ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసే నెట్ వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.
లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం.
గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారని చెబుతున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నాయి. ట్రాన్సిట్ వారంట్ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.
అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్‌కు వాంగ్మూలా లిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్ అకౌంటెంట్. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి. సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్‌కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది.