద్రాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తూ , తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం అన్ని విధాల వెన్ను తట్టి ప్రోత్సహించటం ఎలా అర్థం చేసుకోవాలి? నిస్సందేహంగా మోదీ, అమిత్ షా మార్కు రాజకీయంగానే! చంద్రబాబును టార్గెట్ చేసేందుకు కేసీఆర్ సాయం మోదీ తీసుకుంటున్నారు. మోదీకి సాయం చేసినందుకు కేసీఆర్ తెలంగాణలో తమ పార్టీ బలోపేతం చేసుకుంటున్నారు. ఇదీ గులాబీ బాస్ దిల్లీ టూర్ల వెనుక సారాంశం! 

ఇమ్రాన్ పిలిచాడు! ఇండియన్స్ వెళుతున్నారు! సబబేనా?

అంతర్జాతీయ రాజకీయాల్లో ఆహ్వాన రాజకీయాలు వేరు! అవేంటి అంటారా? ఒక దేశ అధినేతని తమ దేశానికి రమ్మని మరో దేశాధినేత ఆహ్వానించటమే ఈ వెల్ కమ్ పాలిటిక్స్! ఇవి ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. అయితే, మోదీ వచ్చాక మన దేశానికి కాస్త ఎక్కువయ్యాయి. ఇంతకు ముందు మన ప్రధానులు, రాష్ట్రపతులు దశాబ్దాల పాటూ ఒకే విదేశాంగ విధానంతో కొనసాగే వారు. కానీ, మోదీ వచ్చాక ఈ దేశం, ఆ దేశం అంటూ తేడా లేకుండా అన్నిట్నీ చుట్టి వస్తున్నారు. అందు కోసం ఆయన్ని విమర్శించే వార్ని పక్కన పెడితే ఒక దేశాధినేతగా ఆయన అలా అనేక దేశాలతో సంబంధాలు నెరపటం హర్షించదగిందే.     అమెరికా మొదలు ఆఫ్రికా దేశాల వరకూ మోదీ ఇప్పటి దాకా చాలా దేశాల్నే పర్యటించారు. అయితే, వాటిలో ప్రధానమైనవి అమెరికా, యూరప్, ఇజ్రాయిల్ వంటివి చెప్పవచ్చు. ఈ దేశాలకు వెళ్లిన మోదీ కొన్ని దేశాల అధినేతల్ని మన దేశానికి రమ్మని పిలిచారు కూడా! వారు చాలా వరకూ పాజిటివ్ గానే స్పందించారు ఆయా నేతలు. చైనా తరువాత అత్యంత వేగంగా దూసుకుపోతోన్న ఆర్దిక వ్యవస్థతో వున్న భారత్ ఎవర్ని ఆహ్వానించినా ఇప్పుడు సంతోషంగా వస్తారనే చెప్పుకోవచ్చు. మనల్ని ఎప్పుడూ ఆర్థిక రంగ శత్రువుగా చూసే చైనా కూడా ఇండియా నుంచీ వెల్ కమ్ మెసేజ్ రాగానే ఆనందంగా వచ్చేస్తోంది. భారత్ లో ఇప్పటికే జిన్ పింగ్ సందడి చేశారు.     అమెరికా గత అధ్యక్షుడు ఒబామా మన దేశానికి మోదీ ఆహ్వానంపైనే వచ్చారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన గ్రాండ్ వెల్ కమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా రావాలని భావిస్తున్నారట. ఇంకా డిసైడ్ కాలేదని చెబుతోన్న ఆయన రాకపోవటానికి పెద్ద కారణాలైతే కనిపించటం లేదు. ఇండియాతో, మోదీతో ట్రంప్ కు కొన్ని భేదాభిప్రాయాలు వున్నా ఆయన మన ఆహ్వానాన్ని మన్నించే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే ఆయన కూతురు ఇవాంక ట్రంప్ ఇక్కడికి వచ్చి వెళ్లి ఇండియా గురించి, మోదీ గురించి గొప్పగా అభిప్రాయం వెలిబుచ్చింది.     ఆహ్వాన రాజకీయాల్లో మరో కోణమూ వుంటుంది. ఏ చిన్న దేశాధినేత వచ్చినా మోదీ స్వయంగా వెళ్లి ఆలింగనం చేసుకుని వెల్ కమ్ చెబుతారు. కానీ, కెనడా పీఎం వస్తే అస్సలు పట్టించుకోలేదు. ఇందుకు కారణం ఆయన ఖలిస్థాన్ వేర్పాటువాదులకి మద్దతు పలుకుతుండటమే. ఇది ఒకరకంగా నిరసన తెలపటమే! ఇలా వెల్ కమ్ పాలిటిక్స్ జోరుగా సాగిస్తున్నారు మోదీ. అయితే, పాకిస్తాన్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోదీని ఆహ్వానించాలా వద్దా అని ఆలోచనలో వున్నారట! స్వాగత రాజకీయాల్లో ఆరితేరిన మోదీ తీరా పిలిచాక రానంటే పరువు పోతుందని పాక్ అధికారులు ఇమ్రాన్ ని హెచ్చరిస్తున్నారట.     మోదీ తాను ప్రధానిగా ఎన్నిక కాగానే ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. అలాగే, నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లికి అనూహ్యంగా పక్కదేశంలో దిగిపోయారు. తన వ్యక్తిగత భద్రతని కూడా ఆయన రిస్క్ చేశారు. మరి ఇప్పుడు ఇమ్రాన్ ఆహ్వానం మన్నిస్తారా? ఇది పెద్ద ప్రశ్నే! మోదీ ఇమ్రాన్ ప్రమాణానికి హాజరైతే అది పాకిస్తాన్ తో మనం సత్సంబంధాలు కోరుతున్నామని సంకేతాలు ఇస్తుంది. కానీ, నిత్యం మన సైనికుల్ని పొట్టన పెట్టుకుని, కాశ్మీర్ లో రాళ్ల వర్షం కురవటానికి కారణమై, ఉగ్రవాదుల్ని ఎగదోస్తోన్న పాక్ ను ఎలా అంగీకరించగలం? సామాన్య భారతీయులు, సైన్యం చచ్చిపోతుంటే… అదే దేశానికి అతిధులుగా వెళ్లి సంబరాల్లో పాల్గొనటం హర్షనీయం కాదు! ఈ కోణంలో తప్పక మోదీ ఆలోచించాలి! ఇప్పటికే గవాస్కర్, సిద్దూ, కపిల్ దేవ్, ఆమీర్ ఖాన్ వంటి వారు ఇమ్రాన్ వెల్ కమ్ చెప్పగానే ట్రావెల్ బ్యాగులతో రెడీ అయిపోయారు. మోదీ కూడా వెళితే అది పూర్తిగా తప్పుడు సంకేతమే అవుతుంది. కుక్క తోక వంకర లాంటి పాక్ ను పనిగట్టుకుని వెళ్లి హాజరై ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. అదీ సైన్యం సహకారంతో గద్దెనెక్కుతోన్న ఇమ్రాన్ ను అస్సలు ప్రొత్సాహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం ఈ రెండూ ఇమ్రాన్ పరిష్కరిస్తాడని ఆశించటం… అత్యాశ తప్ప మరొకటి కాదు!

స్వంత సామాజిక వర్గంలో సాంతం పోగొట్టుకుంటున్న పవన్!

ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారిన అంశాల్లో కాపు రిజర్వేషన్లు ఒకటి. నిజానికి కాస్తో కూస్తో చంద్రబాబును ఇరుకున పెట్టదలుచుకుంటే మిగిలింది అదొక్కటే! ప్రత్యేక హోదా మీద ఆయన చేయగలిగింది అంతా చేస్తున్నారు. పార్లెమంట్ వేదికగా మోదీ వ్యతిరేక గళం ధైర్యంగా వినిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో కీలకంగా మారి వచ్చే ఎన్నికల తరువాతైనా హోదా సాధించే వ్యూహం పన్నుతున్నారు. ఇక పోలవరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపే పోలవరం నీళ్లు కొంత మంది ఆంద్రా రైతుల పోలాల్ని అయినా తడిపి తీరుతాయి. ఇలాంటి నేపథ్యంలో కాపు రిజర్వేషన్ పై బాబు మాట ఇంకా అమలు కాలేదు. అదే జగన్, పవన్ చక్కగా వాడుకోగల అంశం!     కాపు రిజర్వేషన్లు బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో వుంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది కాబట్టి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తే కాపులు బీసీల్లో చేరతారు. కానీ, దాన్ని ఎలాగైన రాజకీయ అంశంగా కొనసాగించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పోనీ అదన్నా సీరియస్ గా చేసి చంద్రబాబును ఇరుకున పెడుతన్నాయా అంటే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ తమకు తామే డ్యామేజ్ చేసుకుంటున్నాయి. జగన్ కాపు రిజర్వేషన్ విషయంలో ఈ మద్యే చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్నారు! నా వల్ల ఏం కాదని చేతులు ఎత్తేసి ఇరవై నాలుగ్గంటల్లో మీడియా వక్రీకరించింది అన్నారు. కేంద్రం పరిధిలో వున్న అంశం నేనేం చేయలేనని ఆయనే లైవ్ లో మాట్లాడారు. వేలాది జనం విన్నారు. అయినా జగన్ తూచ్ .. నేను అలా అనలేదు అని దబాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి కాపు సామాజిక వర్గంలో అనుమానాస్పదుడుగా మిగిలిపోయారు!     కాపు రిజర్వేషన్ అంశం జగన్ కంటే ఎక్కువగా వాడుకోగలిగేది పవన్! ఆయన ప్లేస్ లో మరో అనుభవం, లోక జ్ఞానం వున్న కాపు నేత వుండి వుంటే నానా రచ్చ చేసి వుండేవాడు. మరీ గుజరాత్ లోని హార్దిక పటేల్ లా రోడ్డు మీద పోరాటాలకు తెగించకున్నా కనీసం రాజకీయ ప్రసంగాలతోనైనా కాపుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు పవన్! అదే సామాజిక వర్గానికి చెందిన స్టార్ హీరో అయిన ఆయన ఏం చెప్పినా కాపు యువత తీవ్రంగా ప్రభావితం అవుతారు. మరి అటువంటప్పుడు పవన్ తాను కాపు రిజర్వేషన్లకు అనుకూలం అని చెబితే ఏం పోయింది? అది సాద్యం కాదు… కేంద్రం పరిధిలో వుంది… కాబట్టి కాపుల్ని మోసం చేయకూడదని జనసేనాని ఆలోచనా? అంత మంచి ఆలోచన వుంటే అదే చెప్పొచ్చు కదా? అలా కూడా చేయకుండా పవన్ ఓ కమిటీ వేశారు! గతంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ , జేఎఫ్సీ లాంటి హంగామాలు చేసిన పవర్ స్టార్ ఇప్పుడు మరోసారి ముచ్చటగా కాపుల డిమాండ్ పై కమిటీ వేశారు! పోయిన ఎన్నికల ముందు నుంచీ కీలకమైన అంశంగా వున్న కాపుల అంశంపై ఇప్పుడు అధ్యయనమా? ఏమైనా కామన్ సెన్స్ వుందా అనేస్తున్నారు జనసేనాని ప్రత్యర్థులు!   కాపు రిజర్వేషన్లకు అనుకూలమని, వ్యతిరేకమని ఏదీ చెప్పకుండా పవన్ కమిటీ రాజకీయాలు నడుపుతున్నారు. ఆయన వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, ఈయన అభిప్రాయం వెలిబుచ్చేది ఎప్పుడు, కాపు ఓటర్లు ఆయనకు మద్దతు పలకాలా వద్దా అని నిర్ణయించుకునేది ఎప్పుడు? పవన్ కాపు రిర్వేషన్ల అంశాన్ని హ్యాండిల్ చేస్తున్న పద్దతి, తన వర్గం వారిలో బలమైన నేతగా ఎదిగే అవకాశాన్ని చేజార్చుకుంటున్న తీరు చూస్తే … ఆయన అపరిపక్వత తప్ప మరేం కనిపించటం లేదు. ఇదే ప్రస్తుతం రాజకీయ పండితుల అభిప్రాయం!  

జగన్, కేసీఆర్‌లకు బదులు చంద్రబాబునే నమ్ముకున్న మమతా!  

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారా? ఇలా మాట్లాడితే బీజేపీ అభిమానులు తెగ కామెడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియాలో వారి హల్ చల్ అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు కూడా ఇదే వరస. చంద్రబాబు చక్రం తిరగలేదంటూ వెటకారాలు! అయితే, ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయం తెలుగు రాష్ట్ర కాషాయ అభిమానులు గుర్తించకపోవటమే పెద్ద విషాదం!     వచ్చే ఎన్నికల్లో ఏపీ కమలం పరిస్థితి గత ఎన్నికల్లో కాంగ్రెస్ లాగే వుండబోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం మోదీ , అమిత్ షా కుట్ర రాజకీయాలే. దానికి తగ్గట్టే చంద్రబాబు వరుసగా తెలివైన అడుగులు వేస్తూ వస్తున్నారు. చర్చ మొత్తం ప్రత్యేక హోదా వైపు మరల్చటంతో రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద విలన్ అయింది. ఆ విలన్ కి తోక పార్టీగా వైసీపీని నిలబెట్టడం కూడా చంద్రబాబు వ్యూహమే! అది ఫలించిందనే చెప్పుకోవాలి. అయితే, చంద్రబాబు తిప్పిన చక్రం అసలు ఎఫెక్ట్ దిల్లీలో పడబోతోంది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీకి ఇక్కడ సున్నా స్థానాలు వచ్చిన నష్టమేం లేదు. కానీ, దిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు డ్యామేజ్ భారీగానే వుండబోతోంది… అదే మోదీ, షాలు ఆలోచించుకోవాల్సిన సంగతి!     జాతీయ స్థాయిలో తాజా పరిణామాలు చూస్తే … బెంగాలీ రెబెల్ మమతా బెనర్జీ దిల్లీ చేరారు. సోనియా, రాహుల్ తో భేటీ అయిన ఆమె ప్రధాని రేస్ లో లేనని ప్రకటించారు. ముందు బీజేపీ కుట్రల్ని ఛేదించి అంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ వ్యతిరేక టీమ్ గా మారి ఎన్నికలు ఎదుర్కొంటే తరువాత పీఎం ఎవరన్నది ఆలోచించవచ్చని మమతా మాట. అంటే, ఎన్నికల్లో మోదీని, బీజేపీ అరికడితే … తరువాత అందరికీ సమ్మతమైన నేతని పీఎం చేయవచ్చని ఆమె ఆలోచన! ఇప్పుడున్న స్థితిలో ఇంత కంటే వేరే మార్గం లేదు మోదీ వ్యతిరేక వర్గానికి. ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత రాహుల్ అందరికీ ఆమోదం కాదు. అలాగే, ప్రాంతీయ నేతలు కూడా ఏ ఒక్కరూ ప్రధాని పదవికి ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించటం లేదు. అందుకే, ఆమె ముందు ఎన్నికలు, తరువాత పీఎం కుర్చీ అన్నారు.         మమతా బెనర్జీ సోనియా, రాహుల్ ని కలవటమే కాక టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వార్ని మోదీ వ్యతిరేక పోరు చేస్తున్నందుకు అభినందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రంతో మమతా టీడీపీకీ దగ్గరవుతున్నారు. మరీ ముఖ్యంగా, మమతా బెనర్జీ ఈ నెలలో దిల్లీలో నిర్వహించబోయే ర్యాలీకి చంద్రబాబును ఆహ్వానించారు. దీనిపై ఏపీ సీఏం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ తృణముల్, టీడీపీల నడుమ మైత్రికి ఇది సంకేతమనే చెప్పాలి. ఆ మద్య కేసీఆర్ స్వయంగా కోల్ కతా వెళ్లి తన కూటమిలో చేరమంటే పెద్దగా స్పందించని బెంగాలీ సీఎం చంద్రబాబును స్వయంగా ఆహ్వానించారు! ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు దిల్లీలో మంచి పరిణామమే. మోదీకి బెదరకుండా ఎదురు నిల్చి పోరాడుతున్న ఆయన ఇప్పుడు జాతీయ మీడియా, జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీజేపీకి, మోదీకి పట్టు అతి తక్కువగా వుండే దక్షిణాదిలో చంద్రబాబు లాంటి కమాండర్ వుండటం మమతా బెనర్జీ లాంటి వారికి చాలా అవసరం!     మమతా బెనర్జీ ర్యాలీకి హాజరై చంద్రబాబు మోదీ వ్యతిరేక వర్గంలో కీలకంగా మారతారో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ, ఏపీ నుంచీ మమతా బెనర్జీ లాంటి వారు ఆయననే నమ్మదగ్గ నేతగా చూస్తున్నారనేది మాత్రం స్పష్టం. జగన్ కూడా అధికారికంగా మోదీ వర్గం కాకున్నా మమతా బెనర్జీ ఆయనని ఆహ్వానించలేదు. ముందు ముందు కూడా కేసీఆర్, జగన్ లు జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యే అవకాశాలే ఎక్కువ. మోదీ వ్యతిరేక వర్గం కూటమిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు చక్రం తిప్పటం పక్కా!  

చంద్రబాబు చాణక్యం Vs జగన్ చాపల్యం!

