టీ-బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా వీలుకాదా?
posted on Feb 4, 2014 @ 11:49AM
ఇంతవరకు తెలంగాణా ఏర్పాటుపై చాల ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ నిన్న జరిపిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల వైఖరి చూసి కంగుతింది. రేపటి నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెడితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంత సభ్యుల ఆందోళన కారణంగా అసలు సభ జరిగే అవకాశమే ఉండదని, అందువల్ల ఈ సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని, ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు వంటి అత్యంత ముఖ్యమయిన బిల్లులను మాత్రమే సభలో ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల సూచనతో కాంగ్రెస్ అధిష్టానం నోటమాటలేకుండా పోయింది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ సమావేశాలలో ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు ఆమోదించడం అత్యంత అవసరం. అదిగాక మరో 39 బిల్లులపై సభలో చర్చజరిపి ఆమోదించవలసి ఉంది. వాటిలో కొన్ని రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించే ఉద్దేశ్యంతోనే ప్రవేశపెట్టబడుతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధికి మేలు చేకూర్చే అటువంటి బిల్లులకు తామెందుకు మద్దతు ఈయాలి? అని భావించడంతో బీజేపీతో సహా ప్రతిపక్ష నేతలు కేవలం ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు మరికొన్ని ముఖ్యమయిన బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టాలని సూచించాయి.
తెలంగాణా బిల్లుని ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేయమని వారు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తను అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణా బిల్లుని సభలో ఆమోదింపజేయడం మాట సంగతెలా ఉన్నా, దానిని అసలు సభలో ప్రవేశపెట్టవద్దని ప్రతిపక్షాలు కోరడం కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోవడం చాలా కష్టమవుతోంది. తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికే అభ్యంతరం చెపుతున్న ప్రతిపక్షాలు, వాటి మాట కాదని ప్రవేశపెట్టినా దానికి మద్దతు ఇస్తాయని నమ్మకం లేదు.
బీజేపీ నేత సుష్మాస్వరాజ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ యంపీలపై ఆ పార్టీకి ఎటువంటి అదుపు లేదు. అందువల్ల వారు మళ్ళీ సభా కార్యక్రమాలను జరుగకుండా స్తంబింపజేయడం తధ్యం. అటువంటి పరిస్థితిలో కీలకమయిన బిల్లులపై ఏవిధంగా చర్చించలము? అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముందుగా తన సభ్యులను అదుపులో ఉంచుకొని సభను నిర్వహించమనండి. అప్పుడు బిల్లులకు మా మద్దతు గురించి అడగవచ్చును,” అని అన్నారు.