గన్నవరంలో మళ్లీ టికెట్ ఫైటింగ్

  కృష్ణా జిల్లా గన్నవరం అంటే ప్రతిసారీ హాట్ సీటే. ఆ టికెట్ కోసం ఏ ఎన్నికల్లో చూసినా ఎంతోకొంత గొడవలు తప్పవు. ఇప్పుడు కూడా గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం టీడీపీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్‌ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు. గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇవ్వాలని తాను చంద్రబాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారంటూ వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. అయితే, వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో పార్టీ టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే విషయం చర్చనీయాంశమైంది.

లోక్‌సభ బరిలో నగ్మా

  దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో నగ్మాకు చోటు దక్కింది. ఇక్కడ దయానంద్ గుప్తాను మార్చి మరీ నగ్మాకు టికెట్ ఇచ్చారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంతో సంబంధముందని ఆరోపణలు వచ్చిన రైల్వేశాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌ కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది.

పవన్ పార్టీ కష్టమే..

  పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’కు ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని రెండు రోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని, రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదని, పబ్లిక్‌గా వాడుకోకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే పార్టీ జెండా, ఎజెండా లాంటివి ప్రకటించడానికి సాంకేతికంగా వీలు కాదన్న మాట. అది కాకుండా ఇంకేమైనా చెప్పుకొంటే చెప్పకోవచ్చు.

పవన్ కి అండగా మెగాభిమానులు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్దపడుతుండటంతో చిరంజీవి తన అభిమాన సంఘాల నేతలకు స్వయంగా ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెపుతున్నట్లు సమాచారం. అదే నిజమయితే, పదవుల కోసం ఇప్పటికే తన పరువు పోగొట్టుకొన్న ఆయన ప్రజల దృష్టిలో ముఖ్యంగా అభిమానుల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులున్న సంగతి ఎవరూ కాదనలేరు. అయితే వారు ఆయన సినిమాల కారణంగానే అభిమానులయ్యారు తప్ప ఆయనలో వేరేదో గొప్ప గుణం చూసి మాత్రం కాదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది ఆయన సినిమాలను చూసి కాక ఆయనలో ఉన్న మానవతా దృక్పధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఆయనపై వారి అభిమానం చెక్కు చెదరలేదు.   చిరంజీవి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయిన తరువాత మెగాభిమానులలో చాలా నిరుత్సాహం ఏర్పడింది. ఆ తరువాత వారి నమ్మకాన్ని, ఆశలను చివరికి వారి అభిమానాన్ని అన్నిటినీ వమ్ము చేస్తూ సాగుతున్న ఆయన ప్రస్తానం చూస్తున్న అభిమానులు, ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించాలనుకోవడంతో, ఆయన ఎక్కడ దెబ్బ తింటారో అనే భయంతోనే ఆయన రాజకీయ ప్రవేశాన్ని మనస్పూర్తిగా స్వాగతించలేకపొతున్నారు తప్ప, ఆయన రాజకీయాలలోకి రాకూడదని కాదు. అయితే, ఆయన ఆవేశంతో, అనాలోచితంగా వ్యవహరించకుండా సరయిన రాజకీయ విధానాలతో తనను తాను నిరూపించుకొన్నట్లయితే, ఆయనకు తన కుటుంబ సభ్యులు, సోదరులు అండగా నిలవనప్పటికీ, మెగాభిమానులందరూ ఆయనకు అండగా నిలవడం తధ్యం. పవన్ కళ్యాణ్ తన ముందున్నది పూల బాట కాదు, ముళ్ళ బాట అని నిత్యం గుర్తుంచుకొని పూర్తి అప్రమత్తతో, పూర్తి అవగాహనతో అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే ఇది కూడా మరొక ప్రజారాజ్యం, మరొక ఆమాద్మీ పార్టీలలాగ నవ్వుల పాలవుతుంది.

