జూబ్లీ బైపోల్ కౌంటింగ్ రేపు.. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబర్ 14)న వెలువడనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న అంటే మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తధ్యం అని అంచనా వేసినా, తుది ఫలితం కోసం పార్టీలూ, అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర బలగాల మూడంచెల భద్రత నడుమ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రంగా ఉంచారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.  ఇక కౌంటిగ్ కోసం  42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే  కౌంటింగ్ పూర్తి అవుతుంది.  ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు.  ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవడంతో.. ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది.  హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఇక మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. 

సెల‌బ్రిటీస్ సారీ..గామా!

ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ‌. ఈమె గ‌తంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో  నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో  నాగార్జున న్యాయాన్ని ఆశ్ర‌యించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్య‌వ‌హారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో  అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ త‌ప్పించుకున్నారు.  ఆమె మంత్రిగా ఉండి కూడా  ప్రభుత్వంలో తమను   తొక్కేస్తున్నార‌ని ఆరోపణలు గుప్పించి కూడా  పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం.  అప్ప‌టి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయాన‌ని అంటారు. తానేదైనా అంటే  అది మ‌రొక‌టిగా రూపాంత‌రం చెందుతోంద‌ని.. ఫీల‌య్యి మీడియాతో మాట్లాడ్డ‌మే మానేశాన‌ని చెప్పుకొచ్చారీ మ‌ధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ‌.. ట్వీట్ చేసి స‌రిపుచ్చారు త‌ప్ప‌.. మీడియా ముందుకు రాకుండా జాగ్ర‌త్త వ‌హించారు చూశారా!? ద‌టీజ్ కొండంత సారీల సురేఖ‌  అంటే. ఇక  రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్. ఒక స‌మ‌యంలో షాడో సీఎం గా వ్య‌వ‌హించార‌న్న పేరుండేది. అప్ప‌ట్లో ఇద్ద‌రి ప‌ట్ల తాను ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాన‌నీ ఆయ‌న ఇప్పుడు తాజాగా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ వారెవ‌రో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్ద‌రి ప‌ట్ల తాను అలా వ్య‌వ‌హ‌రించి ఉండ‌కుండా ఉండాల్సింద‌న్న కోణంలో ఆయ‌న చేసిన ఒక వీడియో ప్రెజంటేష‌న్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏదంటే  అది అన్న మాట‌క‌న్నా, ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక ద‌శ‌లో ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మీద ఉపాధ్యాయులంతా  క‌ల‌సి కంప్ల‌యింట్ చేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నుంచి  సారీ.. అది  కూడా ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు అందింది.  ఒక మూడో సారీ..  న‌టుడు ప్ర‌కాష్ రాజ్చెప్పారు.   బేసిగ్గా ప్ర‌కాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్ర‌ధాన మంత్రినే ఏ ప్ర‌శ్న‌లంటే ఆ ప్ర‌శ్న‌లు అడిగే బాప‌తు. దేశంలో ఏ చిన్న విష‌య‌మైనా స‌రే ఆయ‌న నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని స‌మాజాన్ని అనే టైపు. అలాంటి ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకుగానూ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తనకే పాపం తెలీదంటే అది త‌ప్పు అవుతుందని అన్నారు.  అయితే.. తాను గ‌తంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్ర‌చారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్ర‌ముఖుల నుంచి మూడు సారీలు వెలువ‌డ్డంతో ఇదో స‌రికొత్త రికార్డు  సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జ‌గ‌మొండి ఘ‌టాల నుంచి ఇలాంటి క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం ఈ స‌మాజం చూస్తుంద‌నుకోలేదు. కాబ‌ట్టే ఇంత ఎగ్జ‌యిట్ మెంట్. ఇందులో ఏదైనా త‌ప్పుంటే సారీయే..!

తాడిపత్రిలో హై టెన్షన్

  అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. అదే సమయంలో, స్థానిక  ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.  దీంతో పెద్దారెడ్డి కార్య క్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డిపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరిని అడ్డుకుంటున్నాం.. గత ఐదేళ్లు పట్టిన పీడను వదిలించుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి ఏం చేశారని అంటు అస్మిత్‌రెడ్డి ప్రశ్నించారు

జూబ్లీహిల్స్ ‌లో అత్యల్ప పోలింగ్ నమోదు

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం 48.43%  నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారు. ఇది మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి వచ్చి తమకు నచ్చిన నాయకులను ఎన్నుకొమని చెప్పిన జూబ్లీ ఓటర్ల ఆమడ దూరం పోయారు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీహిల్స్‌లోనే 48.43 శాతం నమోదు అయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం సమస్యతో మృతి చెందటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. జూబ్లీహిల్స్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నాట్లు తెలుస్తోంది.  

