chandrababu

మంత్రి కొండ్రు మురళి కి మదపిచ్చి!

        చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళి అధికార మదంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు అంతిమయాత్ర అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు. వైఎస్ జగన్ అవినీతిలో కొండ్రుకు వాటా ఉందని, ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబును పార్టీ అద్యక్ష పదవి నుంచి మార్చాలని మురళీమోహన్ సూచించగా, లిక్కర్ డాన్‌గా పేరొందిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చుకోండని బాబు రాజేంద్ర ప్రసాద్ సూచించారు.

valantines day

పార్కు జంటలకి పెళ్లిళ్ళ రోజు నేడు

  ఈ రోజు ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరిస్తున్నాయి. విదేశీ సంస్కృతికి అలవాటుపడ్డ యువత, ఇటువంటి ‘వాలెంటైన్స్ డే’ వంటివాటిని సాకుగా తీసుకొని విచ్చలవిడితనానికి అలవాటుపడి భారతీయ సంస్కృతిని మంటగలుపుతున్నారని తీవ్రంగా విమర్శించే ఆ రెండు హిందూసంస్థలు, ఇటువంటి ప్రేమ జంటలకి బుద్ది చెప్పేందుకు మంగళ సూత్రాలు, మట్టెలు, పసుపుకుంకుమలు వంటి పెళ్లి సామాగ్రిని దేశంలో అన్ని ప్రాంతాలలో సిద్ధం చేసుకొని ప్రేమపక్షులకోసం పార్కుల వద్ద, పబ్బులవద్ద ఎదురు చూస్తున్నాయి.   హైదరాబాదు పోలీసు కమీషనరు మాత్రం ప్రేమజంటలకి దైర్యం చెపుతూ మేమున్నామని అంటున్నారు. పార్కుల వద్ద ప్రేమికులను కాపాడేందుకు పోలీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.   గమ్మతయిన విషయం ఏమిటంటే, మిగిలిన రోజుల్లో పార్కుల్లో, బీచుల్లో ప్రేమ జంటలు కనిపిస్తే వారిని తరిమేసే పోలీసులే ఈ రోజు వారిని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ల నుండి కాపాడే బాద్యత తీసుకోక తప్పట్లేదు.   భజరంగ్ దళ్ నగర కన్వీనర్ భరత్ వంశీ, రాష్ట్ర కార్యదర్శి టి.యమన్‌సింగ్ హైదరాబాదులో తమ కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ ప్రేమ జంటలను పట్టుకుని అందరి సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, వారి తల్లి తండ్రులకు చెప్పి మరీ పెళ్లిళ్లు చేస్తామని అన్నారు.

lokesh tweetter message

నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్: బాబుపాదయాత్రకు ఢిల్లీ గజగజ

  ఒక వైపు చంద్రబాబు నాయుడు నిరంతరంగా పాదయాత్ర చేసుకుపోతూ, ప్రభుత్వాన్ని, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజల మద్యనిలబడి మరీ ఎండగడుతుంటే, ఆయన కుమారుడు తన ఇంట్లోంచే ఆ పార్టీలపై ట్విట్టర్ ద్వారా సైబర్ యుద్ధం చేస్తున్నాడు. సంక్షిప్తంగా ఉండే సందేశాలతోనే గుంటూరు మిర్చి అంత ఘాటయిన డైలాగులు పేల్చుతూ అందరి దృష్టినీ ఆకట్టుకొంటున్నాడు. అయితే, ఆ రెండు పార్టీలలో ఇంతవరకు అతనిని ఎదుర్కొనే ‘సైబర్ వీరుడు’ ఇంకా పుట్టినట్లు లేదు. అందువల్ల లోకేష్ ట్వీటర్లో చేసిన విమర్శలకు, ఆ రెండు పార్టీలు మీడియా ముఖంగానో లేకపోతే ప్రజలతో నేరుగానో జవాబు చెప్పుకోవలసివస్తోంది. త్వరలో ఆ రెండు పార్టీలు కూడా లోకేష్ కు ధీటుగా సైబర్ యుద్ధం చేసేందుకు ప్రయత్నం చేసినా చేయవచ్చును.   ఇక, విషయానికి వస్తే నారా లోకేష్ మళ్ళీ మరో మారు ట్వీటర్లో కాంగ్రెస్ ను విమర్శిస్తూ సందేశం పెట్టాడు. తన తండ్రి ఇక్కడ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే, అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉలికులికి పడుతోందని, పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో కనిపిస్తున్నాయని వ్రాసాడు. ఇక్కడ తన తండ్రి చంద్రబాబు నాయుడు 1000 కిమీ పాదయాత్ర పూర్తి చేయగానే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నగదు బదిలీ పధకం మొదలు ప్రకటించిందని, మళ్ళీ ఇప్పుడు 2000 కిమీ. పూర్తిచేయగానే ఋణ మాఫీ అంటోందని ఎద్దేవా చేసాడు.   ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఋణ మాఫీ అసాద్యం, అసంభవం అంటుంటే, మరో పక్క కేంద్రం రుణమాఫీ గురించి మాట్లాడటమే రాజకీయాలలో చురుకుగా ఉండే లోకేష్ వంటి యువకులకు విమర్శించే అవకాశం ఇస్తోందని అని అనుకోవచ్చును.

