జగన్ విజయ రహస్యాలు
posted on Apr 29, 2014 @ 3:57PM
జగన్మోహన్ రెడ్డి బలమంతా తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ప్రజలలో ఉన్న ఆదరణ, సానుభూతేనని చెప్పవచ్చును. నిజానికి దీనిని బలం కంటే బలహీనతగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయనపోయి ఐదేళ్ళు అవుతున్నా కూడా నేటికీ ఆయన పేరు చెప్పుకొనే ప్రజలను ఓట్లు అడుగుతున్నారు తప్ప జగన్ తన స్వంత పార్టీ సిద్దాంతాలు, దాని బలం, తన శక్తి యుక్తులు ఆధారంగా ఓట్లు అడగలేకపోతున్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన పార్టీ అధికారం చెప్పట్టలేదు గనుక ఆయన తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేకపోయారు. బహుశః ఆ కారణం చేతనే ఆయన తన తండ్రి పేరు ప్రతిష్టలను ఆయన మరణం తాలూకు సానుభూతిని పెట్టుబడిగా పెట్టి అధికారంలోకి రావాలని తపిస్తున్నారు.
ఈ రోజుల్లో ఏకంగా ఐదేళ్ళపాటు జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకు సానుభూతిని ప్రజలలో యధాతధంగా నిలిపి ఉంచగలగడం సాధారణమయిన విషయమేమీ కాదు. జగన్ ఓదార్పు యాత్రలు, షర్మిల పాదయాత్రలు, విజయమ్మ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలలో నేటికీ అదే స్థాయిలో సానుభూతి నిలుపుకోగలిగారు. ఇక దానిని ఇప్పుడు ఓట్ల రూపంలో మార్చుకోగలిగితే వారి ప్రయత్నంలో నూటికి నూరు శాతం సఫలం అయినట్లే. ఈ ముగ్గురు కలిసి సమిష్టిగా చేసిన ఈ ప్రయత్నం అంతా పార్టీని బ్రతికించుకోవడానికే అయినప్పటికీ, వారు మాత్రం తాము ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడే త్యాగాలు చేసామని చెప్పడం కూడా గొప్ప ఆలోచనే. ప్రజలని ఓదార్చే మిషతో వారికి దగ్గరయ్యి, వారిలో ఆ సానుభూతి కరిగిపోకుండా చూసుకొంటూ, తన పార్టీని మెల్లగా బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ “త్వరలోనే షర్మిల తెలంగాణాలో కూడా ఓదార్పు యాత్ర చేప్పట్టబోతోందని” ప్రకటించారు. మళ్ళీ నిన్న హైదరాబాదులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన “ఈ ఎన్నికలలో కాకపోతే వచ్చే ఎన్నికలలో అయినా తెలంగాణాలో తప్పక గెలుస్తామని” అన్నారు. ఈ రెండు ప్రకటనలను కలిపి చూసినట్లయితే ఆయన ఓదార్పు యాత్రలు పార్టీని బలోపేతం చేసుకోవదానికేనని స్పష్టంగా అర్ధమవుతుంది. అటువంటప్పుడు అది ఏవిధంగా ‘త్యాగం’ అవుతుందో వారికే తెలియాలి. వారు తమ పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే దానికి ఎవరు అభ్యంతరం చెపుతారు? ఒక రాజకీయ పార్టీగా వారికి ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. దానికి ఓదార్పు, త్యాగమనే సబ్ టైటిల్స్ ఎందుకు?
ఇక వారు ముగ్గురూ కలిసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వలన సామాన్య ప్రజలకు అందిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేస్తూ, జగన్ పై అనేక అవినీతి కేసులున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు పట్టించుకోకుండా ఉండేలా చేయలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పోలీసు స్టేషన్ గడప తొక్కడమే అవమానంగా భావించే ప్రజలకి, పద్దెనిమిది నెలలు జైలులో ఉండి వచ్చిన జగన్, అది తన సహనానికి, పట్టుదలకి ప్రత్యర్ధ పార్టీలు పెట్టిన అగ్నిపరీక్షగా చెపుతూ దానిలో తాను విజయవంతంగా నెగ్గి బయటకు వచ్చిన గొప్ప వీరుడిగా ప్రజలను నమ్మింపజేయాలని ప్రయత్నించడం చేయడం చూస్తే ప్రజలకు అసలు లోకజ్ఞానం, రాజకీయ అవగాహన వంటివి ఏవీ ఉండవని వారు భావిస్తున్నట్లు కనబడుతోంది.
సాధారణంగా ఎవరయినా జైలుకెళ్ళి వచ్చినవారు సమాజంలో చులకనవుతారు. కానీ జగన్ మాత్రం తాను ప్రజల కోసం చేస్తున్న పోరాటం కారణంగానే అన్యాయంగా జైలు పాలయ్యాననే ఒక భావనను ప్రజలలో వ్యాపింపజేస్తూ, తనను తాను ఒక త్యాగమూర్తిగా ప్రదర్శించుకొంటున్నారు. ఇటువంటి వ్యవహారాల వలన వేరెవరయినా అయితే అప్రదిష్ట మూటగట్టుకొంటారు. కానీ జగన్ మాత్రం దానిని కూడా ప్రజల సానుభూతి పొందే అంశంగా మలుచుకొని ఓట్లు రాల్చుకోవాలని కలలు కంటున్నారు.
ఒక అబద్దాన్ని వందసార్లు నిజమని గట్టిగా వాదించగలిగితే అది చివరికి నిజమయిపోతుందని జగన్, షర్మిల, విజయమ్మ నిరూపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో వైకాపా విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రి అవ్వగలిగితే, ప్రజలను మభ్యపెట్టడంలో వారు ముగ్గురూ విజయవంతం అయినట్లేనని అంగీకరించక తప్పదు.