సీమంద్రాలో తెదేపా బలాబలాలు
posted on Apr 29, 2014 @ 1:42PM
సమైక్యాంధ్ర ఉద్యమాలతో అస్తవ్యస్తమయిన సీమాంధ్ర, ఇప్పుడు రాష్ట్ర విభజనతో ప్రధాన ఆదాయం కోల్పోయి మరింత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కూడా జరగవలసి ఉంది. ఇవి చాలవన్నట్లు అధికారం చేజిక్కించుకోవడం కోసం అన్ని పార్టీలు చేసిన ఉచిత వాగ్దానాలు కొన్నయినా తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది. వీటన్నిటినీ ఏక సమయంలో సమర్ధంగా చక్కబెట్టగలవాడికే ప్రజలు పట్టం కట్టాలని భావించడం సహజం. మంచి పరిపాలనాదక్షుడు, రాజకీయ అనుభవజ్ఞుడు, కేంద్రంతో సత్సంబంధాలున్నవ్యక్తి, పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపడం సహజం.
అంటే పరిస్థితులు చంద్రబాబుకు, ఆయన పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిని చంద్రబాబు, పవన్, మోడీ, తెదేపా అభ్యర్ధులు బలంగా ప్రచారం చేసుకోగలిగితే, తెదేపాకు లబ్ది చేకూరవచ్చును. ఈసారి తేదేపాకు ప్రధానంగా కలిసి వస్తున్న అంశం ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేఖత, ఆ కారణంగా పూర్తిగా కాంగ్రెస్ బలహీనపడి ఉండటం. ఇక కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు ఈసారి తెదేపా టికెట్ పై పోటీ చేస్తుండటం తెదేపాకు కలిసివచ్చే అంశమే.
దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్న ఈతరుణంలో తెదేపా బీజేపీతో జత కట్టడం కూడా పార్టీకి ఎంతో కొంత మేలు చేయబోతోంది. ఇక తెలంగాణాలో తనకు ఎదురేలేదని భావిస్తున్న కేసీఆర్ అంతటివాడిని దైర్యంగా ఎదుర్కొని తాట తీస్తానని హెచ్చరించి అభిమానుల దృష్టిలో రియల్ లైఫ్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఈసారి పార్టీకి వరంగా మారారు.
చంద్రబాబు చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ కూడా తోడయితే, తెదేపా మరింత బలపడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ను ద్దేకొని వచ్చిన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే బలంగా డ్డీ కొనడం తధ్యం. త్వరలో సీమాంద్రాలో ఎన్నికల ప్రచారానికి రానున్న నరేంద్ర మోడీ కూడా ఇదే అంశం గట్టిగా ప్రస్తావించబోతున్నారు.
కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన సోదరుడు చిరంజీవి ప్రజలను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయినందున, మెగాభిమానులు, యువత, కూడా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులు ప్రయోజనం పొందనున్నారు.
ఇక గల్లా జయదేవ్ తరపున మహేష్ బాబు ట్వీటర్ ద్వారా జయదేవ్ కు మద్దతు ప్రకటించి, అభిమానులను కూడా కోరారు. కానీ, ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ మహేష్ బాబు కూడా తెదేపా తరపున కనీసం గుంటూరు జిల్లా అంతటా ప్రచారం చేసినా అది తెదేపాకు చాలా లబ్ది కలిగించవచ్చును.
ఇక తెదేపాకు ఉన్నత కులాల మద్దతు ఎంత ఉందో బీసీ, కాపు కులస్థుల మద్దతు కూడా అంతే ఉంది. ఇక 13 జిల్లాలలో తెదేపాకున్న బలమయిన క్యాడర్, మంచి అంగబలం, అర్ధ బలం ఉన్న అభ్యర్ధులు, నాయకులు వారికి ఆయా ప్రాంతాలపై ఉన్న మంచిపట్టు అన్నీ కూడా తెదేపాకు కలిసి వచ్చే అంశాలే.
ఇదేవిధంగా తేదేపాకు కొన్ని వ్యతిరేఖ అంశాలు కూడా ఉన్నాయి. ఏ దేశముదురు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని అవలీలగా గెలవాలని తెదేపా భావిస్తోందో, సరిగ్గా వారివలననే పార్టీకి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కారణం ప్రజలలో వారిపట్ల, కాంగ్రెస్ పట్ల నెలకొని ఉన్నతీవ్ర వ్యతిరేఖతే. ఈసారి బీజీపీతో జత కట్టి ప్రయోజనం పొందాలని భావిస్తున్న తెదేపా, ఆ పార్టీ కారణంగానే, ముస్లిం ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎన్నికలలో జూ.యన్టీఆర్ లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన ప్రచారంలో పాల్గొనక పోవడం వలన, కనీసం 1-2 శాతం ఓట్లు వదులుకోకతప్పదు.