టిడిపికి 30 లోక్ సభ స్థానాలు..!
posted on Sep 13, 2013 @ 11:52AM
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 30 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన బస్ యాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ,రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీనే సరైన పార్టీ అన్న భావన ప్రజలలో ఏర్పడుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ – సీమాంధ్ర ప్రజలను శత్రువులుగా మార్చి తన పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఆ పార్టీ గారడీ చేయిస్తుందని అన్నారు. అయితే విభజనకు తాను వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలు నాకు సమానం అని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సీమాంధ్రలో గత 40 రోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే కేంద్రం చోద్యం చూస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను చర్చలకు పిలవాలని లేదా రెండు ప్రాంతాల జేఏసీలను పిలిచి చర్చలు జరపాలన్న డిమాండ్ తో చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేయనున్నారు.