yasin malik

అఫ్జల్ గురూ కోసం పరితపిస్తున్న మన మేధావులు

  మన దురదృష్టం ఏమిటంటే, మరొకరికి అవకాశం దక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు మన దేశం మీద మనమే దాడి చేసుకొంటాము. భారత పార్లమెంటు మీద దాడి చేయడమే కాకుండా 9 మందిని పొట్టన బెట్టుకొన్న తీవ్రవాది అఫ్జల్ గురూను మొన్న ఉరి తీసినప్పుడు వరవరరావు మొదలుకొని, కాశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరకు ‘అతనిని ఉరి తీయడం చాల అమానుషం’ అంటూ చాల మందే నిరసనలు తెలియజేసారు. అటువంటప్పుడు జమ్మూ కాశ్మీర్ ను, మన దేశం నుండి విడగొట్టి పాకిస్తాన్ లో కలిపేయాలని కోరుకొంటున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ మాత్రం ఎందుకు ఊరుకొంటాడు?   అతనివంటి వారికి మన దేశం కన్నా, మన దేశాన్నితరచూ అవమానించే పాకిస్తాన్ అంటేనే ప్రేమ అధికం. మొన్న ఆ దేశం వెళ్ళిన మాలిక్ ఈసారి తన అసలు రూపం ఏమిటో లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి చూపాడు. ముంబై దాడులకు తెగబడిన లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో ఒకే వేదికపై కలిసి కూర్చొని అఫ్జల్ గురూ ఉరికి నిరసనగా పాకిస్తాన్ లో ఒక రోజు దీక్ష చేసాడు.   అసలు అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదికి మద్దతుగా నిరసన చేయడమే ఒక తప్పయితే, మన దేశం మీద దాడికి తెగబడి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకొన్న మరో పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో కలిసి, పాకిస్తాన్ లో దీక్ష చేయడం రెండవ తప్పు.   బహుశః మన దేశంలో ఉన్న స్వేచ్చస్వాతంత్రాల వల్లనే, ఒక దేశద్రోహిని ఉరితీసినప్పుడు కూడా తమను తాము మేధావులుగా భావించేవారు అనేక మంది రాష్ట్రపతి, ప్రభుత్వం, సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. తద్వారా వారికి మన వ్యవస్థపట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్ధం అవుతోంది. అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కన్నా, తీవ్రవాదుల ప్రాణాలే మిన్నఅని భావించడం ఏ వాదం అవుతుంది? అమాయకుల ప్రాణాలు పొట్టన బెట్టుకొనే ఒక కరడుకట్టిన తీవ్రవాదిని, ఉద్యమకారుడిగా వర్ణించడం ఏవిధంగా సమర్ధనీయం?   రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ చిన్న సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాని ఇటువంటి కుహనా మేధావులు, అనవసరమయిన సమయంలో, అనవసరమయిన విషయాలలో తల దూర్చి మేమున్నామంటూ మీడియా కెక్కుతుంటారు. గానీ, డిల్లీ గ్యాంగ్ రేప్, నల్గొండను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, రాష్ట్ర విభజనవంటి పలు కీలక అంశాలపై ఏనాడు నోరువిప్పని ఇటువంటి పనికి రాని, కుహాన మేధావులు మన దేశంలో కోకోల్లలున్నారు.   వారి ఈ అతివల్లనే మాలిక్ వంటి వేర్పాటువాదులు దైర్యంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతూ మన దేశం, ప్రభుత్వం పరువు పాకిస్తాన్ లో తీస్తున్నారు. ప్రభుత్వం కేవలం అతని పాస్ పోర్ట్ స్వాదీనం చేసుకొనంత మాత్రాన్న ఒరిగేదేమీ ఉండదు. అతనికి కూడా కటినంగా శిక్షించి అటువంటి ఆలోచనలు చేసే వారికి గట్టి హెచ్చరిక చేయాలి.

dccb elections

గుంటూరులో సహకారం లేనట్లే

  గుంటూరు సహకార సంఘాల ఎన్నికలలో ఆదిక్యత కనబరచిన తెలుగుదేశం పార్టీకి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్ష పదవి దాదాపు ఖాయం అనుకొంటున్న తరుణంలో హైకోర్టు అక్కడ 4 వారాలపాటు ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక నేడో రేపో వెళ్లి బ్యాంకు వ్యవహారాలు చూసుకోవడమే తరువాయి అనుకొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకి కోర్టు ఆదేశాలు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇక పక్కనే ఉన్న కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్ష పదవికి మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.