జూబ్లీహిల్స్‌లో హస్తానిదే హవా...తేల్చిచేసిన ఎగ్జిట్ పోల్స్‌‌

  తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసినందుకు ఆమెను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు ఛాన్స్ ఇచ్చారు చాణక్య స్ట్రాటజీస్‌  కాంగ్రెస్‌ 46%, బీఆర్‌ఎస్ 43%, బీజేపీ 6% ఓట్లు పీపుల్స్‌ పల్స్‌: కాంగ్రెస్‌ 48%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు నాగన్న సర్వే: కాంగ్రెస్‌ 47%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు ఆపరేషన్‌ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, బీఆర్‌ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు ఆరా మస్తాన్ సర్వే :  కాంగ్రెస్‌  47.49% బీఆర్‌ఎస్ 39.25%, బీజేపీ 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది..  ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం   66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122. ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ  చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి.  పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.   మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది.  ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది.  ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది.  అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. 

ముగిసిన జూబ్లీ పోలింగ్... ఎగ్జిట్ పోల్స్‌‌పై ఉత్కంఠ

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సాయంత్రం 5  గంటల వరకూ 47.16 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియెగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్ అవకాశం ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.  పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి.. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. అనేక సంస్థల అంచనాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీ లేదాబీఆర్‌ఎస్ ల మధ్యే గెలిచే ఛాన్స్ ఉంది. తక్కువ పోలింగ్ శాతం కారణంగా పోల్స్ అంచనాలలోనూ కొంత భిన్నత్వం కనిపించనుంది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన ప‌లువురిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య,  రామ‌చంద్ర‌నాయ‌క్‌,  రాందాస్ పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు  దాస్యం విన‌య్ భాస్క‌ర్,  మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోద‌య్యాయి. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని గౌర‌వించాల‌ని సూచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గ‌మ‌నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఢిల్లీ బ్లాస్ట్.. బీహార్ ఎలక్షన్స్!

ఢిల్లీలో చాందినీ చౌక్, లాల్ ఖిలా, నయి దిల్లి రైల్వే స్టేషన్ కు అతి దగ్గర గా ,  పార్లమెంట్ కు కూడా పెద్దగా దూరం లేని ప్రాంతం లో కారు లో భారీ పేలుడు పదార్ధాలతో కూడిన ఆత్మహుతి దాడి జరిగింది.  కేంద్ర దర్యాప్తు సంస్థలు తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే తేలిందని చెబుతున్నాయి.   ఇక  బీహార్ లో అత్యంత కీలక మైన  రెండో, చివరి దశ పోలింగ్ జరుగుతోంది.  ఈ రెంటికీ లింక్ లేదు.. డిల్లి లో జరిగిన పేలుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద కుదుపునకు లోను చేసింది.  పహాల్ గావ్ ఘటన జరిగిన తరువాత.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు అత్యంత అప్రమత్తత తో పనిచేస్తున్నాయి అన్నది వాస్తవం.  అయినా వాటి నిఘా నీడ ను తప్పించుకొని డిల్లి లో కొన్ని కిలోల పేలుడు మెటీరియల్ ను తెచ్చి పేల్చడాన్ని నిఘావైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.  ఇకపోతే బీహార్ ఎన్నికల పై ఈ బ్లాస్ట్ ప్రభావం  ఉంటుందా? అన్నదో ప్రశ్న. సోమవారం  రాత్రి 7.30 నిముషాలకు జరిగిన బ్లాస్ట్ దేశం లో నిముషాల్లో పాకి పోయింది.. దీనికంటే ముందు ఒక  విషయం చెప్పుకోవలసి ఉంటుంది. 1991 లో రాజీవ్ గాంధీ పై మానవ బాంబుదాడి జరిగింది.. ఆ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు దేశం లో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి . దాదాపుగా కాంగ్రెస్ కు స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని ఎన్నికలు అవి. రాజీవ్ గాంధీ హత్య  అనంతరం   జరిగిన ఫేజ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. రాజీవ్ హత్యకు ముందు  జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ కు చాలా చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు ప్రజెంట్ బీహార్ ఎన్నికలకు వద్దాం..  తెల్లారి రెండోది చివరిది అయిన ఎన్నికల ఫేజ్.. మొదటి ఫేజ్ లో ఎన్ డీ ఏ కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనేది పబ్లిక్ టాక్ గా ఉంది.. రెండో ఫేజ్ పై దాని ప్రభావం పడి ఆర్ జేడి కి ఒక 135 స్థానాలు గ్యారంటీగా వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.. ఇప్పటి బ్లాస్ట్ ప్రభావం , దాని టైమింగ్ ఎన్నికల పై పడుతుందా అనేది పోల్ స్టర్స్ ను తొలుస్తున్న ప్రశ్న. పోలింగ ప్రారంభం కావడానికి కేవలం 12 గంటల ముందు, అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావం బీహార్ లో రెండో దశ పోలింగ్ పై  పడే అవకాశం కేవలం ఐదుశాతం మాత్రమే ఉంటుందంటున్నారు. ఆ ప్రభావం కూడా పట్టణాలూ, నగరాలకే పరిమితమౌతుందనీ అంటున్నారు. అయితే ఆ ఐదు శాతం ప్రభావమే..  సీట్ల లో భారీ తేడాను తెస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఘటబంధన్ ఆ ప్రభావం ను అడ్డుకోగలిగితే గెలుపు వాకిట్లో బోల్తా పడే పరిస్థితి నుంచి కూటమి బయటపడుతుంది