2014 సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలుగేళ్లైపోతోంది. ఇక చివరి సంవత్సరం మొదలైనట్టే. అంటే, ఈ సారికి ఇది క్లైమాక్స్ ఇయర్ అన్నమాట! ఏపీకి సంబంధించినంత వరకూ 2019లో తగిన సమయానికే ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు కాబట్టి ముందస్తు సూచనలేం లేవు. మరి వచ్చే సంవత్సరం ఎండా కాలంలో ఎన్నికలంటే ఇప్పుడే హీట్ స్టార్ట్ అవ్వటంలో ఆశ్చర్యమేం లేదు కదా! అయితే రాష్ట్రంలోని ఒక్కో పార్టీ ఒక్కో అంశాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకెళుతోంది. తమకు అనుకూలంగా వుండబోయే వివాదాన్ని రచ్చకీడుస్తూ ఓట్లుగా మార్చుకోటానికి ట్రై చేస్తోంది. ప్రధానంగా రెండు ముఖ్యమైన పార్టీలైన టీడీపీ, వైసీపీ వేగంగా పావులు కదుపుతున్నాయి…     చంద్రబాబు గత కొంత కాలంగా రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. మోదీ సర్కార్ హోదాకి బదులు ప్యాకేజీ అంది. చివరకు ప్యాకేజీలో కూడా రాష్ట్రానికి పెద్దగా ఏమీ ఇవ్వకుండానే చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే, ఆయన ప్రత్యేక హోదా నినాదం ఉధృతం చేశారు. క్రమక్రమంగా ఎన్డీఏకు దూరం జరుగుతూ వచ్చి ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం పార్లమెంట్ వేదికగా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే బాబు కేంద్రాన్ని విలన్ గా నిరూపించగలిగారు. వచ్చే ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగేలా చేశారు!     హోదా విషయంలో బీజేపిని, మోదీని టార్గెట్ చేసిన చంద్రబాబు 25 మంది ఎంపీల్ని ఇస్తే తరువాతి ప్రధాని ఎవరో నేనే నిర్ణయిస్తానంటూ జనానికి తమ వాణి వినిపించారు. మరి జగన్ ఏం చేస్తున్నారు? ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రోజుకో ఎజెండాతో ముందుకు పోతోంది! చంద్రబాబు తుఫాన్ మొత్తం హోదా చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చూస్తే జగన్ ప్రతీ రోజూ చంద్రబాబును తిడుతు కాలం గడిపేస్తున్నారు. అది చాలదన్నట్టు చంద్రబాబును చంపేయ్యండని ఆ మధ్య దురుసుగా మాట్లాడిన జగన్ పవన్ పైన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆయనకు నలుగురు పెళ్లాలంటూ లేనిపోని వివాదం కొనితెచ్చుకున్నారు! ఇలాంటి వ్యక్తిగత విమర్శలతో ఎన్నికల్లో ఓట్లు ఎలా రాలతాయి? అయితే గియితే మరిన్ని ఓట్లు పోతాయి!   జగన్ పవన్ ను తిట్టడం మొదలు రమణ దీక్షితులుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయన చేత విమర్శలు చేయించటం వరకూ నానా రకాలు రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఒక ఖచ్చితమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. తాజాగా కాపు రిజర్వేషన్లపై స్వయంగా కాక రేపి చేతులు కాల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వారికి రిజర్వేషన్లు ఇవ్వటం కేంద్రం పరిధిలోనిదని , తన వల్ల ఏం కాదని చేతులు ఎత్తేశారు. మళ్లీ జరిగిన తప్పు గుర్తించి మీడియా నా మాటలు వక్రీకరించిందని రొటీన్ గా గండం నుంచీ గట్టెక్కే ప్రయత్నం చేశారు. ఏ మీడియా ఆయన మాటల్ని వక్రీకరించింది? ఆయన స్వంత సాక్షి కూడానా? జగన్ కాపు రిజర్వేషన్ల గురించి పబ్లిగ్గా మాట్లాడారు. వేలాది జనం మధ్య తన వాహనంపై నుంచీ ప్రసంగం చేశారు. అవే మాటల్ని మీడియా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇందులో వక్రీకరించటానికి ఇంకేం మిగిలింది? జగన్ కే తెలియాలి!     ఒకవైపు చంద్రబాబు తెలివిగా జనం ఆగ్రహాన్ని బీజేపీపైకి, మోదీ పైకి మళ్లించి రానున్న ఎన్నికలకి ఎజెండా సెట్ చేస్తుంటే… జగన్ మాత్రం అనాలోచిత మాటలు, ఆవేశపూరిత చర్యలతో కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ, లోక్ సభల్లో లేరు. పవన్ పై వ్యాఖ్యలతో కాపుల మనో భావాలు దెబ్బతీశారు. ఆపైన రిజర్వేషన్లు నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఇలా రోజుకో ఘనకార్యం చేస్తుంటే… ఇప్పటిదాకా ఓటు వేద్దామనుకున్న వారు కూడా పునరాలోచనలో పడతారు! ఇది జగన్ గమనించి ఇంకాస్త పరిణతితో వ్యవహరిస్తే బావుంటుంది! 

లోన్ల రూపంలో… జనం డబ్బుతో… ‘ఆటలాడుకున్నాడు’!

ఒక్క వ్యక్తి… కేవలం ఒకే ఒక్క వ్యక్తి… ఇటు అధికార బీజేపీని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ని కూడా ఇబ్బంది పెట్టగలగటం మాటలు కాదు. కానీ, ఆ పని విజయవంతంగా చేశాడు విజయ్ మాల్యా. కాంగ్రెస్ కాలంలో అప్పులు చేసి బీజేపీ పాలనలో దర్జాగా లండన్లో మకాం వేశాడు. ఇప్పుడు రెండూ పార్టీలు మాల్యా కేసులో పాపమంతా మీదంటే మీదని దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే, మోదీ సర్కార్ మాత్రం కింగ్ ఫిషర్ కింగ్ తమపై తీసుకొచ్చిన ఆరోపణల్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంతోంది. బ్రిటన్ కోర్టులో ఇవాళ్ల తుది వాదనల అనంతరం మాల్యా ఇండియాకు వస్తాడా లేదా తేలిపోతుంది. అయితే, ఇప్పటికే విజయ్ మాల్యాకు తన సీన్ ఏంటో అర్థమైపోయినట్టు కనిపిస్తోంది. ఆయనని భారత్ కు అప్పగించటానికే బ్రిటన్ కోర్టు ఆదేశించవచ్చు.     చాలా సింపుల్ గా మాట్లాడుకుంటే విజయ్ మాల్యా 9వేల కోట్లు వివిధ బ్యాంకుల వద్ద అప్పు చేసి ఎగ్గొట్టాడు. పారిపోయి బ్రిటన్ లో రాజసం వెలగబెడుతున్నాడు. అయితే, ఇప్పుడు సీబీఐ కేసు వేసి కోర్టుకి లాగటం వల్ల మాల్యా తిరిగి రాక తప్పకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఇంకా బోలెడు తతంగం వుంటుంది. కానీ, ముందైతే ఆయన ఇండియాలో దిగీ దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది చాలు బీజేపీ వారికి. ఎందుకంటే, మాల్యా దేశం వదిలి పారిపోయేలా మోదీ సర్కార్ సహకరించిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టడానికి మాల్యా కొన్ని రోజులో, కొన్ని గంటలో జైల్లో వున్నా చాలు! కానీ, అసలుగా ఆయన చేసిన ఘనకార్యాలకు శిక్షపడిదే ఎప్పుడో మూలన పడ్డ కింగ్ ఫిషర్ విమానాలకే తెలియాలి!     విజయ్ మాల్యా లాంటి కార్పొరేట్ అవినీతి మొసళ్లు మన వ్యవస్థలోని లోపాల్ని ఆసరా చేసుకునే బతికేస్తుంటాయి. ఈ బెంగుళురు బుల్లోడు బాలీవుడ్ భామలతో ఫోటోషూట్ లు, గోవా బీచుల్లో క్యాలెండర్ గాళ్స్ తో సరసాలు తెగ సాగించాడు. అదంతా బాగానే వర్కవుట్ అయినా అసలు సమస్య మనోడి విపరీత తెలివితేటల్తో వచ్చింది. కింగ్ ఫిషర్ కంపెనీ పేరుతో హ్యాపీగా బీర్లు అమ్ముకున్న మాల్యా అక్కడితో ఆగక విమానాలు నడిపే సంస్థ ప్రారంభించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్లోకి పోయింది. అందుకు కారణం మాల్యా ఎయిర్ హోస్టెస్ ల మీద పెట్టిన శ్రద్ధ పెట్టుబడులు, రాబడుల మీద పెట్టకపోవటమే. అది పక్కన పెడితే ఇంకా చాలా ఆర్దిక అరాచకాలు చేశాడంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. తాజాగా ఓ ఛానల్ వారు మాల్యా ఈమెయిల్స్ బట్టబయలు చేశారు. వాటిల్లో కింగ్ ఫిషర్ కంపెనీ ఉన్నతాధికారులతో మాల్యా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు.     మాల్యా ఈమెయిల్స్ సారాంశం ఏంటంటే… ఇక్కడి బ్యాంకుల వద్ద కింగ్ పిషర్ విమానాల కోసమని అప్పులు చేసి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ , ఫోర్స్ వన్ రేసింగ్ టీమ్ లకు డబ్బులు మళ్లించటం. క్రికెట్ లో, రేసింగ్ లో టీమ్ లు కొని వాట్ని పోషించటానికి జనం డబ్బుతో నడిచే బ్యాంకులకి టోపి పెట్టాడన్నమాట. ఇలా అయిదు వందల కోట్లు విదేశాలకు పంపి అక్కడ్నుంచీ తన క్రికెట్ టీమ్ కు, కార్ రేసింగ్ టీమ్ కు చెల్లింపులు చేశాడట. వాటి మీద లాభం ఏముంటుంది? అందుకే డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి!   మాల్యా లాగా కార్పోరేట్ మోసాలు చేసి విదేశాలకు పారిపోయే బాపతు నేరస్థులకి కఠిన శిక్షలు పడేలాగా మోదీ సర్కార్ కొత్త బిల్లు తెచ్చింది. అయితే, దాన్ని ఎంత వరకూ మన పాలకులు నిజాయితీగా అమలు చేస్తారన్నది సమస్య! అదే జరిగితే మాల్యా మొదలు నీరవ్ మోదీలు, జగన్మోహన్ రెడ్డీలు అందరూ తగిన ఫలితం అనుభవిస్తారు. కానీ, అలాంటి సూచనలు మన వ్యవస్థలో తక్కువే!

రాజధాని అడ్డుకుంటానన్న పవన్‌పై ప్రభావం… ‘వారిదే’నా!

ఈ మధ్యే ఏపీ సీపీఐ కార్యదర్శి ప్రకటించేశారు! రాబోయే ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారట! ఇది పెద్ద న్యూస్ ఏం అవ్వలేదు. ఎందుకంటే, పవన్ ఎర్ర జెండా అభిమానం రహస్యమేం కాదు. తాను చిన్నప్పట్నుంచే కమ్యూనిస్టు భావజాలం గలవాడినని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంత వరకూ సంతోషమే! కానీ, పవన్ కమ్యూనిజానికి ప్రతినిధులుగా భారతదేశ సీపీఐ, సీపీఎంలని ఎంచుకున్నారు! అదీ ఏపీ కొడవలి పార్టీల్ని అక్కున చేర్చుకున్నారు. ఇది పవన్ రాజకీయ అవగాహనకి మచ్చు తునక అనవచ్చు!     జనసేన, కమ్యూనిస్టులు కలిశారు కాబట్టి ఇక టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలది ఒంటరి పోరేనని మనం డిసైడ్ అవ్వొచ్చు. మరి కలిసి పోటీ చేస్తోన్న సీపీఎం, సీపీఐ, జనసేనలకి ఎవరికి ఎవరి వల్ల లాభం? ఇదే ఇప్పుడు హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ ను కూడా వేధిస్తోన్న విషయం! ఆయన మీద అభిమానంతో ఓటు వ్దేదామనుకున్న వారు కూడా ఇప్పుడు కమ్యూనిస్టు జెండాలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. సీపీఎం, సీపీఐ ఒకప్పటిలా ధృఢంగా లేవన్నది అందరికి తెలిసిన విషయమే. పోయిన ఎన్నికల్లో ఖాతాలు కూడా తెరవలేకపోయాయి నవ్యాంధ్రలో. అటువంటి స్థితిలో వున్న కమ్యూనిస్టులతో పవన్ కు అవసరం ఏంటి? ఒకరో ఇద్దరో కమ్యూనిస్టు వ్యతిరేక ఫ్యాన్స్ వుంటే వారు ఈయనకు ఓటు వేయకపోవటం తప్ప మరో లాభం లేదు! సీపీఎం, సీపీఐలతో కలయిక వల్ల పవన్ కు లాభం కంటే నష్టం ఎక్కువని కాస్త గట్టిగానే చెప్పుకోవచ్చు. ఎలాగంటే… ఆ రెండు పార్టీలు దేశ్య వ్యాప్తంగా కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. బెంగాల్ , త్రిపుర చేజారిపోగా , కేరళలో కాంగ్రెస్, బీజేపీలు సీపీఎంని ముప్పతిప్పలు పెడుతున్నాయి. కేరళల అధికారంపోతే కమ్యూనిస్టులకు ఎక్కడా సీఎం కుర్చీ వుండదు. అందుక్కారణం వారు చెప్పే కుందేటికి మూడు కాళ్ల సామెతే…     మన సీపీఎం, సీపీఐ పార్టీలు గొప్పగా చెప్పే చైనా కూడా కమ్యూనిజం పూర్తిగా మార్చేసుకుంది. కాలానుగుణంగా అమెరికాతో పోటీ పడేలా క్యాపిటలిస్టు ఆర్దిక విధానం నెత్తికెత్తుకుంది. అక్కడ పాలన, ఎన్నికల విధానాల్లో తప్ప కమ్యూనిజం ఎక్కడా కనిపించదు. కానీ, మన కమ్యూనిస్టులు మాత్రం ఇంకా మార్క్స్ , మావో సిద్ధాంతాలే మన గతి అంటూ చెబుతుంటారు. అవ్వి కూడా తమకు దశాబ్దాల తరబడి అధికారం ఇచ్చిన రాష్ట్రాల్లో నిజాయితీగా అమలు చేయలేదు. అందుకే, ప్రజలు వార్ని పక్కకు తోసి అభివృద్ధి, ఉద్యోగాలు చూపించే పార్టీలకు పట్టం కడుతున్నారు. బీజేపీ మొదలు టీడీపీ దాకా అన్నీ పార్టీలు ఉద్యమాలకు బదులు ఉద్యోగాలు అన్న నినాదంతోనే వరుసగా గెలుపులు స్వంతం చేసుకుంటున్నాయి. కమ్యూనిస్టులు మాత్రం అదే పాత పద్ధతిలో ప్రభుత్వ వ్యతిరేక జన ఆందోళనలే తప్ప మరో ఆలోచన చేయటం లేదు!     తమ పద్ధతులతో తామే నష్టపోతోన్న సీపీఎం, సీపీఐలని పవన్ అక్కున చేర్చుకున్నారు. పైగా వారి బాటలోనే తాజాగా కామెంట్స్ కూడా మొదలు పెట్టారు. అమరావతిలో కొంత మంది రైతుల కోసం వేల ఎకరాలిచ్చిన మిగిలిన అందరు రైతుల్ని నష్టపరిచేలా అమరావతి నిర్మాణం అడ్డుకుంటామని ప్రకటించారు. జనసేన అమరావతి నిర్మాణం అడ్డుకుంటుందా? అడ్డుకోగలదా? అన్నది తరువాతి ప్రశ్న! అసలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని నిర్మాణం జరుకుంటుంటే ఆనందించాల్సింది పోయి ఏవో సమస్యల్ని  చూపి అడ్డుకుంటానని బెదిరించటం ఏంటి? ఇది పక్కా సీపీఎం, సీపీఐ మార్కు ఉద్యమాల రాజకీయం. ఒకప్పుడు ఆ మాటలు పని చేసేవే. కానీ, ఇప్పుడు జనం ఉద్యమాల కంటే ఉద్యోగాల కోరుకుంటున్నారు. ఆవి అమరావతి లాంటి భవ్యమైన రాజధాని వల్ల సాధ్యం. హైద్రాబాద్ వుండటం వల్లే ఇవాళ్ల తెలంగాణ ఎంత ఆర్దిక అభివృద్ధి సాధించిందో అందరికీ తెలుసు. మరి అటువంటి రాజధాని ఏర్పాటుకు, అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే పవన్ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? ఎవరో చెప్పుడు మాటలు విని ఇలా బాద్యతా రహితంగా మాట్లాడితే ఎలా? రాజధాని అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ యువతకు జరిగే మంచేంటి?     ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం, ఓట్లు, సీట్లు పంచుకోవటం వరకూ ఓకే కానీ… రాబోయే ముప్పై ఏళ్లు ప్రజా జీవితం గడుపుతానని అంటోన్న జనసేనాని… పూర్తిగా సీపీఎం, సీపీఐ మార్కు ఛాందస కమ్యూనిజం తలకెత్తుకుంటే ఇబ్బందే! ఆయనకు అంతగా కమ్యూనిజం నచ్చితే మన కమ్యూనిస్టులు కాక చైనా ఏం చేస్తుందో చూసి తెలుసుకోవాలి. అప్పుడు ఆ దారిలోనన్నా అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ జనానికి భరోసా ఇవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి నిరోధకంగా మారితే… బెంగాల్, త్రిపుర, కేరళలో సీపీఎం, సీపీఐలకు ఎదురవుతోన్న గడ్డు పరిస్థితే పవన్ కు తప్పక పోవచ్చు!  

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి?

