ఆమాద్మీముందు ప్రజారాజ్యం దిగదుడుపే
posted on Dec 10, 2013 @ 12:29PM
ఆమాద్మీపార్టీ స్థాపించి ఏడాది కూడా తిరగకుండానే డిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపించింది. ఇంచుమించు అటువంటి గొప్ప ఆశయాలతోనే మన రాష్ట్రంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం, జయప్రకాశ్ నారయణ లోక్ సత్తా పార్టీలు స్థాపించారు. కానీ, రెండు పార్టీలు కూడా ఆమ్మాద్మీలాగ నిలద్రోక్కుకొని తమ సత్తా చూపలేకపోయాయి.
లోక్ సత్తా నామ మాత్రంగా ఇంకా రాష్ట్రంలో కనబడుతున్నపటికీ ప్రజారాజ్యం మాత్రం పదవుల కోసం తన ఆశయాలకు, సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చేసి నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. పోనీ దానివల్ల చిరంజీవి, ఆయన అనుచరులు ఏమయినా బావుకొన్నారా? అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన ఉచ్చులో చిక్కుకొని ఏడాది తిరగకుండానే మళ్ళీ వారందరి పరిస్థితి మొదటికి వచ్చేసింది. ప్రజారాజ్యం స్థాపించక ముందు రాష్ట్ర ప్రజలు, అభిమానులు ఆ పార్టీపై ముఖ్యంగా చిరంజీవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. అయితే అడుగడుగునా పొరపాట్లు చేస్తూ ఎన్నికలు ముగిసేసరికే తన పరువు, పార్టీ పరువు రెండూ కూడా పూర్తిగా పోగోట్టుకొన్న ఏకైక జీవి చిరంజీవి.
గతంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ కేవలం తొమ్మిది నెలలలోనే రాష్ట్రంలో అధికార పగ్గాలు చెప్పటడం చూసి, చిరంజీవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నఅశేష ప్రజాభిమానంతో అధికారం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి అయిపోదామనే లక్ష్యంతో పార్టీని పెట్టారు. కానీ ఆయన ఏ అభిమానుల అండ చూసుకొని పార్టీ పెట్టారో ఆ వీరాభిమానులను అందరినీ దూరంగా ఉంచడం, పార్టీలో వారికి ఎటువంటి పాత్ర లేకుండా చేయడం ఆయన చేసిన అతిపెద్ద పొరపాటు. అందువల్ల ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్ని గొప్ప ఆశయాలు, సిద్దాంతాలు వల్లె వేసినా ప్రజలు ఆయనను నమ్మలేదు.
ఆమాద్మీ పార్టీ, తెదేపా రెండూ కూడా కేవలం ప్రజాభిమానంతోనే అతి తక్కువ వ్యవధిలోనే అపూర్వ విజయాలు సాధించగా, ప్రజాభిమానం పుష్కలంగా ఉన్నపటికీ ప్రజారాజ్యం అతితక్కువ వ్యవధిలోనే దుఖాణం కట్టేసుకొని సరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్నికలలో ఓడిపోయినా తరువాతయినా చిరంజీవి తన తప్పు తెలుసుకోలేదు. కనీసం పశ్చాత్తాప పడలేదు. పద్దతులు కూడా మార్చుకోలేదని తదనంతర పరిణామాలు స్పష్టం చేసాయి. ఈరోజుకి కూడా ఆయన వ్యవహరిస్తున్నతీరుని ప్రజలందరూ ఆక్షేపిస్తూనే ఉన్నారు.
ఆమాద్మీ పార్టీతో పోలిస్తే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అశేష ప్రజాదారణ ఉండేది. కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేక ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొంది.
ఇక గత ఎన్నికలలో కులం, డబ్బు, రాజకీయ సమీకరణాల ముందు లోక్ సత్తా పార్టీ కొట్టుకుపోయింది. ఆ తరువాత నుండి లోక్ సత్తా కూడా వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడుతూ వ్యవహరించడం మొదలుబెట్టింది. దానివల్ల ఆ పార్టీ ఎటువంటి లాభం పొందలేకపోయినా క్రమంగా ఉన్న పేరు కూడా పోగొట్టుకొంది. లోక్ సత్తా, ప్రజా రాజ్యం పార్టీలు రెండూ కూడా గొప్ప ఆశయాలతో ఆరంభమయినవే, కానీ ఆమాద్మీ పార్టీ లాగ ఎందుకు విజయవంతం కాలేకపోయాయి అని ప్రశ్నించుకొంటే, సరయిన ప్రణాళిక లేకపోవడం, వల్లె వేస్తున్న ఆశయాలు, సిద్దాంతాల పట్ల చిత్తశుద్ది లేకపోవడం, ప్రజలతో మమేకం కాలేకపోవడం ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల తీరు, వైఫల్యం చూసిన తరువాత ఇక ముందు పుట్టుకొచ్చేఏ పార్టీలని కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి లేకుండా పోయింది.