producer ganesh

ప్రొడ్యూసర్ గణేష్ బొత్స బినామీ

        ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శల బాణం వదిలారు. నిర్మాత బండ్ల గణేష్ ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు బొత్స సత్యనారాయణపైనా దృష్టిపెట్టాలన్నారు. గణేష్, బొత్స బినామీ అని ఆయన ఆరోపించారు. బొత్స ఇంట్లోను సోదాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాక గణేష్ ఇంట్లో సోదాల సందర్భంగా బయటపడిన విషయాల్ని వెల్లడించాలన్నారు. మరోవైపు తెదేపా ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు కూడా బొత్సనే లక్ష్యంగా చేసుకున్నారు. గణేష్ వెనుక బొత్సతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గణేష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

chandrababu babu

చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: మంత్రి కొండ్రు

        తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను రికార్డుల కోసం చేస్తున్నారా లేక ప్రజల కోసం చేస్తున్నారా చెప్పాలని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై, నేతలపై పాదయాత్రలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతిని తెలిసేందుకే ఆయన యాత్రలో స్థూపాలు కడుతున్నారన్నారు. ప్రపంచంలో బాబును మించిన అవినీతిపరుడు లేడన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి అధ్యక్షుడిని మార్చుకోవాలన్నారు. లేకుంటే ఆ పార్టీ పతనం కావడం ఖాయమన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఘనుడు బాబు అని విమర్శించారు.

 Bobbili MLA switches loyalty to Jagan camp

జగన్ పార్టీకి విజయనగరంలో ఎదురుదెబ్బ

        జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అ జిల్లాకు చెందిన సీనియర్ రాజీకీయ నాయకుడు శంబంగి చిన అప్పల నాయుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు చెందిన వారికి పార్టీలో ప్రాధాన్యత లేదని, వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్టీని వీడారు.   శంబంగి చిన అప్పల నాయుడు దాదాపు ముప్పయ్యేళ్లు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. 1985లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. 1989లో అదే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లలో టిడిపి తరఫునే పోటీ చేసిన ఓటమి చెందారు. ఆయన మొదటి నుండి బొబ్బిలి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉన్నారు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత అందులో చేరారు.

Indian raped in Maldives

మాల్దీవుల్లో ఇండియన్ పై గ్యాంగ్ రేప్

        మాల్దీవుల్లోనూ ఇండియాకు చెందిన టీచర్ గ్యాంగ్ రేప్ కు గురైంది. మాలెలో ఆసుపత్రి లో చికిత్స పోందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలీఫ్ దాల్ అటార్ లోని ధంగేతి అనే పట్టణంలో బాధితురాలు ఇటివలే కంప్యూటర్ స్కూల్ లో టీచర్ చేరింది. ఆమెపై కొందరు దుండగులు ఆదివారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను పోలీసులు హాస్పటల్ కి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం భారత్ కు తీసుకువెళ్తామని బాధితురాలి బంధువులు తెలిపారు.యువతి పరిస్థితిపై మాలెలోని భారత రాయబార కార్యాలయ అధికారులు మాల్దీవుల మంత్రి మరియమ్ షకీలతో మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి శిక్షిస్తామని ఆమె తెలిపారు.

padayatra

బాబు, షర్మిల పాదయత్రలకి మళ్ళీ బ్రేక్ పడనుందా?