మెగా ఫ్యామిలీలో చీలిక

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కారణంగా, పవన్ కళ్యాణ్ కు ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన సోదరుడు నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తమకు తమ అన్నయ్య చిరంజీవే దారి చూపాడని అందువల్ల ఆయన చూపిన బాటలోనే, ఆయననే అనుసరిస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. తాను చిరంజీవికే మద్దతు పలుకుతానని విస్పష్టంగా చెప్పారు. ఇకపై మెగా ఫ్యామిలీలో మిగిలిన హీరోలు అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ తదితరులు అందరూ కూడా వారి బాటేపట్టే అవకాశం ఉంది. గనుక పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయినట్లే భావించవచ్చును. అదేవిధంగా మెగాభిమానులు కూడా ఎటువైపు మొగ్గాలనే సందిగ్ధంలో ఉన్నారు కనుక వారిలో కూడా చీలిక రావడం తధ్యం. రేపు పవన్ కళ్యాణ్ తన పార్టీ, తన ఆశయాలు, ఆంధ్ర, తెలంగాణా అంశాలు, సమైక్యవాదం, బలహీన వర్గాలు వగైరా అంశాల గురించి మాట్లాడిన తరువాత ప్రజలు, అభిమానులు, రాజకీయ పార్టీలు కూడా స్పందించడం మొదలుపెడతాయి. దానిని బట్టి పవన్ కళ్యాణ్ వెంట ఎంత మంది నడుస్తారో, ఎవరెవరు నడుస్తారో అనే అంశంపై మరింత స్పష్టత వస్తుంది.

కొడవళ్ళు మళ్ళీ కలిసాయి

  నిన్న మొన్నటి వరకూ కత్తులు, కొడవళ్ళూ దూసిన లెఫ్ట్ పార్టీలు రెండూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనబెట్టి కలిసి సాగాలని నిర్ణయించుకుంటున్నారు పాత మిత్రులు. ఆ నాటి ఆ స్నేహం ఆనంద గీతం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. జగన్ పార్టీతో ఎన్నికల్లో వెళదామని ఆలోచించిన సీపీఎం, అవినీతి మకిలి తమకూ అంటుకుంటుందని భయపడి దూరం జరిగారు. సీపీఐ కూడా రాజకీయ సర్దుబాటు కోసం అటు ఇటు దిక్కులు చూసింది. ఎటు వైపు నుంచీ గ్రీన్ లైట్స్ కనిపించకపోవడంతో, దూరంగా కనబడుతున్న రెడ్ లైటు వైపే సాగాగా సాగాగా అక్కడ తన పాత మిత్రుడు సీపీయం కనబడింది. అప్పుడు రాఘవా, నారాయణ అనుకొంటూ ఒకరినొకరుకరుచుకుపోయారు.   ఒకరికొకరు లాల్ సలాములు చేసుకొన్నాక, మనతో ఎవరూ కలవనప్పుడు మనమే ఒకరితో మరొకరు కలిసి పోటీ చేసుకొందామని ఇద్దరూ డిసైడ్ అయిపోయారు. కలిసి కలదు సుఖమూ అనే ఆ పాత మధురాలను ఒకసారి కలిసి పాడుకొన్నారు మన కామ్రేడ్లు. ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. కారణం అవినీతి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళలేరు. మతతత్వ బీజేపీతో దోస్తీ కుదరదు. బాబు కూడా బీజేపీ వైపే చూస్తుండటంతో ఆయన కూడా తమతో పొత్తుల ఊసే ఎత్తక పోయే..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే గెటవుట్ చెప్పేసిన తెరాస తమను ఎర్రెర కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతుందని ఆశపడటం అత్యాశే అవుతుంది. అందుకే ఆడుకున్నా, పాడుకున్నా తమ బాష అర్ధం చేసుకోగల కామ్రేడ్స్ తో ముందుకు సాగడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చేసారు.   సీపీఎం, సీపీఐలకు ఇరు ప్రాంతాల్లో కలిసి వచ్చే అంశాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన సీపీఐకి తెలంగాణలో ప్లస్ అయితే, సమైక్యాంధ్రకు కట్టుబడ్డ సీపీఎంకు సీమాంధ్ర లో పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు కామ్రేడ్స్. అంటే ఈ సారి కామ్రేడ్స్ కూడా మరో కొత్త శక్తిగా బరిలోకి దిగుతున్నారన్నమాట.

