సమైక్యమా, పార్టీయా? కిరణ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యం దేనికి
posted on Sep 11, 2013 @ 12:17PM
తన సమైక్యవాదనలతో ఇంతవరకు రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదిరిస్తున్నఏకైక మొనగాడుగా సీమాంధ్రలో పేరు సంపాదించుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్నఆయన క్యాబినెట్ లోని తెలంగాణా మంత్రులు కలిసి, ఆయన పక్షపాత వైఖరికి పద్దతికి నిరసన తెలియజేసినప్పుడు, ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు జోరుగా జరుగుతున్నసమయంలో యావత్ రాష్ట్రానికి మంత్రులుగా వ్యవహరించవలసిన వారు ఏవిధంగా తెలంగాణా తరపున పోరాడారో గుర్తు చేసి చురకలు వేసారు. అదేవిధంగా నేడు సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకు పోరాడుతున్న అక్కడి మంత్రులను తప్పు పట్టలేమని అన్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినయినప్పటికీ, తానూ ఎవరికీ వెనుక నుండి సహాయపడటం లేదని, తన సమైక్యవాదానికి అర్ధం తాను సీమాంధ్రలో జరుగుతున్నఉద్యమాలను వెనుక నుండి నడిపిస్తున్నానని భావించడం తప్పని, యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానమేనని ఆయన బదులిచ్చారు.
అంతే గాక ఈ రోజు ఇరుప్రాంతల నేతల మధ్య సమన్వయం సాధించేందుకు, ఈరోజు సాయంత్రం ఆయన ఒక విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, తెదేపా, వైకాపాల దాడితో నోరెత్తలేకపోతున్నతన పార్టీని కాపాడుకొనేందుకు ఆయన త్వరలో సీమాంధ్రలో పర్యటించనున్నారు. రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను కాపాడాలని ఆయన స్వయంగా ప్రయత్నించడమే కాకుండా, అదే విషయాన్నిఇరు ప్రాంతాల నేతలకు ఆయన చెప్పబోతున్నారు.
ఇదే నిజమయితే, ఇంతకాలంగా ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పదవికి, పార్టీకి రాజీనామా చేసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెట్టబోయే సరికొత్త రాజకీయ పార్టీకి సారధ్యం వహిస్తారనే మీడియాలో వస్తున్నవార్తలు కూడా కేవలం పుకార్లుగానే భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, భాద్యతాయుతమయిన పదవిలో ఉన్నకారణంగా ఆయన సరయిన విధంగానే వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చును.
కానీ, పార్టీని రక్షించుకోవడం కోసం ఆయన తన సమైక్యవాదాన్ని పక్కన పెడితే, ఇంతకాలంగా ఆయన చేస్తున్న సమైక్యవాదం అంతా భూటకమేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏమయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కత్తి మీద సాము వంటిదేనని చెప్పక తప్పదు.