బీహార్ లో ప్రశాంతంగా పోలింగ్.. అంచనాలకు మించి ఓటెత్తిన జనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో , చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌  సాయంత్రం 5 గంటల వరకు కొనగుతుంది.  ఈ విడతలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు . 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.   ఉదయం 9 గంటలకే 14.55 శాతంగా నమోదైన పోలింగ్ .. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికల్లా దాదాపు 50 శాతానికి చేరుకుంది. ఈ విడతలో తొలి దశకంటే అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే భారీ పోలింగ్ ఏ కూటమికి అనుకూలం అనే విషయంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కిషన్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం నమోదు కాగా,  గయాలో 50.95, జుమాయిలో 50.91, బంకాలో 50.07శాతం ఓటింగ్ నమోదైంది. ఇక మధుబనిలో అయితే అత్యల్పంగా 43.39శాతం ఓటింగ్ నమోదైంది.   రెండో విడత పోలింగ్ లో ఇప్పటి వరకూ ఓటు వేసిన ప్రముఖులలో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝా, ఎంపీ పప్పుయాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి నితిష్ మిశ్రా, జుమాయ్ బీజేపీ అభ్యర్థి శ్రేయేషి సింగ్, ఇండిపెండెంట్ అభ్యర్థి జ్యోతి సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు షహనవాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకుడు అజీత్ శర్మ తదితరులు ఉన్నారు.

జూబ్లీ బైపోల్ చాలా చిన్న ఎన్నిక.. కిషన్ రెడ్డి మాటల మర్మమేంటి?

జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎంత? ఏ పార్టీ పట్ల జనం మొగ్గు చూపే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు కాసేపు పక్కన పెడితే.. పోలింగ్ ప్రారంభం కావడానికి గంటల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య.. ఈ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకోలేదా? లేక.. ఓటమిని అంగీకరించేసిందా? అన్న చర్చ మొదలైంది. అసలు మొదటి నుంచీ కూడా జూబ్లీ ఉన ఎన్నిక విషయంలో బీజేపీ అసలు రేసులో ఉందా? లేక ఆటలో అరటిపండు చందమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం మాదే అంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో విజయం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ అభ్యర్థి ఎంపికలో జాప్యం నుంచి ఎన్నికల ప్రచారం వరకూ బీజేపీ జూబ్లీ బైపోల్ ను చాలా లైట్ గా తీసుకుందని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది.  ఒకపక్క జూబ్లీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటే.. మరోపక్క సరిగ్గా పోలింగ్ కు గంటల ముందు ఇది చాలా చిన్న ఎన్నిక అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం.. బీజేపీ ఓటమి అంగీకర ప్రకటనలా ఉందంటున్నారు పరిశీలకులు.  అంతే కాకుండా.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా ఉన్నాయం టున్నారు.   

