‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో?
జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి. అయితే.. తాజా పరిస్థితులను, ముఖ్యంగా హామీల అమలులో జాప్యం కారణంగా ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను గమనిస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే సాహసం చేస్తుందా? అనే అనుమనాలు వ్యక్త మవుతున్నాయి.
అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. మంత్రులి సైతం అంగీకరిస్తున్నదే.. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇవ్వడమే కాకుండా.. దానికి అదనపు ఆకర్షణగా వందరోజుల ట్యాగ్ లైన్ జోడించింది. ఇచ్చిన హమీలు అన్నింటినీ వంద రోజులల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో భరోసా ఇచ్చింది.
అయితే వందర రోజులు కాదు, రెండు వందలు, మూడు వందలు, నాలుగు, ఐదు వందల రోజులు కూడా వెళ్లి పోయాయి. అయినా ఇంతవరకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల్లో అమలు కానీ హమీలదే పై ‘చేయి’ గావుంది. నిజమే ఇచ్చిన ప్రతి హమీనీ అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుతానికి మాత్రమే కాదు, మరే ప్రభుత్వానికి అయినా అయ్యే పనికాదు. అందుకే ప్రజలు కూడా సహజంగా నూటికి నూరు శాతం హామీలు అమలు అవుతాయని ఆశించరు. అలాగే వంద రోజులంటే వంద రోజుల్లోనే అమలు కావాలని కోరుకోరు. ఎన్నో కొన్ని అయినా అమలు చేస్తే చాలని అనుకుంటారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కూడా లేదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోయినా.. హామీల అమలు విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కదలిక లేక పోవడంతో సహజంగానే ప్రజలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రతి రోజు వినిపిస్తున్న ప్రవచనాలు హామీలు అమలవుతాయనే ఆశలను పూర్తిగా తుడిచేశాయని క్షేత్ర స్థాయి సర్వేలు సూచిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా బహిరంగ ప్రకటన చేసిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో కాకున్నా వెయ్యి రోజులకు అయినా అమలు చేస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నిజానికి హామీలను చెత్త బుట్టకు ఎత్తడం కోసమే ముఖ్యమంత్రి, ఆర్థిక విలాపం అలపిస్తున్నారనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో... సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అవిశ్వాసం రోజురోజుకు పెరిగి పోతోందని కాంగ్రెస్ వర్గాలే కలవర పడుతున్నాయి.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం గుబులు రేపుతోందని అంటున్నారు. మరో ఒకటి రెండు నెలలలో (జూన్ లేదా జూలై) స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన స్పీడ్ పెరుగుతోందని అంటున్నారు.
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని, ఏప్రిల్ 15 జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆదేశించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అనేక సందర్భాలలో గ్రామాలకు వెళ్ళాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే గ్రాలకు వెళితే హామీల అమలు కోసం ప్రజలు నిలదీస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఒక విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా సంక్షేమ పధకాలు అన్నిటికీ మూలాధారం అయిన,రేషన్ కార్డుల విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్ 21న నిజామాబాద్‌లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలా మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీంతో, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇంచార్జి ఆదేశాలను చాలా మంది నాయకులు అంతగా పట్టించుకోవడం లేదు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర నాయకత్వంతో తమ ఆందోళనలను వ్యక్తిగతంగా తెలిపారు.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. పెండింగ్ బిల్లుల జాప్యం వల్ల పంచాయతీ కార్యదర్శులు తమ భార్యల బంగారం, మంగళ సూత్రాలను తాకట్టు పెడుతున్నారని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాయడం గమనార్హం.
అదలా ఉంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెకింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సుముహుర్తం పైనా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.