అప్పుడే అసమ్మతి ‘గంట’ మ్రోగేసింది

  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరియు మరో నలుగురు కాంగ్రెస్ యం.యల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరి గట్టిగా 24గంటలు కూడా గడవక ముందే అప్పుడే గంటా బ్యాచ్ తెదేపాకి అసమ్మతి గంట కొట్టేసింది. వాళ్ళ రాకను మొదటి నుండి వ్యతిరేఖిస్తున్న సీనియర్ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు నిన్న వారు పార్టీలో చేరిన తరువాత వారి పట్ల తన అయిష్టతను బహిరంగంగానే ప్రకటించేయడంతో గంటా బ్యాచ్ కంగు తింది.   చంద్రబాబు, గంటా బ్యాచ్ మరనేక మంది పార్టీ సీనియర్లు పాల్గొన్న సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, “ఈ కొత్తగా వస్తున్న వాళ్ళు పార్టీలో ఎంత కాలం ఉంటారో ఎప్పుడు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. కానీ, మేము మా కార్యకరతలం మాత్రం చనిపోయేవరకు పార్టీనే అంటిపెట్టుకొని ఉంటాము,” అని గంటా బ్యాచికి అందరి సమక్షంలో చురుకలు వేసారు. ఆయన అలా అనడానికి బలమయిన కారణం ఉంది.   గత ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు తెదేపాకు హ్యాండిచ్చి ప్రజా రాజ్యం పార్టీలోకి దూకి, అక్కడి నుండి చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసి మంత్రి అయిపోయారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు బయటకి దూకేసి పారిపోయిన గంటా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉండటం చూసి మళ్ళీ తెదేపాలోకి దూకేశారు. ఒకవేళ ఎన్నికల తరువాత అదృష్టం బాగుండి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే గంటా తెదేపాలోనే కొనసాగుతారనే నమ్మకం ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ 'జై చిరంజీవ!' అంటూ హనుమంతుడిలా చిరంజీవి చేయ్యందుకొని కాంగ్రెస్ లోకి దూకేయడం ఖాయం. అందుకే అయ్యన్న పాత్రుడు ఆ విధంగా అన్నారు.   ఆయనే కాదు స్వయంగా గంటా శ్రీనివాసరావే పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రసంగిస్తూ, “మా వంటి నేతలు తెదేపాలోకి వస్తుంటారు..వెళ్లిపోతుంటారు. కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఏమయినప్పటికీ తెదేపాలోకి రావడం స్వంత ఇంటికి చేరుకోన్నట్లే నాకు అనిపిస్తోంది,” అని అన్నారు.   మరి తనన్న మాటలనే అయ్యన్న నోట విన్నపుడు గంటా ఎందుకు అంత ఉలికి పడ్డారో తెలియదు కానీ తెదేపా నేతలతో ఏర్పాటు చేసిన తొలి సమావేశానికి తన బ్యాచ్ తో సహా డుమ్మా కొట్టేసి పార్టీలోకి వచ్చి 24గంటలు కూడా కాకముందే అసమ్మతి గంట కొట్టేసారు. అయ్యన్నపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేన పేరుపై వివాదం షురూ

  పోలిటిక్స్ లోకి ఎంటరవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పార్టీ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన అంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుకు మించిన పేరే ఉండదంటూ రాంగోపాల్ వర్మ వంటివారు అప్పుడే ట్వీటేశారు. ఇంతలోనే జనసేన పార్టీ తమది అంటూ కొందరు మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న తాము 6 నెలలు కష్టపడి జనసేన అని నామకరణం చేసుకున్నామని చెబుతున్నారు. వారం రోజుల క్రితం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేశామని బాలరాజ్, అతని మిత్రులు చెబుతున్నారు. తమ పార్టీ పేరైన జనసేనపై ఎవరికి ఎటువంటి అభ్యంతారాలున్నా తెలియజేయాల్సిందిగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చామని ఆధారాలు చూపిస్తున్నారు. మీడియాలో ప్రచారం నిజమై పవన్ పార్టీ కూడా జనసేనే అయితే దయ చేసి పేరు మార్చుకోవాలని అప్పీల్ చేశారు. పవన్ పార్టీ తరపున ఇంతవరకు ఏ ఒక్కరూ పార్టీ పేరు ప్రకటించలేదు. పవర్ స్టార్ పార్టీ పేరు కూడా జనసేన అయితే మరో కొత్త వివాదం మొదలైనట్లే.

అమెరికాలో మెరిసిన భారతీయ విద్యార్థులు

      అమెరికాలో ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు బుధవారం ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను కైవసం చేసుకున్న జార్జియాకు చెందిన ఆనంద్ శ్రీనివాసన్(17), మేరీల్యాండ్‌కు చెందిన శౌన్ దత్తా(18)లు ఈ ఘనత సాధించారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్‌ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్‌వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు.

పోటీ చేయడానికి ఎదురు డబ్బులు?

      అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.   మాజీ మంత్రి రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో ఉండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.

చంద్రబాబు సరి కొత్త ప్రయోగం

  ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని, వినియోగించుకోవడంలో ఎల్లపుడు ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలకు మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు నిన్న వైజాగ్ లో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రకటించారు.   ఈసారి పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరిని అభ్యర్ధులుగా నిలబెట్టాలో తెలుపమని కోరుతూ పార్టీ ఎంచుకొన్నకొందరు అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు గొంతుతో రికార్డు చేయబడిన వాయిస్ మెసేజ్ లు పార్టీ కార్యకర్తల, ప్రజల సెల్ ఫోన్లకు పంపబడతాయని, ఐ.వీ.ఆర్.యస్. ఆధారితంగా పనిచేసే ఆ మెసేజ్ లకు ప్రజలు, కార్యకర్తలు స్పందించి తమకు నచ్చిన అభ్యర్ధులను ఎంచుకోవచ్చని వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారికి నచ్చిన వ్యక్తినే పార్టీ అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజక వర్గాల వారిగా అభ్యర్ధుల పేర్లతో కూడిన మెసేజ్ లు ప్రజలకు, కార్యకర్తలకు అందుతాయని, వాటికి స్పందించమని చంద్రబాబు కోరారు.   ఇదే ప్రయోగం ఆయన అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయక మునుపే చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. అందరి మన్ననలు పొందగాలిగేవారు. కానీ, దాదాపు సగం మందికి పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత చేస్తున్న ఈ ప్రయోగం వలన ఆశించిన ఫలితం దక్కకపోవచ్చును. పైగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ నుండి కేశినేని నానికి ఏడాది క్రితమే ఆయన లోక్ సభ టికెట్ ఖరారు చేసారు. ఇప్పుడు ఆయనతో బాటు మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లను సూచిస్తూ మెసేజులు పంపినప్పుడు, ప్రజలు, కార్యకర్తలు ఆయనను కాక మరొకరి పేరును సూచిస్తే ఆయనను మార్చడం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చి చేరుతున్న వారందరూ కూడా పార్టీ టికెట్స్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరుతున్నారనేది బహిరంగ రహస్యం. కనుక అభ్యర్ధులకు పార్టీ టికెట్స్ ఖరారు చేసిన తరువాత ప్రజలను, కార్యకర్తలను అభిప్రాయం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి.   అయితే, ఇప్పటికీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయని అనేక నియోజకవర్గాలలో ఈ ప్రయోగం చేయవచ్చును. కానీ, అది కూడా కొత్త సమస్యలకు దారి తీయవచ్చును. అయితే ప్రతీ కొత్త ప్రయోగానికి, ఆలోచనకీ మొదట్లో ఇటువంటి ఆటుపోటులు, విమర్శలు ఎదుర్కోక తప్పదు గనుక చంద్రబాబు ప్రయత్నించడంలో తప్పులేదు.

సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్

  రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా విభజించాలని కేంద్రం నిర్ణయిం చింది. దీనికి రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌గా ఉండనుండగా, విజయవాడ ప్రధాన కేంద్రంగా సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక జోన్‌గా ఆవిర్భవించనుంది. రాష్ట్ర విభజన ఖాయంగా మారిన నేపథ్యంలో.. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ వివిధ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఆ సమయంలో కేంద్రం దీనిపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాళ్లు మాత్రం కొత్త జోన్ ఏర్పాటు వల్ల అదనంగా ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరిచేశారు.   తెలంగాణా బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగా కేంద్రం మళ్లీ ఈ రైల్వే జోన్ విభజను పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. తాజాగా రెండు జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రైల్వే అధికారులను ఆదేశించటంతో ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల చేయలేదు.   ప్రస్తుతం తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను కూడా కొత్త జోన్ పరిధిలోకి తేనున్నారు. ఈ మూడు ప్రాంతాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తేవాలని చాలాకాలంగా గట్టి డిమాండ్ ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు పనిలోపనిగా ఆ ప్రాంతాలను తూర్పుకోస్తా నుంచి తప్పించి విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు.

కేసీఆర్ అమరుల ఉసురు పోసుకుంటారా?

  తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు వెయ్యిమంది వరకు ప్రాణత్యాగాలు చేసి అమరులయ్యారు. కానీ ఆ అమరుల కుటుంబాలను ఉద్యమపార్టీగా చెప్పొకునే టీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇతర పార్టీల నాయకులను ప్రజల్లో పలుచన చేసేందుకు ఎప్పటికప్పుడు అమరుల అంశాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం వాళ్లను కూరలో కర్వేపాకులా తీసి పారేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోతూ కూడా తెలంగాణా నినాదాలు చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి.   శ్రీకాంత్ తల్లి శంకరమ్మ సైతం ఇదే అంటున్నారు. ఆమె కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని కూడా హెచ్చరించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ చెప్పారని, దానికి ఆమె ససేమిరా అన్నారని తెలుస్తోంది.

రాయపాటి చూపు…తెలుగుదేశం వైపు

  కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేస్తారని భావించిన రాయపాటి సాంబశివరావు.. ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నాలుగు సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఈసారి గుంటూరు వదిలి నరసరావుపేట వైపు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరులో రాయపాటి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఏం చేయాలో ఆయన నిర్ణయించుకునేలోపే గల్లా జయదేవ్ టీడీపీలో చేరిపోవడం, ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు రాయపాటి నరసరావుపేట ఎంపీ టికెట్ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారని సమాచారం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

కుర్చీని వదలాలంటే ఎంత కష్టమో

  రాకరాక వచ్చిన కేంద్ర మంత్రిపదవిని వదులుకోవడం కావూరి సాంబశివరావుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అప్పటివరకు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన ఆయన, ఆ తర్వాత ఉన్నట్టుండి స్వరం మార్చేశారు. కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాలని, మనం ఏం చేయగలమని అన్నారు. ఇప్పుడు కూడా చిట్టచివరి రోజు వరకు ఆ పదవిని అనుభవించేసి, ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసే ఆలోచనల్లో కావూరి ఉన్నట్లు తెలుస్తోంది.   ఇందుకోసం ముందుగా ఆయన పార్లమెంటులో తానేం ఇరగదీశానో చెబుతూ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘నా బాధ్యతల్ని శక్తి మేరకు చిత్తశుద్ధితో నిర్వహించినా పార్టీ నిర్ణయం కారణంగా మీకు నొప్పి కలిగించానేమో. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో మీరే చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ...’ అంటూ ఆ లేఖ సాగింది. ఈ లేఖను కరపత్రాలుగా ముద్రించి ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గంలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ఆ కరపత్రంపై ఒక ఫోన్ నంబరు కూడా ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే మంత్రి కావూరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖల భాగోతానికి తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే అభిప్రాయనికి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఆవిర్భావ సభలో ఆకట్టుకోని కిరణ్ ప్రసంగం

      తూర్పు గోదావరి జిల్లా జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. కిరణ్ చేసిన ప్రసంగం చాలా చప్పగా సాగడంతో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు నిరసి౦చిపోయారు. కాంగ్రెస్ అధిష్టాన౦పై పాత పాటనే కిరణ్ మళ్ళీ వినిపించారు. రాష్ట్ర విభజనకు ఎవరు సిపార్సు చేస్తే విభజించారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఈ రీతిలో విభజించడం సమంజసమా? అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణ విద్యార్ధులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలలో ఇబ్బందులు వస్తాయని అన్నారు. గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తెలియదని అన్నారు. రాష్ట్ర విభజనకు పెద్ద బాబు చంద్రబాబు, చిన్న బాబు జగన్ బాబు ఇద్దరూ లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. విభజనను ఎలా చెయ్యాలి అనేది కూడా చిన్న బాబు జగన్ లేఖలో వివరించి పంపించారని అన్నారు. మరోవైపు ఇతర పార్టీ అధ్యక్షులపై పదునైన విమర్శలు చేయడంలో కిరణ్ విఫలమయ్యారు. సభకు వచ్చిన కార్యకర్తలో, ప్రజల్లోను ఉత్సాహాన్ని ని౦పలేకపోయారు. ఇదే తీరుగా కిరణ్ తన ప్రసంగాలతో ప్రజల్లోకి వెళితే పార్టీకి గుర్తింపు రావడం కూడా కష్టమేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.                      సభ హైలైట్: సమైక్యాంద్ర పార్టీ సభను నిర్వహిస్తున్న ఒక నేత ఒకటికి పదిసార్లు రోడ్డుమీద ఉన్నవారంతా సభ ప్రాంగణంలోకి రావాలని కోరడం విశేషం. 