ప్రశాంతంగా జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మంగళవారం (నవంబర్ 11) ఉదయం ఏడుగంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ  ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. ఈ పోలింగ్ పరిశీలన, పర్యవేక్షణకు తొలి సారిగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.  జూబ్లీ బైపోల్ కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో  226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గూడలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ ఎన్నిక...పోలింగ్ శాతం పెరిగేనా?

  అభ్యర్థుల గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. జూబ్లీహిల్స్‌లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా? ఎప్పటిలాగే 50 శాతం లోపే ఆగిపోతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి, ఓ పది నిమిషాలు క్యూలో నిల్చొని.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. పోలింగ్‌ని లైట్ తీసుకొని రిలాక్స్ అవుతారా? అన్నదానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయ్. ఎందుకంటే.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది.  ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం మార్క్‌ని దాటలేదు. జూబ్లీహిల్స్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ బైపోల్‌లోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఎంత చర్చ నడుస్తుందో.. పోలింగ్ శాతం పెరుగుతుందా? లేదా? అనే దానిమీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో.. తక్కువ పోలింగ్ నమోదవడం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఎందుకంటే.. ఓటు మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ప్రశ్నించడానికైనా, ప్రాంత ప్రగతికైనా.. ఓటే ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి? ఎంతో కొంత మంది వేస్తున్నారుగా? నేనొక్కడిని ఓటు వేయకపోతే.. ఏమవుతుందిలే అనే ఆలోచన, నిర్లక్ష్య ధోరణి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం! ఇలా ఆలోచిస్తే.. పోలింగ్ శాతం తగ్గిపోతోంది. తక్కువ మార్జిన్‌తో.. ఫలితం మారిపోతోంది. అప్పుడు.. మీరు అనుకున్న నాయకుడికి బదులుగా.. మరొకరు గెలిచే అవకాశం ఉంటుంది.  మీకు నచ్చిన నాయకుడు గానీ, పార్టీ గానీ గెలుపొందాలంటే.. మీరు కచ్చితంగా గడప దాటి వెళ్లి ఓటు వేయాల్సిందే! నేను కాకపోతే మరొకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే.. వాళ్లు కూడా మీలాగే ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతే.. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికీ పెరగదు. ఇది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. ముఖ్యంగా.. జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజలు కలబోతగా ఉన్న నియోజకవర్గంలో.. 50 శాతం పోలింగ్ కూడా నమోదవకపోవడం ఆందోళనకరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ.. సరైన అక్షరాస్యత లేని వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  కానీ.. ఉన్నత చదువులు చదివి, సిటీలో ఉంటూ.. ఓటు హక్కు వినియోగించు కోకపోవడమేంటి? చివరికి.. బీహార్ ఓటర్లు కూడా.. పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మరి.. జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏమైంది? పోనీ.. పోలింగ్ కేంద్రాలేమైనా పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటాయా? అంటే అదీ లేదు. అందరికీ.. దగ్గర్లోనే ఉంటాయ్. లైన్‌లో ఓ పది నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది. మహా అయితే.. అరగంట. అంతకుమించి పోలింగ్ సెంటర్‌లో వేచి ఉండే పరిస్థితే లేదు. అయినప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం పెరగడం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలని చూసైనా.. మేల్కోవాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. ఓటు హక్కు.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు. మన భవిష్యత్తుని నిర్ణయించే.. విలువైన అధికారం. ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోకపోతే.. ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్‌లో పాల్గొనే ప్రతి పౌరుడికి.. ఎన్నికల తర్వాత తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఎవరికైనా ఓటు వేసుకోండి.. మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి.  కానీ.. ఓటు మాత్రం వేయండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అధికారం కట్టబెట్టినప్పుడు, పాలనలో లోపాలు కనిపిస్తే.. నిలదీసే హక్కు దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా వింటున్నారా? పోలింగ్ డే రోజున.. ఇంటి నుంచి కదలండి. ఆనవాయితీగా మారిన లో ఓటింగ్ మచ్చని చెరిపేయండి. ఈసారైనా చరిత్రని మార్చండి. మీ ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకండి. మీ ఒక్క ఓటే.. తీర్పుని మార్చొచ్చు. పోలింగ్ సెంటర్‌లో మీరు తీసుకునే నిర్ణయమే.. సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నియోజకవర్గ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.

