త్వరలో చంద్రబాబు ‘బస్సు యాత్ర’ షురూ
posted on Jul 16, 2013 @ 10:43AM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సుదీర్ఘమయిన తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో తన పార్టీ పరిస్థితిని ఆయన స్వయంగా అధ్యయనం చేయగలిగారు. అనారోగ్యం, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నపటికీ ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను ముగించారు. పార్టీపై, ప్రజలపై ఆయన పాదయాత్ర ప్రభావం ఎంత ఉందో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలే తెలియజేస్తాయి.
ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈనెలాఖరులోగా రాష్ట్ర విభజనపై ప్రకటన చేసినట్లయితే, తదనుగుణంగా పార్టీని సన్నధం చేసేందుకు చంద్రబాబు తన బస్సు యాత్ర ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చును.