ఒకవేళ ముందస్తుగానో, లేక సమయానికే అయినా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేస్తారు. అది నిజమే అయినా… తెలంగాణ నుంచీ విడివడీ, హైద్రాబాద్ ను పోగొట్టుకున్న ఏపీ… ఇప్పుడు పీకల్లోతూ ఆర్దిక సవాళ్ల ఉబిలో వుంది. దీన్ని బయటకు లాగటమే ఎవరి లక్ష్యం అయినా. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, రేపు జగన్ సీఎం అయినా కావచ్చు. కానీ, రాబోయే కొన్ని సంవత్సరాల వరకూ నవ్యాంధ్రకు అనేక అస్థిత్వ సమస్యలున్నాయి. ఎప్పటికప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తే తప్ప నిలదొక్కుకోలేదు. అటువంటి కీలక సమయం కాబట్టే 2014లో జనం అనుభవజ్ఞుడైన చంద్రబాబును తమ సారథిగా ఎంచుకున్నారు.     త్వరలోనే మరోసారి దేశానికి ఎన్నికలు రావచ్చు. ఎప్పుడో మనం చెప్పలేకున్నా జనం తమ ఎంపీల్ని ఎన్నుకుని దిల్లీకి పంపాల్సి వుంటుంది! మరి టీడీపీ, వైసీపీల్లో ఎవరికి జైకొట్టాలి. ఇతర పార్టీలకి కూడా ఎందుకు మద్దతు తెలుపకూడదు. ఒక్కసారి ఆలోచిద్దాం. బీజేపీ ఇప్పటికే హోదా ఇవ్వక విలన్ గా మారింది. కాబట్టి కమలం గుర్తుకు ఎన్ని ఓట్లు వేసినా, ఎన్ని సీట్లిచ్చినా లాభమే శూన్యమే! మరిక కాంగ్రెస్ కైతే దేశ వ్యాప్తంగా ఏ మాత్రం ఆశావహంగా లేదు పరిస్థితి. పంజాబ్ తప్ప కాంగ్రెస్ చేతిలో ఏ రాష్ట్రామూ లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీగా ఎంపీలు పెరిగి రాహుల్ ప్రధాని అవుతాడని వారి పార్టీ వాళ్లే నమ్మకంగా చెప్పటం లేదు. అటువంటి పార్టీ… పైగా ఇష్టానుసారం విభజన చేసిన హస్తం… ఇప్పుడు ఎంపీల్ని ఇస్తే ఏం చేస్తుంది? అదృష్టం బాగాలేకపోతే మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది రాహుల్ సేన! కాంగ్రెస్ , బీజేపీలు కాకుండా కమ్యూనిస్టులు, జనసేన వంటి పార్టీలకు ఎంపీల్ని ఇస్తే కూడా ఒదిగేదేం లేదు. ఎందుకంటే,  ఈ పార్టీలు ఇక్కడ అమరావతిలో చక్రం తిప్పలేవు. అక్కడ దిల్లీలో దమ్ము చూపులేవు. ఎటూ బలం లేని పార్టీలకు సీట్లు ఇస్తే సాధించేదేముంది? కాబట్టి చివరాఖరుకు మిగిలేవి టీడీపీ, వైసీపీలే! వీటిలోనే ఆంధ్రా ఓటర్ తన మద్దతు ఎవరికో తేల్చుకోవాలి!     వైసీపీకి పోయిన ఎన్నికల్లోనూ జనం బాగానే ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ, చేసిందేముంది? మోదీకి లోపాయికారిగా సహకరిస్తూ దిల్లీలో రాజీనామాలు చేసి హైద్రాబాద్ కు వచ్చేశారు. తెలంగాణ రాజధానిలో వ్యాపారాలు, ఏపీ రాజధానిలో చంద్రబాబుపై విమర్శలు. ఇంతే తప్ప ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ… వీటి గురించి వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారా? మొక్కుబడిగా మాట్లాడినా చివర్లో చంద్రబాబును తిట్టిపోసి మోదీకి సంతోషం కలిగిస్తుంటారు. అంతే తప్ప ఆంద్రా జనం కోసం తపన ఎక్కడా కనిపించదు. అన్ని పార్టీలు పోనూ మిగిలిన టీడీపీ … ఇప్పుడు పార్లమెంట్లో దేశ మొత్తం ముందు మోదీ సర్కార్ ను ఎండగడుతోంది. అవిశ్వాసం పెట్టి కలకలం రేపింది. ప్రతీ రోజూ చర్చలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పదే పదే మాట్లాడుతోంది. ఇదే ఓటర్లు ఆశించే స్పందన. అది అందిస్తోంది టీడీపీ ఎంపీలేగాని వైసీపీ వారు రాజీనామాలతో సరిపెట్టేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లు పక్కన పెట్టి రోడ్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు. ఇదే ఏ ఏపీ ఓటరైనా రేపు పోలింగ్  టైంలో ఆలోచించాల్సింది! హోదా వచ్చినా రాకున్నా ఏదో ఒక రోజు తెచ్చేది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎంపీలే. రాబోయే ఎన్నికల్లో మొత్తం పాతిక ఆంధ్రా పార్లమెంట్ స్థానాలు సైకిల్ క్యారియర్ పైకి చేరిపోతే… అప్పుడు వుంటుంది అసలు రాజకీయం. ఇప్పుడు వంద శాతం సీట్లు లేకున్నా ఎంతో పోరాడుతున్న టీడీపీ ఎంపీలు… 25మంది ఒక్కటైతే సభను అల్లాడించగలుగుతారు.     ఆంద్రా ఓటర్లు వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా చంద్రబాబుకు ఓటు వేస్తేనే హోదా ఉద్యమం ముందుకు పోయేది. లేదంటే, జగన్, పవన్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ జట్టులోకి చేరిపోయే అవకాశాలే ఎక్కువ. అలాగే, గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా దిల్లీ రాజకీయాలు ఔపోసన పట్టిన చంద్రబాబు ఎంత ఎక్కువ మంది ఎంపీలుంటే అంత ఎక్కువ ప్రభావశీలం అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! మోదీ సర్కార్ వస్తే పోరాటం చేసేందుకు, మరో సర్కార్ వస్తే పొత్తు రాజకీయాల్లో ఏపీకి ఎక్కువ మేలు జరిగేలా చూసేందుకు… అన్నిటికి ఆయనే సమర్థుడు! అందుకే, ఆంధ్రా ఓటర్ చంద్రబాబుకు , టీడీపీకి కాకుండా ఇతర నేతలకి, పార్టీలకి జైకొట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటే అత్యంత అమూల్యం….   

సెల్ఫ్ గోల్స్‌తో ‘కాపు’రం చేస్తోన్న జగన్!

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ చేసిన కాపు రిజర్వేషన్ వ్యాఖ్యలే హాట్ టాపిక్ అయ్యాయి! గత ఎన్నికల ముందు నుంచీ కాపులకు బీసీ హోదా అనేది పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతూ వస్తోంది. జనంలో వున్న ఆకాంక్ష చూసి మన నేతలు సై అన్నారు. కానీ, ఇప్పుడు అది కోర్టులకి, కేంద్రానికి సంబంధించిన వివాదంగా మారిపోయింది. అయితే, ఇప్పటి వరకూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మరే ఇతర పార్టీ కూడా కాపులకి రిజర్వేషన్స్ పై నో చెప్పలేదు. ఎందుకంటే, అది పొలిటికల్ గా అంత తెలివైన మాట కాదు. కాపులకి నిజంగా బీసీ స్టేటస్ ఇవ్వటం వీలవుతుందా లేదా అనేది పక్కన పెడితే… నా వల్ల కాదని మాత్రం ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఆ ఘనకార్యం మన జగన్ బాబే చేశారు!     జగన్ వైఎస్ బొమ్మ పెట్టుకుని ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు కానీ… అసలు ఆయనలో ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించే మనిషి బయటకొస్తాడు. సగటు పొలిటీషన్ ఎవరూ చేయని చారిత్రక తప్పులు ఆయన చేస్తుంటారు. వాటి వెనుక ఏదో పెద్ద చాణక్యం వుందని ఆయన మీడియా, టీడీపీ అంటే పడని వారు, చంద్రబాబు ప్రత్యర్థులు భాష్యాలు చెప్పొచ్చుగాని…. ఫైనల్ వాటికి ఎలాంటి వాల్యూ వుండదు. జగన్ సెల్ఫ్ గోల్స్ గా హిస్టరీలో మిగిలిపోతుంటాయి. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన తాజా కామెంట్ అలాంటి ఒకానొక అన్ వాంటెడ్ సెల్ఫ్ గోలే! జగన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా నవ్యాంధ్రాలో తన ప్రస్థానం మొదలు పెట్టాక అసెంబ్లీని బహిష్కరించి అతి పెద్ద తప్పు చేశాడు. ఇక మొన్నటికి మొన్న కీలకమైన సమయంలో పార్లమెంట్ ను కూడా వదిలి వచ్చేయమని తన ఎంపీలకు చెప్పి మరో బ్లండర్ చేశాడు. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ సంగతి నా చేతిలో లేదు కేంద్రం చూసుకోవాలి అంటూ మ్యాచ్ ను మూడు , సున్నా గోల్స్ గా మార్చేశాడు! టీడీపీకి, చంద్రబాబుకి తన సెల్ఫ్ గోల్స్ తోనే జగన్ పాయింట్లు పెంచుతున్నాడు. ఆపార అనుభవం వున్న చంద్రబాబు తన చాణక్యంతో ఈ పాయింట్లతో ఈజీగా మ్యాచ్ గెలిచే పరిస్థితి వచ్చేస్తోంది!     ఇంతకీ, కాపులకి బీసీ స్టేటస్ పై నేనేమీ హామీ ఇవ్వను అని కుండబద్ధలు కొట్టి జగన్ ఏం సాధించాడు? ఏమీ లేదు! కుండ బద్దలై మట్టి పెంకులు గుచ్చుకునే స్థితి వచ్చింది! దట్సాల్! అసలు కొందరి అభిప్రాయం ప్రకారం జగన్ ఇలా మాట్లాడటానికి కారణం… అంతకు ముందు ఆయన పవన్ పై చేసిన పర్సనల్ వ్యాఖ్యలే! పవన్ పెళ్లిళ్ల గురించి అనవసరంగా నోరు రచ్చ చేసుకున్న వైసీపీ అధినేత ఈ కాపు కామెంట్ల ద్వారా జనం దృష్టిని మరల్చగలిగాడు. అయితే, ఇది కూడా నెగటివ్ గానే పని చేసింది. పవన్ ని తిట్టాడన్న ఆగ్రహంతో వున్న కాపు సోదరులు ఇప్పుడు తమ రిజర్వేషన్ ఆకాంక్షపై జగన్ నీళ్లు చల్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్రగడ లాంటి వారు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎలా చూసినా కాపు ఓటు బ్యాంక్ కి జగనే స్వయంగా చిల్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది...     జగన్ కాపు రిజన్వేషన్లపై తేల్చేశారు. దీని వల్ల టీడీపీకి ఎంత లాభమో కానీ పవన్ కు కాపు ఓట్లు మళ్లే ప్రమాదమూ వుంది. మరి ఈ విషయం తెలుసుకోలేనంత అమాయకుడా జగన్? చెప్పలేం… బాగా తెలివైన వాడే అయితే ఇప్పుడు ఏ అవసరం లేకున్నా కాపు రిజర్వేషన్ల సమస్యని రాజేసి ఎందుకు చలి కాచుకుంటాడు! జగన్ లాజిక్ జగన్నాథుడికే తెలియాలి! 

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాపాలు… ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి!  