అందుకే జగన్‌ అసెంబ్లీ రావడం లేదు : స్పీకర్ అయ్యన్న

  వైసీపీ అధినే జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని  ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ శాసన సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై సభాపతి స్పందించారు. జగన్‌కు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే  ఇస్తామని స్ఫష్టం చేశారు. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని హితవు పలికారు.  నా ముందు అధ్యక్ష అనడం ఇష్టం లేక అసెంబ్లీకి  రావడం లేదని తెలిపారు. వైసీపీ 10 మంది  ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు జగన్‌ తప్ప..  కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని స్పీకర్ తెలిపారు. గత జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చంఢీయాగ, నవగ్రహ యాగాల్లో సభాపతి అయ్యన్న సోమవారం పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారని. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు  చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ అధికారులపై కేసు.. వివేకా హత్య కేసులో డాక్టర్ సునీతకు నైతిక విజయం.. భారీ ఊరట!

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి డాక్టర్   సునీతకు ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది.  2019లో తన తండ్రి దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటూ చేస్తున్న న్యాయపోరాటంలో డాక్టర్ సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో  న్యాయం కోసం అవిశ్రా పోరాటం సాగించారు. సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సోదరుడు జగన్  ఉన్న సమయంలోనే ఆమెకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో  పోలీసులు ఆమె, ఆమె భర్తపై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  విచారణలంటూ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సునీత, ఆమె భర్తపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులంటూ కొట్టివేసింది. అంతే కాదు.. ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అప్పట్లో సునీతపై, ఆమె భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులు ఎవరంటే.. అప్పటి  ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి.  ఆ ఇద్దరూ కూడా ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిరువురిపై శాఖాపరమైన విచారణకు నిర్ణయించిందని చెబుతున్నారు.  ఆ ఇరువురిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకూ  వారి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ఆ తప్పుడు కేసుల నమోదుకు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.    ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు నమోదైంది. లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి సునీత, ఆమె భర్తపై అక్రమ కేసులు నమోదు చేయడం, వేధించడంలో కీలక పాత్ర పోషించిన  అప్పటి ఎఎఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వరరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుపై వారిరువురిపై కేసు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సంవత్సరాల పోరాటం తరువాత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు ప్రస్తుత పరిణామం నైతిక విజయంగా పరిశీలకులు ఆభివర్ణిస్తున్నారు. నాడు తప్పుడు కేసులతో తనను వేధించిన అధికారులే ఇప్పుడు నిందితులుగా బోనెక్కాల్సిరాడమంటే ఇది క చ్చితంగా వివేకా హత్య కేసులో న్యాయం దిశగా పడిన కీలక అడుగుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

అంబటినోట టీటీడీపై ప్రశంసలు.. అన్నప్రసాదం అద్భుతం అంటూ పొగడ్తలు

తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత విషయంలో వైసీపీ హార్డ్ కోర్ నేతలు కూడా ప్రశంసించక తప్పడం లేదు. ప్రత్యర్థుల ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎత్తి చూపడానికీ, వంక పెట్టడానికి ఇసుమంతైనా అవకాశం లేకుండా.. తెగడ్తలు గుప్పిద్దామన్నా నోటినుంచే పొగడ్తలు వచ్చేలా అన్న ప్రసాదం నాణ్యత, రుచి, శుభ్రత ఉంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనమే..నిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, అన్న ప్రాసాదం క్యాంటిన్ లో శుచి, శుభ్రతల గురించి మైమరిచి మరీ పొగడ్తల వర్షం కురిపించారు.  వైసీపీ హయాంలో అన్న ప్రసాదం ఒక్కటే కాదు, చివరాఖరికిరి తరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉందన్న ఆరోపణలు భక్తుల నుంచే వచ్చాయి. అవేమీ రాజకీయ ఆరోపణలకు కావని లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కూడా. వైసీపీ హయాంలో అసలు తిరపతిలో భక్తుల సౌకర్యాలను గురించి పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ, తిరుమల కొండపై పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాల కల్పన ఉందన్న ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నడుస్తున్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.   ఆ క్యాంటిన్ ను నిర్వహిస్తున్న తీరు, అక్కడి శుచి, శుభ్రత, అన్నప్రసాదం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా.. తాను కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో  భోజనం చేస్తున్న వీడియోను  షేర్ చేశారు.  ఆహారం నాణ్యత, నిర్వహణ, పారిశుధ్యం, భక్తులకు అన్నప్రసాదం వడ్డన ఇలా అన్నీ ఏగ్రేడ్ లో ఉన్నాయంటూ ప్రశంసించారు.  ఇదే ప్రశంస వేరే ఎవరినుంచైనా వచ్చి ఉంటే.. వైసీపీ.. రాజకీయం చేసి ఉండేది. ఎల్లో మీడియా ప్రచారం అంటూ ఊరూవాడా ఏకం చేసేసేది.  కానీ ఇక్కడ ఈ పొగడ్తలు వైసీపీ సీనియర్ నాయకుడు, కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు నుంచి వచ్చాయి.   దీంతో వైసీపీకి గొంతులో పచ్చవెలగకాయ పడినట్లు అయ్యింది.  ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీయులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై వారు టీటీడీపై విమర్శ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించకతప్పని పరిస్థితిని అంబటి రాంబాబు పొగత్తలు కల్పించాయి.  

