నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ
posted on Feb 4, 2014 8:58AM
మాజీ ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీ మొన్న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “రాహుల్ గాంధీకి నేను ఓటు వేయలేను. ఎందుకంటే లెర్నింగ్ లైసెన్సుతో వస్తున్నఅటువంటి వ్యక్తి చేతికి దాదాపు 1.2 బిలియన్ల జనాభా ఉన్న భారత్ దేశాన్ని అప్పగించలేము. అనుభవరహితుడయిన అతను ఇంత పెద్ద దేశాన్ని ప్రధానిగా పరిపాలించగలడని నేను భావించడం లేదు. కానీ, అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొని నెగ్గుకొచ్చిన నరేంద్ర మోడి ప్రధాని పదవికి అన్ని విధాల తాను అర్హుడనని నిరూపించుకొన్నారు. ఇంత పెద్ద దేశాన్నికొత్తగా డ్రైవింగ్ నేర్చుకొంటున్న అనుభవరహితుడయిన రాహుల్ గాంధీ చేతిలో పెట్టడం కంటే, అనుభవజ్ఞుడు, తన దక్షత నిరూపించుకొన్న వాడయిన నరేంద్ర మోడీ చేతికి అప్పగించడమే మేలని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను వారిరువురిలో నరేంద్ర మోడీకే నా ఓటు వేసేందుకు ఇష్టపడతాను.” అని అన్నారు.
ప్రముఖ సామాజిక నేత అన్నాహజారేతో కలిసి నడుస్తున్న కిరణ్ బేడీ ఒకప్పటి తమ ఉద్యమ సహచరుడయిన అరవింద్ కేజ్రీవాల్ కి కానీ, ఆయన స్థాపించిన ఆమాద్మీ పార్టీకి గానీ ఈవిధంగా ఎన్నడూ తన మద్దతు ప్రకటించలేదు. కానీ, తామందరూ వ్యవ్యతిరేకిస్తున్న బీజేపీకి చెందిన ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి ఈవిధంగా మద్దతు తెలపడం విశేషమే. ఆమాద్మీ పార్టీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోందని తెలిసి ఉన్నపటికీ ఆమె బీజేపీకి మద్దతుగా మాట్లాడటం మరో విశేషం.
ఇక ఆమె మాటలను మన రాష్ట్రానికి కూడా చాలా చక్కగా అన్వయించుకోవచ్చును. ప్రస్తుతం మన రాష్ట్ర, దేశం పరిస్థితులు ఒక్కలాగే చాల క్లిష్టంగా తయారయ్యాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో అనుభవరహితుడు, అనేక ఆర్ధిక నేరాలలో కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు నెలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆత్రుత పడుతున్నాడు.
ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా మున్ముందు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనకొనవలసి ఉంటుంది. ఆ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, గాడి తప్పినా పాలనను మళ్ళీ గాడిలో పెట్టడం అనుభవరహితుడయిన జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం కాదని చెప్పవచ్చును. అందువల్ల రాష్ట్ర ప్రజలు కూడా అన్నివిధాల సమర్ధుడయిన వ్యక్తికే ఓటు వేయడం అత్యవసరం.