భారతదేశంలో రాజకీయంగా ఓ విచిత్రమైన స్థితి వుంటుంది. అదేంటంటే… ఇప్పుడున్న సమస్యల్ని దేన్ని బాగా తవ్వి చూసినా… మూలంలో కాంగ్రెస్ హస్తం వుంటుంది! దేశాన్ని అత్యధిక కాలం దిల్లీలో, రాష్ట్రాల్లో ఏలిన అతి పురాతన పార్టీ అదే! కాబట్టి అన్ని అద్భుతాల వెనుక కాంగ్రెస్ వున్నా వుండకున్నా అన్ని అద్వాన్నాల వెనుక మాత్రం హస్తం… హస్తం వుండే తీరుతుంది! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన చర్చ కూడా పదేపదే చేయి గుర్తు వైపే వేలెత్తి చూపుతోంది!     ఒకవైపు మోదీ, మరోవైపు చంద్రబాబు మోహరించి ఇప్పుడు ప్రత్యేక హోదా రణ రంగం చేస్తున్నారు. ఏపీలో అయితే కాంగ్రెస్ కు వున్నది సున్నా ఎమ్మెల్యేలు కాబట్టి పెద్దగా చర్చే లేదు. కేంద్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అడపాదడపా ఏపీ ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతుంటారు. రాహుల్, మన్మోహన్ సహా అందరూ హోదా ఇవ్వాల్సిందేనంటారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా హస్తం నేతలు లోక్ సభ, రాజ్యసభల్లో ఆంద్రా డిమాండ్లకు అండగానే నిలిచారు. ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ వుందని భ్రమిస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే… అసలు ఇప్పుడున్న అన్ని చిక్కుముళ్లకి కారణమే కాంగ్రెస్ కాబట్టి! ప్రత్యేక హోదాకు ఆనాటి ప్రధాని మన్మోహన్ ఒప్పుకుని కూడా బిల్లులో అధికారికంగా పెట్టలేదు. అదే ఇప్పుడు మోదీ సర్కార్ కి వరంగా మారింది. అదికారికంగా ఇవ్వని హామీ తీర్చకున్నా ఏమీ అనటానికి వీల్లేని పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ తప్పు కాక మరెవరిది అనగలం?     తమ పదేళ్ల ప్రభుత్వ కాలంలో చిట్ట చివరి సమావేశాల రోజున సభలో తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన సోనియా సేన… కావాల్సినన్ని చారిత్రక తప్పులు చేసింది. బిల్లులో హోదా గురించి ఎలాంటి హామీ ఇవ్వని యూపీఏ సర్కార్ మరో దారుణం కూడా చేసింది. ఏపీలోని 175 ఎమ్మెల్యే స్థానాల్ని 225కి పెంచాలని విభజన చట్టంలో పెట్టారు. కానీ, అది సాధ్యమేనా? 2026 వరకూ నియోజక వర్గాల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. రాజ్యాంగం అందుకు ఒప్పుకోదు. ఈ మాట చెబుతోన్నది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వ మంత్రి చిదంబరం! తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశంలో ఆయనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదే విషయమై నిలదీశారు కూడా! చిదంబరం చక్కగా మౌనం దాల్చారు తప్పు జవాబు ఇవ్వలేదు!     రాజ్యాంగం ఒప్పుకోదని తెలిసీ, 2026 వరకూ ఎమ్మెల్యే సీట్ల పెంపు కుదరదనీ తెలిసి… కాంగ్రెస్ ఆ హామీని బిల్లులో పెట్టింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన చిదంబరం నిర్మోహమాటంగా వీలు కాదని చెబుతున్నారు. ఇలాంటి పనులే హస్తం పార్టీ ఎప్పుడూ చేస్తూ వస్తుంటుంది! పైగా అటు హోదా రాకపోవటానికి, ఇటు నియోజక వర్గాల పెంపు జరగకపోవటానికి కారణమైన పార్టీనే మళ్లీ మేము ఆంధ్రాను ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. యూపీఏ సర్కార్ వస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతన్నారు! వీళ్లని ఏపీ ఓటర్లు నమ్ముతారా? రాష్ట్రంలోని ఏ పార్టీ హస్తంతో చేయి కలపటానికి సిద్ధంగా లేకపోవటమే పరిస్థితికి అద్దం పడుతుంది! ఇష్టానుసారం విభజన చేసి, లోపభూయిష్టంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆకులు పట్టుకుందామన్నా లాభం లేని స్థితిలో వుంది. మరోవైపు ఏపీలో ఎదిగే అవకాశం వున్నా బీజేపీ మొండి వైఖరితో స్వయంకృతాపరధం చేస్తోంది. మొత్తానికి సమీప భవిష్యత్ లో రెండు జాతీయ పార్టీలు ఆంధ్రాలో సున్నాలకే పరిమితం కాక తప్పకపోవచ్చు!

కోమటిరెడ్డి మీద కోపం కోర్టుతో కొట్లాటగా మారుతోందా?

కోర్టులకి , ప్రభుత్వాలకి మధ్య గొడవ ఎప్పుడూ వుండేదే! చాలా అంశాల్లో కోర్టుల ఆదేశాల్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేయకుండా వుండాలా అని దార్లు వెతుకుతుంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి, హైకోర్టులకి మధ్య గొడవే కాదు సుప్రీమ్ కోర్టుకు , కేంద్రానికి కూడా అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తూనే వుంటాయి. కానీ, మన రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశిస్తే ఎవరైనా శిరసావహించాల్సిందే. అందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు కూడా అతీతం కారు. నిజానికి వారు బాధ్యతగా కోర్టు తీర్పుల్ని పాటించకపోతే సామాన్య జనానికి కూడా న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోయే ప్రమాదం వుంది. అందుకే బాధ్యత గల ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు ఎప్పుడూ పాల్పడదు!     కోర్టులకి, గవర్నెమంట్ కు గొడవ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… హైద్రాబాద్ హైకోర్టు తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. నిజానికి అసెంబ్లీకి సంబంధించినంత వరకూ స్పీకర్ దే అంతిమ నిర్ణయం. ఆయన ఆదేశాల్ని ప్రశ్నించటానికి వీల్లేదు. కానీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై తెలంగాణ స్పీకర్ తీసుకున్న చర్యలు వివాదాస్పదం అయ్యాయి. వేటు పడ్డ ఎమ్మెల్యేలు వేరే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన సస్పెన్షన్ వేటు ఎత్తి వేసింది. వారికి గన్ మెన్లను కూడా తిరిగి కేటాయించాలని కేసీఆర్ సర్కార్ ని ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఇద్దరు ఎమ్మెల్యేల్ని స్పీకర్ అసెంబ్లీలోకి రానివ్వలేదు. గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించలేదు. ఇదే న్యాయమూర్తుల ఆగ్రహానికి కారణమైంది.     బహిష్కృత ఎమ్మెల్యేల్ని తిరిగి సభలోకి అనుమతించాలనీ, వారికి భద్రత కల్పించాలనీ, జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశిస్తోన్న హైకోర్ట్ ఒక దశలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని సూటిగా ప్రశ్నించిందట. మీరు ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారా? లేక ఒక పార్టీ తరుఫునా? అంటూ ఏజీపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా తెలంగాణ సర్కార్ పునరాలోచించుకోవాల్సిన అంశమే! ఎందుకంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పక్షం గొడవగా మొదలైన బహిష్కరణ వ్యవహారం కోర్టుకి, ప్రభుత్వానికి మధ్య విభేదంగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే అంత మంచిది కాదు. కాకపోతే, ఇప్పుడు కోర్టు చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్ లను తిరిగి అసెంబ్లీలోకి ఆహ్వానిస్తే అది టీఆర్ఎస్ కు ఓటమిగా ప్రచారం అవుతుంది. బహుశా ఇదే తెలంగాణ సీఎం మదిలో మెదులుతున్న ఆలోచన కావచ్చు. కానీ, కొన్నిసార్లు కేసీఆర్ గులాబీ బాస్ గా కాకుండా ప్రభుత్వ అధినేతగా నిర్ణయం తీసుకుంటేనే హుందాగా వుంటుంది. స్పీకర్ తో బహిష్కరణ వేటు ఎత్తి వేయిస్తే మరింత డ్యామేజ్ జరగకుండా వుంటుంది. కోమటిరెడ్డి, సంపత్ సభలోకి వచ్చాక వార్ని తమ ఎమ్మెల్యేలతో కలిసి ఎదుర్కోవటం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరీ అసాద్యం ఏం కాదు. ఆ కోణంలో ఆలోచించకుండా పట్టుదలకి పోయి కోర్టు ధిక్కరణ అంచున నిలవటం జనం ముందు అంత మంచి సంకేతమేం కాదు.     కోమటిరెడ్డి, సంపత్ లకు కోర్టులో దక్కిన తీర్పు, వారి కోసం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా టీకాంగ్ కు ఉత్సాహాన్నిచ్చేవే. జనంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ ను ఈ వివాదంతో కొంత వరకూ ఇరుకున పెట్టవచ్చని వారు ఆలోచిస్తుండవచ్చు. కాకపోతే, ఈ గొడవ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాల్చేటంత సంచలనాత్మకమైందైతే కాదు!

బలిపీఠంగా మారుతోన్న ప్రత్యేక హోదా నినాదం!