  త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికల దృష్ట్యా ఈ నెల 19వతేది సాయంత్రం నుండి 21వ తేది ఉదయం వరకు సంబందిత తెలంగాణా, గుంటూరు, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. అందువల్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ నాయకుల పాదయాత్రలను ఆ తేదీల మద్య తప్పనిసరిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు.   ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గుంటూరులో పాదయత్ర చేస్తుండగా, షర్మిల నల్గొండ జిల్లాలో చేస్తున్నారు. రెండు ప్రాంతాలలో ఎన్నికల నియమావళి అమలులోకి రానున్నది గనుక, ఆ ఇద్దరూ నేతలూ కూడా ఆ తేదీల మద్య తప్పని సరిగా తమ పాదయాత్రలు నిలిపివేయవలసి ఉంటుంది.   అయితే, షర్మిల నల్గొండ జిల్లాలో తానూ నిర్ణయించుకొన్న అన్ని ప్రాంతాలలో 19వతేది నాటికి పాదయాత్ర ముగించుకొని, గుంటూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది గనుక, ఆమె నల్గొండ జిల్లా పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చును. ఏకారణాల వల్లనయినా ఆమె పాదయాత్ర ఎక్కడయినా ఆలస్యం అయినట్లయితే, మిగిలిన ప్రాంతాలలో ఆమె వడివడిగా పాదయాత్ర చేసుకోవడమో లేదా ఆమె తన పాదయాత్రలో కొన్ని ప్రాంతాలను వదులుకొని నేరుగా గుంటూరు చేరుకోవడమో, లేదా 21వ తేది వరకు తన పాదయాత్రను వాయిదావేసుకొని తిరిగి నల్గొండలోనే ప్రారంభించడమో చేయవలసి ఉంటుంది. అయితే, ఆమె ఈ లోగానే, నల్గొండ జిల్లాలో అన్ని ప్రాంతాలను సందర్శించడం పూర్తవుతుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ, సరిగ్గా ఎన్నికల నియమావళి అమలయ్యే రోజునే ఆమె గుంటూరులో ప్రవేశిస్తారు గనుక, తన గుంటూరు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసిరావచ్చును.   ఇక, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు స్థానిక ఎన్నికల అధికారిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయనున్నారు. గత నాలుగు నెలలుగా చంద్రబాబు పాదయత్ర చేస్తున్నందున, ఈ ఎన్నికలకీ ఆయన పాదయాత్రకి ఏవిధమయిన సంబంధంలేదని, అందువల్ల తమ నాయకుడి పాదయాత్రకు అనుమతినీయాలని, ఇచ్చినట్లయితే తాము ఎన్నికల నియమావళికి లోబడే పాదయాత్ర చేసుకొంటామని విన్నవించనున్నారు.   ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అనుమతినిచ్చినట్లయితే, అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదేవిధమయిన అభ్యర్ధన చేసే అవకాశం ఉంది. కానీ, వారి పాదయాత్రలు ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉనందున వారి అభ్యర్ధనను ఎన్నికల కమీషన్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. అప్పుడు చంద్రబాబు, షర్మిల ఇద్దరూ కూడా తప్పనిసరిగా తమ పాదయాత్రలు వాయిదావేసుకోక తప్పదు. కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిద్దరూ బహుశః ఈ కారణంగా తమ పాదయాత్రలు వాయిదా వేసుకొని రెండు రోజులు విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంది.

 jagan congress

జగన్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

      అమలాపురంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అమలాపురంలో జరిగిన మన గ్యాస్- మన హక్కు పేర నిర్వహించిన అఖిల పక్ష సదస్సులో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ జగన్ పార్టీ నేత శెట్టిబత్తుల రాజబాబును వేదికపై నుంచి కిందికి తోసేశారు. ఎంపి హర్షకుమార్ ప్రసంగిస్తుండగా, వైఎస్ఆర్ సీపీ నేత రాజబాబు అడ్డుపడి తొమ్మిదేళ్లుగా ఈ సమస్యపై ఎమ్.పి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.ఈ సదస్సును కాంగ్రెస్ సమావేశంలా నిర్వహించడం ఏమిటని నిలదీశారు. దాంతో ఎంపీ అనుచరులు రెచ్చిపోయారు. రాజబాబును వేదిక నుంచి కిందికి తోసి దాడికి పాల్పడ్డారు. అనుచరులతో పాటు హర్షకుమార్ కూడా చేతులు కలిపారని చెబుతున్నారు. ఎంపి హర్షకుమార్, ఆయన తనయుడు పై  వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు పిర్యాధు చేశారు.  

Wrestling to be dropped from 2020 Olympic Games

ఒలింపిక్స్‌ నుంచి రెజ్లింగ్‌ అవుట్

        ఇండియాకు ఐఓసీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 ఒలింపిక్స్‌ నుంచి రెజ్లింగ్‌ను తప్పించింది. ఈ మేరకు ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే క్రీడల్లో మార్పులు చేర్పులు లో భాగంగానే ఈ నిర్ణయంతీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం భారత్ పతకాలపై ప్రభావం పడుతోంది. 2008, 2012 ఒలింపిక్స్ లో భారత్ ఈ అంశంలో పతకాలు సాధించింది.   అంతే కాదు 1962లో భారత్ కు వ్యక్తిగత విభాగంలో వచ్చిన పతాకం కూడా రెజ్లింగ్ లో వచ్చిందే! అలాంటి రెజ్లింగ్ ఇంకో ఒలింపిక్స్ లో మాత్రమే కనిపిస్తుంది. బ్రెజిల్ లో జరిగే తర్వాతి ఒలింపిక్స్ లో మాత్రమే రెజ్లింగ్ ఆఖరు! ఆ తర్వాత మనకు అంతో ఇంతో మెడల్స్ తెచ్చి పెట్టే క్రీడ మాయం అవుతోంది. ఇదిలా ఉంటే… ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్ తొలగించటంపై దేశ వ్యాప్తంగా ఉన్న వస్తాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత లండన్ ఒలింపిక్స్‌లో ఇండియా రెండు మెడల్స్ సాధించిన పెట్టిన రెజ్లింగ్‌పై చిన్న చూపుతగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2020 ఒలింపిక్స్ నుంచి తొలగించాలని ఐఓసీ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని అంటున్నారు. భారత ప్రభుత్వ జోక్యం చేసుకుని రెజ్లింగ్ కొనసాగేలా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

green fields housing society

గ్రీన్ ఫీల్డ్ వాసులకు శంకరన్న ఉసురు తగిలిందా?

