పాపం జగన్!
posted on Dec 4, 2013 @ 5:30PM
అయితే ఆంధ్రప్రదేశ్ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ లక్ష్యం అంతకంతకూ దూరమైపోతూ వుండటంతో ఆయన నిరాశలో కూరుకుపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జైలులో వున్న పదహారు నెలల కాలంలో జగన్‌ని అన్యాయంగా జైల్లోకి పంపారంటూ ప్రచారం చేయడంలో వైఎస్సార్సీపీ కొంత విజయం సాధించింది.
జగన్ జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఊహించిన స్పందన లేకపోవడం వైసీపీ వర్గాలను, జగన్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతకంతకూ అడుగంటిపోతున్న తన రాజకీయ ఛరిష్మాని పైకి తీసుకురావడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు సరైన స్పందన లభించడం లేదని తెలుస్తోంది. సమైక్య రాష్ట్రం కోసమో, తన రాజకీయ ప్రయోజనాల కోసమో జగన్ పలువురు జాతీయ నాయకులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటి ద్వారా జగన్‌కి పొలిటికల్ మైలేజీ పెరగడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
జగన్ కలసిన నాయకులందరూ ఏదో జగన్ వచ్చాడు కాబట్టి కలుస్తున్నారే తప్ప ఆయన మీద ప్రత్యేక అభిమానమేమీ కనబర్చడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒక దశలో జగన్ తమని కలవకపోవడమే ఉత్తమమని కొందరు జాతీయ నాయకులు భావించినట్టు తెలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు. అఖిలేష్ యాదవ్ ఇప్పటికి రెండుసార్లు జగన్ అపాయింట్‌మెంట్‌ని రద్దు చేశాడు. ఒకసారి జగన్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశాడు. మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకున్న జగన్ లక్నో వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దగ్గరకి వెళ్ళగానే అపాయింట్‌మెంట్ రద్దు చేస్తున్నట్టు సందేశం పంపించాడు.
ఇది జగన్‌ని కలవడం ఇష్టం లేక అఖిలేష్ అనుసరిస్తున్న వ్యూహమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహాన్ని జగన్ అర్థం చేసుకోలేకపోతున్నాడో లేక అర్థం చేసుకుని మరీ అవమానాలకు గురవుతున్నాడో అర్థంకావడం లేదని అంటున్నారు. మొత్తమ్మీద జగన్ రాజకీయంగా దయనీయమైన పరిస్థితిలో వున్నాడని విశ్లేషకులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.