కమలంపై చంద్రుడి ప్రభావం
posted on Feb 3, 2014 @ 8:48PM
చంద్రబాబు కంటే ముందే డిల్లీ చేరుకొన్న కేసీఆర్ తెలంగాణాపై ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నబీజేపీ నేతలని కలిసి, బిల్లుకి అనుకూలంగా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. కానీ, వారు ఆయన కంటే ముందు చంద్రబాబునే కలవడం, మారుతున్న వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. బీజేపీ మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు తెలుపుతున్నపటికీ, తెదేపాతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత క్రమంగా దాని ఆలోచనా సరళిలో కూడా మార్పు రాసాగింది. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనను కాక అది జరుగుతున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నందున, ఎన్నికల తరువాత రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేయవచ్చని బీజేపీ భావించి ఉండవచ్చును.
అదీగాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకే ప్రయోజనం కల్పిస్తుంది తప్ప బీజేపీకి కాదు. అంతేగాక, ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే అటువంటి లోపభూయిష్టమయిన బిల్లుని ఆమోదింపజేసినందుకు బీజేపీ ప్రభుత్వమే నానా అవస్థలు పడవలసి ఉంటుంది. గనుకనే బీజేపీ ఇప్పుడు తెలంగాణాపై మాట మార్చింది. ఇప్పుడు బీజేపీ నేతలు సీమాంధ్రవైపు మొగ్గు చూపిస్తుండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని చెప్పవచ్చును. తొమ్మిదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి బీజేపీ కంటే బాగా రాష్ట్ర పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు గురించి తెలుసు గనుక, బహుశః బీజేపీ నేతలు ఆయన సూచన ప్రకారమే వ్యవహరిస్తుండవచ్చును.
ఇక మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే ఇంతవరకు పార్టీలోని ఆంధ్ర, తెలంగాణా ప్రాంత నాయకులను వారివారి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడేందుకు అనుమతించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వారినందరినీ ఒకే త్రాటిపైకి తీసుకువచ్చి వారందరినీ వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రతిపక్షనేతలని కలుస్తుండటం ద్వారా తెదేపా ఇంతకాలంగా కోరుతున్న'ఇరుప్రాంతాల ప్రజలకి సమన్యాయం' అనే తన వాదనలో నిబద్దత ఉందని స్పష్టం చేయగలిగారు. ఒకవేళ ఆయన ప్రత్యర్దులందరూ వాదిస్తున్నట్లుగా ఆయన సమైక్యాంధ్ర లేదా సీమాంధ్రకే ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే, ఆయన కేవలం సీమాంధ్ర సభ్యులనే వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ఇది ఆయన నాయకత్వాల్ లక్షణాలకి, రాజకీయ చాతుర్యానికి అద్దంపడుతోంది.