  గత పది సం.లుగా హైదరాబాదులో గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీ వాసులు మాజీ మంత్రి శంకరావు తమ ఇళ్ళ స్థలాలను లాక్కొనే ప్రయత్నంలో అయన, అయన సోదరుడు దయకరావు ఇద్దరూ కూడా బెదిరింపులకి పాల్పడుతున్నారని కోర్టులో కేసువేసి వారితో తిప్పలు పడుతున్నారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో మొన్న జనవరి 31వ తేదీన పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, మళ్ళీ అంతలోనే ఆయన ఆరోగ్యపరిస్థితి చూసి భయపడి ఆసుపత్రికి తరలించడంతో, ఒక్కసారిగా దళిత సంఘాలు, రాజకీయ నాయకులూ కదలివచ్చి అందరూ ఆయనకు మద్దతుగా మాట్లాడేసరికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెనక్కి తగ్గక తప్పలేదు.   శంకరావును పోలీసులు అవమానకర రీతిలో తరలించారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిఐడీ అధికారులతో ఒక కమిటీ వేసినప్పటికీ, శంకరావు కుటుంబ సభ్యులు వారికి సహకరించక సీబీఐ చేత విచారణ చేయించాలని పట్టుబట్టారు.   ఈ క్రమంలో ‘తమ గోడు వినిపించుకొనే నాధుడే లేడా?’ అంటూ గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీ వాసులు మీడియాతో మోర పెట్టుకొన్నపటికీ అదికూడా అరణ్యరోదన అయిపోయింది. కానీ, ఈ సంఘటన జరిగిన తరువాత తెరవెనుక ఏమి మంత్రాంగం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ, ఈ రోజు రెవెన్యు అధికారులు భారీపోలీసు బందోబస్తు సహాయంతో తరలివచ్చి గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో నిర్మించిన అక్రమకట్టడాలు కూల్చేశారు. పెద్దలతో పెట్టుకొంటే ఏమవుతుందో బాగా అనుభవమయిందని గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న పేదలు, పదవీ విరమణ చేసిన వారు ఇప్పుడ తీరికగా బాధపడుతున్నారు. అందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని శంకరావు సోదరుడు దయకరావు చెప్పడం కొస మెరుపు.

bandla ganesh

గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ కధేమిటో?

  ఒకప్పుడు సినిమాలలో కామెడియన్ గా చిన్నచిన్న వేషాలు వేసే బండ్ల గణేష్, అకస్మాత్తుగా ఒకరోజున పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చిత్ర సీమలో ఉన్నఅందరు పెద్ద హీరోలు, అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మొదలు పెట్టినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావడంతో సినిమాలు తీయగలుగుతున్నానని ఆయన చెప్పినప్పటికీ, ఆయన వెనుక మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఒకప్పుడు హైదరాబాదు శివార్లలో కోళ్ళ ఫారం నడుపుకొని బ్రతికే బండ్ల గణేష్, తరువాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొన్నపుడు, తన భూములతో ఆ వ్యాపారంలో ప్రవేశించడం నిజమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసేంత డబ్బు సంపాదించడం మాత్రం నిజం కాకపోవచ్చును.   ఆయన మొట్టమొదట రవితేజతో తీసిన ‘ఆంజనేయులు’ సినిమా బోర్లాపడినప్పటికీ, వెంటనే పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా తీసాడాయన. కానీ, అది కూడా ఫ్లాప్ అవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని అందరూ అనుకొంటున్నతరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి విజయం సాదించారు. అయితే, రెండు వరుస అపజయాలు తట్టుకొని నిలబడటమే గాకుండా, మళ్ళీ వెంటనే మరో భారీబడ్జెట్ సినిమా ఎలా తీయగలిగాడని సినిమారంగంలో ప్రతీ ఒక్కరికీ సందేహాలొచ్చాయి, కానీ, బొత్స సత్యనారాయణ పేరు చూచాయగా వినిపిస్తుండటంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.   ‘గబ్బర్ సింగ్’ సినిమా మొదలు పెట్టిన వెంటనే, ఆయన జూ.యన్టీఆర్ తో ‘బాద్షా’ సినిమా, అల్లు అర్జున్ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే మరో సినిమా కూడా మొదలు పెట్టడంతో, ఆదాయపన్ను శాఖ కళ్ళు బండ్ల గణేష్ పైన పడ్డాయి. నిన్న, ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఒకేసారి దాడి జరిపిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి నుండి కొన్ని కీలకపత్రాలు స్వాదీనం చేసుకొన్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయనను తమ కార్యాలయానికి పిలిపించుకొని వారు మరిన్ని వివరాలు సేకరించారు.   బండ్ల గణేష్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు, అందరూ గణేష్ కి, బొత్స సత్యనారాయణకి మద్య ఏదయినా రహస్య ఒప్పందాలు జరిగి ఉంటే, అవి బయటపడవచ్చునని భావించారు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారులు మాత్రం అటువంటివేవి దొరికినట్లు ఇంతవరకు ప్రకటించలేదు. అందువల్ల, ప్రస్తుతం కేవలం బండ్ల గణేష్ మాత్రమే ఆదాయపన్ను సమస్యలలో చిక్కుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒక వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు, బొత్స సత్యనారాయణ కూడా గణేష్ సినిమా వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపెడితే మాత్రం అది బొత్సకు కొత్త సమస్యలు తేవడం ఖాయం.

