సీమాంధ్రలో కూడా హంగ్ తప్పదా?
నిన్న జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే తెదేపా, వైకాపాలు రెండూ కూడా సమవుజ్జీలుగానే నిలిచినట్లు కనబడుతోంది. కానీ రెండు పార్టీల నేతలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నగరాలు, పట్టణాలలో మంచి ఆధిక్యత కనబరచగా, వైకాపా గ్రామీణ ప్రాంతాలలో ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తోంది. నగరాలలో, పట్టణాలలో నివసించే ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పేందుకు తెదేపావైపు మొగ్గు చూపగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పధకాలు, రుణాల మాఫీలకి ఆకర్షితులయ్యి వైకాపా వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అదేవిధంగా కులం, మతం, డబ్బు, మద్యం వంటి అనేక అంశాలు కూడా నగర ప్రజల కంటే గ్రామీణ ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపగలవు గనుక అక్కడి ప్రజలను వైకాపా చాలా సులువుగా ఆకర్షించి ఉండవచ్చును.
ఇక నగరాలలో నివసించే ప్రజలు కూడా ఈ ప్రలోభాలకు, బలహీనతలకు అతీతులు కాకపోయినప్పటికీ, అంతిమంగా అభివృద్ధి, సమర్ధతకే మొగ్గుచూపడంతో అది తెదేపాకు లబ్ది చేకూర్చవచ్చని సమాచారం. ఇక ఈసారి కొమ్ములు తిరిగిన రాయపాటి వంటి కాంగ్రెస్ నేతలు అనేక మంది తెదేపా అభ్యర్ధులుగా పోటీ చేయడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది. కానీ, కాంగ్రెస్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేఖత కారణంగా, వారిని చేర్చుకొన్నందుకు తెదేపాకు పడవలసిన ఓట్లు, చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు పడే అవకాశం ఉంది.
తెదేపా బీజేపీతో పొత్తు పెట్టుకొన్న కారణంగా ముస్లిం, మైనార్టీ ప్రజలను వైకాపా ఆకర్షించగలిగింది. కానీ ఆ పొత్తుల కారణంగానే నగర ప్రజలు తెదేపావైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ ప్రభావం, విజయావకాశాలున్నఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న తెదేపావైపు నగర ప్రజలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు చాలా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి యువ ఓటర్లు ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేయడం, వారి ఓటింగు శాతం గతంలోకంటే బాగా పెరగడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
వివిధ అంశాలు, సమీకరణాలు, ప్రజల బలహీనతలు, పార్టీల ప్రలోభాల కారణంగా ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినప్పటికీ, అర్బన్, రూరల్ ఓట్లు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ స్పష్టమయిన మెజార్టీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. నిన్న జరిగిన ఎన్నికలలో 13జిల్లాలలో కూడా చాలా అత్యధిక శాతం పోలింగు నమోదు అయింది. అందువల్ల ఓట్లు కూడా అదే స్థాయిలో చీలే అవకాశం ఉంది. ఒకవేళ పోలింగు 70 శాతం దాటినట్లయితే తెదేపా విజయావకాశాలుంటాయని ఇటీవల లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం నిజమనుకొంటే, నిన్న పోలింగు ఏకంగా 80శాతం జరిగింది గనుక తెదేపా విజయం తధ్యం అనుకోవచ్చును. కానీ గ్రామీణ, పట్టణ ఓటర్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ మెజార్టీ రాకపోవచ్చును. ఏమయినప్పటికీ మరొక వారం రోజుల్లో ప్రజాభిప్రాయం ఎవరికి అనుగుణంగా ఉందో తేలిపోతుంది.