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతలు సైలెంట్ అయ్యాయి. మరోవైపు బీహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు  ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు. పారా మిలిటరీ బలగాలు.. ‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి ఎన్‌సీసీ వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తుమని తెలిపారు 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 103 మంది ఓటింగ్ పూర్తిందని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నెల 11న పోలింగ్.. 14న కౌంటింగ్, ఫలితాల వెల్లడి తాయని తెలిపారు  

ఓటర్ కార్డులో సునీత భర్త పేరు వేరే ఉంది...బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

  బీజేపీ అంటేనే హిందువు... హిందువు అంటేనే బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పాదయాత్ర చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మ మాట్లాడుతున్నారంటే ఏమనాలి అని  బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.  అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది.... అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్ అని కేంద్ర మంత్రి విమర్శించారు. 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారు. 7సార్లు జైలుకు పోయి వచ్చిన... నీకు నాతో పోలికా? అని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు...అదేనెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిగో ఆధారాలు... కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంజయ్ తెలిపారు.  గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవని ప్రశ్నించారు కేంద్రమంత్రి. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని తెలిపారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందని ఆయన తెలిపారు. విచారణలో ఆమె తప్పుడు  సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిందని బండి సంజయ్ అన్నారు. ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని..ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని సంజయ్ ఆరోపించారు. ఇదిగో ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా...విచారణ జరపించాలని రేవంత్ రెడ్డికి సవాల్  విసిరారు.  2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీతకు చదువుకోలేదని రాసిచ్చారని..2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారని ఆయన తెలిపారు వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారని ఆయన అన్నారు.  గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు...గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. గోపీనాథ్ సుప్తచేతనావస్థలో ఏఐజీ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని రానీయ్యలే....కానీ అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదాని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి ఓటేసి దీపక్ రెడ్డిని గెలిపిస్తే...కేంద్రంతో మాట్లాడి జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాని బండి సంజయ్ తెలిపారు.  