రామ్ గోపాల్ వర్మ సినిమాకి వివాదం తప్పదా?

    వివాదం లేకపోతే అది రామ్ గోపాల్ వర్మ సినిమా కాదని జనం నమ్మే పరిస్థితి ఉందిప్పుడు. మొదట్లో ‘శివ’, ‘క్షణ క్షణం’ వంటి విలక్షణమయిన అనేక మంచి సినిమాలు తీసిన అయన, ఆ తరువాత అండర్ వరల్డ్ గ్యాంగులు, డాన్ల సినిమాల వైపు మళ్ళారు. ఆ తరువాత దెయ్యాలు భూతల వెంట పడ్డారు కొన్నాళ్ళు. తరువాత రక్త చరిత్ర, బెజవాడ రౌడీలు వంటివి రాజకీయ, ఫాక్షనిస్ట్ సినిమాలు తీసి వివాదాలు తలకెత్తుకొన్నారు.   అంతవరకూ తీసిన ప్రతీ సినిమా కూడా ఒక వివాదస్పదమే అయ్యింది. అయినా, అందుకు ఆయన బాధ పడలేదు సరికదా చాలా గర్వపడ్డారు. మళ్ళీ, ఇప్పడు ముంబాయి ఉగ్రవాదుల దాడిని కధాశంగా తీసుకొని '26/11 ఇండియాపై దాడి' చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా మార్చ్ మొదటివారంలో విడుదల కానున్న సమయంలో ఈసారి కూడా సినిమాపై వివాదం మొదలయింది. రామ్‌ప్రసాద్ అనే ఒక లాయర్ ఈ సినిమా విడుదల అయితే మతకల్లోల్లాలు చెలరేగే అవకాశం ఉంది గనుక, దానిని విడుదల చేయకుండా నిలిపేయవలసిందిగా కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ వ్రాసారు. కానీ, ఆయన లేఖపై సెన్సార్ బోర్డు ప్రతిస్పందన ఇంకా తెలియలేదు.

చిరంజీవీ! డైలాగులు మరిచిపోతే ఎలాగయ్యా?

  కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి పుట్టిన ప్రజారాజ్యం పార్టీ చివారఖరికి ఆ బంగాళఖాతంలోనే కలిసిపోగా, ఆయన ప్రజారాజ్యం నావ ఎక్కినవారు మునిగి పోయిన వారు మునిగిపోగా, మిగిలినవారు అదే కాంగ్రెస్ పార్టీలో తేలారు. అందుకు బహుమానంగా ఆయన కేంద్ర మంత్రి పదవి స్వీకరించి, తనతో మిగిలినవారిలో కొందరికి యధాశక్తిన ఏవో చిన్నాపెద్దా పదవులు ఇప్పించుకొన్నారు.   ప్రజారాజ్యం ఊపుమీద ఉన్న తోలిరోజుల్లో చిరంజీవి ‘సామాజిక తెలంగాణ’ అనే తనకే అర్ధం కాని ఒక కొత్తరాగం అందుకొని, అందరినీ గందర గోళం లో పడేసి చివరికి తనకీ అర్ధం కాకపోవడంతో, అనువయిన కాంగ్రెస్ పల్లవి ఎత్తుకొన్నాడు.   అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ బాష బాగా నేర్చుకొన్నందున, ఆయనని ఎవరయినా “తెలంగాణా సంగతి ఏమిటీ? మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగినప్పుడు ఈ అంశంపై తానూ ఎన్నోసార్లు తన అభిప్రాయం ప్రకటించానని అందువల్ల మళ్ళీ మళ్ళీ అడిగి చరిత్ర తవ్వోదని సూచిస్తుంటారు. ప్రస్తుతం తానూ పూర్తీ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తను గనుక తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే తనకు శిరోధార్యం అన్నాడాయన. ఏది ఏమైనా వీలయినంత త్వరలో నిర్ణయం జరగాలని ఆయన కోరుకొన్నారు.   మన కోదండరామాచార్యుల వారు, ఎంతయినా ప్రొఫెసరుగా చేసారు గనుక చిరంజీవికి అర్ధం అయ్యే సినిమా బాషలోనే జవాబిచ్చే ప్రయత్నం చేసారు. నటుడు కెమెరా ముందుకొచ్చి తన డైలాగులు మరిచిపోతే ఎలా ఉంటుందో, లేక వేరొకరి డైలాగులు వల్లిస్తే ఎలాఉంటుందో ఇప్పుడు చిరంజీవి మాటలు కూడా అలానే ఉన్నాయని ఆన్నారు. సామాజిక తెలంగాణా అంటూ ఆవేశపడిపోయి, ఇప్పుడు ఏకంగా తెలంగాణాయే వద్దని మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అయన అన్నారు.