    తెలుగు నేల ఏ క్షణాన రాష్ట్రాలుగా ఏర్పడిందోగానీ… ఇక్కడ ఎప్పుడూ బలిదానాలే! నిజాం నిరంకుశ పాలనలో వేల మంది ప్రాణాలు కోల్పాయరు. ఆ తరువాత భారతదేశంలో విలీనం అయిన హైద్రాబాద్ సంస్థానం ఆంధ్రాతో కలిసింది. తెలంగాణతో కలవటానికి ముందే ఆంద్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది. ఇక ఆంధ్రా, తెలంగాణలు ఎలాగో కలిసి సమైక్యాంద్ర ఏర్పడితే… అది అనేక కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. 1969లో తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. వెంటనే… కొన్నేళ్లకే ప్రత్యేకాంధ్ర ఉద్యమంతో మరి కొంత మంది అసువులు బాయాల్సి వచ్చింది. ఇక 2014 విభజనతో ముగిసిన ఉదమ్యం సంగతైతే చెప్పక్కర్లేదు! తెలంగాణలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆంద్రలోనూ కొందరు బలవన్మరణం పాలయ్యారని వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ, తెలంగాణ వేరు వేరు అయిపోయాక ఈ బలిదానాల గుండెకోత వుండదని అంతా భావించారు! కానీ, ఇప్పుడు మరోమారు ప్రత్యేక హోదా బలిపీఠంపై తెలుగు ప్రాణాలు పణంగా పెట్టబడుతున్నాయి! ఇది నిజంగా విషాదం…     చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో సుధాకర్ అనే 26 ఏళ్ల యువకుడు ఉరితాడుకు వేలాడి ప్రాణాలు తీసుకున్నాడు. కారణం…. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని! ఇంకా బోలెడంత జీవితం మిగిలి వున్న ఆ యువకుడు , చేసేది చేనేత పని! తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు! వింటుంటేనే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ ఉధృతిలోనూ ఇదే స్థితిని చూసింది తెలుగు జాతి. దిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మనమెప్పుడూ మూల్యం చెల్లిస్తూనే వున్నాం. నెహ్రు నుంచీ మోదీ దాకా ఇదే పద్ధతి. నెహ్రూ సకాలంలో స్పందించకే పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అదే దుస్థితి కొనసాగుతోంది. అయితే, ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ చాలా స్పష్టంగా వీలుకాదని చెబుతోంది. ఆంధ్రా అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు పోరాడుతున్నారు. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం వున్న వారికైనా ప్రత్యేక హోదా రాదని స్పష్టంగానే అవగాహన వుంటుంది. కనీసం జేసే దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు మోదీ ప్రధానిగా వున్నంత కాలం హోదా డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాద్యం కాదు. ఇదంతా సుధాకర్ లాంటి అమాయకులకి చేరవేయటంలో రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియా విఫలం అవుతున్నాయి.     బ్రిటీష్ వాళ్లతో స్వతంత్ర పోరాటం చేసినప్పుడు కూడా మనం కోరింది అంతా తేలిగ్గా లభించలేదు. కానీ, అప్పుడు ఇప్పటిలా ఆత్మహత్యలు జరగలేదు. కారణం ఉద్యమం నడిపే నేతలు జనానికి భరోసా కల్పించేవారు. ఏనాటికైనా బతికి సాధించగలమని నమ్మకం కలిగించే వారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతూ, ఎవరి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వారు చేస్తూ రాష్ట్రం కోసం తపించే నిజాయితీపరుల్ని ఒత్తిడికి గురిచేస్తున్నారు. మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ హోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడట. ఇలా చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం. ఇప్పుడు సుధాకర్ అలాగే చేశారు. ఈయనకంటే ముందే తిరుపతికి చెందిన మునుకోటి అనే వ్యక్తి హోదా కోసం ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి వాట్ని రాజకీయ నేతలు సీరియస్ గానే తీసుకోవాలి. తమ పార్టీ కార్యకర్తల చేత చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేయించాలి. మీడియాని, సోషల్ మీడియాని పెద్ద పెద్ద నాయకులు సమర్థంగా వాడుకుని ఆత్మహత్యలు వద్దని చెప్పాలి. లేదంటే, వందల మందిని బలితీసుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలాగే ప్రత్యేక హోదా కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ హోదా కోసమో, మరింక దేనికోసమో చేసుకునే ఆత్మహత్యల్ని హైలైట్ చేయకుండా వుండాలి. వాటి మీద చర్చ పెట్టి ముందు ముందు వేరే వారు చేసుకోకుండా చూడాలిగానీ…. టీఆర్పీల కోసం డెడ్ బాడీ వద్దకిపోయి సెన్సేషనలిజానికి తెగబడవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… కేంద్రం జనం ఎందు కోసం ఆత్మహత్యల దాకా వెళుతున్నారో అర్థం చేసుకోవాలి!

సైకిల్... హస్తం... కమలం… ఇక ఫ్యాన్?

అన్న ఎన్టీఆర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పార్టీ టీడీపీనే! ఆయన స్థాపించిన ఆ పార్టీ, దాని పచ్చ జెండా, సైకిల్ గుర్తు చరిత్ర సృష్టించాయి. అయితే, తరువాతి కాలంలో నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. ఇప్పుడు కూడా పార్టీని చంద్రబాబే ముందుండి నడుపుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నా పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోరు. హరికృష్ణ, ఆయన తనయులు కూడా ఈ మధ్య టీడీపీకి దగ్గరగా ఏం మసులుకోవటం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు అందరూ రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేకుండా అయిపోయారు. కేవలం నందమూరి పురంధేశ్వరి మాత్రం ఇందుకు మినహాయింపు!     మొదట తండ్రి పెట్టిన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన పురంధేశ్వరి క్రమంగా చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారు. అసలు ఎన్టీఆర్ మనసావాచాకర్మణా వ్యతిరేకించిన హస్తం పార్టీలో ఆమె చేరటమే పెద్ద సంచలనం! అయినా ఆమె సోనియా సైన్యంలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించారు. కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో పురంధేశ్వరి పార్టీ ఫిరాయించారు. ఈసారి కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీలో చేరారు. టీడీపీ నుంచీ కాంగ్రెస్ లో చేరటం ఎంత విడ్డూరమో అంతే విచిత్రం కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి రావటం కూడా! కాకపోతే, కమలంలో చిన్నమ్మ ఆశించినంత వర్కవుట్ కాలేదు. బీజేపీ, టీడీపీ పొత్తు వున్నప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ లో ఆమె భాగం కాలేకపోయారు. ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ గెలవని ఆమె ఏ  కేంద్ర, రాష్టర ప్రభుత్వ పదవి లేకుండానే కాలక్షేపం చేయల్సి  వచ్చింది. ఇప్పుడిక మరోసారి ఎన్నికల సీజన్ వస్తుండటంతో పురంధేశ్వరి కదలికలపై ప్రచారాలు మొదలయ్యాయి…     ఇప్పటికైతే బీజేపీలోనే వున్న పురంధశ్వరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది! అయితే, అది కమలం గుర్తుపై కాదట. ఫ్యాన్ గుర్తు మీదనట. వైసీపీలోకి జంప్ చేసి ఆమె విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. జగన్ కూడా ఓకే చేశారని చెబుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమో ఇప్పుడే చెప్పలేం. కానీ, పురంధేశ్వరి ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి బలమైన కారణమే వుంది. ఆమె తన  కొడుకు పొలిటికల్ ఎంట్రీకి ఈ పని చేయక తప్పటం లేదట.     పురంధేశ్వరి తనయుడు పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నాడట. గతంలో అక్కడ్నుంచీ దగ్గుబాటి వేంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే, ఇప్పుడు తమ అబ్బాయిని పరుచూరు నుంచి పోటికి దింపాలంటే బలమైన పార్టీ కావాలి. బీజేపీలో వున్న పురంధేశ్వరి అదే పార్టీ నుంచీ కొడుకు దించేంత రిస్క్ చేయలేరు. ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా విలనైన కాషాయ పార్టీ ఎంత మాత్రం సూటబుల్ కాదు. ఆ పార్టీ టికెట్ పై పురంధేశ్వరి రాజకీయ వారసుడు బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుంది. అలా కాదని టీడీపీ నుంచి పోటీ చేసే చాన్స్ కూడా లేదు. చంద్రబాబుతో పురంధేశ్వరి దంపతుల విభేదాలే కారణం. ఇక మిగిలింది జగన్ పార్టీనే! అందుకే, పురంధేశ్వరి తాను బీజేపీ వదిలి వైసీపీలోకి మారి, కొడుకుని కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నారట! విజయవాడ ఎంపీగా పురంధేశ్వరి , పరచూరు ఎమ్మెల్యేగా ఆమె తనయుడు పోటీ చేసి గెలుస్తారో లేదో తరువాతి సంగతి… కానీ, ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీలు అన్నిట్లో పని చేసిన ఘనత మాత్రం నందమూరి పురంధేశ్వరికే దక్కుతుంది. అలాగే, ఈ మద్య కన్నా లక్ష్మీనారాయణను చివరి నిమిషంలో వెనక్కి లాగేసిన బీజేపీ పెద్దలు చిన్నమ్మ పార్టీ మార్పుపై ఎలా స్పందిస్తారో కూడా చూడాలి!

అభివృద్ధి హైవే వదిలి హిందూత్వ బైపాస్‌కి రూటు మార్చిన బీజేపీ!   