యువ ఓటర్లదే ఇక రాజ్యం

      లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో సగానికిపైగా యువ ఓటర్లే ఉన్నారు. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 3.52 కోట్ల మంది యువతే. ఇటీవల కేంద్ర ఎన్నిల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా బయట ఉన్న యువతను జాబితాలోకి తీసుకురావడానికి అనేక చర్యలను చేపట్టారు. దీంతో కొత్తగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. రాష్టంలో మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోయి, పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జనవరిన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్ల మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 2.92 కోట్ల మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య తలకిందులైంది. ఇంటింటి ఓటర్ల జాబితా తనిఖీల అనంతరం పురుష ఓటర్లు పెరిగిపోయారు. మహిళా ఓటర్లు ఏకంగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. ప్రస్తుతం పురుష ఓటర్లు 3.13 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 3.10 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సంఖ్య మూడు లక్షలు తక్కువ.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పేరు జనసేన?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించబోయే కొత్త పార్టీ పేరు ‘జన సేన’ అని తాజా వార్త. ఆయన ఈమధ్యనే ఎన్నికల కమీషన్ వద్ద ఈ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పార్టీకి ఎన్నికల కమీషన్ అంగీకరిస్తుందా లేదా అనే సంగతి తేలవలసి ఉంది. లేకుంటే ఆయన తన అనుచరులతో కలిసి స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగవచ్చును. ఎల్లుండి హైదరాబాదులోని మాదాపూర్ వద్ద ఉన్న హైటేక్స్ లో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ స్థాపనకు చురుకుగా పనులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.ఆరోజు పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరు, లోగో, జెండా, అజెండా వగైరాలు ప్రకటిస్తారు.

మెగా సోదరుల మధ్య కూడా కాంగ్రెస్ చిచ్చు

  కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకాలంగా అన్నదమ్ములలా కలిసి బ్రతికిన తెలుగుజాతిని రెండుగా చీల్చింది. ఇప్పుడు చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించి, మెగా సోదరుల మధ్య కూడా చిచ్చుపెట్టి వారి కుటుంబాలను, అభిమానులను కూడా రెండుగా చీల్చుతోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సంగతి తెలిసి ఉన్నపటికీ, ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించితే, దానిని ఆయన అంతే సంతోషంగా మహాప్రసాదమన్నట్లు స్వీకరించడం విశేషమే.   కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందో చిరంజీవికి తెలిసి ఉన్నపటికీ, ఆయన ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, కేవలం పదవులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇంతకాలం రామలక్షణుల వలే మెలిగిన ఈ మెగా సోదరులిరువురూ ఎన్నికల కురుక్షేత్రంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోబోతున్నారు. చిరంజీవి సీమాంధ్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ తరపున యుద్ధం చేస్తుంటే, ఆయన సోదరులిరువురూ ఆ వంచింపబడ్డ ప్రజల తరపున నిలబడి పోరాడేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను చీల్చడానికి కూడా వెనుకాడలేదు. అదేవిధంగా చిరంజీవి అధికారం, పదవుల కోసం రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మీద, తనకు బ్రహ్మరధం పట్టిన తెలుగు ప్రజలమీద కత్తి కట్టినట్లుగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రజల ముందు రాబోతున్నారు.   నిజానికి చిరంజీవి ఇప్పటికయినా తన తప్పుని సరిదిద్దుకొనే అవకాశం సోదరుడు పవన్ కళ్యాణ్ ద్వారా దక్కినపుడు దానిని సద్వినియోగం చేసుకొని ఉండి ఉంటే, ఆయనకు ప్రజలు మళ్ళీ బ్రహ్మ రధం పట్టేవారు. కానీ, తనను ఆదరించి ఆశీర్వదించిన తెలుగు ప్రజల కంటే, తోడబుట్టిన తమ్ముళ్ళ కంటే కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీయే మిన్న అని ఆయన అనుకొంటున్నారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొంటే తనకు తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఓడిపోతే తన పరిస్థితి ఏమిటనేది ఆయన ఆలోచించుకొన్నారో లేదో ఆయనకే తెలియాలి.   ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెగా సోదరుల మధ్య చిచ్చుపెట్టి వినోదం చూస్తోందని భావించవచ్చును.అయితే, అందుకు కాంగ్రెస్ నే కాదు చిరంజీవిని కూడా నిందించక తప్పదు.