బెడ్ రూము రాజకీయలేల బాబు?

  ఒకప్పుడు పార్టీలపరంగా మాత్రమే విమర్శించుకొనే స్థాయి నుండి నేడు వ్యక్తిగత దూషణల స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయినందుకు మనం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. షర్మిలకి అసలు గాయమూ లేదు, ఆపరేషనూ జరుగలేదంటూ మొదలయిన విమర్శలు, ఇప్పడు ఒకరి కాళ్ళు మరొకరు పట్టుకోవడం, ఒకరి బెడ్ రూమ్ కబుర్లు మరొకరు మాట్లాడటం వరకు దిగజారిపోయాయి.   నల్గొండలో పర్యటిస్తున్న షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబు, తన స్థాయిని మరిచి మాపై విమర్శలు చేస్తున్నారు. మా ఇంట్లో 70 బెడ్ రూములు కట్టుకోన్నామని ఆయన ప్రజలకి చెపుతున్నారు. మా ఇంట్లో మేము ఎన్ని బెడ్ రూములు కట్టుకొంటే దానితో ఆయనకి ఏమి సబంధం? అయినా అదేమయినా జాతీయ సమస్యా ఉపన్యాసాలలో మాట్లాడటానికి? మా ఇంట్లో ఎన్నిబెడ్ రూములు ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకి అంతగా ఆసక్తి ఉంటే, టవున్ ప్లానింగ్ అధికారుల దగ్గిరకి వెళ్తే అక్కడ మా ఇంటి తాలూకు డ్రాయింగులు చూసుకోవచ్చును."   "తెలుగు దేశం పార్టీలో ఒక నేతకి నా కాళ్ళకి దెబ్బ తగిలిందా లేదా? అని అనుమానం, మరో నేతకి అసలు నాకాలికి ఆపరేషను జరిగిందా లేదా అని అనుమానం. వారి నాయకుడికి మా ఇంట్లో బెడ్ రూములెన్ని అని అనుమానం. వీరికి ఇంతకన్నా మాట్లాడేందుకు మరే అంశం దొరకదా? అయినా ప్రతీ చిన్న విషయాన్నీ కూడా రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం చాల హేయమయిన పని,” అని అన్నారు.   దీనికి చంద్రబాబు ఆయన పార్టీ ధీటుగానే సమాధానం చెప్పవచ్చును. గానీ, అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని ఆలోచిస్తే, ఒక ఆశ్చర్యకరమయిన విషయం బయటపడుతుంది. అది మన సినీపరిశ్రమ, మీడియా చాల కాలంగా అనుసరిస్తున్నసూత్రాన్ని వారు అమలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలను ప్రస్తావించడం, మాస్ మసాల అంశాలు జోడించిన ప్రసంగాలతో ప్రజలకి అవసరమయిన ‘కిక్కు’ అందించడం, మరి కొంత దిగజారి ఎదుట వారి బలహీనతలను బట్ట బయలు చేసి ప్రజలను రంజింపజేసి వారి చేత చప్పట్లు కొట్టించుకోవడం, ‘కిక్కు’ ఇచ్చే ప్రసంగాలుంటాయనే నమ్మకం ప్రజలకు కల్పించి, తద్వారా వారిని సభలకు రప్పించుకోవడం వంటి కొత్త (పాత) సూత్రాలతో నేడు మన రాజకీయ నాయకులు నోటికొచ్చిన మాటలతో ఎదుటవారిని దూషిస్తూ ప్రజలకి వినోదంపంచి ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా జనం చప్పట్లు పడినా, అవి ఓట్ల రూపంలో ఎంతమేరకు మారగలవని వారు ఆలోచించుకోవాలి.   అయితే, ఇక్కడ కూడా వారు మరో సూత్రం అమలు చేస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేయాలంటే, అది అబద్దం కాదు నూటికి నూరు శాతం నిజమేనని వారు స్వయంగా ఆత్మవంచన చేసుకొని నమ్మడమే కాకుండా, అదే విషయాన్ని తమ సభల్లో, సమావేశాల్లో పదేపదే గట్టిగా చెప్పడం ద్వారా క్రమంగా ప్రజలను అబద్దాన్ని నిజం అని నమ్మే స్థాయికి తీసుకు రావచ్చుననే ఆలోచనతో మన రాజకీయ నాయకులు ప్రజలను వంచిస్తున్నారు.   ఇంకా, నిర్లజ్జగా చెప్పుకొంటే ప్రజలలో చాలా మంది కుల, మతం, ప్రాంతం ప్రభావాలలో ఉన్నందునే, వారి ఆటలు కొనసాగుతున్నాయి. తాము ఏ ప్రభావానికి లొంగి ఉంటే, దానికి సంబందించిన వ్యక్తులు చెపుతున్నవి అన్నీ కూడా నిజమేనని గుడ్డిగానమ్మే పరిస్థితులు ఇప్పుడు దేశమంతటా కనబడుతున్నాయి.   తమ ఉన్నత చదువులు, తమ లోకజ్ఞానం, తమ మేధస్సు వంటివేవీ కూడా, అటువంటి నాయకుల మాటలను, పార్టీలను ప్రశ్నించే వివేకం కలిగించకపోవడం మరో దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ప్రజలలో ఉన్న ఈ బలహీనతలే రాజకీయ నాయకులకి అలుసుగా మారాయని చెప్పవచ్చును.