టీడీపీలో టికెట్ ఫ‌ర్ సేల్ సీజ‌న్ 2

  టీడీపీని కోట్ల‌కు టికెట్ల గొడ‌వ ఒక ఊపు ఊపేస్తోంది. శ‌నివారం నాడు తిరువూరు వ్య‌వ‌హారం క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ముందు చ‌ర్చ‌కు వ‌చ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి  శ్రీనివాస‌రావు తాను ఎంపీ చిన్నికి ఈ నియోజ‌క‌వ‌ర్గ  టికెట్ కోసంగానూ రూ. 5 కోట్లు ఇచ్చానంటూ సంచ‌ల‌నం రేకెత్తించారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ వంటి ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను సొంత ఖ‌ర్చుతో నిర్వ‌హించే తానేంటి? ఇలాంటి వ‌సూళ్లు చేయ‌డ‌మేంట‌న ఆయ‌న పెద్ద ఎత్తున రియాక్ట‌య్యారు. ఈ వ్య‌వ‌హారంపై ఇరువురు నేత‌ల‌ను పిలిచి.. ఒక నివేదిక రూపొందించి అధినేత చంద్ర‌బాబుకు స‌మ‌ర్పించారు వ‌ర్ల‌రామ‌య్య త‌దిత‌ర పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ  స‌భ్యులు. ఇదిలా ముగిసిందో లేదో మ‌రో కొత్త టికెట్ల‌కు కోట్ల గొడ‌వ  తెర‌పైకి వ‌చ్చింది. అదే రైల్వే కోడూరు సీటు కోసం రూ. 7 కోట్ల వ‌ర‌కూ ఇచ్చిన వ్య‌వ‌హారం.  సుధా మాధ‌వి అనే ఒక టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్త వేమ‌న‌ స‌తీష్ అనే టీడీపీ ఎన్నారైనేత పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తాను స‌తీష్ కి డ‌బ్బులు ఇచ్చే వీడియోతో పాటు.. ఇత‌ర ఆధారాల‌ను ఆమె బ‌య‌ట పెట్టారు. అదెలా ఇచ్చార‌ని ఆమెను అడిగితే.. వేమ‌న స‌తీష్ చంద్ర‌ బాబు, భువ‌నేశ్వ‌రి, లోకేష్ వంటి వారు త‌న‌కు బాగా తెలుసున‌ని వారితో ఆయ‌న‌ ఫోటోలు దిగ‌డం చూసి న‌మ్మి ఇచ్చామ‌ని అన్నారామె. స‌తీష్ కి థ‌ఫ థ‌ఫాలుగా త‌న ఆస్తిపాస్తుల‌ను అమ్మి మ‌రీ 7 కోట్ల‌ మొత్తం చెల్లించిన‌ట్టు చెప్పారామె. ఇప్పుడు చూస్తే ఆ సీటు రాలేద‌ని.. తాను నిండా మునిగిపోయాన‌నీ... తాము రోడ్డున ప‌డ్డామ‌నీ, త‌న భ‌ర్త మంచాన ప‌డ్డాడ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు  బాధితురాలు సుధా మాధ‌వి. పార్టీకి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడీ కొత్త త‌ల‌నొప్పి తోడ‌య్యింది. ఇటీవ‌లి క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ  తిరువూరు స‌హా మొత్తం 7 నియోజ‌వ‌ర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఫించ‌న్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి విష‌యాల‌కు దూరంగా ఉన్న‌ట్టు గుర్తించి వారిపై కూడా చ‌ర్చించారు. ఇక నియోజ‌క‌వ‌ర్గానికో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న కూడా చేస్తున్నారు. తాజాగా ఈ వార్త కూడా వెలుగులోకి రావ‌డంతో.. ప్ర‌స్తుతం పార్టీలో ఇదో క‌ల‌క‌లంగా  మారింది. ఇంత‌కీ వేమన‌ స‌తీష్ ఎవ‌రు? ఆ డీటైల్స్ ఏంట‌న్న  దానిపై జోరుగా  చ‌ర్చ జ‌రుగుతోంది.  తాను చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌పుడు 53 రోజుల  పాటు నిరాహార దీక్ష చేశాన‌నీ.. సొంత వాహ‌నాలు పెట్టుకుని  నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని గ్రామాలు తిరిగి  బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు టీడీపీ గెలవాలని ఎంతో కృషి  చేశాన‌ని చెప్పుకొచ్చారామె. త‌న కార్య‌క్ర‌మాల‌ను గుర్తించిన వేమ‌న స‌తీష్ త‌న‌కు బాబు, భువ‌నేశ్వ‌రి, లోకేష్ తెలుసున‌ని రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాన‌ని  న‌మ్మ‌బ‌ల‌క‌డంతో ఆస్తుల‌మ్మి  మ‌రీ సొమ్ము చెల్లించిన‌ట్టు చెబుతున్నారామె. అప్పుడే తమ గ్రామ‌స్తులు ఈ విష‌యంపై ధ‌ర్నా నిర్వ‌హిద్దామ‌ని అంటే తానే వ‌ద్ద‌న్నాన‌నీ.. ఇపుడు త‌మ పిల్ల‌లు విష‌యం వెలుగులోకి తేవ‌డంతో మీడియా ముందుకు వ‌చ్చాన‌నీ.. ఒక స‌మ‌యంలో స‌తీష్ త‌న మామ పోలీస‌ని.. ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే చంపేస్తాన‌ని బెదిరించాడ‌నీ... తమ‌కు ఆయ‌న్నుంచి ప్రాణ‌హాని ఉన్న‌ట్టుగా చెప్పారు సుధా మాధ‌వి. కాబ‌ట్టి సీఎం చంద్రబాబు త‌మ‌కు న్యాయం చేయాల్సిందిగా  కోరారు బాధిత మ‌హిళ సుధా మాధ‌వి.