మోడీని అడ్డుకొనేందుకు రాహుల్ త్యాగానికి సిద్దం?
posted on Apr 28, 2014 @ 10:39AM
ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే అందు కోసం తనది ఒక కన్నుపోగొట్టుకోవడానికి సిద్దపడే నేతలు పార్టీలు మనకి చాలానే ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 100 సీట్లు, బీజేపీకి 200 సీట్లు వరకు రావచ్చని, ఎట్టిపరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర, తెలంగాణాలలో కానీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని సర్వేలన్నీ ఘోషిస్తున్నా కూడా విజయం తమదే అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రాష్ట్రంలో సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కుర్చీలో స్థిరపడితే, బహుశః రాహుల్ గాంధీ ఇక తన జీవితంలో ఎన్నడూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. అందువల్ల ఒకవేళ తమకు అధికారం దక్కకపోతే, నరేంద్ర మోడీకి కూడా ఆ అవకాశం దక్కనీయకూడదనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతోంది.
బీజేపీ స్వయంగా 272 సీట్లు సాధించాలననే లక్ష్యంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తాజా లెక్కలు ప్రకారం బీజేపీకి 200 యంపీ సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు అన్నీకలిసి మహా అయితే మరో 40-50 సీట్లు మాత్రమే సాధించగలవని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 552 సీట్లున్న లోక్ సభలో, కనీసం 272 సీట్లు సాధించిన పార్టీ లేదా కూటమికి మాత్రమే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం మరో 20-30 సీట్లు అవసరం ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఎదురయితే, దేశంలో చిన్న చితకా పార్టీలను, తమిళనాడులో రెండు పార్టీలలో దేనినో ఒకదానిని దువ్వి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే వ్యూహం అమలు చేసేందుకు అప్పుడే పావులు కదుపుతోంది. మతతత్వ బీజేపీని, నరేంద్రమోడీని అధికారం చేపడితే అది దేశానికే చాలా ప్రమాదమని, అందువల్ల సెక్యులర్ పార్టీలన్నీ తమతో చేతులు కలిపాలని, అందుకు వారు అంగీకరిస్తే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్దమని కాంగ్రెస్ ప్రకటించింది. థర్డ్ ఫ్రంట్ నేతలు కాంగ్రెస్ ప్రతిపాదనను స్వాగతించడం, హర్షం ప్రకటించడం కూడా జరిగిపోయాయి.
థర్డ్ ఫ్రంటులో ములాయం సింగు, మాయావతి, జయలలిత, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కనీసం ఒక అరడజను మంది నేతలు తమ జీవితంలో ఒక్కసారయినా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్నారు. అయితే థర్డ్ ఫ్రంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సాధించలేదు కనుక వారి కలనెరవేరే అవకాశం కూడా లేదు. అందువల్ల అటువంటి వారితో కూడిన థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తే, ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోవచ్చునేమో కానీ మోడీ కూడా ప్రధాని కాకుండా అడ్డుకోవచ్చును.
దురాశాపరులయిన థర్డ్ ఫ్రంట్ నేతల చేతిలో అధికారం పెట్టినట్లయితే వారు దేశాన్ని మరింత భ్రష్టు పట్టించడం ఖాయం. కనుక అప్పుడు ప్రజలు వారికంటే కాంగ్రెస్ పాలనే నయమనుకొనే రోజులు మళ్ళీ తప్పక వస్తాయి. ప్రస్తుతం మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోగలిగితే, ఆయన గుజరాత్ తిరిగి వెళ్లిపోవడం తధ్యం. ఆనక థర్డ్ ఫ్రంట్ లో కొన్ని పార్టీలను తనవైపు తిప్పుకొని, వారి ప్రభుత్వాన్ని కూల్చి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం చెప్పట్టవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం దూర దురాలోచన చేస్తోంది.
కానీ ఒకవేళ మోడీ చెపుతున్నట్లుగా బీజేపీయే స్వయంగా 272 సీట్లు సాధించగలిగితే కాంగ్రెస్ వేసుకొంటున్న ఈ లెక్కలు, వ్యూహాలు పనిచేయవు. అదే జరిగితే రాహుల్ గాంధీ ఇక ఎన్నడూ ప్రధాని కాలేకపోవచ్చును.