స్వామీ గౌడ్ కు వ్యతిరేఖంగా ఏకమయిన స్వతంత్ర అభ్యర్దులు

  ఏదో అదృష్టం బాగుండి తెలంగాణా ఉద్యమం పుణ్యమాని సకల జనుల సమ్మె జరగడం, దానితో తన రాజకీయ జీవితానికి బీజం వేసుకొని మెల్లగా తెరాస పార్టీలో జేరడం, అటు పిమ్మట కేసీఆర్ దయకి పాత్రుడవడంతో తెలంగాణా జేయేసీ కన్వీనర్ పదవి కూడా వచ్చి వళ్ళోవాలడం అన్నీ చకచక జరిగిపోయాయని సంతోషిస్తున్న తెరాస నేత స్వామీ గౌడ్ ను, ఒకవైపు తెలంగాణా యన్.జీ.ఓ. గృహ సొసైటీ అక్రమాల కేసు భూతంలా వెంటాడుతుంటే, మరో వైపు సొసైటీ సభ్యులు వెంటనే డైరెక్టర్ పదవి నుండి వెంటనే తప్పుకోమని డిమాండ్ చేయడం స్వామి గౌడ్ కు చాల ఇబ్బందికరంగా మారింది.   రాజకీయాలలోకి వచ్చాడు గనుక, అదంతా రాజకీయ కుట్ర అని ఎంతకొట్టి పారేసినా, కోర్టులు మాత్రం అందుకు అంగీకరించక కేసు నడపాల్సిందే! అని పట్టుబడుతూ ఆయన సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కేసీఆర్ దయతలచి శాసనమండలి సీటుకు కూడా టికెట్ ఇచ్చి రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కేందుకు ప్రోత్సహిస్తుంటే, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న 15 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఒప్పందం చేసుకొని తమలో ఒక్కరే పోటీలో నిలబడి, స్వామీ గౌడ్ ను ఎలాగయినా ఈ ఎన్నికలలో ఓడించాలని నిర్ణయించుకొన్నారు. తనకి ఎంత కేసీఆర్ మద్దతు ఉన్నపటికీ, ఇంతమంది కలిసి తనకు వ్యతిరేఖంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, స్వామీ గౌడ్ కొంచెం కంగారు పడుతున్నట్లు సమాచారం. ఆయన స్థానికేతరుడయిన కారణంగానే తాము ఆయనకి వ్యతిరేఖంగా పోటీ చేస్తున్నామని మీడియా వారితో వారు చెపారు. కర్ణుడి ఓటమికి వేయి శాపాలన్నట్లు స్వామీ గౌడ్ క్కూడా, పళ్ళెంలో పెట్టి దొరుకుతున్న శాసనమండలి సీటును అందుకొనేందుకు బోలెడు సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఆయన వీటిని అన్నిటినీ అధిగమించి శాసనమండలిలో కాలుపెట్టినట్లయితే, ఇక అయన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలయిందని భావించవచ్చును.