దేశంలో హిందూత్వ పార్టీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీనే! శివసేన లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా వున్నా ప్రధానమైన హిందూత్వ ఎజెండాతో నడిచే కాషాయ పార్టీ కమలదళమే! అయితే, ఆరెస్సెస్ అండతో ముందుకు పోయే బీజేపీ రెండు రకాల మాటలతో రాజకీయం చేస్తూ వుంటుంది. ఒకవైపు అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు అవసరమైనప్పుడల్లా రామ మందిరం, హిందూత్వా అంటుంది! ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే ఎప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా వారికి బాగా తెలుసు! అభివృద్ధి , అవినీతి నిర్మూలన, నల్లధనం, నిరుద్యోగం లాంటి మాటలు మాట్లాడే వారు గోవధ నిషేధం, ముస్లిమ్ లలో జనాభ పెరుగుదల, అయోధ్య రామ మందిరం… ఇలాంటి అంశాల జోలికి వెళ్లరు. తాజాగా కాషాయ నేతల వరుస కామెంట్లు చూస్తే మనకు రానున్న ఎన్నికల ఎజెండా ఏంటో తెలిసిపోతుంది!     2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలనలోని అవినీతి, స్కామ్ లు మోదీకి బాగా కలిసొచ్చాయి. అందుకే, ఎక్కువగా హిందూత్వ ఎజెండా నెత్తికెత్తుకోలేదు. కాంగ్రెస్ హఠావ్ నినాదంతో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ హోరెత్తించారు. కానీ, నాలుగేళ్ల తరువాత సీన్ మొత్తం రివర్సైంది. మోదీ వచ్చాక చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు పేద, మధ్యతరగతి వారికి అసతంతృప్తి కలిగిస్తున్నాయి. అలాగే, ఉత్తరాదిలో బీజేపీ పట్టు అంతకంతకూ సడలుతోంది. పోయిన సారి ఎంపీల సీట్ల విషయంలో రాష్ట్రాలకు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసిన చోట ఇప్పుడు ఉప ఎన్నికల్లో వరుస ఓటములు భయపెడుతున్నాయి. అందుకే, ఉత్తరాది హిందూ ఓటర్లని కదిలించే పనిలో పడింది కాషాయ దళం. అందుకు తగ్గట్టే అతివాదులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో వారి కామెంట్లు చూస్తే భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థమైపోతుంది!     ఉత్తర్ ప్రదేశ్ నుంచీ పార్లెమంట్ కు ఎంపికైన ఎంపీ హరి ఓం పాండే. ఈయన తాజా కామెంట్ ఏంటంటే… దేశ స్వాతంత్ర్యం తరువాత ముస్లిమ్ జనాభ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అందువల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు పెరుగుతున్నాయి. మనం తక్షణం పార్లమెంట్లో జనాభ పెరుగుదల నియత్రణ కోసం బిల్లు తీసుకురాకపోతే మరోసారి పాకిస్తాన్ లాగా భూభాగం కోల్పోవాల్సి వస్తుంది! ఇదీ ఆయన చేసిన హాఠాత్తు వ్యాఖ్య!   ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన మరో బీజేపీ నేత సురేంద్ర సింగ్. ఆయన కూడా ముస్లిమ్ లలో జనాభా పెరుగుదల ఎక్కువగా వుందని అన్నారు. అందుకు విరుగుడుగా హిందువులు కూడా అయిదుగురు పిల్లల్ని కనమని పిలుపునిచ్చారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మరొకరు ఎవరైనా ఫర్వాలేదని ఆయన అన్నారు! బీజేపీ ఉత్తరాది నాయకులు మైనార్టీ వర్గాల్ని టార్గెట్ చేస్తే దక్షిణాది నేతలు మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఈ మద్యే ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని ఏకంగా కాల్చిపారేయాలని అభిప్రాయపడ్డాడు. తానే దేశ హోంమంత్రి అయితే పోలీసులకి కాల్చిపారేయమని ఆదేశాలు ఇస్తానన్నాడు బసన గౌడ! కర్ణాటకలో ఈ మధ్యే గౌరీ లంకేష్ లాంటి రచయిత్రి మీద దాడి జరగటం మనందరికీ తెలిసిందే!     ముస్లిమ్ లకు వ్యతిరేకంగా, మేధావులు, అభ్యుదయవాదులకి వ్యతిరేకంగా ఇలా మాట్లాడే వారు బీజేపీలో ఎప్పుడూ వుంటారు. కానీ, వీరంతా ఇప్పుడు హఠాత్తుగా వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. గోరక్షకుల దాడుల్ని, ఎక్కడ మైనార్టీలకు, దళితులకి ఏ కాస్త ఇబ్బంది కలిగినా ఆ సంఘటనల్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ఇతర సెక్యులర్ పార్టీలు కూడా మోదీ సర్కార్ ని వీలైనంత ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సెక్యులర్ రాజకీయాలకు విరుగుడుగా బీజేపీ హిందూత్వ ఎజెండాను మరోసారి నెత్తికెత్తుకుంది. పరిస్థితి చూస్తుంటే ముందు ముందు ఎన్నికల హోరులో కాషాయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. 2019 పార్లెమంట్ ఎన్నికల నాటికి ఈ మాటలు పరాకాష్టకు చేర్చి మోదీని మరోసారి పీఠం ఎక్కించటం ఈ మొత్తం వ్యూహం లక్ష్యంగా భావించాలి! అయితే, అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది? ఓటర్లు ఎంత వరకూ ఎమోషనల్ అవుతారు? వేచి చూడాలి! అంత వరకూ మాత్రం రాహుల్ లాంటి సెక్యులర్ నేతలు, ఓవైసీ లాంటి మైనార్టీ నేతలు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకి చెలరేగిపోయి స్పందించటం నిత్య కృత్యమే అవుతుంది!

మాంత్రికుడి ప్రాణం చిలకలో… పవన్‌కు గండం ఫ్యాన్స్ ఆవేశంలో!

పవన్ భయపడ్డంతా జరిగింది! ఆయన నోరు తెరిచి రచ్చ చేయొద్దని వేడుకున్నా… ఆయన సోకాల్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు! ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే పదే పదే ఎదురయ్యే సమస్య! ఏం చేయాలో అర్ఝం కాని వ్యవహారం! ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషన్ అయిన జనసేన అధినేత ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు చేసే వెటకారాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయినా వారిలో మాత్రం ఆవేశం, ఆలోచన రావటం లేదు… జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, పెళ్లాల గురించి మాట్లాడాడు. అది తప్పే. కానీ, వెంటనే పవన్ తన అభిమానులకి స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల్ని, వారింటిలోని ఆడపడుచుల్ని వివాదంలోకి లాగవద్దని. జనసేనాని ఇంతలా పరిణతి చూపించి పిలుపునిచ్చినా పవనిస్టులు మాత్రం తమ కథ తాము నడిపారు! వైఎస్ జగన్ కుటుంబంలోని ఆడవార్ని కాకుండా ఎవరో కొత్తమ్మాయిని గొడవలోకి లాగారు. ఆమె పేరు అలేఖ్యా ఏంజిల్. ఆమెతో జగన్ వున్న సెల్ఫీ ఫోటోను వైరల్ చేసి శునకానందం పొందారు! ఇదే వద్దని చెప్పారు పవన్. అయినా తమ బుద్ధి పోనిచ్చుకోలేదు ఉన్మాద అభిమానులు…     పాపం… పవన్ పదే పదే ఇలాంటి ఆవేశపూరిత ఫ్యాన్స్ వల్ల తంటాలు పడాల్సి వస్తోంది. కత్తి మహేష్ విషయంలో గబ్బర్ సింగ్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాన్ని ఒక విధంగా కత్తి చాలా తెలివిగా వాడుకుని గందరగోళం కూడా సృష్టించారు. ఆ పైన వర్మదీ, శ్రీరెడ్డిది కూడా ఇదే ఫార్మాట్! వాళ్లు పవన్ ని ఏదో అనటం, పవన్ వాళ్లనీ ఏమీ అనకున్నా ఫ్యాన్స్ రెచ్చిపోవటం, చివరకు తలనొప్పి అంతా పవర్ స్టార్ భరించాల్సి రావటం జరుగుతోంది. వపన్ అబిమానులు దుందుడుకు చర్యల వల్ల ఆయన రెండు, మూడు న్యూస్ ఛానల్స్ మ్యానేజ్మెంట్లతో కూడా గొడవపడాల్సిన స్థితి దాపురించింది. ఇక ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహారం కూడా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే! కందకు లేని దురద అన్న సామెత గుర్తొచ్చేలా పవన్ ఫ్యాన్స్ వదినమ్మని రెండో పెళ్లి చేసుకోవద్దని కలకలం రేపారు. పవన్, రేణు పరస్పర అవగాహనతో విడిపోయినా వీరే తెగ ఫీలయ్యారు!     వపన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కాలం సోషల్ మీడియాలో చేసిన హంగామా వేరు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటూ … జనసేనాని ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో… వీరి ఆగడాలు తీసుకొచ్చే ఫలితాలు వేరు! పవన్ కి ఈ విషయం తెలియదని భావించలేం. కానీ, ఆయన తన అభిమానులని చెప్పుకునే వార్ని ఎలా కంట్రోల్ చేస్తారు? జగన్ వ్యక్తిగత విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పినా కూడా జరగాల్సింది జరిగిపోయింది. అనవసరంగా ఎవరో అలేఖ్యా అనే అమ్మాయి పవన్ అభిమానుల ఆవేశానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆమె ఓ క్రిస్టియన్ గీతాల సీడీ ఆవిష్కరణ కోసం లోటస్ పాండ్ కు వచ్చింది. అదీ తన కుటుంబ సభ్యులతో కలిసి. ఆ సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. ఇంత చిన్న విషయాన్ని తమ ఇష్టానుసారం రాతలతో సోషల్ మీడీయాలో వైరల్ చేసి ఆనందించారు పవన్ అభిమానులు. దానికి అలేఖ్యా బాధపడి పోస్టు పెట్టింది. తనని బజారుకు లాగొద్దని వేడుకుంది. ట్విస్ట్ ఏంటంటే… తానూ పవన్ అభిమానినేనని చెప్పింది పాపం!     ఇప్పుడు జగన్, అలేఖ్యాల ఫోటో విషయంలో జరిగిన రచ్చకి పవన్ కారణం కాదు. అలాగే, కత్తి మహేష్, వర్మ, శ్రీరెడ్డి, రేణు దేశాయ్‌ల వ్యవహారాల్లో కూడా! కానీ, జనం ఓట్లు వేయటానికి పోలింగ్ బూత్ కి బయలుదేరేటప్పుడు ఇదంతా ఆలోచించరు. జరిగిన రచ్చని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుని ఈవీఎం మెషిన్ పై మీట నొక్కుతారు. కాబట్టి పవన్ సాద్యమైనంత తొందరగా తన అభిమానులు అని చెప్పుకునే వార్ని నియంత్రించటానికి తగిన మార్గం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడాయన బాక్సాఫీస్ పవర్ స్టార్ కాదు… బ్యాలెట్ బాక్సుల బ్యాటిల్లో నిలిచిన జనసేనాని!