రాయల తెలంగాణాతో రాష్ట్ర కాంగ్రెస్ ఫినిష్
posted on Dec 4, 2013 @ 11:39AM
ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరొక కొత్త సమస్య సృష్టించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపిస్తోంది. ఆ పార్టీ కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదనతో, గత నాలుగయిదు నెలలుగా ప్రశాంతంగా ఉన్నతెలంగాణాలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెరాస అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణా అంతటా ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రేపు తెలంగాణా బంద్ జరుగబోతోంది. ఈ పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానాన్నేనిందించవలసి ఉంటుంది.
రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను, ఆందోళనలను ఎంత మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ ఇప్పుడు కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతల సలహాల మేరకు ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి తెలంగాణా ప్రజల మనోభావాలను కూడా కించపరిచింది.
ఈవిధంగా రాష్ట్రాన్ని విభజిస్తే తను రాజకీయంగా లాభపడవచ్చునని ఆలోచిస్తోందే తప్ప రాయలసీమ, తెలంగాణా ప్రజల మనోభావాలకు వీసమెత్తు విలువ ఈయడం లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే తను సీమాంధ్రలో ఓటమి చవి చూడటం ఖాయమని అర్ధం చేసుకొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తూ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.
ఇంతవరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నకారణంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలకు, నేతలకు ఉన్నమంచి అభిప్రాయం కాస్తా ఈ రాయల దెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల, ఇప్పుడు 10జిల్లాలతో కూడిన తెలంగాణా ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే అవకాశం లేదు.
ఇంతకుముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమను కాంగ్రెస్ అధిష్టానం నిలువునా ముంచేసిందని ఆవేదన చెందేవారు. ఇప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు కూడా వారికి వంత పాడబోతున్నారు. అయితే టీ-కాంగ్రెస్ నేతలకి తెలంగాణాలో తమ కాంగ్రెస్ నావ మునిగిపోతోందని తెలిసి ఉన్నపటికీ, దానిలోనే ఉండవలసిన దుస్థితి. లేకుంటే తెరాసయే దిక్కు. ఈవిషయంలో సీమంధ్రలో కాంగ్రెస్ నేతలకు తెదేపా, వైకాపా లేదా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కాంగ్రెస్ పార్టీలు ఉండటం వారి అదృష్టమనే చెప్పాలి. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ అవకాశం కూడా లేదు పాపం.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా, ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన వలన పార్టీకి జరిగిన నష్టాన్ని వారు పూడ్చలేరు. కాంగ్రెస్ హస్తం దెబ్బకి ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోవడం సంగతి దేవుడెరుగు. ముందుగా కాంగ్రెస్ పార్టీయే తుడిచిపెట్టుకుపోయేలా ఉంది.