పెప్సీ వివాదంలో అమితాబ్ బచ్చన్
posted on Feb 4, 2014 @ 10:31AM
సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్ళు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్ల రూపాయలకు కాంట్రాక్టులు కుదుర్చుకొని సదరు కంపెనీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా బచ్చన్ కూడా వివిద కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొంటున్నారు. అమితాబ్ బచ్చన్ 2008 నుండి 8 సం.ల పాటు పెప్సీ కంపెనీతో ఏడాదికి రూ.3 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేసారు. అందుకు పెప్సీ కంపెనీ ఆయనకు మొత్తం రూ.24 కోట్లు చెల్లించింది. అయితే ఆయన ఇటీవల అహ్మదాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ లో ఉపాద్యాయులు, గుజరాత్ పర్యాటక శాఖ సంస్థ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి.
ఆయన వారితో మాట్లాడుతూ “నేను ఒకసారి జైపూర్ లో ఒక స్కూలు విద్యార్ధులతో మాట్లాడుతున్నపుడు ఒక బాలిక “మాకు మా టీచర్ అటువంటి పానీయాలు (కూల్ డ్రింక్స్) విషం వంటివని చెప్పారు. మరి మీరు అటువంటి విష పానీయాలను త్రాగమని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది?” ఆమె ప్రశ్నకు నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. కానీ, ఆమె ప్రశ్న నన్ను తీవ్ర ఆలోచనలో పడేసింది. నేను ప్రచారం చేస్తున్న శీతల పానీయాల గురించి ప్రజలలో ఇటువంటి అభిప్రాయం ఉన్నపుడు నేను వాటికి ఇంకా ప్రచారం చేయడం సరికాదని భావించి ఇక అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయడం మానివేశాను. అంతేకాకుండా నేను నా కొడుకు, కోడలికి కూడా అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని సూచించాను. ఎందుకంటే, మన వృత్తిరీత్యా ఏదయినా ఒక వస్తువుకు ప్రచారం చేసేటప్పుడు అది ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
అమితాబ్ బచ్చన్ వంటి ఒక ప్రముఖుడు ఎనిమిదేళ్ళ పాటు పెప్సీ మరియు ఆ కంపెనీ తయారు చేసే ఇతర శీతల పానీయాలను త్రాగమని విరివిగా ప్రచారం చేసి, అందుకు ప్రతిఫలంగా రూ.24 కోట్లు డబ్బు కూడా తీసుకొని ఇప్పుడు అవన్నీ విషంతో సమానమని, వాటికి ప్రచారం చేయవద్దని తన కొడుకు కోడలికి కూడా చెప్పానని ఆయన బహిరంగంగా చెప్పడంతో సదరు కంపెనీ వారే కాక ఇతరులు కూడా ఆయనను తీవ్రంగా తప్పు పడుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సైతం ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిపై ఇంతవరకు స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు జడివానలా కురుస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మ్యాగీ నూడుల్స్, పార్లే గోల్డ్ స్టార్ కుకీస్, బైనాని సిమెంట్స్, కళ్యాణ్ జ్యులర్స్, గుజరాత్ పర్యాటక శాఖలకు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడయినా ఈ వస్తువులలో కూడా ఏదయినా లోపం ఉందని ఆయన తెలుసుకొంటే అప్పుడు వాటిని కూడా వాడవద్దని ఆయన సూచిస్తారా? ఆ విధంగా చేస్తే, ఇంతవరకు ఆయన సదరు వస్తువు కోసం చేసిన ప్రచారమంతా దేనికోసం? దేశంలో అత్యంత ప్రభావంతుడయిన ఆయన చేసే ప్రచారం వల్ల ఒక వస్తువు అమ్మకాలు ఏవిధంగా పెరుగుతాయో,దానికి వ్యతిరేఖంగా ఆయన చెపుతున్నమాటలు కూడా అంతే వ్యతిరేఖ ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. మా శీతల పానీయాలకు ఎనిమిదేళ్ళు ప్రచారం చేసిన తరువాత ఇప్పుడు ఆయన ఆవిధంగా చెప్పడం చాలా విచారకరమని పెప్సీ కంపెనీ సంస్థ ప్రతినిధులు అన్నారు.